“సున్నితమైన స్వభావం, లోతైన అన్వేషణ, తగినంత అర్ద్రత, నిజాయితీ, చేసే పని ప్రాణం పెట్టి చేయటం, నచ్చనివాటిని తీవ్రంగా వ్యతిరేకించటం, లేదంటే వాటికి వీలైనంత దూరంగా ఉండటం, ఇతరులలో మరిన్ని మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహ చెందటం తన వ్యక్తిత్వంలో ముఖ్యమైన లక్షణాలుగా గమనించిన ప్రసాద్, సరైన కారణం తెలియని లోలోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావిస్తారు. దానినే డిమాండ్ ఫర్ ఎక్సలెన్స్ అని కూడా అనుకోవచ్చునని, అది బహుశా అందరిలోనూ ఉంటుందని, దానిని గుర్తించే సున్నితత్వం, వ్యవధి, అంతర్ముఖీనత ఉండాలని అంటారు.
అనేక దేశకాలాలకు చెందిన జ్ఞానుల మాటలని వర్తమాన జీవితంతో సమన్వయించుకొంటూ, అధ్యయనం చేయటం మానవ వికాసానికి దోహదం చేస్తుందని భావించే ప్రసాద్, వ్యక్తీ-సమాజము, బుద్ధీ-హృదయమూ, జీవితమూ-అంతిమ సత్యమూ పరస్పర వ్యతిరేకాలు కావని, స్త్రీ-పురుష శక్తులవలే పరస్పర పూరకాలనీ, జాతుల, మతాల, ప్రాంతాల సంస్కృతుల సారాన్ని గ్రహిస్తూ, ఒక మహామానవ సంస్కృతి విస్తరించాలని, ఎవరి జీవితమని కాకుండా, అందరం మొత్తం జీవితం పట్ల బాధ్యత కలిగి స్పందించాలని, ఆలోచించాలని, వికసించాలని కలగంటారు.
సాహిత్యం పట్ల ప్రజలలో క్షీణిస్తున్న ఆసక్తీ, దానికి దారితీసిన ఉదాత్తత, నిజాయితీ లోపిస్తున్న సాహిత్యకారుల ఇరుకిరుకు వాదప్రతివాదాలూ, సాంకేతిక పరిణామాలూ, అనేక ఇతర కారణాల వల్ల పొడిబారుతున్న మానవ సంబంధాలూ; వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులూ – వీటన్నిటితో సృజనకు దూరంగా చాలా సంవత్సరాలు గడిచాక – జీవితం పట్ల మరింత స్పష్టతా, ఇష్టతా ఏర్పడుతున్న దశలో – క్షీణిస్తున్న మానవ విలువల పట్ల వ్య్దధచెందే అక్కడక్కడి మిత్రులను చూసి, ముఖ్యంగా కొందరికైనా తన మాటలు ఓదార్పునీ, స్పష్టతనీ, బలాన్నీ ఇవ్వటం గమనించి, తనకు అర్థమైన జీవితాన్ని ఇతరులతో పంచుకోవటం కోసం…’ఆకాశం’ సంకలనాన్ని” బి.వి.వి ప్రసాద్ గారు తీసుకొచ్చారు.
ఈ సంకలనానికి వ్రాసిన ముందుమాటలోని పై భాగాల్లో ప్రసాద్ గారి దృక్పథం, నిబద్ధత, అన్వేషణ మొదలైనవి తేటతెల్లమౌతాయి.
మేఘాల స్పర్శ, వానజల్లుల తడి, ఉరుముల అలజడి, మెరుపుల తళుకులు, తారల విలాసం, అమవస నిశినాటి చంద్రవిలాపం – ఎన్నెన్నో భావాల ఆకరమై, వంద కవితలతో ఆధునిక కవిత్వ శతకమైన “ఆకాశం” మీ చేతుల్లో ఉంచుతున్నాం.
ఈ సంకలనాన్ని ఈపుస్తకంగా ప్రచురించడానికి అనుమతి నిచ్చిన బి.వి.వి. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
సాహిత్యాభినందనలతో
ఆవకాయ.కామ్ సంపాదక బృందం