వార్తః ఢిల్లీ హైకోర్టు వద్ద తీవ్రవాదుల బాంబు దాడి
ప్రభుత్వ ప్రణాళిక: ప్రధానమంత్రి కార్యాలయం ఒక కంకణం, రెండు ఉక్కుపాదాల కొనుగోలుకు ఆర్డర్లు సిద్ధం చేసింది. త్వరలోనే మరోసారి కంకణం కట్టుకొని ఉక్కు పాదాలతో తీవ్రవాదాన్ని ఒక్కసారైనా నొక్కిపారెయ్యాలని ప్రధానిగారు ఉవ్విళ్ళూరుతున్నారు.
ప్రజా నాలుక: ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరుల చేతులన్నీ కంకణాలతో నిండిపోయాయి. కాళ్ళేమో ఉక్కుపాదాల్తో పొక్కిపోయాయి. ఇహ మిగిలినవి గొంతులే! కొత్త కంకణాన్ని గొంతుకు కట్టుకున్నా, ఇనుప పాదాల్ని ఎక్కడ పెట్టుకొంటారన్నది ప్రధాన(ని) సమస్య.
* * *
ప్రభుత్వ ప్రణాళిక: టెర్రరిస్టు “జీ” చేసిన బాంబుదాడిలో మరణించిన ఓ వ్యక్తి అంతకు అరగంట ముందే తనకు ఫోను చేసాడని, ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలు ఆధారాలతోసహా అవసరమైనప్పుడు అందిస్తానని డిగ్గీరాజా విలేఖరులకు చెప్పారు.
ప్రజా నాలుక: మంత్రదండమా మజాకా! ఈసారి ఎవడైనా సరే నిరాహారదీక్ష చేసాడో, ఈ ఆధారాలతో మసిపూసేస్తాడు ఈ మారేడుకాయ.
* * *
ప్రభుత్వ ప్రణాళిక: ఒక్క శాతం తీవ్రవాదం వల్ల తాను మరోసారి సిగ్గుపడాల్సి వస్తున్నదని రాహుల్ రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో వాపోయారు.
ప్రజా నాలుక:“సిగ్గులేకపోతే సరి!”…. అని ఆసుపత్రిలో వెంటపడి వెళ్ళగొట్టారనా ఈ సిగ్గు?
* * *
ప్రభుత్వ ప్రణాళిక: అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటం వలనే ఈ దాడి జరిగిందని, తను తన పార్టీ మరణ శిక్షకు వ్యతిరేకమని, అందుకుగాను ఉద్యమిస్తున్న తీవ్రవాదులకు సంఘీభావం ప్రకటిస్తున్నామని ముఫ్తీ మహ్మద్ సయీద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ప్రజా నాలుక: అఫ్జల్ గురును ఉరితీస్తే కానీ వదలమని చెబుతూఈ అబ్బని కిడ్నాప్ చేస్తే, ఎలా మొత్తుకుంటాడో!!