నేడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం.
పండుగల సాంప్రదాయంతో సుసంపన్నమైన సంస్కృతిలో “జెండా పండుగ”గా ప్రాచుర్యాన్ని పొందిన రోజు.
కోటి, కోటి భారతీయుల రక్తతర్పణంతో, దీక్షాతత్పరతతో, అకుంఠిత సంకల్పంతో మువ్వన్నెల జెండా స్వేచ్ఛావాయువులతో స్నేహం నెరపిన రోజు.
ఎవడో పరాయివాడు వచ్చి ఈ దేశాన్ని పరిపాలించడం ఒక చారిత్రక విపర్యాసం. ఒక విషాద సన్నివేశం. ఒక అవైజ్ఞానిక దృక్పథం యొక్క వికృత ప్రదర్శనం. కానీ ఆ విపర్యాస, వికృతత్వం నుండి బైటపడడానికి ఒక్కొక్క భారతీయుడు నిప్పుకణికైనాడు. కోటి కోటి నిప్పుకణికలు కలిసి కలిసి మహాగ్నిజ్వాలయై, వేయినాల్కలతో “వందేమాతరం”ను నినదిస్తూ, ఇచ్ఛాశక్తి ఉష్ణోగ్రతను, దేశభక్తి ప్రకాశాన్ని శతకోటి సూర్యప్రభావసమానమై వెలుగొందితే, పరాయి పాలకుడి మంచుగడ్డ గుండె కరిగి నీరయింది. వాడు వేసుకొన్న పచ్చిగడ్డి గద్దె భగ్గున మండింది. వాడు కప్పుకొన్న పులితోలు మసై నక్కతోలు బైటపడింది. అందుకే ఈ రోజు విశిష్టమైన రోజు. శతాబ్దాల పరాయి పాలనపై తిరగబడిన భారతీయుల ప్రచండ మానసిక ధీశక్తికి గీటురాయి ఈ రోజు.
కొందరికి అహింస ఆయుధమైంది. మరికొందరికి ఆయుధ హింసే ప్రాణమైంది. ఎందరికో ’వందేమాతరం’ నినాదం ఊపిరయింది. ఒక్కొక్క శక్తి పరస్పరం పేనుకొని, బలీయమైన బంధనమై, అంధకార పాలనకు చరమగీతం పాడింది. అందుకే ఈ రోజు విశిష్టమైనది.
అప్పుడెప్పుడో క్రీస్తుపూర్వంలో యవన అలెగ్జాండర్ భారత భూమి సరిహద్దుల్ని దాటి లోనికి చొరబడ్డాడు. ప్రజాస్వామ్య వ్యవస్థతో, ప్రజలే పాలకులుగా వర్ధిల్లుతుండిన ’గణ రాజ్యాలు’ ఎవరికి వారు ఆ యవన సామ్రాట్టును నిలువరించే ప్రయత్నం చేసారు. “ఏక భారతం – శ్రేష్ఠ భారతం” అనే స్ఫూర్తి మూర్తీభవించడానికి సుమూహూర్తం సంభవించని కాలమది. ఐతేనేం, ఒక్కొక్క గణ రాజ్యం ఆక్రమణకు గురికావడం కన్నా ఆయుధాన్నే ఎన్నుకొంది. ఆహవాన్నే కోరుకొంది. అడుగడుగునా యుద్ధభీతితో, ప్రాణనష్టంతో సాగిన యవన సైన్యం చివరకు చేతులెత్తేసింది. తన సామ్రాట్టు ఆజ్ఞనే ధిక్కరించింది. భరతభూమిలో అంగుళం అంగుళంలో అరివీరభయంకరులున్నారని, ఈ దేశం ఇలా తోస్తే అలా కూలిపోయే పర్షియన్ దేశం కాదని స్వానుభవంతో తెలుసుకొన్న అలెగ్జాండర్ వెనక్కు తిరగాల్సి వచ్చింది. విశ్వవిజేత కావాలన్న దురాశతో సహనశీలురైన భారతీయుల్ని హింసించినందుకు ఒక జీవితకాలపు చేదు అనుభవంతో వెనుదిరిగాడు అలెగ్జాండర్ ’ద గ్రేట్.’ అలా తన అనుపమాన స్వతంత్ర్య కాంక్షతో పరాయి దురాక్రమణను తొట్టతొలిసారిగా తిప్పికొట్టింది ఈ మహా భారతం. ఆర్య చాణక్యుడి మార్గదర్శకత్వంలో మౌర్యచంద్రగుప్తుడనే ఓ దాసీపుత్రుడు భారత భాగ్యవిధాతయై, మకుటమూనిన మహాసమ్రాట్టు ఐనాడు. ఈ మట్టిలో పుట్టిన మనుషులకు యజ్ఞమే కాదు రణయజ్ఞం కూడా చేతనవుతుందని నిరూపించిన సనాతన భారతీయ విజయం – చాణక్య చంద్రగుప్తుల సంయోగం.
