వలస నవల – సమీక్ష

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

వలస నవల – సమీక్ష

చదవండి – ఆవకాయ నవలలు


వలస నవల – సమీక్ష. చదివించే గుణం ఉన్న నవల. అమెరికాలో వలసవెళ్ళిన భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సమస్యలు వివరించిన నవల. అనేక అంశాలలో సార్వజనీయత ఉన్నా, ప్రధాన అంశాలన్నీ అమెరికా చుట్టునే తిరుగుతాయి. అమెరికా గడ్డమీద నడచిన అన్ని పాత్రలూ – స్వామి-గోమతి, కల్యాణి-బాబ్జీ, శ్యాం-చందన, శ్యాం తల్లి కమల, రుక్మిణి, శేషగిరి, కోకిలాబెన్, కవిత, అలాగే, అమెరికాలో పుట్టి జన్మతః అమెరికా పౌరులైన పిల్లలు తురియ, ఆదిత్య, సమీర, ఇలా అన్ని పాత్రలూ నవల కధాంశానికి బలం ఇచ్చినవే.

నవల మొదట్లో స్వామి అంత్యక్రియలు తో మొదలై, మూడు జంటల జీవితాల ఫ్లేష్‌బేక్‌లమీద నడచిన నవల చివరిపేజీలో స్వామి అంత్యక్రియలతోనే ముగియటం చదవగానే, గొల్లపూడి మారుతీరావుగారి “సాయంకాలమైంది” నవల గుర్తొచ్చింది.

నవల సారాంశం అంతా ఒక్క వాక్యంలో ఇమిడారు రచయిత్రి. “ఈనగాచి నక్కలపాలు చేయకమ్మా…..” అంటే, మన పిల్లలు దారితప్పకుండా చూసుకోమని ఆవేదనతో ఇచ్చే సలహా.
నవల పూర్తయ్యేసరికి ఈ ఒక్క వాక్యమే బుర్రలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది.

ఇటు ఇండియాలోనూ, అటు అమెరికాలోనూ కూడా, ప్రభుత్వాలూ మేధో-సమాజం కలసి ప్రోత్సహిస్తున్న “వోకిజం (మితిమీరిన వ్యక్తిగత హక్కుల స్పృహ)” వల్ల పిల్లలు తమను పెంచిన తల్లిదండ్రులకూ సమాజానికీ పనికిరాకుండా పోతున్నారు. అందులోనూ, మితిమీరిన గెండర్ అంశాలు, అంటే, తనని తాను అబ్బాయిగా భావించుకొనే అమ్మాయిలూ, అమ్మాయిగా బావించుకొనే అబ్బాయిలూ, ఇలాంటి పెడధోరణులు అలవరచుకొనే మినర్ పిల్లలను వారి తల్లిదండ్రులు మందలించకుండా అడ్డుపడే చట్టాలూ, ఇవన్నీ సగటు భారతీయ తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలను పెంచే బాటలో ఎదురయ్యే ముళ్ళకంపలే.

తల్లిదండ్రులను ఎదిరించి మరీ “నక్కలపాలు” అవుతున్నారు. పది పన్నెండేళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు తమని క్షేమసమాచారాలు అడిగినా, వారు సహవాసం చేసే స్నేహితుల వివరాలు అడీగినా “డొంట్ బీ సష్పిసియస్” అనే వైఖరి తీసుకొనే పిల్లలు, ఒక్కోసారి ఈ స్వేచ్చని వాడుకొని అసాంఘిక శక్తుల చేతుల్లో పావుగా మారుతున్నారు. ఈ మార్పు ఇండియాలో పద్దెనిమిది సంవత్సరాలు దాటినవారిలో కనపడితే, అమెరికాలో పన్నెండేళ్ళ పిల్లలే “స్వతంత్ర్యం” కోరుకుంటున్నారు అని అర్ధం అవుతోంది.

పేరు పొందిన డాక్టర్ అయిన స్వామి కూతురు తురియ, అలాంటి అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళటమే స్వేచ్చ, సాధికారత అని నమ్మి, చివరికి ఆ అసాంఘిక శక్తుల చేతుల్లో పావుగా మారి స్వంత ఇంట్లో దొంగతనం చేసే స్థాయికి దిగజారటాన్ని, ఆ దొంగతనం పోలీసుల దృష్టిలో పడగానే స్వామి తన కూతురు తరపున పోలీసులను ప్రాధేయపడటాన్ని, తరువాత తురియ తన పద్దెనిమిదో పుట్టినరోజున కనీసం తల్లిదండ్రుల శుభాకాంక్షలు కూడా అందుకోకుండా ఇల్లు విడిచి వెళ్ళటం, అదేదో జైలు నుండి విముక్తి అయినట్టుగా, భావించటం, ఇల్లు వదులుతున్నప్పుడు కేన్సర్ పేషెంట్ అయిన తల్లి, “నాన్న వచ్చే వరకూ ఆగు” అని తలుపుకి అడ్డంగా నిలబడితే, తల్లినీ, తల్లికి సహాయంగా వచ్చిన కోకిలాబెన్ అనే గుజరాతీ పెద్దావిడని కూడా నెట్టేసి గాయపరచి మరీ వెళ్ళటం, అన్నీ చాలా సహజంగా ఉన్నాయి.

