భారతీయ ప్రాచీన శాస్త్రాల అధ్యయన క్రమం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

ప్రస్తావన:

వేదవ్యాస రచితమైన బ్రహ్మసూత్రాలలో “తత్తు సమన్వయాత్” అన్న సూత్రమొక టున్నది.

ఇది చాలా సులువుగా అర్థమయ్యే సూత్రం. బహు గ్రంథ విస్తృతము, పద గుంఫనా గహనము, బహ్వర్థ గంభీరమూ ఐన సనాతన ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను సమన్వయ పరచుకుంటూ చదవాలన్నది వేదవ్యాసుని అభిలాష (ఆదేశం కూడానూ).

వేదాలను విభజించిన వానిగా, 18 పురాణాలు, అంతే సంఖ్యలో ఉప పురాణాలను, ఒక ఇతిహాసాన్ని వ్రాసిన మహానుభావుని మాటను లెక్క చేయకుండా సమన్వయపూర్వకంగా అధ్యయనం చేయాల్సిన గ్రంథాలను విడదీసి, విడివిడిగా, పొడి పొడిగా చదవేసి తీర్మానాలను చేయడం, అపహాస్య-అవహేళన-అపనిందలు వేయడం ఏ విధంగా సబబు? ఇది ఎటువంటి విజ్ఞానం?

మూల రచయిత ఉద్దేశ్యాలను, జ్ఞానాన్ని శంకిస్తూ వక్రవ్యాఖ్యలు చేయడమేనా పరిశోధన?

“అమ్మా/అయ్యా – ఇది ఏవిధంగా చూసిన తప్పు. దిద్దుకొమ్మ”ని చెప్పేవారిని ద్రోహులుగాను, ఉన్మాదులుగానూ ముద్రవేయడం ఏ రకపు సంస్కారం?

ఇంతకూ సమన్వయ మంటే ఏమిటి? దానికి ఉదాహరణ ఏమిటి?

అపి స్వర్ణమయీం లంకాం న మే రోచసి లక్ష్మణా

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి (జనప్రసిద్ధిలో ఉన్న శ్లోకం)

 

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్టితాత్

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (మహాభారతం – భగవద్గీత)

 

పైపై చూపులకు రెండు శ్లోకాలు వేరువేరుగా ఉన్నట్టు కనిపించవచ్చు కానీ అంతర్లీనంగా రెండూ శ్లోకాలు వేర్వేరు సందర్భాలను వాడుకొని ఒకే విషయాన్ని ఉపదేశిస్తున్నాయి. ఎలాగంటే

స్వర్ణమయీం లంకాం = పరధర్మాత్వనుష్టితాత్

న మే రోచసి = భయావహః

జననీ జన్మభూమిశ్చ = స్వధర్మో విగుణః

స్వర్గాదపి గరీయసి = శ్రేయాన్ స్వధర్మో

బంగారుమయమైన లంక రాముడికి రుచించనట్టే అందమైన పరధర్మం కృష్ణుడికి రుచించలేదు. తాళిబొట్టులో మాత్రమే బంగారాన్ని కలిగివున్న కన్నతల్లి బంగారుమయమైన లంక కంటే గొప్పది అన్నాడు రాముడు. విగుణమైన స్వధర్మమే మేలన్నాడు కృష్ణుడు. సుఖమయమైన స్వర్గం కంటే జన్మభూమి గొప్పదన్నాడు రాముడు. స్వధర్మంలో సంభవించే మరణమే ఉత్తమమన్నాడు కృష్ణుడు.

కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినామ్

విధిక్రియావిహీనానామ్ గతిర్గోవింద కీర్తనమ్ (భాగవతం)

కల్మష చిత్తం, పాపద్రవ్యం, విధిక్రియా విహీనత్వం = పరధర్మం (కలి పరమైన అధర్మాలు) = లంక

గోవింద కీర్తనమ్ = స్వధర్మం = జననీ, జన్మభూమి

గతిః = శ్రేయః = స్వర్గాదపి గరీయసి

అంటే అది కృతయుగమైన లేక ద్వాపరమైన – చెప్పినవాడు రాముడైన లేక కృష్ణుడైనా లేక వ్యాసుడైనా – ఉపమానోపమేయాలు వేరు వేరుగా అగుపడినా – అందరూ చెప్పదల్చుకున్న సత్యమొకటే. ఇటువంటి ఏక సత్యత్వాన్ని “తత్తు సమన్వయాత్” ద్వారా సాధించడమే అసలైన పరిశోధన.

“ఏకమ్ సత్ విప్రా బహుధా వదంతి”

అధ్యయన క్రమం:

సనాతన భారతీయ ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి:

1. ప్రసంగం
2. ప్రసక్తి

ఒక ప్రసంగంలో ఎన్నో ప్రసక్తులు ఉంటాయి. ఉదా: రామాయణంలోని రామ వనవాసం.

ఈ ప్రసంగం పుట్టడానికి ఎన్ని ప్రసక్తులు అవసరమయ్యయో చూడాలి.

