రాష్ట్ర విభజన జరిగిననాటి నుండీ విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, రాజధాని మా ఊరులో ఉండాలంటే మా ఊరులో ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారి నగరం మీదున్న అభిమానాన్ని కొట్టి పారేయ్యలే౦. కానీ ఇది భవిష్యత్తులో శాశ్వతంగా ఉండే రాజధాని, దీని మీదనే సీమాంధ్ర ప్రజల రేపటి బాగోగులు ఆధారపడి ఉంటాయి అన్న విషయం గుర్తుంచుకుంటే, కేవలం నగరం మీద అభిమానంతోనో లేక ఇతరత్రా కారణాలవల్లనో ఈ విషయ౦లో ఓ నిర్ణయానికి రావడం సమంజసం కాదు.
ముందుగా ప్రస్తుత పరిస్థితిని ఓసారి గమనిద్దాం.
- రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అరకొర నిధులొస్తాఏమో కానీ పెద్దగా వేల వేల కోట్లు వస్తాయని ఆశించలేం.
- ఆ అరకొర నిధులలోంచే రాజధానికి కావాల్సిన కనీస హంగులు ముందుగా సమకూర్చాలి. అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్య మంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాలు, MLA Quarters, వివిధ విభాగాల ఆఫీసులు వగైరా వగైరా
- విశాలంగా, ప్రభుత్వ విభాగాల కార్యాలయాల ( Government administration area) ప్రదేశం ఏర్పరుచుకోవడానికి కనీసం ఓ వెయ్యి, రెండు వేల ఎకరాల స్థలం కావాలి. వచ్చే ఏభయ్యి, వంద సంవత్సరాల వరకూ ఇదే మన మన రాజధానిగా ఉంటుందన్న విషయం ఇక్కడ మరువకూడదు. ఎక్కడో అక్కడ పెట్టేసుకోవచ్చులే, తరువాత తీరిగ్గా అభివృద్ధి చేసుకోవచ్చు అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇది ఎందుకు చెపుతున్నానంటే ఈ మధ్యనే ఓ మంత్రి గారు గుంటూరు దగ్గరి నాగార్జున విశ్వ విద్యాలయం ప్రస్తుతానికి ఖాళీ చేయించి రాజధాని అక్కడ పెట్టేదామనే ఛండాలపు ప్రతిపాదన చేసేరు.
- సీమాంధ్ర రాజధాని వచ్చే అయిదు –పది ఏళ్లలో కనీసం ఓ రెండు మూడు లక్షల ఉద్యోగస్తులకి ఆశ్రయం ఇస్తుంది. అంటే ఎక్కడ రాజధాని వచ్చినా కనీసం ఓ పన్నెండు లక్షల జనాభా అదనంగా అక్కడికి చేరతారు. ఇప్పటి వరకూ అక్కడ నివసిస్తున్న వారు కాక. ఈ అదనపు జనాభాని అటూ ఇటుగా ప్రస్తుతం విజయవాడ నగరం జనాభాతో పోల్చొచ్చు. ( ఇది నా కనీస అంచనా మాత్రమే. నా ఉద్దేశం ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే సీమాంధ్ర రాజధాని వచ్చే పది ఏళ్లలో ఇరవై –ముప్ఫై లక్షల అదనపు జనాభా ఉన్న నగరంగా ఎదుగుతుంది).
- నేటి విజయవాడ నగరం విస్తీర్ణం వికిపీడియా ప్రకారం 262 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 65 వేల ఎకరాలు.
ఈ ప్రకారం చూస్తే, వచ్చే పదేళ్లలో, కనీస అంచనాల ప్రకారం, సీమాంధ్ర రాజధాని కేవలం 12 లక్షల మంది నివసించే ఓ చిన్న నగరంగా ఎదిగినా దానికి 65,000 ఎకరాల స్థలం కావాలి. ఒక వేళ సీమాంధ్రుల తలరాత బాగుండి రాజధాని మరింత శరవేగంగా ఎదిగితే కనీసం లక్ష, రెండు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్న నగరం ఔతుంది. అలాంటప్పుడు కొన్ని విషయాలని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.
- విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల చుట్టుపక్కల ప్రభుత్వం ఆధీనంలో ఇంత పెద్ద మొత్తంలో స్థలం లేదు.
- ఒక వేళ రాజకీయ కారణాల వల్ల పైన ఉదహరించిన ఏ నగరనినైనా రాజధానిగా ప్రకటిస్తే, ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ సేకరణ చెయ్యాల్సి ఉంటుంది.
- కనీస మొత్తంలో ఎకరానికి 2-3 లక్షల రూపాయిల పరిహారం చెల్లించినా , ప్రభుత్వానికి ఇది వెయ్యి, రెండు వేల కోట్ల భారం. విజయవాడ – గుంటూరుల మధ్య రాజధానిని నిర్మిస్తే ఇవ్వ వలసిన పరిహారం ఈ మొత్తానికి 5-10 రెట్లు కూడా ఉండొచ్చు. అంత భారాన్ని భరించే స్థితిలో రాబోయే ప్రభుత్వం వుండదు. అంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వ సహాయం అందే అవకాశం కూడా లేదు. ముందసలు, పైన చెప్పిన పెద్ద నగరాల చుట్టు పక్కల రైతులు భూ మిని అమ్మడానికి ఇష్టపడక పోవచ్చు. లేదా బలవంతంగా తీసుకుంటే కోర్టుకి వెళ్ళవచ్చు. దాని వల్ల సమస్య మరింత జటిలమౌతుంది.
- ఇంకో విధంగా ఆలోచిస్తే భూసేకరణకి వెచ్చించే సొమ్ము కొత్త ప్రదేశంలో రోడ్లు, sewerage, తాగునీటి పైపులు లాంటి కనీస సౌకర్యాలని ఏర్పరుచుకోవటానికి సరిపోతుంది.
- ఎయిర్ పోర్టును కట్టుకోవడానికి , రైల్వే లైనులు వేసుకోవడానికి ఈ డబ్బు చాలు.
ఈ విధంగా ఆలోచిస్తే ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో అక్కడ రాజధానిని నిర్మించడమే అన్ని విధాలా మంచిది. అది ఓ కుగ్రామమైనా పర్వాలేదు. రాజధాని ఒక అయస్కాంతం లాంటిది. ఎక్కడ రాజధాని వచ్చినా అక్కడకి ప్రజలు చేరటం పరిపాటి. ఈ నేపధ్యంలో నా వోటు దోనకొండకే. దోనకొండకి ఉన్న advantages అన్నీ ఇన్నీ కావు.
- ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో 54 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క ఎకరం కూడా సేకరించ కుండా ఓ విజయవాడని నిర్మించే అవకాశం ఇక్కడ ఉంది.
- ఈ వూరు కర్నూలు, విజయవాడ, ఒంగోలు పట్టణాలకి సమాన దూర౦లో ఉంది.
- గుంటూరు – గుంతకల్ బ్రాడ్ గేజీ లైన్ ఈ వూరు మించే వెళ్తోంది.
- ఒంగోలు జిల్లాలోని ఈ వూరు కర్నూలు జిల్లా సరిహద్దుల నుంచి కేవలం 60- 70 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని కోస్తాలో ఉండాలా లేక రాయలసీమ లో ఉండాలా అన్న వివాదం తలెత్తితే, కర్నూలు జిల్లా సరిహద్దులని పొడిగించి దోనకొండ వరకూ తీసుకురావటం లాంటి విషయం కూడా ప్రభుత్వం పరిశీలించ వచ్చు.
- గుండ్లకమ్మ, నాగార్జున సాగర్ లు ఈ వూరు నుంచి పెద్ద దూరంలో లేవు. రానున్న కాలంలో తాగు నీటి సమస్యని కూడా ఈ విధంగా అధిగమించే వీలుంది.
సీమాంధ్రులందరూరూ స్వంత నగరాల అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తే బావుంటు౦దని నా ఆశ.
* * * * *