న్యూరో-సైకాలజీ నిపుణులు ఒక మనిషికి ఆలోచనల్లో పూర్తి పరిపక్వత రావటానికి పాతికేళ్ళు పడుతుంది అని ఒకపక్క చెప్తున్నా, ప్రభుత్వాలూ, చట్టాలూ పద్దెనిమిదేళ్ళకి “మేజర్” అనే హోదా కట్టబెట్టి ఈ పిల్లలికి మరింత త్వరగా “నక్కలవైపు వెళ్ళే స్వతంత్ర్యాన్ని” కట్టబెడుతున్నాయి.
ఈ మార్పు అమెరికాలో పన్నెండేళ్ళ పిల్లలు కూడా “నన్ను ఏమైనా అంటే కాప్స్ ని పిలుస్తాను. నేను అమెరికన్ సిటిజన్ ని. మీరు ఏషియన్ మనస్తత్వం నుండి బయటపడలేదు” అని ఈసడించే స్థాయిలో అక్కడ పిల్లలని ఎంపవర్ చేస్తున్నాయి.

ఈ నవలలో నాకు ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం. పన్నెండేళ్ళ పిల్లలికి కూడా తల్లిదండ్రులను బెదిరించేలా చట్టాలున్నాయి. పద్దెనిమిదేళ్ళు దాటితే ఇల్లు వదిలే స్వేచ్చ కూడా ఇచ్చాయి. అదే సమయంలో పాతికేళ్ళవరకూ పిల్లలికి తల్లిదండ్రుల మెడికల్ ఇన్సూరెన్సు మీద ఆధారపడొచ్చు కానీ, ఆ ఇన్సూరెన్సు డబ్బుకట్టే తల్లిదండ్రులకి మాత్రం తమ పిల్లల వైద్య వివరాలు తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా! అంటే అమెరికన్ ప్రభుత్వం పిల్లలికి ఇరవయ్యారేళ్ళు వచ్చేవరకూ కూడా తల్లిదండ్రులు కట్టే ఇన్సూరెన్సు మీద ఆధారప్డే అవకాశం ఇచ్చి, ఆ డబ్బుతో వారు చేయించుకొనే చికిత్సా వివరాలు మాత్రం తల్లిదండ్రులు తెలుసుకోలేని కట్టడి చేసింది. మితిమీరిన హక్కులు సామాజిక వినాశనానికే దారితీస్తాయి. ఈ విషయంలో యూరోప్, అమెరికాలను భారతీయ సమాజం నెమ్మదిగా అనుసరిస్తోంది.

చివరగా ఈ నవలకి చిన్న చిన్న దిష్టిచుక్కలు.

ఉన్న పాత్రలలో శంకర్ పాత్ర, అతడికి పరిచయమైన స్త్రీ పాత్రా వలన నవలకి ఎలాంటి ఉపయోగమూ లేదు అనిపించింది. శంకర్ ఉన్న ఐదుపేజీలూ శ్యాం-చందన జంట గురించి రాసి ఉంటే బావుణ్ననిపించింది. పైగా శంకర్ పాత్ర అమెరికాలోనిది కాదు, కూడా.

నవలలో టైం లైన్ ని చూచాయిగా చెప్పే లా ఉంటే బావుండేది. అంటే, నేరుగా 2001, 2011 అని సంవత్సరాలు చెప్పకపోయినా, కథాగమనంలో ట్విన్ టవర్లు కూలటం, ఒసామాబిన్‌లాడెన్ ని చంపటం లాంటివి సంఘటనలను ఒక వాక్యంలా (టివీలో వార్త వచ్చినట్టుగా) చెప్పి ఉంటే, వీటి ఆధారంగా ఏ పాత్ర ఎప్పుడూ అమెరికా వెళ్ళిందీ పాఠకుడికి మరింత స్పష్టంగా తెలిసేది. వివిధ పాత్రలమధ్య ఉన్న వయసు అంతరాలు ఇంకా స్పష్టంగా తెలిసేవి అనిపించింది. నవల ముగింపు తొందరగా జరిగిందేమో అనిపించింది. స్వామి మీద కల్యాణికి అంత గౌరవం పెరగటానికి తగ్గ నేపధ్యం మరికొన్ని సంభాషణలు ఉండి ఉంటే బవుండెది అనిపించింది. ఉన్న పాత్రలకు, ఆ పాత్రలమధ్య నడచిన కథకి మరో యాబై పేజీలన్నా రాసి ఉంటే నవల ఇంకా ఆసక్తికరంగా ఉండేది అనిపించింది.

నవల ముగిసేసరికి నాకు కలిగిన అనుభూతి – భవసాగరాన్ని కాగితం పడవలో ఈదిన రచయిత్రి – కొత్తావకాయ సుస్మిత, స్వామి పాత్ర చేత “పక్షులు వలస వెళ్ళినా తిరిగి రాగలవు. అమెరికాకి వలస వెళ్ళిన వాళ్ళు మాత్రం అలా తిరిగి వెళ్ళలేరు” అని బాధగా చెప్పించటం, చదవటానికి భారంగా అనిపించినా కల్యాణి చేత “రాజాం దాటితే ఎక్కడైనా ఒకటే” అనే వాక్యం చెప్పించటం దీనికి ఓదార్పు లా అనిపించింది. బహుశః ఈ రెండు వాక్యాలూ రచయిత్రి వివిధ సందర్బాల్లో అనుకొని ఉంటారనిపిస్తోంది.

 

Your views are valuable to us!