[ఏకతార మీటుకుంటూ శిష్యుడు ప్రవేశించును]
“ఏనాడు మొదలిడితివో..ఓ…ఓ…ఓ…ఏనాటికో ఈ నాటక సమాప్తి…ఏనాడు…ఏనాడు….ఏనాడు…”
“ఇక చాలు శిష్యా! నీ నాటక పాట నరనరాన నిప్పెడుతోంది!”
“ఇది అన్యాయం గురూ! నన్నాపకండి” [అని మళ్ళీ పాడును] “నల్ల తామర పుట్టి తెల్లవారలు పెరిగి చల్లని నీళ్ళలో నిప్పు రాజేసెరా…ఆ…ఆ…ఆ…”
“నల్ల తామర ఏమిటి? అది నిప్పు రాజేయడమేమిటిరా శిష్యాక్కుపక్షి?”
“అదే గురూ! ఆ మతలబే అర్థం కాక తత్వాలు పాడుకొంటున్నా. మీరు మహాజ్ఞానులు. రహస్య విచ్చేదనా దక్షులు…అక్కుపక్ష్యాది శిష్యగణ ఉద్ధారకులు…మీరే చెప్పాలి!”
“వెర్రోహం! రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయి చాన్నాళ్ళయిందిరా…”
“అలా సన్యసించకండి గురూ! కనికరించండి గురూ! నల్ల తామర రహస్యాన్ని విప్పండి గురూ…నా జ్ఞానపుష్పాన్ని విప్పార్చండి గురూ!”
“ఆహా! నీ దీనాలాపాలు రాహుల్ గాంధీ ప్రలాపాల కన్నా కడుంగడు భీభత్సంగా ఉన్నాయిరా శిష్యార్భకా! సరే, చెబుతాను విను.”
“తామర పువ్వును గుర్తుగా కలిగిన ఒకానొక రాజకీయ పక్షంపైనే కదరా నీ అక్కసు?”
“అవును గురూ! చక్కగా గ్రహించారు.”
“హుహుహు! ఇందులో గ్రహించడానికి, సంగ్రహించడానికి ఏమున్నదిరా కుంభారతి ప్రియ?”
“ఆ చివరిపదం తిట్టో, పొగడ్తో తెలీకున్నా…మా ఇదిగా నచ్చిందు గురూ! కొనసాగించండి.”
“విను! కమలం బ్రహ్మభారతుల ఆసనం. కాషాయం భారతీ తీర్థాదుల వస్త్ర విశేషం…కనుక….”
“మీరిలా కుంభారతి ప్రియలా మాట్లాడితే నేను ఊరికే ఛస్తాను. కనక తేటగా చెప్పండి గురూ!”
“ఒరేయ్ పదార్థ జ్జానమెరుగని వ్యథార్థజీవీ నీ భాషలోనే ఘోషిస్తాను, విని అఘోరించు! కమలము, కాషాయమూ నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, నిజంగా వేద సంస్కృతి చిహ్నాలు. వాటిల్ని తుచ్ఛ రాజకీయ ప్రయోజనాల కోసం నిస్సిగ్గుగా వాడుకోవడంతో బాటు వాటికి కట్టుబడివుండే సమాజానికి మొండి చేయి చూపించడం హీనమైనది.”
“అవును గురూ!”
“కనుకనే కదరా దూదేకుల సిద్ధయ్య అలా చెప్పింది!”
“ఏమని గురూ?”
“ఇంటి లోపలను ఇల్లు గట్టుకుని…మంటలోపల రాట్నం పెట్టుకు…కంటిలోపల కదురు బెట్టుకు…ముక్కు లోపల యేకు బెట్టుకొని…చెవిలో బారా చేతికి దీసుకు”
“అర్థం కాలేదు గురూ!”
“అదేరా విష్ణుమాయ! అనర్థమే తప్ప అర్థమెరుగని నీకు పదార్థమెట్లా తెలుస్తుంది? ఫో…అనుభవించు ఫో…”
“అంటే నల్ల తామరనే నాకు గతి అంటున్నారా గురూ?”
“వెర్రోహం! మళ్ళీ మళ్ళీ చెప్పాలట్రా!”
“హయ్యో! నల్ల తామర పుట్టి , తెల్లవారలు పెరిగి, చల్లని నీళ్ళలో నిప్పు రాజేసెరా…ఆ…ఆ…ఆ…”
[ఏకతార మీటుకుంటూ శిష్యుడు నిష్క్రమించును]
*****