Original Author: Ravinar, MediaCrooks.com Telugu Translation: C. Raghothama Rao
Read original article on MediaCrooks.com – Link >> Failure To Launch
మోడి సర్కార్ 2.0 వచ్చి కొన్ని వారాలు మాత్రమే అయింది. ప్రభుత్వ పోకడల్ని ఇంత తక్కువ సమయంలో అంచనా వేయడం తొందరపాటుగా అనిపించవచ్చు. కానీ ఈ 2.0 ప్రభుత్వం నుండి వస్తున్న సంకేతాలు మాత్రం సరిగ్గా లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. మొదటిసారి కంటే కొద్దిగా ఎక్కువ సీట్లతో మళ్ళీ అధికారాన్ని అందుకున్న ప్రభుత్వం ఊహించదానికంటే సిగ్గుల మొగ్గవుతూ, నత్తనడకతో కదలడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి కొత్త ఆలోచనలు ఏమాత్రం రావడం లేదని అర్థమవుతోంది. అంతేకాదు, అమల్లోకి తేవల్సిన పాత ఆలోచనల్ని కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా ఉంది. అన్నిటి కంటే ముఖ్యమైన విషయమేమిటంటే, మోడి కానీ భాజపా ప్రభుత్వం కానీ హిందువుల్ని ఎన్నికల సమయం వాడుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉంది. వీరి దృష్టిలో హిందువులంటే ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగపడే ఒక వోట్ బ్యాంక్ మాత్రమే. వారి సహాయంతో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం చాలా సులభంగా “సిక్యులర్” వేషాలు వేయడం మొదలేస్తుంది. దీని వల్ల తేలేదేమిటంటే – మోడీకి హిందువుల పట్ల, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎలాంటి తాపయత్రం లేదు. ఈ మోడీ హిందువుల చేయబోయేది కూడా ఏదీ లేదు. దానికి బదులుగా ముస్లిమ్ దేశాల నుండి వచ్చే అవార్డులకు ఎగబడతాడు. ఇప్పటికే అర డజను ముస్లిమ్ దేశాలు అతనికి అవార్డులనిచ్చాయి. ఇంకా 44 దేశాలు ఇవ్వాల్సి ఉన్నాయి.
2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో “స్మశానం – కబరిస్తాన్” విషయాన్ని పలుమార్లు ప్రస్తావించాడు మోడి. ముస్లిముల కబరిస్తాన్‍కు ఎక్కువ స్థలం కేటాయించడం ద్వారా అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం హిందువుల్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పాడు. 2019 లోక్‍సభ ఎన్నికల్లో బెంగాల్, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ముస్లిముల చేతుల్లో చనిపోయిన హిందువుల్ని ప్రస్తావించాడు. ఇలా హిందువుల్లో ఆవేశాన్ని రగిలించిన మోడి అధికారంలోకి రాగానే “సిక్యులర్” మేధావిగా మారిపోయాడు. దీనివల్ల అర్థమయ్యేదేమిటంటే మోడికి కావల్సింది “హిందువుల మాసం” మాత్రమే. వారి కష్టాలు కానీ, సమస్యలు కానీ అతనికి అవసరం లేదు. ఇలా ఎందుకంటున్నానంటే, 2019 ఫిబ్రవరి నెలలో తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కుంభకోణం దగ్గరగా ఉన్న ఒక పల్లెలో రామలింగం అనే ఒక ప్రాంతీయపార్టీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అతన్ని చంపిన వారు ముస్లిములు. ఈ ఘాతుకం పై దేశవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక్తపరిచారు. అప్పుడు ఏమాత్రం నోరు మెదపని మోడీ, లోక్‍సభ ఎన్నికలు దగ్గర పడుతుండగా హడావిడిగా NIA బృందాన్ని ఒకదాన్ని రామలింగం గ్రామానికి పంపాడు. ఆ తర్వాత ఏమయిందో ఎవరికీ తెలీదు. అంటే, రామలింగం హత్యను, NIA ను ఎన్నికలప్పుడు తెలివిగా వాడుకున్నాడు మోడీ. బెంగాల్లో హత్యకు గురైన ప్రతి హిందువు గురించి మోడి కానీ బీజేపీ కానీ కార్చింది మొసలి కన్నీళ్ళు మాత్రమే. ఈమధ్యనే, పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్‍ను ఇటుక రాయితో కొట్టి దారుణంగా గాయపర్చడం జరిగింది. ఆ సంఘటన పై స్పందించిన డా. హర్షవర్ధన్ “డాక్టర్ల పై దాడులకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది” అని ట్వీట్ చేసాడు. మోడీ ప్రభుత్వంలో ఉన్న మూర్ఖపు మంత్రుల్లో ఇతను అగ్రగణ్యుడు. ఈ క్రింది స్క్రీన్ షాట్లో మీరు అతని ట్వీట్ ను చూడలేరు. ఎందుకంటే, నేను (మీడియాక్రూక్స్) ఇచ్చిన వాయింపుడుకు జడిసి తన ట్వీట్‍ను తొలగించాడు ఈ మేధావి.
