అరవైనాలుగు కళల్లోను, నవరసాల్లోనూ కూడా ఒకటైన శృంగారరసానికి ఓ ప్రత్యేకత ఉంది. అటు లౌకిక సుఖ ప్రియుల్ని, ఇటు అలౌకిక మోక్షసుఖాపేక్షుల్నీ ఇద్దర్నీ బలంగా ఆకర్షించిన రసంగా ఇది ప్రసిద్ధి చెందింది.
“రాసక్రీడ” ద్వారా వేలాది గోపికలకు అంగ సుఖాన్ని కృష్ణుడు ఇచ్చినట్టుగా భారత, భాగవతాల్లో ఉంది. శృంగారమంటే విశృంఖల కామ మని చాలామంది ఉద్దేశ్యం. కానీ ఆ భావన సరికాదు.
భారతదేశపు ఇతిహాస పాత్రల్లో కృష్ణుడిది విలక్షణమైన పాత్ర. కృష్ణావతారియైన శ్రీహరి యొక్క పూర్వ అవతారలతో పోల్చి చూసినపుడుగానీ, లేక రామాయణ, భారతాల్లో వచ్చే ఇతరేతర పాత్రలతో పోల్చినపుడు గానీ, శ్రీకృష్ణుని వంటి అసాధారణ వ్యక్తిత్వం గల పాత్ర ఎక్కడా దొరకదు.
జైల్లో పుట్టి, పుట్టగానే నదిని దాటి, పెంపుడు తల్లి లాలనతో పెరిగి, ఆవుల్ని కాచి, మేనమామను చంపి, తాతయ్యకు పట్టంగట్టి, పదహారువేలనూటాఎనిమిది మంది భార్యలకు పతియై, సరస సల్లాపాలకు సిసలైన చిరునామాయై, అమోఘ రాజనీతి విశారదుడై, పాండవ మిత్రుడై, కౌరవ వినాశకుడై వెలిగినా చివరకు అతన్ని లోకం “గీతాచార్యా” అనే పిలుస్తుంది-నమస్కరిస్తుంది.
గీతలో సరస సల్లాపాలకు తద్విరుద్ధమైన ఉపదేశాలను చేస్తూ దేహం నశ్వరమని, దీనిపై మోహం తగదని చెబుతాడు. “వృద్ధనారీ పతివ్రతః” అన్న హాస్యోక్తి లాంటిదా ఈ గీతోపదేశం? అన్న ప్రశ్న వేసుకుంటే – కాదని చెబుతాయి ఉపనిషత్తులు. రాసక్రీడ గురించి భారత, భాగవతాల్లో దొరకని అనేక అరుదైన విషయాలను “గోపాల తారకోపనిషత్”, “తాపిన్యోపనిషత్” వంటి ఉపనిషత్తులు విశదీకరిస్తాయి. అంటే వేదోపనిషత్తుల నేపధ్యం లేకుండా చూస్తే, కృష్ణ రాసక్రీడ తుచ్ఛమైన కామాతురంలా మిగిలిపోతుంది.
ఇంతకూ ఏమిటీ రాసక్రీడ?
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
“శరీర మాత్రం ఖలు ధర్మ సాధనం” అన్న పురాణోక్తి మేరకు సమస్త తీర్థాలు, క్షేత్రాలు, దేవతామూర్తులూ ఈ దేహక్షేత్రంలోనే నివాసముంటారు. అలా మానవ దేహంలో “యమునా” నది నెలకొన్న భాగంలో పరమాత్ముని గుణగానాన్ని అనుసంధానిస్తూ భక్తుడు “స్త్రీ”గా, భగవంతుడు “పురుషుడు”గా సాగే సాధనే “రాసక్రీడ”.
