పల్నాటి వీరభారతం-ముందుమాటలు
ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం:
రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో , ఎక్కడ పాఠకుల్ని తమ “గ్రిప్ “లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.
దాగిన కన్నీరు, కథ కంచికి, వెలిగే దీపం, వీనస్ , కాలవాహిని, పూచినపున్నాగ, చిత్రమైన జీవితం, పాతకొమ్మ-కొత్తరెమ్మ, మరోమలుపు, మురళీరవళి, అచ్చుతప్పులు, అసమగ్ర చిత్రాలు, ఎక్కలేని రైలు, మనిషి జీవితంలోని మరపురని అనుభవాలు, జీవన సంధ్య మొదలైనవి వీరి ప్రచురితమైన నవలలు.
వీరి నాటకం “ఒరేయ్ ” తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నది.
మధ్యరకం సంసారాల కథల్లో నిజాల్నీ వారి మధ్య చిత్రమైన అనురాగాల్నీ, రంగులపటంలా కళ్ళ ముందు వేలాడేసే కథావిధానం, పరుగెత్తే సెలయేరులాంటి రచనతో పాటు మమకారపు దు:ఖాంతాల కథల్లో వీరు స్థితప్రజ్ఞులు.
పల్నాటి వీరభారతం పల్నాటి వీరుల పౌరుష గాధ. సమగ్రమైన తొలి పల్నాటి తెలుగు నవల.
— బుక్ ట్రస్ట్ బ్యూరో, గాంధీనగరం, విజయవాడ – ప్రచురణకర్తలు
EXPLORE UNTOLD HISTORY
రచయిత మాటల్లో – పల్నాటి వీరభారతం
పల్నాటి వీర భారతానికి పదివాక్యాల పరిచయం
చరిత్రలను వీరుల రక్తంతోను, వీరవనితల కన్నీటితోనూ కలగలిపి రాస్తేనేం…అది వీరభారతమైనప్పుడు! పల్నాటి పౌరుషం తెలుగువాణ్ణి, తెలుగునాణ్ణీ పునీతం చేసి, తరతరాల తెలుగు సంస్కృతిలో వెలలేని విలువైన మణిదీపమైనప్పుడు.
నిజానికి పల్నాటి రాళ్ళలోనూ, రప్పల్లోనూ పౌరుష ముండి తీరాలి. నాగులేటి నీళ్ళల్లో, నాపరాళ్ళల్లో వీరత్వం కనిపించకపోతే శ్రీనాథ కవిసార్వభౌముడి కవితాకన్య మృదుమధుర ద్విపద కవితారాగాన్ని పల్కించి వుండకపోవచ్చు.
ఐతే చరిత్ర చేసుకున్న మహాపాపమేమంటే; అది తన మహాప్రవాహంలో స్వచ్ఛమైన నీళ్ళతో పాటు చెత్తనీ, చెదారాన్నీ కలుపుకున్నది. కట్టుకథలు కావ్యాల్లో పుట్టిపెరిగి కొన్నిసార్లు రసాభాసగా తయారవుతాయి. అట్లాంటి కల్పితాలే లేకపోతే పల్నాటి చరిత్ర – వీరభారతమే.
జాతిని ఉద్దీపింపజేసేదీ, క్షాళితమైన హిందూరక్తంలో పవిత్రతతో పాటు వీరత్వాన్ని కలగజేసేదీ ఇటువంటి చరిత్రలే.
ఐతే పల్నాటి చరిత్రను ఎందుకు వ్రాయాల్సి వచ్చింది?
పల్నాటి చరిత్రను పరిశీలించి చూస్తే ప్రతిపాత్రా సజీవ వీరరసోద్దీపనా చిహ్నమే. తల్చుకుంటే ఒళ్ళు జలదరించే సంఘటనా సంఘటితమే.
బ్రహ్మన్నా, బాలచంద్రుడూ, కన్నమదాసూ, అలరాజూ, వీరభద్రుడు ఇత్యాదులు మహావీరులైతే, మాంచాలా, పేరిందేవి, నాగమ్మా వీరవనితలైన తెలుగువాళ్ళ ఆడపడుచులు.
తెలుగునాట ఈ కథ మర్చిపోతే, తెలుగునోట ఈ కథ పలక్కపోతే – తెలుగులకు చరిత్రే లేదు. తెలుగులకు విలువే లేదు. ప్రతి జాతికీ ఒక వీరచరిత్ర కావాలి.
మాంచాలవంటి వీరపత్నులు రక్తసిందూరంతో భర్తల్ని యుద్ధరంగానికి పంపారు. ఇట్లాంటి కొంతమంది ధర్మపత్నులు రాసుకున్న వీరపారాణే జాతికి వెన్నెముక, దన్ను.
“నాయకీ నాగమ్మ – మగువ మాంచాల మా తోడబుట్టినవాళ్ళు!”
“నాగమ్మ తలగొట్టి నలగాముబట్టి మనసీమలో శాంతి వెలయింపజేయగా దీవించిపంపవే దేవి మాంచాలా!” – అని విన్నప్పుడు జలదరించిన శరీరంతో – ఈ నవల వ్రాయాలనుకున్నాను.
పారాణి పూసుకునే పవిత్రమైన పాదాలు కనిపించినప్పుడూ; పేరిందేవిలాంటి తెలుగు ఆడపడుచుల కన్నీటి కథల్లో కరిగిపోయినప్పుడూ – పల్నాటి నాగులేటి నీటిలో పారిన రక్తప్రవాహాల్తో ఈ తెలుగునేల తడిసి పునీతమై, గాలి – వీరగాధల్ని తెలుగునాడు వాడవాడలా మోసుకొచ్చినప్పుడు పల్నాటి కథలు ప్రజల గుండెల్లో నిండితీర్తాయి.
అందుకోసమైనా ఈ కథ వ్రాయాలి.
అందుకే ఇది వ్రాసాను.
—-చిట్టిబాబు