Original Author: Ravinar, MediaCrooks.com Telugu Translation: C. Raghothama Rao
Read original article on MediaCrooks.com – Link >> Scamsters Paradise
2014లో అధికారానికి వచ్చిన మోడి ప్రభుత్వం తొలి రోజుల్లోనే నల్లధనంపై విచారణకు ఒక SIT ను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి గత నాలుగు సంవత్సరాలలో ఆ సిట్ ఏం చేసిందో, ఎన్ని నివేదికల్ని సమర్పించిందో నాకు తెలీదు. ఏది ఏమైనా, ఎన్నికల సమయంలో మోడీ చేసిన వాగ్దానం ప్రకారం ఎలాంటి నల్లధనమూ ప్రభుత్వ ఖజానాకు చేరిందయితే లేదు. నా వరకు నేను ధృఢపరుచుకున్నాను – ఏ నల్లధనం పట్టుబడదని. అందుకే “Baby black is not coming back” అన్న వ్యాసాన్ని ఎప్పుడో రాసేసాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విదేశీ బ్యాంకుల నుండి నల్లధనాధిపతుల పేర్లను సేకరించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ఆ పేర్లను బహిరంగంగా ప్రకటించలేదు. మోడీ ప్రభుత్వం ఇంతకంటే గొప్ప పనినే చేసింది. ఈయన ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లెక్కి “అయ్యా! పేర్లను పబ్లిగ్గా ప్రకటించేది వద్దు. అలా చేస్తే ఆయా దేశాలతో, విదేశీ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాలు మట్టిగొట్టుకుపోతాయి” అని వాపోయింది. ఈ విషయం పై మాట్లాడడానికి అరుణ జైట్లీనే సరైన వ్యక్తి. ఎందుకంటే అటు నల్లడబ్బు దొరలతోను, ఇటు సుప్రీంకోర్టుతోను గేమ్స్ ఆడిన ఘనుడు ఈ జైట్లీ.
214 అక్టోబర్ నెలలోనే రామ్ జెత్మలాని అరుణ్ జైట్లీకి నల్లడబ్బుపై ఒక ఉత్తరం రాసాడు. దీనికి ముందు జైట్లీ తన దర్బారు ఐన టీవీ ఛానళ్ళలో ఏవేవో వాగాడు. పై చెప్పిన నా పాత వ్యాసంలోని ఒక పేరాను ఇక్కడ మళ్ళీ ఉటంకిస్తున్నాను.
జైట్లీ తన నిత్యాభిమాని ఐన బర్ఖాదత్ తో మాట్లాడుతూ – “[నల్లడబ్బుగలవాళ్ళ] పేర్లను బయటపెడితే వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని నేను భావిస్తాను.” అన్నాడు. ఇక్కడ నేను అంటే భా.జ.పా అని భావం. TimesNow ఎడిటర్ నావికా కుమార్ జైట్లీని ఇంటర్వ్యూ చేస్తూ నల్లడబ్బున్నవాళ్ళలో కాంగ్రేస్ వాళ్ళ పేర్లున్నాయా అని అడిగితే అందుకు సమాధానంగా “నేనేమీ చెప్పడం లేదు. నవ్వుతున్నానంతే” అన్నాడు జైట్లీ. ఢిల్లీ లుట్యెన్ ముఠాలతో మంచి సంబంధాలున్న జైట్లీ ఇలాంటి రాజకీయ క్రీడలు ఆడడంలో చాలా నేర్పరి. జైట్లీకి రక్షణశాఖ కానీ I&B శాఖపై కానీ ఆసక్తి లేదు. నిజానికి జైట్లీ యోగ్యతకు I&B శాఖనే సరైనది. ఇతనిలానే పి. చిదంబరంకు హోమ్ శాఖలో ఆసక్తి లేదు. అయినా వీళ్ళకు అ శాఖల్ని కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేసినా మీడియావాళ్ళు మాత్రం ఈ ఇద్దరిని ఎప్పుడూ గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మీడియాకు డార్లింగ్స్.
