By: -కె.గీత
http://kalageeta.wordpress.com/
http://kgeeta.blogspot.com/
*****
అఫ్సర్ కవిత్వంలో అడుగుపెట్టి 30 సంవత్సరాలయ్యిందంటే కాలం ఎంత వేగంగా పరుగెడుతూందో అర్థం అవుతూంది.దాదాపు 20 ఏళ్ల కిందట మొదటిసారి చూసినట్టున్నానుఅఫ్సర్ గార్ని. అప్పుడూ ఇప్పుడూ అదే చిర్నవ్వు. అదే చిన్న పలకరింపు. బహుశా: నాతోఅతి తక్కువగా మాట్లాడిన కవి కూడా అఫ్సరే. కానీ అప్పుడూ ఇప్పుడూ ఒక్క వాక్యంతోనేకవిత్వాన్ని కొనసాగించాగించాలనే స్ఫూర్తి కలింగించేదీ ఒక్క అఫ్సరే.
ఇలాంటి మనస్తత్వం ముఖ్యంగా సమకాలీనకవుల పట్ల మరో కవికి వుండడం చాలా అరుదు. మన కళ్ల ముందు బతికున్న కవిత్వాన్ని, ఎంకరేజ్’ చేయడం, రాగద్వేషాలు లేకుండా మెచ్చుకోవడం చాలా కష్టం. అందుకు నేను సదా అఫ్సర్ గార్కిఋణపడివున్నాను.
నాకు తెలిసినంత వరకు అఫ్సర్ ఒక మంచి కవి,కథకుడు, వ్యాస రచయిత, విమర్శకుడు, ఎడిటర్, అన్నిటినీ మించి మంచి మనిషి. అతి తక్కువగా మాట్లాడే అఫ్సర్ నండూరి అన్నట్లు ‘కాగితమ్మీద కొమరం పులి.’ అందుకు నిదర్శనంగా
ఆయన మొదటి కవితనిచూడండి:
మెత్తటి వేళ్ళు
తలుపు తట్టినట్టు
వయొలిన్తీగల్ని నొక్కినట్టు
నరాల్లో మౌనంగా
పారే రక్తంలో
వొక మృదువయిన కదలిక
ఆలోచన గాలిపటం
తెగిపోయిన ఆకాశంలో
కనిపించీ కనిపించనట్టు
మెలికలు తిరుగుతూ
నేలరాలే అనుభూతి
చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు
రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం
బిగుసుకుపోయిన గాల్లోంచి
కరుగుతూ వచ్చి
నిశ్శబ్దాన్ని తడుముకుంటూ
వెళ్లిపోయే సంగీతం వేళ్ళు
యుద్ధభూమిగా మారిన అరచేతులు
ఆకాశాలను పొదివిపట్టుకోవాలనుకునే
చివరి ప్రయత్నంలో
నిర్జీవంగా వేలాడి
అలసిపోయిన హృదయంపై
వాలిపోతాయి
వెక్కి వెక్కి ఏడ్వలేక
ఏ ముఖంలోనూ దాక్కో లేక…!
మొదటి కవితలో ఇంతటి పరిణతి అఫ్సర్ కే చెల్లింది. నా వరకు నాకు ఆశ్చర్యంవేసింది.
చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు
రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం
బిగుసుకుపోయిన గాల్లోంచి
కరుగుతూ వచ్చి
నిశ్శబ్దాన్ని తడుముకుంటూ
వెళ్లిపోయే సంగీతం వేళ్ళు
అంటూ ‘వయొలీన్లోకంలోకి ‘ పాఠకుల్ని తీసుకెళ్లిన తీరు అసామాన్యం. ‘అరచేతిలో యుద్ధభూమి ‘ మళ్లీ తర్వాతి కవితల్లో కూడాకనిపిస్తుంది.
ఆంధ్రజ్యోతి లో చేరాతల్లో రక్త స్పర్శను గురించి రాస్తూ ‘మంచి కవిత్వం మా బాగా వస్తోందని శీర్షిక ‘ తో రాసారు.
రక్తస్పర్శ లో వ్యక్తిగతం , రాజకీయం రెండూఉన్నా నాకు వ్యక్తిగతమే ఇష్టం. ఒక్కసారి చదివినా మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చేదేనిజమైన కవిత్వం.
‘ జ్ఞాపకాలు వేధిస్తాయే కానీ, ఆప్యాయం గా పలకరించవు.’
‘కొందరు స్నేహితులు.. నాన్న ఒక అర్థరాత్రి ‘ కవితలో
చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది.
నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణంనిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.
ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.
అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి.
ఈ వాక్యాలు చదివి నప్పుడల్లా ఖాళీ ఆకాశంకుంభ వృష్టిని నెత్తిన బోర్లించినట్లు దు:ఖం పొగిలి పొగిలి వస్తుంది.
ఇంత బాగా రాసే కవి అస్పష్టంగా కూడాఎందుకు రాసారో అర్థంకాదు నాకు ఇప్పటికీ.
అయితే ఈ మధ్య నేనుచదివిన ఏ కవితా అస్పష్టంగా ఉన్నట్టుగుర్తు లేదు.
కాలంతో పాటూ ప్రవాహ గతిలో మార్పు కనిపిస్తూంది. ఆయన అక్షరాల ఉధృతి బ్లాగు ని చూసే వాళ్లెవరికైనా తెలుస్తుంది.
నా వరకు నాకు వ్యక్తిగత కవితలేఇష్టమయినా మాటల్లో అగ్ని కణాలు రాలే పద్యాలు, పాదాలు చదివి తీరాల్సిందే…
విభజించిపాలించే నా శత్రువులారా,
నన్నెవరూరెండుగా చీల్చలేరు.
నాకనుపాపల్ని ఎవరూ పేల్చలేరు…
…..
……
ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే
నా ఇప్పటి పద్యం కదరా!
కృతకమయినపద్యం రాసిన రాత్రి
మనసంతాఅశ్లీలం!
……..
వానకురుస్తూన్న అర్థ రాత్రి కూచుని రాస్తున్నా-
అఫ్సర్ పద్యం ‘కురిసీ కురవకుండా’ మనస్సు నిండా –
…………………..
ఎప్పటిదోతెలీదు
ఎక్కడిదోతెలీదు
తడపటంఒక్కటే తెలుసు వానకి.
లోపలంతారాత్రంతా
అలా
కురుస్తూనేవున్నా ఏక ధారగా.
…………………
అదేకవితలా- గాయకుడు మిగిల్చివెళ్ళిన నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘమౌనానికినిరసనలా వాన
ఇవాళింకతెరిపి లేదు.
—————————
-కె.గీత
http://kalageeta.wordpress.com/
http://kgeeta.blogspot.com/