శ్రీశ్రీ అభిప్రాయాలు

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

శ్రీలు పొంగిన జీవగడ్డయు
పాలుగారిన భాగ్యసీమయు
వ్రాలినది ఈ భరత ఖండము
భక్తిపాడర తమ్ముడా

అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు

నిద్రకు వెలియై
నే నొంటరినై
…………..
దారుణ మారణ దానవ భాషలు!
ఫేరవ భైరవ భీకర ఘోషలు!
……………
కంటక కంఠపు గణగణలో
చిటికెల మెటికెల చిటపటలో

తనను కదిలించివేస్తే

కవితా! వో కవితా!

అని

ఝుంఝానిల షడ్జధ్వానం
ఖడ్గ మృగోదగ్ర విరావాలు

పక్క వాయిద్యాలుగా

పదండి ముందుకు
పదండి తోసుకు

అంటూ తెలగు కవితా సీమలో చండ్రనిప్పులు కురిపించిన శ్రీశ్రీ తరలిపోయి ఈరోజుకు 27 సంవత్సరాలైంది.


 ఇది కూడా చదవండిశ్రీశ్రీ చమత్ “కారాలు”


శ్రీశ్రీ గురించి చెప్పుకొన్నదే చెప్పుకోడం కంటే కవిత్వం గురించి శ్రీశ్రీ యేమన్నాడో, యేమనుకొన్నాడో ఆయన మాటల్లోనే చెప్పుకోడం మేలనిపించి ఈ నాలుగు రాతలు రాస్తున్నా.

తన “ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల” అని చెప్పుకొన్న “అనంతం“లోని భాగాల్నే “శ్రీశ్రీ అభిప్రాయాలు” అన్న పేరుతో ఇక్కడ తిరగ రాస్తున్నా.

శ్రీశ్రీ అభిప్రాయాలు

  • తెలుగువాడి జాతీయగుణం ఓర్వలేనితనం. తెలుగువాడి జాతీయ కార్యక్రమం కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెట్టడం. కానీ తెలుగుదేశంలో ఒక గొప్పతనం కూడా వుంది అదేమంటే, తెలుగుదేశంలో అందరూ కవులే.
  • ప్రపంచ విశాలమైన దృష్టితో అంతటా కలయజూస్తేనేగానీ కావ్యస్వప్నం సఫలీకృతం కాదు.
  • యే చండశాసనుడికీ లేని శక్తి భాషకి వుంది. భాషలో కూడా రాజులూ, బానిసలూ వున్నారు. 
  • “కావ్యం యశసే, అర్థకృతే, వ్యవహారవిదే శివేతర క్షతయే…” అంటూ ఒక పెద్ద లిస్టు ఇచ్చాడు మమ్మటాచార్యుడు. చాలామంది మొదటి రెండుకోసం కవిత్వం రాస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. వీళ్ళందర్నీ వడబోసి సెకండ్ రేట్ కవులుగా కాలం తన చెత్తబుట్టలో పారేస్తుంది. 
  • “కవిత్వం వొక హ్రస్వలిపి” అన్నాడు ఒక విమర్శకుడు. అల్పాక్షరముల అనల్పార్థరచన అని అంతకుముందే అన్నాడు మన తెలుగు కవి.
  • “ప్రవాసము, ఊర్వశే” ఎన్నిమార్లు చదివానో నాకే(శ్రీశ్రీ) తెలియదు. కానీ ప్రతిసారీ ఒక కొత్తస్పందన పొందుతూనే వచ్చాను. అలాంటి చైతన్యం కలిగించగలిగేదే కవిత్వం అంటాన్నేను.
  • “మంద: కవియశ: ప్రార్థీ” అని కాళిదాసంతటివాడు తన్ను తాను కించపరుచుకున్నాడు. తానో మూర్ఖుడట. కవిని కావాలనే కీర్తిని కోరుకుంటున్నాడట! నాకు తెలిసినంత మట్టుకు సంస్కృత కవులెవ్వరూ నేనింతవాణ్ణి, అంతవాణ్ని అని చెప్పుకోలేదు. ఇది తెలుగు కవులకు మాత్రమే చెల్లింది.
  • నేను (శ్రీశ్రీ) నా కవిత్వాన్ని చేసుకున్న భార్యగాకాని, ఉంచుకున్న ముండగా గాని కాక, నన్ను కన్నతల్లిగానే ఎప్పుడూ భావించాను.
  • ఉద్రేకాలను రెచ్చగొట్టడం ఒకటే కవితాధర్మం కాదు. మనిషి ఆలోచించే జంతువుకాబట్టి అతని కవిత కూడా ఆలోచనలను రేకెత్తించాలంటాన్నేను (శ్రీశ్రీ).
  • లిట్మస్ టెస్ట్ లాగ కాకపోయినా, కవిత్వాన్ని తక్షణమే గుర్తించగలిగే ఒక మంచి చిట్కాను ఒకానొక విమర్శకుడు సూచించాడు “నిజమైన కవిత్వాన్ని చదువుతూవుంటే నా వెన్నెముకలో విద్యుత్తులు ప్రసరిస్తాయి. కవిత్వం కానిదయితే పొత్తికడుపులో బాధపుట్టి, వాంతిచేసుకునే పర్యంతమవుతుం”దన్నాడతడు.
  • కవిగా జీవించాలంటే ఛందస్సుల మీద అధికారం సంపాదించవలసిందే! అందుకనే నేనంటూవుంటాను, వచనగీతాలు రాసే కవికిశోరాలతో “క్లాసిక్కులు తప్పకుండా చదవండర్రా, యెందుకంటే కవిత్వం ఎలా రాయకూడదో మీకు తెలుస్తుంది!” అని.
  • కవులురాసేదంతా గొప్ప కవిత్వం కాదనీ, అలాగని రచన మాత్రం కవులు ఆపకూడదనీ టి.ఎస్. ఈలియట్ అన్నాడు.
  • మేలుకొన్న మాటలు మాత్రమే పాటలు పాడుతాయి.
  • మాటలకి సొంత విలువలేదు. వాటిని పేర్చినప్పుడు కొంతవిలువ వస్తుంది. పేర్చినంత మాత్రంచేత కవిత్వం కాదు. పేర్పు పేర్పులోంచి బయలుదేరే ఒకానొక వేడి- అదే మాటలను క్రియలుగా మార్చగలిగేది- అదేకావాలి. మాటలు మిగలకు. Poets are the engineers of emotion, not its victims. కవిత్వం అంటే మాటలా?
  • గ్రంథచౌర్యం ఒకటే క్షమించరాని నేరంకాని, కావ్యానుసరణ గర్హం కాదు.ఇక కవి తాను సాలెపురుగులాగ తనలోంచే దారాలు తీసి పసందైన సాలెగూడు నిర్మిస్తున్నా ననుకుంటాడు. కాని కవులెప్పుడూ తుమ్మెదలలాంటి వాళ్ళు. ఎన్నెన్నో పువ్వులనుంచి మధువులు సేకరిస్తారు. యే పువ్వునూ జ్ఞాపకం చెయ్యని తియ్యని తేనె ఆ కవుల ద్వారా మనకు లభిస్తుంది.
  • మన భావకవులు సరేసరి! వాళ్ళెమిటి రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో వాళ్ళకే తెలియదు. అవి చదువుకునే, మా చిన్నతనంలో మేం మైమరచిపోతూ ఉండేవాళ్ళం. భావకవులందరికీ ఆద్యుడైన రాయప్రోలు వారు –

 “పాయలు పాయలుగా విడిపోయిన నా తెలుగు తల్లి
ముంగురులకు వేణి యోగ్యాభరణముగా నీ యెడ జడకుచ్చు
లల్లి యిచ్చితి” నన్నప్పుడు,

ముంగురులకు జడకుచ్చు లేవిటని అడిగే పాటి దమ్ములు మాకు లేకపోయాయి! ముంగురులనే శబ్దం, కేశంలాగా శిరోజం లాగా జుత్తుకు పర్యాయపదంగా తీసుకోవాలని కొంతమంది సమర్థించారు. దీన్నే అవాస్తవికంగా ఆలోచించడం అంటాన్నేను (శ్రీశ్రీ).