మోసగాళ్ళు, నల్లడబ్బు దొంగలు ఒక రక్షణ కవచం వెనుక హాయిగా ఉన్నారని నిస్సందేహంగా చెప్పగలను. నల్లడబ్బు SIT తాము సేకరించిన పేర్లను ఒక “సీల్డ్ కవర్”లో పెట్టి సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సివుంది. ఆ కవర్‍ను ఓ 50 ఏళ్ళ తర్వాత, ఆ లిస్ట్ లోని చాలామంది చచ్చిపోయాక, తీరిగ్గా తెరుస్తారు. ఎవ్వరూ జైలుకు వెళ్ళరు. ఎలాంటి నల్లడబ్బు బైటకు రాదు.
ఈరోజు మనం నీరవ్ మోడి, మెహుల్ చోక్సీ మరి ఇంకొందరి ఆర్థిక నేరాలపై పెట్రేగిపోతున్నాం. ఈ ఇద్దరూ వజ్రాల వ్యాపారం చేసినవాళ్ళు. వీరికి వజ్రాలను అమ్మినవాళ్ళెవ్వరూ ఈ ఇద్దరినీ నమ్మనుగాక నమ్మలేదు. ఎలాంటి అప్పు ఇవ్వలేదు. పైగా వాళ్ళు డబ్బులు కడితేనే వజ్రాల్ని ఇచ్చారు. మన భారతీయ బ్యాంకులు మోసకారి పనులకు అలవాటు పడ్డాయి. బ్యాంకు మేనేజర్లు, డైరెక్టర్లు ఆడింది ఆట పాడింది పాట. ఈ విషయాన్ని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ఆర్థిక అవకతవకల నేపధ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిన్నాచితక మోసాల్లో బ్యాంకు మేనేజర్‍కు మంచి “బహుమతి” లభిస్తుందనేది బహిరంగ రహస్యమే. ఇటువంటి మోసాలు సాధారణంగా పారిశ్రామికవాడల్లో జరుగుతుంటాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో గల బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు పారిశ్రామికవేత్తలను తరుచూ కలుస్తుంటారు కనుక వారికి ఆ వ్యాపారుల పద్ధతులు బాగా తెలుస్తాయి. తాము చేస్తున్న మోసాలను కప్పిపుచ్చడానికి ఈ మేనేజర్లు ఆ వ్యాపారుల ఆస్థుల్ని ఒక తెరగా వాడుకుంటారు. “వజ్రం శాశ్వతం” అయినా అది నకిలీ కూడా అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం తాజా కుంభకోణాల్లో చూసాం, తెలుసుకున్నాం. నీరవ్-మెహుల్ అధ్యాయంలోని కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
సంజయ్ పుగాలియ ట్వీట్ చాలా చాలా ఆసక్తికరమైంది. తన స్కాములు బైటపడబోతున్న విషయం నీరవ్ మోడికి చాలా ముందుగానే తెలుసు. ఎంత ముందుగా అంటే స్కూలు కెళుతున్న తన పిల్లలను మధ్యలోనే చదువు మాన్పించేసి విదేశాలను పంపేసాడు. ఆపై తనూ చెక్కేసాడు. దీన్నే Lock, Stock & Children గా చెప్పుకోవాలి. అన్ని రోజులూ నీరవ్‍తో జట్టు కట్టిన బ్యాంక్ మేనేజర్లు, అధికారులే అతను పారిపోవడానికి సలహాలు ఇచ్చివుంటారు. ఉత్తి సలహాలతో సరిపెట్టక నీరవ్ పారిపోవడానికి కావల్సిన సమయాన్ని కూడా ఇచ్చేవుంటారు. ఇందులో సందేహపడ్డానికి ఏమీ లేదు. మెహుల్ చోక్సీ కూడా ఇదే విధంగా విదేశాలను పారిపోయాడు. వీరు తిరిగి వస్తారా? వీరికి విదేశీ పౌరసత్వం ఉందా? అన్న విషయాలను ఇప్పటికిప్పుడు నిర్ధారించడం కష్టం. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది – వీరు దోచేసిన డబ్బు మాత్రం వెనక్కు రాదు. ఇక్కడ ఒకసారి లాలూ ప్రసాద్ కేసును గుర్తుచేసుకోవాలి. కోర్ట్ అతనికి జైలు శిక్ష విధించిందేగానీ అతను దోచిన డబ్బును రికవరీ చేయడంపై ఒక్క మాటా మాట్లాడలేదు.
