ప్రియమైన ఆవకాయ.కామ్ పాఠకులకు,
బొల్లోజు బాబా కవితా సంకలనం “ఆకుపచ్చని తడిగీతం” ఈపుస్తకంగా మీకు అందిస్తున్నాం.
అడిగిన వెంటనే అనుమతినిచ్చిన బాబాగారికి ధన్యవాదాలు.
అభినందనలతో
ఆవకాయ.ఇన్ బృందం
“ఆకుపచ్చని తడిగీతం” – ఓ అభిప్రాయం
బొల్లోజు బాబా గారు ఆవకాయ.కామ్ కు కొత్తవారు కాదు. ఆవకాయ.కామ్ ఆరంభమైన తొలినాళ్ళలో కవితల్ని వ్రాసి కొత్త వెబ్‍సైట్ ను ప్రోత్సహించారు. ఇన్నేళ్ళ తర్వాత వారిని నేను కొత్తగా పరిచయం చెయ్యవలసినదీ లేదు. లేదా అంటే అసలు లేదని కాదు. ఆయన వెలువరించిన “ఆకుపచ్చని తడిగీతం” గురించి చెప్పవలసి ఉంది. యాభై ఎనిమిది కవితలను చేర్చి బాబాజీ “ఆకుపచ్చని తడిగీతం” తీసుకువచ్చారు.
“కవిత్వం హృదయ సంబంధి” అని చాలాసార్లు చదివాను. దాన్ని నేను నమ్ముతానూ కూడా. “తడిగీతం”లో బాబాజీ కూడా చాలా చోట్ల హృదయసంబంధిగానే కనబడతారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ ను, రబీంద్రనాథ టాగోర్ ను బాబాజీ అంతరాళంలో ప్రతిష్టించుకొన్నారనడానికి ఎటువంటి సందేహమూ లేదు. కొన్ని కవితలు వారి శైలినే అనుకరించేట్టు సాగాయి. (ఏది అనుకరణ, ఏది అనుసృజన అనే వాటిపై వారూ, నేను చర్చించిన సందర్భాలున్నాయి.)
2010 నుండి ఇప్పటి వరకూ ఆకుపచ్చని తడిగీతాన్ని చదివిన ప్రతిసారీ నాకు బాబాజీని ఆధునిక ప్రబంధ కవిగా పిలవాలనిపించేది. ప్రణయం, విరహం, ప్రకృతి…ఈ విషయాలతో వారు రచనకు పూనుకున్నప్పుడు వర్ణనలు విరజిమ్ముతాయి. జలయంత్రం లాంటి ఊపు కవిత్వానికి ఓ అందాన్ని ఆపాదిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం దృశ్యం మాత్రం వేరుగా ఉన్నా, ఒక్కోసారి ఒకే పదం ఒకే కవితలో పునరుక్తికి లోనయినట్టు కనిపిస్తుంది. కానీ పఠితకు ఆ వైనం తెలియనివ్వకుండా కవితను నడిపించడంలో బాబాజీ గారి కృషి కనిపిస్తుంది.
క్లుప్తత పట్ల బాబాజీ కి వేరే దృక్కోణముంది. నా దృక్కోణం నుండి చూసినప్పుడు కొన్ని చోట్ల నిడివి పెరిగి మంచి కవిత్వం పలచనబడినట్లనిపించింది. వార్తాపత్రికల్లోనో, కంటి ఎదుటనో తటస్థపడిన సంఘటనల పట్ల స్పందించి వ్రాసినవి ఉన్నాయి. ఇలాంటివాటిల్లో పై చెప్పిన క్లుప్తత కనబడదు.
ఏది ఏమైనా ఎక్కడైతే హృదయసంబంధియైన బాబాజీ కనబడతారో అక్కడ నిజమైన తడి పచ్చగా తాకుతుంది. “హృదయం తియ్యగా వణుకుతుంది”. అపరిచిత మనోలోకమొకటి అమాయకంగా నవ్వుతుంది. ఎలాంటి ముందుమాటా అవసరం లేని పసిపాప బోసినవ్వులా ఆహ్లాదాన్ని పుట్టిస్తాయి.
సాహిత్యాభిమానిగా, మిత్రుడిగా నా అభిప్రాయాల్ని వెల్లడించాను. వాటిల్లో ఏవైనా “కష్టమైనను ఇష్టమేన”ని బాబాజీ అనుకొంటారనే అనుకుంటాను!
అభినందనలతో
రఘోత్తమరావు. కడప