ఉదాహరణ కావ్యము

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

ఉదాహరణము చాలా అరుదైన సాహితీ ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఈ ప్రక్రియ ఉన్నాది.  మిగితా భారతీయ భాషలలో ఉన్నదా అంటే ఏమో మరి.పాల్కురికి సోమనాధుడు అను కవి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం తెలుగులో తొలి ఉదాహరణము వ్రాసెనని చెప్తారు. ఇందులోని నిజానిజాలు ప్రస్తుత విషయానికి అప్రస్తుతాలు.

ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారి మాటల్లో చెప్పుకోవాలంటే “మన సాహిత్యంలో ఉదాహరణము అనునది ఒక లఘుకావ్యం.సంబోధనతో కలిపి ఎనిమిది విభక్తులకూ ఎనిమిది వృత్తాలు రచించాలి, ప్రతి వృత్తానికీ కొసరుగా ఒక కళిక, ఒక ఉత్కళిక అను రగడ భేదాలు జతపరచాలి. ఇదీ స్థూలంగా దీని రూపం. ఇది కేవలం దైవస్తుతికోసం అవతరించిన కావ్యభేదం. వృత్తాలైతేనేమి, కళికోత్కళికలైతేనేమి అన్నీ వెరసి పాతిక పద్యాలు. ఇంకా ఏవేవో నియమాలు లాక్షణికులు చెప్పేరు కానీ కవులందరూ పాటించినవి ఇంతమాత్రమే.

మన శరీరంలోని ఉన్న జ్ణానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, తన్మాత్రలు ఐదు. ఇలా మన వేదాంతులు చెప్పినవి కూడుకుంటూ వెళితే పాతిక విలువ ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరంలో మనతోపాటూ ఉన్నవే. అన్నిటినీ భగవదర్పణ చెయ్యడం ఉదాహరణ కావ్యంలోని పరమార్ధం.”

ఇక నాకు తెలిసిన లేదా నేను నేర్చిన విషయం ఏమిటంటే, వృత్తాలలో కూడా ఉత్పల, చంపకమాలలూ, శార్ధూల మత్తేభాలు మాత్రమే ఉదాహరణంలో ఉండాలనేది నియమం. కళిక, ఉత్కళిక అనునవి మాత్రా ఛందస్సునాధారముగా చేసుకుని వ్రాసే రగడలు అనగా పాటలవలెనుండు పద్యాలు.

వృత్తములన్నీ రాగాంగ ప్రధానములు, మన సంగీతములోనున్న డెబ్బదిరెండు మేళకర్త రాగములలో ఏ రాగముతోనైనా ఈ వృత్తములను స్వరబద్దం చెయ్యవచ్చు. కళికోత్కళికలు తాళాంగ ప్రధానములు త్రిపుట, జంపె, రూపక తాళములకు అనుగుణంగా వీటిని స్వరపరచవచ్చు.

సార్వ విభక్తికమునకు కళికోత్కళికలు జతపరచవలెనన్న నియమములేదు. చివరిగా కవికృత నామాంకితము, అనగా వ్రాసిన కృతి గురించి, కవి గురించి చెపుతూ కృతిని ఇష్ట దైవమునకు అంకితమిచ్చుటకు అల్లు పద్యము ఒకటి ఉండవలెను.ఇది లేకున్ననూ పరవాలేదు అనికూడా ఆర్యోక్తి.

ఈ మధ్య కొంతకాలంగా ఈ తెలుగు వెబ్ సైట్లకు కాస్త దూరంగా ఉంటున్నాను. శ్రీమతి నిడదవోలు మాలతి గారు ఉదాహరణ కావ్యముగురించి వ్యాసము వ్రాయవచ్చుకదా అని అనగా వారి కోరికమేర వ్రాస్తున్న వ్యాసమిది.ఇందులోని విషయము కొంత నేను చదువుకున్నదీ, మరికొంత పెద్దల వద్దనుండి గ్రహించినదీనూ.

Your views are valuable to us!