Like-o-Meter
[Total: 1 Average: 4]
“చైత్రే మాసి జగద్ బ్రహ్మా – ససర్గ పథమే అహని;
వత్సరాదౌ వసంతాదౌ రవిరాద్యే తథైవ చ”
బ్రహ్మ కల్పములో, బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. మొదటి ఉగాదిగా ఆ సుముహూర్తము పరిగణనలోనికి వచ్చినది.
“ప్రభవ” మొదటి సంవత్సరము, మొదటి చిత్ర మాసములో, మొదటిది వసంత ఋతువు ; మొదటి రోజు ఆదివారము, మొదటి తిథి పాడ్యమి నాడు, ప్రప్రథమ నక్షత్రమైన “అశ్వినీ నక్షత్రము నందు త్రిమూర్తులలో ఆద్యుడు, చతుర్ముఖుడు ఐన విధాత ఈ సకల సృష్టి నిర్మించ సమకట్టాడు.
1870 సంవత్సరము నుండి తెలుగు పంచాంగము, ప్రామాణికమైన కేలండరు వెలువడ సాగినది.
భారతీయులందరూ ఆప్యాయతతో చేసుకునే పండుగ “ఉగాది”. కొత్త సంవత్సరమును ఉగాది పండుగగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ ఉగాదినీ ఏ సమయములో నిర్ధారణ చేయాలి?
“బ్రహ్మాది యుగాది కృత్”, “బ్రహ్మ యుగావర్తః ” అనగా అది “వసంత విషువత్ కాలము” ఈ నిర్ణయములో ఎంతో అనుకూలత, భౌగోళిక పరిశీలనచే నెలకొల్పినదగుటచే, ఎంతో సామంజస్యము కలిగి ఉన్నది. ఈ రీతిగా వసంత కాలమును, ఉగాది అని వరాహ మిహిరుడు నిర్దేశించిన స్వచ్ఛమైన నిశ్చయమై ,ప్రజలచే ఆమోదించబడి,ఆచరించ బడుచున్నది కదా!
“ధర్మ సింధువు” – “ఉగాది నాడు సంకల్పమును మార్పు చేస్తూ, చెప్పుకుని
పూజలు చేసి, ఉగాది పచ్చడిని ప్రసాదముగా తీసుకోవాలి. ప్రసాదమును “ఉగాది పచ్చడి”అంటూ పేర్కొనుట తమాషా ఐన వాడుక.
అశోక వృక్షము లేత చిగుళ్ళను, వేప పూతను, లేత మామిడికాయ ముక్కలు, కొత్త చింత పండు, కొత్త బెల్లము ముఖ్యమైన దినుసులు. ఇంకా చెరకు ముక్కలు, జీల కర్ర లతో ప్రసాదమును తయారు చేస్తారు.
యుగాది పర్వ దినమునాడు పంచాంగ శ్రవణము ద్వారా సంవత్సర ఫలాలను, కాల మాన పరిస్థితులనూ, రాజకీయ రంగములోనూ, సంఘములోని తతిమ్మా రంగాలలలోనూ సంభవించే పరిణామాలను తెలుసుకొనుట ప్రజలలో ఆచారముగా పాటించబడుతూన్న ఔత్సాహిక విధి.
ఉగాది పర్వ దినాన నూత్న సంవత్సరనామమునకు శ్రీకారం చుడతాము. ఈ రోజే కొత్త సంవత్సరము పేరును చెప్పడానికి నాంది పలుకుతాము. అనగా నిన్నటి దాకా చెప్పిన శ్రీ వికృతి నామమునకు మారుగా – శ్రీ ఖర నామమును పలుకుతూ, అర్చనా సాంప్రదాయాలను కొనసాగించవలెనన్న మాట!
“తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ|
పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్||”
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.
ఓమ్! శాంతిః! శాంతిః!శాంతిః!
తెలుగు సంవత్సరములు
మన చాంద్రమానమును అనుసరించి నిర్మించిన పంచాంగము ప్రకారము 60 సంవత్సరములు కాల చక్రము. గత శతాబ్దిలో, 1987 లో మొదటిదైన ” ప్రభవ ” నామ సంవత్సరము మొదలైనది. ప్రస్తుతము ఖర=2011-12 నామ వత్సరము లోనికి అడుగిడినాము.
వరుసగా 60 సంవత్సరముల పేర్లను విహంగావలోకనము చేద్దాము.
క్రమ సంఖ్య | తెలుగు సంవత్సరము | ఆంగ్ల సంవత్సరము |
1 | ప్రభవ | 1987-88 |
2 | విభవ | 1988-89 |
3 | శుక్ల | 1989-90 |
4 | ప్రమోదూత | 1990-91 |
5 | ప్రజోత్పత్తి | 1991-92 |
6 | అంగీరస | 1992-93 |
7 | శ్రీముఖ | 1993-94 |
8 | భావ | 1994-95 |
9 | యువ | 1995-96 |
0 | ధాత | 1996-97 |
11 | ఈశ్వర | 1997-98 |
12 | బహుధాన్య | 1998-99 |
13 | ప్రమాది | 1999-2000 |
14 | విక్రమ | 2000-01 |
15 | వృష | 2001-02 |
16 | చిత్రభాను | 2002-03 |
17 | స్వభాను | 2003-04 |
18 | తారణ | 2004-05 |
19 | పార్ధివ | 2005-06 |
20 | వ్యయ | 2006-07 |
21 | సర్వజిత్ | 2007-08 |
22 | సర్వధారి | 2008-09 |
23 | విరోధి | 2009-10 |
24 | వికృతి | 2010-11 |
25 | ఖర | 2011-12 |
26 | నందన | 2012-13 |
27 | విజయ | 2013-14 |
28 | జయ | 2014-15 |
29 | మన్మధ | 2015-16 |
30 | దుర్ముఖి | 2016-17 |
31 | హే విళంబి | 2017-18 |
32 | విళంబి | 2018-19 |
33 | వికారి | 2019-20 |
34 | శార్వరి | 2020-21 |
35 | ప్రవ | 2021-22 |
36 | శుభకృత్ | 2022-23 |
37 | శోభకృత్ | 2023-24 |
38 | క్రోధి | 2024-25 |
39 | విశ్వావసు | 2025-26 |
40 | పరాభవ | 2026-27 |
41 | ప్లవంగ | 2027-28 |
42 | కీలక | 2028-29 |
43 | సౌమ్య | 2029-30 |
44 | సాధారణ | 2030-31 |
45 | విరోధికృతు | 2031-32 |
46 | పరీధావి | 2032-33 |
47 | ప్రమాదీచ | 2033-34 |
48 | ఆనంద | 2034-35 |
49 | రాక్షస | 2035-36 |
50 | నల | 2036-37 |
51 | పింగళ | 2037-38 |
52 | కాలయుక్తి | 2038-39 |
53 | సిధార్థ | 2039-40 |
54 | రౌద్రి | 2040-41 |
55 | దుర్మతి | 2041-42 |
56 | దుందుభి | 2042-43 |
57 | రుధిరోద్గారి | 2043-44 |
58 | రక్తాక్షి | 2044-45 |
59 | క్రోధన | 2045-46 |
60 | అక్షయ | 2046-47 |
అందరికీ సకల పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు !