వైకుంఠపాళీ – చివరి భాగం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

గతభాగం

 

“ఏమిటి దేవీ, ఇంకా ఆలోచిస్తున్నావా?” అన్నాడు శతంజయ సఖుడు.

“అవును స్వామీ! ఒక్కో ఆటకాయ ఒక్కో వైవిధ్యాన్ని కలిగివుంది.” అంది శతదళసమానానన.

“అవునా! ఏమిటో ఆ వైవిధ్యాలు?”

“మొదటగా మీ మొదటి పావు గురించి. ఆట మొదలైనప్పటి నుండీ ఒక్క పాము నోట కూడా పడకుండా ప్రయాణం సాగించింది. స్వర్గలోకాన్నీ, మహర్లోకాన్నీ అవలీలగా చేరింది. చూస్తూ ఉంటే ఈ కాయకు సుమతిత్వం ఉన్నట్టుగా ఉంది. ఇక మీ రెండో కాయ…కేవలం ఒకే ఒక్క పాము నోట బడింది. ఆ చిన్ని అపశ్రుతి తప్ప మిగతా ప్రస్థానాన్ని అమోఘంగా సాగించింది. అత్యంత క్లిష్టమయాలైన ‘గురుబోధ’ను, ‘వైరాగ్యా’న్నీ చేరడమే గాక అన్ని కాయలకంటే మొదటగా ‘వైకుంఠా’న్ని చేరింది. చూడగా చూడగా, ఈ పావు కేశవప్రియగా కనబడుతోంది.” అంది జ్ఞానాంబిక.

“బాగు బాగు! చక్కటి విశ్లేషణలే చేసావు. మరి నీ పావుల గురించి కూడా చెప్పు!”

“ప్రభూ! నా మొదటి పావు కూడా సుమతీయుక్తమైన మీ రెండో పావులానే ఒక్క పాము నోట కూడా పడకుండా నడిచింది. కానీ పరమపదాన్ని పూర్తిగా సాధించలేకపోయింది. స్వర్గలోకంలో మీ మొదటి పావుతో జట్టు కట్టినా నా మొదటి పావును పరికించి చూడగా, నెమ్మదిగా ప్రయాణించినా స్థిరత్వంతో నడచి బ్రహ్మలోకాన్ని చేరుకోగలిగింది. అక్కడితో ఆగకుండా పరమపదానికి ఒక్క మెట్టు దగ్గరలో వచ్చి నిలబడింది. మొత్తం మీద ఈ పావు నడక మనోరంజకంగా నడచింది. ఈక నా రెండో పావు గురించి చెప్పాలంటే…”

“ఆగావేం దేవీ!” అంటూ చిరునవ్వు నవ్వాడు చిత్తజ జనకుడు.

“నిజానికి ఈ ఆటకాయ వైవిధ్యం దాని నడకలోనే ఉంది. ఈ కాయ దిగినన్ని పాముల్ని మరే కాయా దిగలేదు.” అంది దేవవనితా శిరోమణి.

“ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మొత్తం ఆటలో ప్రారంభ స్థానానికి దిగజారిన ఒకే ఒక్క కాయ ఇది. అలా దిగజారినా కూడా అన్ని పాముల్ని దాటుకుని పైకి ఎగబ్రాకింది. అదీ దాని వైవిధ్యం.”

“అనంతుడిచే మ్రింగబడినా మింగిన అనంతుణ్ణి దాటుకు సాగిన ధీశాలి ఈ కాయ అంటారా?”

“అనుమానమా!”

“మీ అనుమోదమే నాకు సమ్మోదం! ఇప్పుడు మొత్తం ఆటను, ఆటకాయలనూ సమీక్షించి చూస్తే – అనంతమైన సంసారంలో మనోరంజకాల్లా భ్రమింపజేసే లౌకికార్షణలకు లోను కాకుండా ఉండే సుమతులు కేశవప్రియులై పరమపదాన్ని చేరుతారు!” అంది పంచగంగాతీరవాసిని.

“చక్కగా సమీక్షించావు దేవీ!” అన్నాడు శ్వేతవరాహరూపి

“మహాప్రభూ! నా బాలిశ పలుకుల్ని హర్షిస్తున్న మీరు దయాసముద్రులే! మీరు సర్వజ్ఞ శిఖామణులు.  మీ నోట జాలువారే ఉపదేశామృతానికై ఈ పావులే కాదు, నేను సైతం ఎదురు చూస్తున్నాను. అనుగ్రహించండి!”

ఆహ్లాదంగా నవ్వాడు ప్రహ్లాదవరదుడు.

“అవశ్యంగా విను దేవీ! వర్షపు చినుకు ద్వారా భూమికి చేరిన జీవి, తండ్రి గర్భంలో మూడు నెలలు ఉండి, రేతస్సు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించి, అక్కడ తొమ్మిది నెలలు ఉండి ప్రసూతి వాయు తాడనం చే భూమి పైకి రావడం జరుగుతుంది. ప్రాణమున్నంత వరకూ ఈ దేహాన్ని శరీరమని పిలుస్తారు. ‘శీర్యతేతి శరీరం’. శీర్య మంటే రోగాది ఉపద్రవాలని అర్థం. నానా విధాలైన దైహిక, మానసిక రుగ్మతలతో హింసపడే దేహాన్ని శరీరమంటారు. త్రిగుణాత్మకమైన ఈ శరీరంలో సాత్వికగుణం వల్ల దయ, క్షమ, శాంతి మొదలైనవి పుడతాయి. రజోగుణం వల్ల అనేక కర్మలను చేయడానికి బుద్ధి పుడుతుంది. తమోగుణం వల్ల కామ, క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలు పుడతాయి.

నుదుటిన వ్రాసిన విధంగా జీవించి ప్రాణవాయువు తొలగగానే శరీరం కాస్తా శవమౌతుంది. యోగ్యులైన, యోగులైనా, అయోగ్యులైనా, చనిపోయిన వారి దేహాన్ని శవమనే పిలుస్తారు.  ‘శం సుఖం వహతీతి గచ్ఛతీతిశవం’. యోగులు, యోగ్యుల విషయంలో ‘శవం’ అన్నది సుఖాన్ని కొనిపోయేదిగా ఉంటుంది. అయోగ్యుల విషయంలో సంకటభూయిష్టమై, దుర్గంధభరితమై, జంతువుల కాహారమయ్యే పాంచభౌతిక దేహంగానే మిగిలిపోతుంది. నేడు ఉండి మరునాడు శిథిలమైపోయే ఈ శరీరాన్ని దేవాలయంగా మార్చగలగడమే సాధన.” అన్నాడు విలయరహితుడు.

“అందుకేగా, ‘పిబత భాగవతం రసం ఆలయం’ – ఈ దేహం నాశనమయ్యేవరకూ భాగవత రసాన్ని ఆస్వాదించమని తద్వారా కుళ్ళుతో కూడుకున్న దేహం ఆలయమౌతుందని వ్యాసభగవానుని రూపంలో మీరే తెలిపారు!” అన్నది రూపలావణ్యగుణయుక్తురాలు.

“ప్రియా! భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం – ఈ ఐదు తత్వాలు కలిసి జీవికి దేహంగా ఏర్పడతాయి. ఈ ఐదు భూతాలు విడివిడిగా ఉంటున్నట్టు కనబడుతున్న ఒకదానిలో ఒకటి మిళితమైవుంటాయి. అంటే నీటిలో భూతత్త్వముంటుంది. అలానే ఆకాశంలో మిగిలిన నాలుగు తత్త్వాలూ ఉంటాయి. కానీ అవి కంటికి కనబడనటువంటి సూక్ష్మాంశాలలో కలిసిపోయి ఉంటాయి. బొగ్గులోను, వజ్రంలోనూ ఉండే మూలభూత వస్తువు ఒక్కటే. అలాగని బొగ్గు నుండి వజ్రాన్ని మానవులు తయారు చేయలేరు. కానీ నీ స్వరూపమైన ప్రకృతి శక్తి ఈ మార్పును సాధించగలగుతుంది. బొగ్గులాంటి దేహాన్ని వజ్రసమానంగా మార్చగలిగేది భక్తి. శ్రవణంతో మొదలుపెట్టి ఆత్మనివేదనం దాకా వెళ్ళగలిగిన వారు జ్ఞానసంపన్నులై ప్రకాశిస్తారు. అంటే బొగ్గు నుండి వజ్రంగా రూపాంతరం చెందుతారు. 

ఈవిధంగా, వైకుంఠపాళి మొదటి గడి ‘కోతి’. అక్కడినుండి బయల్దేరే ఆటకాయ ఆట ముగిసేసరికి పరమపదాన్ని అందుకుంటుంది. అట్టడుగు వరసలో ఉండే కోతి ప్రాకృతిక లక్షణాలకు నిదర్శనమైతే, పై వరుసలో ఉన్న మరో కోతి…అదే…హనుమంతుడు పరమపద సోపాన సదృశమైన ఆధ్యాత్మిక శిక్షణకు నిదర్శనం.

‘కపి చలనే’ అన్న ధాతువు ప్రకారం చంచలమైన స్వభావం కలదాన్ని కోతిగా పిలుస్తారు. ఇలాంటి అస్థిరమైన బుద్ధిని ‘సుగుణమూ, ‘సత్ప్రవర్తనా, ‘నిష్ట’, ‘యాగము’, ‘యోగము’, ‘భక్తీ, ‘చిత్తశుద్ధీ’, ‘గురుబోధ, ‘జ్ఞానము’, ‘వైరాగ్యము’ అనే పది సోపానాలను ఎక్కించినపుడు మునుపు చెప్పుకున్న చంచలమైన ‘కపి కాస్త ‘కం సుఖం పిబతీతి కపి’గా మారుతుంది. అంటే శాశ్వతమైన మోక్షసుఖమనే అమృతాన్ని సేవించే ‘కపి’గా రూపాంతరం చెందుతుంది. అలా కానప్పుడు, ‘హిరణ్యాక్ష’, ‘నరకాసుర ‘, ‘బకాసుర’, ‘దుర్యోధన’, ‘తనరథ’, ‘కర్కోటక’, ‘మాత్సర్య’, ‘అర్కాసుర’, ‘అహంకార’, ‘శతకంఠ రావణ’ అనబడే పది రకాల పాముల నోట బడి అధ:పాతాళానికి తోయబడతారు.

‘భోగేన పుణ్యం కుశలేన పాపం’ అన్న చందాన కుశలబుద్ధితో పాముల్ని దాటుకుని, సుగుణాత్మకాలైన నిచ్చెనలను ఎక్కి పరమసుఖాన్ని భోగించడమే జీవుల జీవనోద్దేశ్యం. ఆ మహాసంకల్పానికి తొలిమెట్టుగా, చిన్నతనాననే దిశానిర్దేశం చేయడానికే ఈ వైకుంఠపాళిని సృజించాను. ఇప్పుడు నీతో ఆడాను. అనంతకాలం నుండి అనంతకాలం వరకూ జీవుల చేత ఆడిస్తున్నాను… ఆడిస్తూనేవుంటాను!” అన్నాడు చరాచరజగన్నిర్మాతృడు.

“అనూన్యంగా మీ నుండి అమోఘమైన ఉపదేశాలను వినిపింపజేసిన ఈ పావుల్ని శాశ్వతసుఖానుభూతిలో ఓలలాడించండి! అచింత్యాలు, అనంతాలైన మీ లీలల్ని కించిత్తైనా తెలుపగలిగిన ఈ పరమపదసోపానపటాన్ని చదివిన వారికి, చదివినవారి వద్దనుండి విన్నవారికి కలికృతకల్మషాలను దూరం చేసి అఖిలార్థసాధనీభూతమైన జ్ఞానాన్ని ప్రసాదించండి.” అంటూ  వినయశీలయై, వినమితగాత్రియై ఆ నీరజనేత్రి నమస్కరించింది. సత్యపూర్ణుడై, సుసత్యకాముడై, సత్యాభీష్టదాయకుడై అనుగ్రహించాడు భక్తాపరాధసహిష్ణుడైన శ్రీమన్మహావిష్ణువు.

* * * * *

“మాతా చ కమలాదేవీ పితా దేవో జనార్దనః।

బాంధవా విష్ణుభక్తా చ నివాసం భువనత్రయం॥“

అంటూ మంగళాశాసనం చేసాడు కేశవ శర్మ.

ఒడిలో కూర్చునివున్న కవలల చేత నమస్కారం చేయించింది సుమతి.

* * * * *

“సుమతీ!” అని పిలిచింది రంజని.

బుడి బుడి నడకలతో వచ్చింది పాపాయి. ‘జేజి’కి నమస్కరించింది.

కనకదుర్గమ్మ చిత్రం మనోజ్ఞంగా నవ్వింది.

* * * * *

గుడిగంట మ్రోగింది.

జ్ఞానానికీ, అజ్ఞానానికీ మధ్యనున్న తేడా ఒకే ఒక అక్షరమన్న సత్యం ప్రభాత సూర్యునిలా ప్రత్యుత్థానమౌతోంది.

ఆ వెలుగులో ఆ ఆలయ శిఖరం మరోమారు తళుక్కుమని మెరిసింది.

అకుంఠిత దీక్షాదక్షులకై వైకుంఠపాళి శబ్దార్థ సమన్వయ చాతుర్యభరితమై మరోమారు ఆయత్తమయింది!

 

సురగణవర పరివారః శోభమానోరుహారః
కరికరసమహస్తః కాంచనోద్దీప్తవస్త్రః
శుభజనకృతగానః శేషభోగేశయానః
ప్రభురమయవినాశః ప్రియతాం ఇందిరేశః

 

~~~ స మా ప్తం ~~~

One thought on “వైకుంఠపాళీ – చివరి భాగం

  1. 🙏🙏🙏💐.. మనసు అంతా, భక్తి భావంతో,మధురమైన భావననింపింది ఈ, రచన… కృతజ్ఞతలు.!

Your views are valuable to us!

%d bloggers like this: