వైరల్ రాజకీయం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.3]

 

 

వైరల్ రాజకీయం అనేది ఇప్పుడొక ప్రత్యేక విషయంగా మారిందనిపిస్తోంది.

జంతువులద్వారానో పక్షులద్వారానో మనుషులకు సంక్రమించే వైరస్ ల గురించి, అలాగే కృత్రిమ జన్యుమార్పిడుల గురించి కాస్త చదువుకున్నాను కనుక ఈ వ్యాసం రాయగలుగుతున్నాను.

వైరస్ కి దేశాలూ, రాజకీయాలూ పట్టవు.

కానీ దురదృష్టవశాతూ, ఇప్పుడు ప్రపంచంలో ఏ వైరాలజిస్టు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నైనా ఒక దేశానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఆపాదిస్తున్నారే కానీ ఆ అభిప్రాయాన్ని శాస్త్రీయ కోణంలో పూర్తిగా అర్ధం చేసుకొనే ప్రయత్నించట్లేదు.

ముందుగా నా అభిప్రాయం:

ఒకవేళ వైరస్ కృత్రిమం ఐనా, దానిని తయారు చేసిందుకు చైనాని నిందించక్కరలేదు.

ఒకవేళ వైరస్ గబ్బిల్లాలోదే ఐనా కూడా అది గబ్బిలం మాంసం ద్వారానే వ్యాపించాలన్న నియమం లేదు. అప్పుడు కూడా లేబ్ నుండీ లీకవవచ్చు.

పై రెండూ విషయాలూ మీడియా కి పట్టటం లేదు. ఇప్పుడు ఏ అంతర్జాతీయ వైరస్ నిపుణుడు ఏమి చెప్పినా మీడియాలో ఏమని వస్తోందీ అంటే, ఇది కృత్రిమ వైరస్ అనే అభిప్రాయం రాగానే చైనా దోషి అనటం. అలాగే ఇది సహజ వైరస్ అనగానే చైనా నిర్దోషి అనటం.

రెండూ తప్పే.

కృత్రిమ వైరస్ లు సృష్టించటం ఏ దేశం దృష్టిలోనూ తప్పు కాదు. ఆ ప్రయత్నాలు దశాబ్దాలుగా డజనుకి పైగా దేశాల్లో జరుగుతున్నవే. ఈ కృత్రిమ వైరస్ సృష్టి అంటే జెనెటిక్ రీకాంబినేషన్. ఇదే రీకాంబినేషన్ తో బీటీ పత్తి విత్తనాలు ఉత్పత్తి చేసి అవి రైతులకు అందుబాటులోకి వచ్చి, ఆ మేరకు పురుగులమందుల వాడకం తగ్గి ఇరవై ఏళ్ళు దాటింది. బీటీ పత్తి వల్ల ఇతర నష్టాలు ఉండోచ్చు. నికరంగా లాభమా?నష్టమా? అన్నది వ్యవసాయ/పర్యావరణ నిపుణుల వ్యవహారం. కానీ వ్యాపార ప్రయోజనాలూ, రాజకీయ అంశాలూ కలిపి శాస్త్రీయ వాస్తవాలను ఎక్కువచేయటమో, తక్కువ చేయటమో చేస్తాయి.

జెనిటిక్ రీకాంబినేషన్ అనేది పత్తి లాంటి పంటల్లో కంటే బేక్టీరియా లాంటి సూక్ష్మ, వైరస్ లాంటి సూక్ష్మాతి సూక్ష్మ జీవుల్లోనే ఎక్కువ సాధ్యం. ఇలా రీకాంబినేషన్ ద్వారా ఒకవేళ వైరస్ సృష్టిస్తే, ఆ సృష్టికర్తలైన శాస్త్రజ్ఞులు దానిని మూడు రకాలుగా వాడోచ్చు.

  1. వేక్సీన్ తయారీకి వాడొచ్చు. ఇది మానవాళికి ఉపయోగపడేది.
  2. లేదా ఆ వేక్సీన్ ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందాలనుకుంటే అప్పుడూ అలాంటి కృత్రిమ వైరస్ విషయంలో చాలా గోప్యత పాటించాలి (ఈ గోప్యత కూడా అన్ని దేశాలూ పాటించేవే).
  3. ఆ కృత్రిమ వైరస్ ని జీవ ఆయుధంగా అవసరమైనపుడూ వాడుకోవడానికి దాచవచ్చు.

నోబెల్ బహుమతి పొందిన ఫ్రెంచ్ వైరాలజిస్టు Luc Antoine Montagnier అభిప్రాయం ప్రకారం,నోవెల్ కరోనా లో ఎయిడ్స్, మలేరియా సంబంధిత జన్యువులు ఉన్నాయి.  ఆయన అనుమానం నిజమైనా, చైనా కేవలం ఎయిడ్స్, మలేరియా వేక్సీన్ కోసం మాత్రమే ఈ వైరస్ సృష్టించి ఉండొచ్చు.

కానీ చైనా ఇప్పటీకే ఈ వైరస్‍కు,  ల్యాబ్‍కు ఏ సంబంధం లేదు అని ప్రకటీంచింది కనుక నోబుల్ పురస్కృత ఫ్రెంచ్ వైరాలజిస్టు అభిప్రాయం దిశగా చర్చని కూడా చైనా అనుమతించే అవకాశం లేదు.

ఒకవేళ అది సహజ వైరస్ అనుకున్నా,

  1. అది గబ్బిలం మాంసం ద్వారా బయటకి రావచ్చు.
  2. గబ్బిలాలనుండి ఆ వైరస్ తీసి, లేబులో పెంచినప్పుడు కూడా లీకు కావచ్చు.
  3. సహజంగా దొరికిన వైరస్ లో మలేరియా ఎయిడ్స్ పోలికలున్న జన్యువులు ఉండటం అరుదేమో కానీ అసాద్యం మాత్రం కాదు.

ప్రకృతిలో కూడా ఏమాత్రం సంబంధం లేని జీవుల్లో ఒకే రకమైన జన్యువులుండటం జరుగుతుంది (ఉదాహరణ నిమ్మగడ్డి, మామిడి అల్లం. ఈ ఉదాహరణలు కొద్దిగా అసందర్భం అనిపించవచ్చు కానీ మరీ అప్రస్తుత విషయాలు కాదు).

అలాగే, ప్రకృతిలో సహజంగా ఉన్న వైరస్ ని మొదటిసారి గబ్బిలాల్లో కనుక్కొని, పరిశోధనలకోసం లేబ్ లో పెంచవచ్చు. అలా పెంచిన వైరస్ లీకైతే, లేబ్ నుంచి లీకైన సహజ వైరస్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ మూలాలు మనకి మారుమూల గబ్బిలాల్లో దొరికినా, ఆ వైరస్ వ్యాప్తిలో లేబ్ పాత్ర లేదు అని చెప్పటానికి ఆధారాలు సరిపోవు. అసలు ఇంతవరకూ తెలియని ఒక కొత్త వైరస్ కృత్రిమ సృష్టి అని నిరూపించాలన్నా, లేదూ ఈ వైరస్ ప్రకృతిలోనే ఉంది ఇప్పుడే మొదటిసారి మానవాళికి సోకింది అని నిరూపించాలన్నా శాస్త్రజ్ఞుల బృందం నెలల తరబడి కలిసి పనిచేయాలి. నిష్పాక్షింగా సమాచార మార్పిడి ఉండాలి.

అంతవరకూ అన్నీ ఆరోపణలూ, సమర్ధింపులూ, భావాజాలాన్ననుసరించి ఏవి నమ్మాలో నిర్ణయించుకోవటాలే. ఆరోపణలు చేస్తున్నది అమెరికా కనుక అమెరికా శాస్త్రజ్ఞులను చైనా అనుమతించకపోవటం ఆ దేశం చేస్తున్న వైరల్ రాజకీయంలో సహజం.

కానీ,  గత మూడు నెలలుగా, చైనాని సమర్ధించే ఆత్రుతలో తనని తానే ఖండిచుకుంటూ, తన విశ్వసనీయత పణంగా పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ని కూడా చైనా ఈ రకమైన పరిశోధనలలో అనుమతించట్లేదు. వైరస్ ఎలా వచ్చింది అన్నది ఆందోళనకరం కాదు.  కానీ, వైరస్ తన దేశంలో నవంబరులోనే బయటపడిన తరువాత చైనా వైఖరి, మూలాల్లోకి వెళ్ళటానికి చైనా నిరాకరిస్తున్న తీరు, తనను సమర్ధించే అంతర్జాతీయ సంస్థని కూడా హద్దుల్లో ఉంచుతున్న తీరు, ఆ తర్వాత కూడా బాధిత దేశాల్లో మేధావులు చైనాని వెనకేసుకొని రావటం మాత్రమే అసలు ముప్పు.

చైనా తప్పు ఉందొ లేదో అనేది వైరస్ నిరోధం విషయంలో  అంతర్జాతీయ సమాజంతో ఎంత సమాచారం పంచుకున్నదీ అనే విషయం పైన ఆధారపడూతుంది గానీ, లేబ్ నుండీ లీక్ అయితేనే చైనా తప్పు ఉంది అనీ, గబ్బిలాలనుండీ వస్తే చైనా తప్పు అస్సలు లేదు అనీ అంటే అది అపరిపక్వతే అవుతుంది.

దీన్నే వైరల్ రాజకీయం అని నేను మొదట్లో చెప్పింది!

 

@@@@@

One thought on “వైరల్ రాజకీయం

Your views are valuable to us!

%d bloggers like this: