Like-o-Meter
[Total: 0 Average: 0]
“బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక ఆ ఆ గారడి చేసి
గుండెను కోసి నవ్వేవు నీవింక చాలిక”
అంటూ పాటలు రాసే వీలులేదు. ఎందుకంటే దేవుడు రాజీనామ చేసేసాడు. దేవరకొండలోని బాలగంగాధర తిలక్ అనే ఏకాంత భక్తుణ్ణి నిన్న రాత్రి కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించేసాట్ట!
రాజీనామా పత్రంలోని కొన్ని ముఖ్యభాగాలు:
“మొదట్లో మొదట్లో ఖండాల్ని సృష్టించాను. డైనింగ్ టేబిల్ మీద ప్లేట్లని జరిపినట్లు వాటిల్ని ఎడాపెడా జరిపేసాను. మధ్యమధ్యలో నీళ్ళు నింపి వినోదించాను. ఆ తర్వాత పెద్ద పెద్ద డైనోసార్లని పుట్టించా. కొద్దిరోజులు బాగానే అనిపించినా అటుపై ఎందుకో అవి నచ్చలేదు. వెంటనే ప్రొడక్షన్ లైను మార్చేసి పులుల్ని, ఏనుగుల్ని, జిరాఫీల్ని, కంగారుల్నీ, చింపాజీల్నీ పుట్టించాను. వీటిల్తో బాటే బ్యాక్టీరియాల్ని, వైరస్సుల్నీ సృష్టించాను. చాలా తమాషాగా ఉండేదప్పుడు.
నదుల్ని సముద్రాల్లోకి కలిపాను. చెట్లకు, చేమలకు, జంతువులకు విడదీయకూడని సూక్ష్మమైన సంబంధాల్ని ఏర్పాటు చేశాను. ప్రతిదానికీ పుట్టుచావుల్ని నిర్దేశించాను. ఎందుకో తెలుసా? ఒక్కరే ఎల్లకాలం అనుభవించకూడదని.
ఆ తర్వాత ఓ క్లిష్టమైన వ్యాపార నిర్ణయం తీసుకొన్నా. అది చాలా బాగా క్లిక్కౌతుందని ఆశించా. I started manufacturing humans. Hell….in next few thousand years everything got screwed up! వాళ్ళు నన్నే మర్చిపోయారు. నేనే లేనని ప్రచారం చేసారు. వాళ్ళల్లో వాళ్ళే దేవుళ్ళైపోయారు. అన్నీ తామే అనుభవించాలని, అన్నీ తమకే దక్కాలన్న దుర్బుద్ధితో కౄరంగా ప్రవర్తించారు. బూట్ల కోసం, కోటుల కోసం, ఆర్భాటాల కోసం నా ముద్దుబిడ్డలైన మూగజీవాల్ని చంపారు. దాహాన్ని తీర్చే నీటికుంటల్ని మూసేసి పెద్ద పెద్ద భవనాల్ని కట్టారు. పచ్చని పొలాల్ని ధ్వంసం చేసి విషపు పొగల్ని కక్కే కర్మాగారాల్ల్ని కట్టుకొన్నారు. సముద్రాల్లోకి విషపదార్థాల్ని విరజిమ్మారు. విమానాలనెక్కి ఆకాశానికి తూట్లు పొడిచారు.
I have lost my interest. I decided to quit and I am quitting now.
ఓయీ తిలక్! నువ్వు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లల్ని కని, కఠినోపనిషత్తును రాసిన జ్ఞానివి. నాక్కాస్త పోస్ట్ మ్యాన్ పని చేసిపెట్టు! ఈ రాజీనామా పత్రాన్ని మన్మోహన్ సింగుకు రవాణించు – ఇట్లు (మాజీ) దేవుడు”
తిలక్ తన ప్రార్థన తో దేవుణ్ణి సముదాయించి అతని వారసుడెవరో తెలుసుకొన్నాట్ట. ఆపై మహాప్రస్థానం మొదలెట్టిన తిలక్ ఇంకా మన్మోహన్ సింగును చేరలేదు. (వారసుని సస్పెన్స్ తట్టుకోలేక) హార్ట్ ఎటాకైన సింగుగారు AIIMS లో రెస్టు తీసుకొంటున్నట్టు తాజా వార్త!!!