[amazon_link asins=’B07G4CK5MV,8129124882,B00SYSEAMY,B01DLQ1LAM’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’2453a9f5-47e8-44ef-aa32-f6b6aff362b4′]ఆ తర్వాత దేశంలోకి చొచ్చుకువచ్చిన శక జాతిని తరిమికొట్టడంలో ఆంధ్ర శాతవాహనులు చూపిన శౌర్యప్రతాపాలు భరతజాతి రక్తనాళాల్లో ఉరకలెత్తే స్వేచ్ఛాకాంక్షకు నిలువెత్తు నిదర్శనాలు. అటుపై ఈ పవిత్ర భూమిపై దురాక్రమణ చేయదల్చిన కుశానులను వాయువ్య భారతానికే పరిమితం చేయడంలో శాతవాహనుల సమరదీక్ష ఎంతగానో ఉపకరించింది.
ఐతే రాను రాను ఆ సమరదీక్ష కొడిగట్టసాగింది. ఇది కాలవైపరీత్యం. పురాణాలు వర్ణించిన కలియుగం.
మ్లేంఛుల మూకుమ్మడి దాడికి ఉత్తర భారతం లొంగిపోయింది. ఆపై దక్షిణ భారతం కూడా తలవంచాల్సివచ్చింది. ఐతే తాత్కాలిక తలవంపు తర్వాత దక్షిణ భారతం మళ్ళీ సగర్వంగా తలయెత్తుకొంది. తుంగభద్రా నదీతీరంలో భారతీయ స్వేచ్ఛా ప్రతీకగా విజయనగరం ఊపిరి నింపుకొంది. ఆ తర్వాత అవక్రపరాక్రమ భారతం ఛత్రపతి రూపంలో ప్రత్యక్షమైంది.
కృష్ణరాయలు, శివాజీలతో పునరుజ్జీవితమైన స్వతంత్ర్య భారత సమరకాంక్ష మంగళపాండేతో మరో కొత్త కోణాన్ని వెదుక్కొంది. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ’ఆజాద్ హింద్’ ఫౌజ్ గా ముందుకురికింది. అల్లూరి సీతారామరాజు చేతిలో పదునైన బాణమైంది. చంద్రశేఖర్ ఆజాద్ మెలివేసిన మీసమైంది. భగత్ సింగ్ చేతిలో బాంబు అయింది. చివరకు ఆగస్టు 15న మువ్వన్నెల జెండాయై విశాల విహాయసంలో రెపరెపలాడింది.
మారిన రాజకీయ, భౌగోళిక స్థితిగతుల్లో తీవ్రవాద రూపంలో, ఆర్థిక విద్రోహ రూపంలో, అర్థం పర్థంలేని సెక్యులరిజమ్ రూపంలో ఈ పవిత్రభూమిపై పరాయి దురాక్రమణ ఇంకా సాగుతోనే ఉంది. ఏ ప్రాచీన గ్రంథాలు మౌర్య చంద్రగుప్తుణ్ణి భారతదేశ ఏకీకరణకు పురిగొల్పాయో, ఏ పురాతన ఋషి గొంతుకలు సాహితీ సమరాంగణ సార్వభౌముణ్ణి దక్షిణాపథ సుస్థిరతకు ప్రేరేపించాయో, ఏ ధరిత్రి పావిత్రత శివాజీని కాషాయధ్వజపతిని చేసిందో – అవన్నీ మూర్ఖత్వాలుగా, మూఢత్వాలుగా తిరస్కరింపబడుతున్నాయి. సర్వజనశాంతికై, ధర్మస్థాపనకు మాత్రమే ఆయుధం అనివార్యమని తెలిసిన జాతికి, భిన్న సిద్ధాంతాలతో, భిన్న పద్ధతులతో నిండినా పరస్పర గౌరవంతో బ్రతుకుతున్న జాతికి ’నాగరికత’ నేర్పుతామని ఉత్సాహపడేవారు మతాంతరీకరణాలకు, ఆత్మవంచనలకు పాల్పడుతున్నారు.
“ఉత్తిష్ట భారత” అన్న శ్రీకృష్ణ వాక్కు ఆనాటి అర్జునుని కన్నా ఈనాటి అర్జునులకు శిరోధార్యమవ్వాలి. “యుద్ధాయ కృతనిశ్చయః” అన్న సంకల్పం ఆనాటి ఫల్గుణుడికన్నా నవభారత ఫల్గుణులకు ఎంతో అవసరం. అంతర్జాతీయ వేదికలపై భారతీయతకు, సంస్కృతి, సాంప్రదాయాలకు జరుగుతున్న మేధోపర, వైచారిక రూప అవమానాలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేధావులపై ఉంది. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ’సమాజ సేవ’ ముసుగేసుకొని మోసం చేస్తున్న ఆంతరంగిక శత్రువులను నిస్వార్థ స్వసమాజోద్ధారం ద్వారా నిర్వీర్యం చేయాల్సిన అవసరం భారత యువతకు ఉంది.
ఈ గురుతర బాధ్యతల్ని నిబద్ధతతో నిర్వహించిననాడు మనదేశానికి సరికొత్త స్వాతంత్య్రం లభిస్తుంది. ఆనాడే నిజమైన స్వాతంత్య్ర దినాచరణం సాధ్యమవుతుంది.
“సుఖస్య మూలం ధర్మః”
“ధర్మస్య మూలం అర్థః”
“అర్థస్య మూలం రాజ్యమ్”
“రాజ్యస్య మూలం ఇంద్రియజయః”
“ఇంద్రియజయస్య మూలం వినయః”
“వినయస్య మూలం వృద్ధోపసేవా”
అన్న చాణక్య నీతిసూత్రాలను హృదయానికి హత్తుకుంటూ ముందుకు సాగుదాం.
||జై భారతమాతా||