దశరథుని కాముకత్వం వల్ల వనవాస ప్రసంగం పుట్టుకొచ్చిందన్నట్టుగా కొందరు చెప్పారు. అది చదివిన వారికి కాముకత్వం తప్ప మరే ప్రసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. అలా పాఠకులకు అనిపించేలా చేయడం రచయిత విజయం కావొచ్చేమోగానీ అది పాఠక పరాజయం అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, రామ వనవాస ప్రసంగానికి నాకు తెలిసి ఐదు ప్రసక్తులు ఉన్నాయి:

1. దశరథునికి శ్రవణ కుమారుని తల్లిదండ్రు లిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
3. మంథర – కైకేయి సంభాషణ.
4. ఎప్పుడో ఇచ్చిన వరాలను రామ పట్టాభిషేక సమయంలోనే కైక అడగడం.
5. వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షి నిర్ధారించిన పట్టాభిషేక ముహూర్తం విఫలమవడం.

పైవన్నీ ఒక్క బిందువు దగ్గర కలిసినప్పుడే వనవాస ప్రసంగం సంభవనీయమైంది. ఇందులో ఏ ఒక్క ప్రసక్తిని వదిలినా ప్రసంగంలోని పరమార్థం మాయమైపోతుంది.

అలానే కురుక్షేత్రంలో అర్జున విషాదాన్ని, నిర్వేదాన్ని ఒకటి, రెండు భగవద్గీత శ్లోకాలతోనే సరిపెట్టాలని చూస్తే అది విపరీతార్థాలకు దారి తీస్తుంది.

బంధువుల్ని చంపలేనని ఏడ్చిన అర్జునుడు కృష్ణప్రబోధంతో యుద్ధానికి మళ్ళాడు. కానీ అభిమన్యుని మరణంతో మళ్ళీ దుఃఖించి యుద్ధం మధ్యలోనే అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడు. అంతకు మునుపు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కృష్ణుడి మీద అహంకరించాడు.ఇలా ఎన్నెన్నో ప్రసక్తుల్ని చేర్చి అర్జునుడిని ఉద్దేశ్యించి గీతలో కృష్ణుడు వాడిన పదాలను విశ్లేషించాలి.

రెండో అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు “క్లైబ్యం మాస్మ గమః పార్థ” అని అర్జునుణ్ణి మందలిస్తాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వమని అర్థం కదా! అర్జునుడు నపుంసకుడా? కానప్పుడు ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు వాడాడు? – ఇవన్నీ అర్థం కావాలంటే భారత యుద్ధం వరకూ గల అర్జునుని వ్యవహారాలన్నింటినీ సమీక్షించాలే తప్ప ఒక్క యుద్ధ ప్రసంగంతోనే నిర్ధారణలకు రాకూడదు.

ఇలా భారతీయ పురాణేతిహాసాలలోని ప్రతి ప్రసంగాన్నీ క్షుణ్ణంగా వివిధ కోణాల నుండి, విధవిధ ప్రసక్తుల సమన్వయంతో వ్యాఖ్యానించాలి గానీ ఏదో ఒకటి రెండు శ్లోకాలను తీసుకొని అందులోని మాటలే సిద్ధాంతమని అనుకోవడం పొరబాటు. ఈ విషయంలో పాఠకుల కంటే రచయితలకే బాధ్యత ఎక్కువ.

వైవిధ్యానికి, వైరుధ్యానికి తేడా తెలుసుకోకుండా తమకు తోచిందే వేదంగా చెలామణీ చేయించాలనుకోవడం అత్యంత విచారకరం. తత్వ సమన్వయం పట్ల సంయమనం లేనివారు సిద్ధాంతాల్ని, కవిత్వాల్నీ, కథల్నీ చెప్పడం ప్రమాదకరం.

సముద్రంలో అనంత సంఖ్యలో అలలు ఉన్నట్టే ఒక్కొక్క అక్షరంలో అనల్పార్థాల్ని నింపుకొని అటు లౌకిక ప్రయోజనాలను, ఇటు పారలౌకిక ప్రయాణాలనూ చక్కగా సమతూకంలో ఉంచుతున్న ధార్మిక గ్రంథాల విశ్లేషణలో శ్లేషలకు, స్వకపోలకల్పితాలకు తావివ్వకూడదన్న కనీస మర్యాదను మర్చిపోయిన వారు హితబోధల్ని చేయడం ఒక విపర్యాసం.

గంగానదిలో స్నానించే వాడితో బాటూ మూత్ర విసర్జన చేసేవాడూ ఉంటాడు. ఎవరి దృష్టి వారిది – ఎవరి ఫలితం వారిది.

వేదాంతం పేరుతో వ్యాపారం చేసేవారికి, అజెండా ధారులకు, తిట్టు కపిత్వ చేష్టులకు, “స్వయం నష్ట పరాన్ నాశయతి” రకపు అవివేకులకూ, ధూపకేతువలకూ ఇవేవీ పట్టవనుకోండి. అయినా తెలుసుకోదలచినవారికి ఉపయోగపడుతుందేమోనని వ్రాసాను.

అంతే!

Your views are valuable to us!