దేహంలో కుడివైపు గంగానదిని, ఎడమవైపు యమునా నదిని, హృదయంలో సింధునదిని అనుసంధానం చెయ్యాలని స్నానవిధిలో పూర్వీకులు తెలిపారు. యమునా తీరం అంటే ఈ దేహమే. నదికి రెండు తీరాలున్నట్టే ఈ దేహంలో కూడా రెండు తీరాలున్నాయి. (“అయం ఉత్తర పక్షః; అయం దక్షిణ పక్షః” అన్న శ్రుతి మేరకు).
అమునా అంటే అతని/ఆమె/వారి నుండి అని అర్థం. య అంటే పొందడం. ఈ రెండు ధాతువుల్ని చేర్చి “యమున” అన్న పదాన్ని చేసినప్పుడు “అతని నుండి పొందడం” అన్న అర్థం సిద్ధిస్తుంది. గోపికలు అతని నుండి అంటే “కృష్ణుడి” నుండి “అంగ సంగ” సుఖాన్ని పొందుతున్నారు. ఈ విధంగా కుడి, ఎడమలనే తీరాల మధ్యన ఉన్న హృదయ భాగంలో భక్తుడు స్త్రీ భావంతో, “పురుష” నామకుడైన భగవంతుని గుణ, మహాత్మ్య కీర్తనా రంజనత్వమనే సుఖాన్ని పొందడమే రాసక్రీడ.
దేహంలో కుడివైపున ముప్పైఆరువేల నాడులున్నాయి. వీటికి సూర్యుడు అభిమాని. అందువల్ల వీటిల్ని పగలు నాడులుగా పేర్కొంటారు. అలానే ఎడమవైపు కూడా ముప్ఫైఆరువేల నాడులున్నాయి. వీటికి చంద్రుడు అభిమాని. వీటిల్ని రాత్రి నాడులుగా పేర్కొంటారు.
కుడివైపు నాడుల్ని “పురుష నాడి” అని, ఎడవైపు వాటిల్ని “స్త్రీ నాడి”యని కూడా పిలుస్తారు. వీటన్నింటినీ అనుసంధానిస్తే, “స్త్రీ”నాడులున్న ఎడమవైపున, “చంద్రుడు” నెలవున్న “రాత్రి” నాడిలో, “యమునా” నది నెలకొన్న ఎడమ భాగంలో పరమాత్ముని గుణగానాన్ని అనుసంధానిస్తూ భక్తుడు “స్త్రీ”గా, భగవంతుడు “పురుషుడు”గా సాగే సాధనే “రాస క్రీడ”.
పై ఆధ్యాత్మిక అర్థానుసంధానంతో చూసినపుడు రాసక్రీడ పట్ల తుచ్ఛభావన పోవాలి. భక్తి నెలకొనాలి. ఈ సదుద్దేశ్యంతోనే జయదేవుడు “గీత గోవిందం”ను వ్రాసాడని నా అభిప్రాయం.
కావ్యంలో వచ్చే నాయికా, నాయకుల విరహాన్ని, ఉద్విగ్నమానసిక స్థితులను భక్తిలో, భక్తికై, భక్తితో తపిస్తున్న భక్తునికి అన్వయించి, అలానే నాయికా-నాయకుల సంతోష, సుఖాలను భగవంతుని అనుగ్రహానికి అన్వయించి చదివినపుడు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక కోణం ఆవిష్కారమౌతుంది.
సదరు భక్తి రసావిష్కరణ, పాఠకులకు చేరాలన్న సదుద్దేశ్యంతో మేమందిస్తున్న “గీత గోవిందం ఈ-పుస్తకా”న్ని రసజ్ఞులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం.
రాసక్రీడ గురించి ఆధ్యాత్మిక వివరణను ఇచ్చిన నా గురువుగారికి, “గీత గోవిందం” మూల పాఠాన్ని తెలుగు అర్థంతో సహా అందించిన కె. రమాపతి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ…
శుభాభినందనలతో…
కడప రఘోత్తమరావు
i am not able to download geetha govindam with translation
pl send this to my mail
గీత గోవిందం ఈపుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ధన్యవాదాలు
ఆవకాయ బృందం