తాను రాసిన ప్రతి పద్యాన్ని ఒకటికి పదిసార్లు తానే విమర్శించుకునే కృష్ణశాస్త్రి కూడా ఒక చోట,

“కరుణ పట్టునకీ బిచ్చగాని చేయి
చాచికొని వాడ మృత్యు
ఘోషమ్మె మరచి!”

అన్నాడు. అంతవరకు బాగానే వుంది. కాని ఆ తర్వాత ఇంతకు ముందుతానేమి చెప్పిందీ మరచి పోయి-

“వట్టి బయలున నొక మ్రొడు చెట్టు వోలె
ఎత్తినది కర మెత్తినట్లే కృశించె” అన్నాడు.

మొదటి సగంలో చాచిన చెయ్యి రెండో సగంలో ఎత్తినది కావడం అంటే 90 డిగ్రీలు తేడా ఉందన్న మాట!

  • ఈనాడు కుటుంబ నియంత్రణకన్నా ముఖ్యం కవిత్వ నియంత్రణ అని నాకనిపిస్తుంది.

*****

అటుదిప్పిన్ ఇటుదిప్పిన్ తేలేదేవిటంటే మమ్మటుడు జెప్పినా, ఆనందవర్ధనుడు జెప్పినా లేక అక్కిరాజు ఉమాకాంతం చెప్పినా, శ్రీశ్రీ చెప్పినా విషయం వొక్కటే – కవిత్వమనేది కగుడింతమ్ రాసినంత సులువుగాదని, ఫలానా డింకావాదమేగాదని, నాన్నల్ని అమ్మమ్మల్ని తయారుజేసుకోడం, ‘ఛీ-థూ’ కవిత్వం తాలూకు దశమ వార్షికోత్సవమని గోల జేయడం గాదని.

యెందులోనైతే సాధారణాలైన శబ్దార్థాలు తమ లౌకికమైన వునికి పోగొట్టుకొని కొత్తదైన, విశేషమైన విషయాన్ని చదువరికి అందిస్తుందో అదే కవిత్వమని తెల్సుకోవాలి. యెప్పుడోకప్పుడు రాలిపోయే భౌతిక పదార్ధాలతో తయారయ్యే చిత్రకళ, శిల్పకళల్లోని ప్రతిభని గుర్తించడానికే కఠోరసాధన అవసరమైనప్పుడు, నాశనమే లేని “అక్షరాల”తో శాశ్వతమైన ధ్వనిలోకాల నిర్మాణానికి యెలాంటి సాధనా అవసరం లేదకునే శుద్ధ మూర్ఖులతో తెలుగుదేశంలో కవిత్వం శున్యమైపోతోంది. ప్రచారకళలో ఆరిదేరిన వాళ్ళకే జ్ఞాపీఠాలు. వొంగి వొంగి సలాము కొట్టే గులాములే ముఠాధిపతులు. వాళ్ళు వాగేవి, పేలివి, నమిలిమింగేదే కవిత్వంగా చెలామణౌతోంది. దీనివల్ల కొత్త తరం గుడ్డెద్దురీతిలో జీర్ణశక్తిలేని విసర్జనా సామగ్రీని పుట్టిస్తూ పులకరించిపోతున్నారు.

నిద్రపోతున్న పదాల్ని లేపివెళ్ళిన శ్రీశ్రీలా కొత్తతరంవాళ్ళు నిద్రనెప్పుడులేస్తారోనని ఎదురు చూస్తూ……

Your views are valuable to us!