భారతదేశం మోసగాళ్ళ స్వర్గధామంగా మారింది. ఇందుకు ముఖ్యకారణం కాంగ్రెస్ పార్టీయే. ఈ భ్రష్టుపట్టిన పార్టీ దేశంలోని అవినీతి బురదకు మూలమైన “కంగోత్రి” అనడంలో సందేహమే అవసరం లేదు. యూపిఏ ప్రభుత్వం చేసిన స్కాముల నుండి రాబర్ట్ వాద్రా అక్రమాల ద్వారా ఈనాటి నీరవ్-మెహుల్ కుంభకోణాల వరకూ – ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ దయతో నడిచినవే. అసలు సమస్య ఏమిటంటే, ప్రధాని మోడి ఈ అవినీతి పై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నాడో లేక బలహీనుడై ఏమీ చేయకుండా ఉన్నాడో తెలియడం లేదు. అతని మనసులో ఏమనుకుంటున్నాడో ఊహించలేక పోతున్నాను. ఈ అవినీతి విషయాల్లో బహుశా మోడి కంటే జైట్లీనే బలవంతుడేమో! అవినీతిపరులను పట్టుకోకుండా ఉండడం వెనుక జైట్లీ ప్రభావం ఉందేమో!! ఇన్ని అక్రమాలు, అన్యాయాలు జరుగుతుంటే బిజేపి మంత్రులు NDTV లాంటి మోసకారి ఛానల్స్ తో సరసాలు ఆడుతుంటే ఎవరికైనా అనుమానాలు రాకుండా ఉంటుందా?
NDTV చేసిన, చేస్తున్న మోసాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా FIPB ద్వారా వీరు చేసిన మోసం బైటపడింది. ఈ మోసంలో పి. చిదంబరం కొడుకు కార్తికి కూడా పాత్ర ఉందని. నిజానికి అతనే బ్రోకర్ లా వ్యవహరించి అక్రమ అనుమతులు ఇప్పించాడని తెలుస్తోంది. బ్రోకరేజీ కింద పెద్ద మొత్తంను జేబులో వేసుకున్నాడని కూడా రిపోర్టులు చెబుతున్నాయి. ఎయిర్‍సెల్-మాక్సిస్ కుంభకోణంకు సంబంధించి, మాజీ మంత్రి చిదంబరం ఇంటిపై జరిగిన ఐటి దాడిలో ఒక సీల్డ్ కవర్ దొరికింది. ఈ కవర్ కేంద్రప్రభుత్వానికి చెందిన ఒక రిపోర్ట్. సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సిన ఈ రిపోర్ట్ నేరుగా చిదంబరం ఇంటికి చేరింది. ఇంత అధికార దుర్వినియోగానికి, ఆర్థిక నేరాలకు పాల్పడిన తండ్రికొడుకులిద్దరూ నిస్సిగ్గుగా, స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ప్రధాని మోడిని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యాలు ఒక్క భారతదేశంలోనే జరుగుతాయి.
ఈ మోసగాళ్ళు, దోపిడీదొంగలందరూ “అంటరానివాళ్ళు.” ఏ దర్యాప్తు సంస్థా వీళ్ళను అంటలేదు. ముట్టలేదు. తాకలేదు.
ఇవేవీ అరుణ్ జైట్లీని కదిలించవు. అసలు ఈ జైట్లీ ఎన్నికల్లో గెలవలేని అయోగ్యుడు. ఐనా సరే కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తూ, తన లుట్యేన్ ముఠాల తరఫున పని చేస్తున్నాడు. ఇతను చేస్తున్న నీతిమాలిన పనుల ప్రభావం మోడీ పైన పడుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు ఈ దేశ ప్రధాని. గత ముప్పై ఏళ్ళలో మనం చూడని శక్తిశాలి ప్రధానిగా మోడీ అధికార పీఠం ఎక్కాడు. కానీ ఎన్నికల్లో గెలవలేని ఒక వ్యక్తి ముందు నిస్సహాయుడిగా నిలబడుతున్నాడు. Sunday Guardian పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. నలపద్ వ్రాసిన ఈ వ్యాసాన్ని చదవండి. ముఖ్యంగా ఈ పేరాను చదవండి.
“his (Modi’s) government has ordered the forcible merger of a Mumbai-based company with a now defunct stock exchange begun by the major shareholder of the former. Oddly, the stockbrokers who actually owed the moneys in default seem to have escaped penal action thus far, while a separate company has been marked for destruction through forcible payment by it of the dues of the other entity. There have been whispers that the move against this company was taken on the instance of a former Finance Minister, who wanted to both destroy an exchange competing with a favourite of his, as well as to protect the parties guilty of default…”
బ్యాంక్ సెక్యూరిటీ వ్యవస్థను భ్రష్టుపట్టించడం ద్వారా కాంగ్రెస్, మరీ ముఖ్యంగా చిదంబరం, ఎలా మోసగాళ్ళను ప్రోత్సహించారో చూస్తుంటే కళ్ళు తిరగడం తథ్యం. లేజర్ సాఫ్ట్ అనే కంపెనీ వారు రూపొందించి, అతి తక్కువ ధరకు ఇచ్చిన బ్యాంక్ సెక్యూరిటీ సాఫ్ట్‍వేర్ ను తీసేసి దాని స్థానంలో 25 రెట్లు ఎక్కువ డబ్బు పెట్టి “Finacle” అనే నాసిరకం సాఫ్ట్‍వేర్ ను Infosys నుండి కొంది కాంగ్రెస్ ప్రభుత్వం. రూ.40 కోట్లకు బదులు రూ.1000 కోట్లను బ్యాంకు వినియోగదారుల నుండి ముక్కుపిండి మరీ వసూలు చేయడం జరిగింది. Finacle అంటే Financial Debacle అని అర్థం చేసుకోవాలేమో?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులకు బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ లోని అన్ని మాడ్యూల్సు అందుబాటులో ఉండేవి అంటే అవినీతి ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది.
ఇక NDTV కుంభకోణం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఈ మోసకారి సంస్థను శిక్షించడంలో మోడి ప్రభుత్వం చూపిస్తున్న నపుంసకత్వం నవ్వు తెప్పిస్తోంది. ప్రణయ్ రాయ్‍ని ముట్టడానికి భయపడుతోంది మోడి సర్కార్. తమ ఆర్థిక నేరాలను బయటకు లాగుతున్న సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా రాసిన ఉత్తరంలో “స్వామి చర్యలు దేశ మర్యాదకు కళంకం కలిగిస్తోందని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోం”దని ప్రణయ్ రాయ్ ఆరోపించాడు. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటుండదు. NDTV ఒక దేశవ్యతిరేక సంస్థ. అన్యాయాల పుట్ట. ఈ సంస్థ ఏనాడు భారతదేశాన్ని గానీ జర్నలిస్ట్ విలువల్ని గానీ గౌరవించిన దాఖలాలు లేవు. FIPB తో NDTV జరిపిన లావాదేవీలు కేవలం పెట్టుబడి లొసుగులు మాత్రమే కాదు, అవన్నీ క్షమించకూడని ఆర్థిక నేరాలు కూడా. ఈ అవకతవకలు సాఫీగా సాగించడానికి పెద్దమొత్తంలో లంచాలు చేతులు మారేవుంటాయి. NDTV ఎవరి డబ్బును అక్రమంగా కొల్లగొడ్తోందో ఊహించడం ఏమాత్రం కష్టం కాదు.
నీరవ్ మోడి కేస్‍లో రాహుల్ గాంధి మొదలు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి మొదలైన కాంగ్రెస్ నాయకులకు సంబంధాలున్నాయి. ప్రధాని మోడి వ్యక్తిగతంగా నిస్వార్థపరుడు. అతనికి ద్రోహబుద్ధి ఉంది అని చెప్పకూడదు. అతని నిజాయితీ ప్రశ్నాతీతం. కానీ కళ్ళ ముందే ఇన్ని ఆర్థిక నేరాలు బయటపడుతున్నా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఊరకే “అవినీతి పై పోరాటం…అవినీతి పై పోరాటం” అని కేకలు పెట్టడాన్ని ప్రశ్నించక తప్పదు. మోడి సర్కార్ ఒక అనామకపు SIT వేసి చేతులు దులుపుకోవడం కంటే కొన్ని కఠిన చర్యల్ని తీసుకొని ఉండాల్సింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వం బ్యాంకులను పిలిచి ఎంతో కొంత అప్పు, ఉదాహరణకు పదికోట్ల రూపాయలకు పైబడి, బాకీ పడి వాటిని చెల్లించని వాళ్ళ చిట్టాను తయారు చేయమని చెప్పివుంటే బాగుండేది. ఇలాంటి ఎగవేతదారులు లక్షమందికి లోపునే ఉంటారు. మోసగాళ్ళను అరికట్టాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఈ చిన్న దొంగల సమూహాంపై నిఘా పెట్టి విచారించడానికి పెద్దగా కష్టమయ్యేది కాదు. ఇలా చేసివుంటే మోడీ వచ్చాక కూడా అక్రమాలను చేస్తున్న వారి ఆట కట్టించేందుకు వీలయ్యేది. బురుడీ బ్యాంకులు కూడా ప్రజల ముందు నగ్నంగా నిలబడేవి. డీమనిటైజేషన్ సందర్భంలో పెద్ద తిమింగలాల్ని రక్షించేందుకు కొందరు బ్యాంక్ అధికారులు కృషి చేసారు. నల్లధనాన్ని అటుయిటు తిప్పి దాచిపెట్టారు.
ఏదియేమైనా, కాంగ్రెస్ హయాంలో ఈ దేశం మోసగాళ్ళ స్వర్గంగా మారింది. మోడీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ మోసగాళ్ళకు కలిగిన కష్టాలు ఏవీ లేవు. నిజంగా మోసపోయినవాళ్ళు ప్రజలు మాత్రమే. బ్యాంకులు కానీ, ఆదాయపన్ను శాఖ కానీ, ఇతర ప్రభుత్వ శాఖలు కానీ వెంటపడి వేధించేది ఈ ప్రజలనే. మోసగాళ్ళ స్వర్గాన్ని అలానే కొన్సాగించడం వల్ల అవినీతి మరింత పెరుగుతుందే గానీ మోడీ హుంకరిస్తున్నట్టు అది అంతరించదు. తరతరాలుగా ప్రభుత్వాలు మోసగాళ్ళను వదిలేసి ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్నాయి. మనదేశాన్ని పీడిస్తున్న అవినీతి వ్యాధిని కలిగిస్తున్న రొచ్చుగుంటలో నీరవ్, మెహుల్ చోస్కీలు చిన్న చిన్న క్రిములు మాత్రమే!