ఒక వ్యక్తిపై ఎవరైనా దాడి చేసి గాయపరిస్తే, చర్యలు తీసుకోవడానికి ఎన్నో చట్టాలున్నాయి. వాటిల్ని వాడకుండా ఈ మేధావి “కొత్త చట్టాలు” కావాలని ఏడుస్తాడు. ఒకవేళ చట్టాలు అవసరమైతే ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న వీళ్ళే కదా! మరి చేయాల్సిన పనిని పక్కనబెట్టి ట్విట్టర్‍లో ఏడిస్తే దాన్నేమనాలి? చేతనికానితనమా లేక నంపుసకత్వమా? మోడీ సర్కార్ విషయంలో ఈ రెండింటితో బాటు “వెన్నెముకలేనితనం” ప్రధానమయింది. వీళ్ళకు ఉన్న చట్టాల పట్ల అవగాహన లేదు. కొత్తగా ఏం చేయాలో తెలీదు. కానీ జనం మెచ్చుకోలు మాత్రం కావాలి. అందుకు సోషియల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడమే రాచమార్గం అనుకునే మూర్ఖులకు బీజేపీలో కొదవ లేదు.
ఇక ’మోటూ భాయ్’గా ప్రేమతో పిలుచుకునే అమిత్ షా ఉన్నాడు. బెంగాల్లో డాక్టర్ పై జరిగిన దాడి గురించి సరైన ప్రకటన చేయకుండా ఏం చేస్తున్నాడో తెలీదు. బహుశా హోమ్ మినిస్ట్రీ అంటే ఏమిటో నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడేమో? అమిత్ షా త్వరలో భారతదేశం కనీ వినీ ఎరుగని విఫల మంత్రిగా మిగులుతాడేమోనని నా అనుమానం!
లోక్‍సభ ఎన్నికల సమయంలో రామ మందిరం గురించి కానీ, అయోధ్య గురించి కానీ నరేంద్ర మోడి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని అన్నాడు అమిత్ షా. రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. ఇదొక ఘోరమైన అబద్ధం. ఒక్క అయోధ్యలో జరిగిన ర్యాలీ లోనే కాదు, బెంగాల్లో కూడ “జై శ్రీరామ్” అన్న నినాదాన్ని విరివిగా వాడాడు మోడీ. ఇదంతా జిత్తులమారితనం. హిందువుల్ని ఒక వోట్ బ్యాంక్ గా మార్చే మోసం. ఇలా హిందువుల్ని ఉబ్బేసి అధికారానికి వచ్చిన మోడి రాత్రికి రాత్రి “సిక్యులర్”గా మారిపోయాడు. తన పార్టీలో ఉన్న ప్రఖ్యాత నటీమణులు హేమమాలిని, స్మృతి ఇరానీ కంటే గొప్పగా నటించగలనని నిరూపించుకున్నాడు మోడి. అయితే, అతని నటన ఇక్కడితో ఆగిపోలేదు. ఎన్నికల ఫలితాలు రాగానే ఆలయాల చుట్టూ తిరిగాడు. కాశీలో రెండుగంటల పాటు పూజలు, అక్కడి నుండి కేదార్‍నాథ్, బదరీనాథ్ పర్యటనలు, కెమరా చక్కగా పట్టే ఒక గుహలో ధ్యానం చేయడం వగైరా నాటకాలు వేసాడు. వీటికంటే ముందు NDA పార్లమెంటరీ సమావేశంలో రాజ్యాంగానికి మోకరిల్లడమనే భారీ నటనను చేసి చూపించాడు.
ఇటువంటి నటనలు, నాటకాలు ప్రధాని మోడీ మొహరులుగా మారాయి. నేను కొండగుహల నిపుణుడిని కాను గానీ మోడీ గుహ మాత్రం చాలా ఆసక్తికరంగా కనబడింది. దానికి ఒక కిటికీ ఉండడంతో బాటు, దుస్తులు తగలేసే హ్యాంగర్ కూడ వేళ్ళాడుతుండడం విచిత్రం. ఇలా కాషాయం బట్టలు, ఆలయ దర్శనాలు, గుహల్లో ధ్యానాలు చేసి చూపించి “ఇది చాల్రా మీకు!” అని హిందువులకు చెప్పకనే చెప్పాడు మోడీ. ఇంతటితో హిందువులు నోరెత్తకుండా పడుండాలన్నది బిజేపీ ఆశయం కాబోలు. విఐపి సంస్కృతి నశించాలని చెప్పే వ్యక్తి తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనానికి పడిగాపులు కాస్తున్న భక్తులను మరింతసేపు వేచివుండేలా చేసాడు. ప్రధానమంత్రికి ఆమాత్రం అధికారం ఉండాలని అంటారా? సరే, అలాగే కానివ్వండి. మోడీ తిరుమల వెళ్ళి వచ్చిన రెండు రోజులకు టిటిడి బోర్డ్ మెంబర్ పదవికి సుధామూర్తి రాజీనామ సమర్పించడం జరిగింది. ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువు (ఇతను క్రిష్టియన్ అని చెబుతారు) ఛైర్మన్‍గా రాబోతున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి.
మోడి సర్కార్ 2.0 వచ్చి కొన్ని వారలు మాత్రమే గడిచివుండవచ్చు కానీ మోడీ సర్కార్ 60 నెలల పాతది. గత అరవై నెలల్లో మోడీ ప్రభుత్వం హిందువుల సమస్యల్ని పరిష్కరించడాన్ని తిరస్కరించడంలోనే కాలం గడిపింది. ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలుగుతున్న ఆలయాలు, గోసంరక్షణ, ఉమ్మడి పౌరసత్వ చట్టం – ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా మోడీ సర్కార్ అలసత్వమే కనబడుతుంది. ఇప్పుడు ఆ అలసత్వం కాస్త నిర్లక్ష్యంగా మారిపోతోంది. ఇది ఇలానే కొనసాగితే, మోడి గానీ అతని మంత్రులు గానీ హిందూ రక్షకులమని చెప్పుకోరాదు. హిందువుల శవాల పై వోట్లు అడుక్కోరాదు. గోరక్షకుల్ని మనసారా తిట్టే మోడీకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కోరుతున్న గోవధ నిషేధాన్ని అమలు పర్చడానికి మనసు రాదు.
ఎరువుల సంచీల్లో తరలిస్తున్న లేగదూడల్ని ఈ వీడియోలో చూడండి. మనసున్నవారికి దుఃఖం కలగకుండా మానదు. గోహంతకులు చేస్తున్న ఈ కిరాతకాలు కంటికి ఇంత స్పష్టంగా కనబడుతున్నా ప్రధాని మోడీకి చీమకుట్టినట్టైనా అనిపించదు.
- ప్రధానమంత్రి కిసాన్ పథకం రైతులందరికీ వర్తిస్తుంది.
- మైనార్టీ (ముస్లిమ్) విద్యార్థులకు పెద్దస్థాయిలో స్కాలర్‍షిప్పులు.
- మద్రసా (ముస్లిమ్ పాఠశాలలు) ఆధునికీకరణ.
ఆ చివరి అజెండా చాలా హాస్యాస్పదమైందనే చెప్పాలి. ఇస్లామ్ మతం పుట్టినప్పటి నుండి ఇప్పటి దాకా ఎటువంటి సంస్కరణకు లోను కాలేదు. అలా చేయాల్సిన అవసరం లేదని ముస్లిమ్ మత పెద్దలు నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామ్ మతం కానీ లేదా ముస్లిమ్ దేశాలు కానీ ఎటువంటి ’ఆధునిక సంస్కరణలు’ చెప్పట్టలేదు. అలాంటిది, మద్రసాలను ఆధునికరిస్తామని మోడీ చెప్పడం నవ్వు తెప్పించే విషయమే!
“మద్రసాలను ఆధునికరించడ మేమిటని?” ప్రశ్నించినవాళ్ళని మోడీ బానిసలు ఎద్దేవా చేసారు. ఆధునికరించడం వల్ల ముస్లిమ్ యువత తీవ్రవాదం వైపుకు వెళ్ళదని వాదించారు. ఈ బానిసలు తమని తాము అపర చాణుక్యులుగా భ్రమపడుతుంటారు. కనుక, తర్కం అన్నది వారికి అందని ద్రాక్ష పండే!
లోక్‍సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీకి ఒక గట్టి ప్రశ్న ఎదురయింది. ఓ పాఠశాల విద్యార్థిని “మీరు (కాంగ్రెస్ పార్టీ) కులాల ఆధారంగా స్కాలర్ షిప్పులిస్తామని అంటున్నారు. దాని వల్ల కొన్ని కులాలకే లాభం కలుగుతుంది కానీ అందరికీ కాదు కదా?” అని అడిగింది. ప్రశ్న అడిగిన అమ్మాయిలో అమాకత్వం ఉంది కానీ అడిగిన ప్రశ్నలో లేదు. కనుక, రాహుల్ గాంధీ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ వీడియోను మోడీ బానిసలు విపరీతంగా పంచారు. కాంగ్రెస్ పార్టీ కులవివక్ష చేస్తోందని ప్రచారం చేసారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మతాల ఆధారంగా విద్యార్థుల్ని విడదీస్తుంటే “ఇదేమిట”ని అడిగిన వాళ్ళను తిట్టి పోస్తున్నారు మూఢ బానిసలు. రాహుల్ చేసింది నేరమని, మోడీ చేస్తున్నది పుణ్యకార్యమని గుండెలు బాదుకుంటున్నారు. నిజానికి, విద్యార్థుల్ని కులాల వారీగా, మతాలా వారీగా విడదీయడం నేరం కాదా? ఈ విషయంలో మోడీ కపట నాటకం ఎలాంటిదో అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ మతప్రాతిపదికన ఇచ్చే స్కాలర్‍షిప్పులను తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతేకాదు, సుప్రీమ్ కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరఫున ఒక దావాను కూడా వేయించాడు.
మతాల ఆధారంగా తయారు చేసిన స్కీముల్ని అమలు చేయాలని రాష్ట్రాలను బలవంత పెట్టకూడదన్నది అప్పటి మోడీ ప్రభుత్వం చేసిన వాదన. ఆరేళ్ళ క్రితం తాను వ్యతిరేకించిన స్కీముల్నే ఇప్పుడు ప్రధానమంత్రిగా అమలు పరుస్తున్న మోడీ ఒక నయవంచకుడే!
ఇక దీనికంటే గొప్ప సమస్య రాబోతోంది.
ఇది మోహన్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ 150వ పుట్టిన సంవత్సరం. కొద్దికాలంలో దేశాన్ని మొత్తం గాంధీ బొమ్మల్తో నింపేస్తాడు మోడి. ఒక్క హిందువుల్లోనే కాదు, బిజేపీ లో కూడా దేశవిభజనకు కారకుడైన గాంధీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఘోరమైన దేశవిభజన గాయాలకు 2014లో పుట్టుకొచ్చిన “గాంధీ భక్తుడు” మరింత కారం రాయబోతున్నాడు. ఈ ’ప్రధాని మోడీ’కి ఒక భయం ఉంది. మైనార్టీలు, సెక్యులరిస్టులు ఎక్కడ తనని “ముస్లిమ్ వ్యతిరేకి” అని ముద్ర వేస్తారో అన్నదే అతని భయం. అందువల్ల తనదైన బాటలో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా మైనార్టీలకు మోడీ చేస్తున్న ’న్యాయం’ కాదు. ఇది మోడీలో పెరుగుతున్న ’మైనారిటీ భీతి’ భూతం. అంతే!
ఇక ప్రతి ఎన్నికల్లో మోడీ చేసే “ఇక అవినీతి ఖతం” అనే గర్జన ఒక పిల్లి కూత లాంటిదే. మోదీ అధికారంలో ఉన్నంత కాలం ఏ ఆర్థిక నేరస్థుడూ, అవినీతిపరుడూ జైలుకు పోరు గాక పోరు. ఎందుకంటే, గత ఐదేళ్ళలో మోడీ ప్రభుత్వం సదరు నేరస్తులకు నోటీసులు, తాఖీదులు పంపండంలో కాలం వెళ్ళబుచ్చింది. ఇకపై కూడా అలానే చేస్తుందని నా ఊహ. 2014లో “అందరికీ న్యాయం – ఎవ్వరికీ ఇవ్వం తాయిలం” (Justice for all, appeasement of none) అన్న మోసపు నినాదంతో అధికారం చేపట్టిన మోడీ సర్కార్, ఇప్పుడు రెండవ విడత అధికార కాలంలో కూడా అదే మోసాన్ని కొనసాగించనుంది. 2014లో చెలరేగిన “క్రిస్టియన్ల పై దాడులు”, “క్రిస్టియన్ నన్ మానభంగం” వంటి వాటితో మోడీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయింది. అప్పుడు వారు అధికారానికి కొత్త. ఇప్పుడు అలా కాకూడదు. కానీ మోడీ ప్రభుత్వం తమ రెండవ విడతను “ఆదిలో హంసపదం” లేదా “ఆదిలోనే హంసపాదు”గా ప్రారంభించింది. మోడీ హిందూ హృదయ సామ్రాట్టు కాడని తనకు తానే నిరూపించుకుంటున్నాడు. కనుక నిజమైన హిందూ సమ్రాట్టుకై హిందువులు ఎక్కువ కాలమే ఎదురు చూడాల్సి ఉంటుంది.
Exccellent article. But bhskts are blindfolded.