పల్నాటి ప్రభువులు రాజమందిరాల్లో పుచ్చుకునే ఖరీదైన పానీయంలాగా, “దుర్బోధ” అనే విషం నెమ్మది నెమ్మదిగా నలగాముని తలకెక్కటం మొదలుబెట్టింది.
కాసేపటికి నలగాముడు తల పైకెత్తి “ఇప్పుడు నన్నేం చేయమంటావు?”
“తమరు ఆనతిస్తే – సైనికబలంతో చోరాగ్రగణ్యులన్నవాళ్ళను వారం రోజుల్లో అణచివేయిస్తాను. అంతేకాదు, వైష్ణవులమని, బ్రహ్మనాయుని ముఖ్యానుచరులమని చెప్పుకునే కొంతమంది ఇళ్ళను తనిఖీ చేయిస్తే, ఇంతలేసి సిరిసంపదలను ఎలా సమీకరించుకున్నారో తేటతెల్లమవుతుంది.”
ఇదే క్షణాన నరసింగరాజు లోపలికొచ్చాడు. నాగమ్మ మళ్ళీ కల్పించుకుని – “వీరుడైన నరసింగరాజు మా వెంటనే ఉండి పల్నాటిసీమలో బరితెగించినవాళ్ళను బలియిస్తాడు.” అన్నది.
“ఇంతకూ కావలసినదేమిటి?”
“తమ అంగీకారం”
“అలాగే.”
“నా మాట మన్నించిన ప్రభువులకు కృతజ్ఞతలు.”
“ఇంతకూ సంగతేమిటి?” అన్న నరసింగరాజుతో..”విన్నమిస్తాను చిన్నరాజా” అన్నది నాగమాంబ.
*******
నలగామహారాజు దగ్గర అనుజ్ఞాపత్రాన్ని పొందిన నాగమ్మ దొంగలను వెదికి వెదికి పట్టుకుని కూల్చివేయించింది. ధనికులైన బ్రహ్మన్న మనుష్యుల ఇళ్ళల్లో దొరికిన ధనసంపదల్ని గురజాల ప్రభువుల ధనాగారాల్లో నింపించింది. ఈ చర్యలతో నలగాముడు చాలా సంతోషించాడు. (నాగమ్మ ఈ చర్య తర్వాతనే “నాయకురాలు” అన్న పేరు సార్థకమై ఉండితీరాలి)
నరసింగరాజును కీలుబొమ్మగా-నలగాముడికి ఆంతరంగిక స్నేహితురాలిగా, ముఖ్య సలహాదారిణిగా మారిన నాగమ్మ, పల్నాటి ప్రభువుల రాజధానిలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నది. గురజాలలో కొత్తశకం ప్రారంభమయింది.
EXPLORE UNTOLD HISTORY
*******
రాచకార్యం నిమిత్తం పొరుగూరినుంచి పక్షం రోజుల తర్వాత వచ్చిన బ్రహ్మన్నకి – గురజాలలో కొత్తరకం రాజ శాసనాల చెలామణీ కనిపించింది.
స్వతహాగా గంభీరుడైన బ్రహ్మన్న, జరగరానిదేదో జరిగిపోయిందని గ్రహించాడు.
నాగమ్మ గురజాలకు మంత్రిణిగా ఉండటం మలిదేవాదులక్కూడా ఇష్టం లేదు. కానీ అగ్రజుడు – పల్నాటి ప్రభువూ ఐన నలగాముడితో ముఖాముఖీ ఈ విషయాన్ని చర్చించగల ధైర్యం వారికి లేదు. బ్రహ్మనాయుడు వచ్చేవరకూ ఎదురుతెన్నులు చూడటం మినహా, మలిదేవాదులు చేయగల్గిందీ లేదు.
ఈ పదిహేనురోజుల కాలంలోనే ఇన్ని విపరీతమైన పరిణామాలు జరుగుతాయని బ్రహ్మనాయుడు ఊహించలేకపోయాడు.
ఎవరినైతే, ఎక్కడికి చేరరాదని బ్రహ్మన్న అనుకున్నాడో వాళ్ళే అక్కడికి చేరారు. దిక్కుమాలిన ఉపాయాలకు పెట్టినపేరైన నాగమ్మ, ఎవరిని ఏం చేయాలో తెలిసిన ఆడదని బ్రహ్మనాయుడికి తెలుసు.
కొలువుకూటంలో ఉండగా – బ్రహ్మనాయుడు సభాప్రవేశం చేసి, నలగాముడికి నమస్కరించాడు.
నలగాముడి ముఖంలో ఆప్యాయత కనిపించలేదు, సరిగదా, ఆతని కనుబొమల్లో చిరాకును స్పష్టంగా చూడగల్గాడు బ్రహ్మన్న. ఏది ఎంతవరకు రావాలో అంతవరకూ వచ్చిందన్నమాట. తొండ ముదరకుండానే వూసరవెల్లి అయింది.
**********
“ప్రభువులు చిరాగ్గా ఉన్నట్టున్నారు?”
“ఆ..!”
“ఎందువల్లనో!”
“ప్రభువులను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు” అంది నాగమ్మ.
“అంటే…”
“రాజులు పసివారు కాదు; మంచి ఏదో, చెడ్డ ఏదో నిర్ణయించుకోగల విజ్ఞులైనారు. ఇతరుల సలహాలతో సంబంధం లేదు.”
“ఇంతకూ నువ్వెవరు?”
“ఏకవచన సంబోధనం నీచ సంబోధనం అని గుర్తుంచుకోండి బ్రహ్మన్నా! రాజసభల్లో గౌరవంగా మాట్లాడడం మీ విద్యుక్తధర్మం. కనీసమర్యాదలను కూడా మర్చిపోతున్నారు.”
“అర్థమయ్యేట్టు చెప్పండి”
“ఇదే అర్థం కాకపోతే, మీరు మహామంత్రి పదవికి అర్హులేననుకుంటున్నారా?” అన్నది నాగమ్మ.
“నాగమ్మా!”
“బ్రహ్మనాయుడా! ఈవిడ మా మంత్రిణి” అని నరసింగరాజంటే-
“ఇకనుంచైనా ఆమెకు గౌరవమివ్వాల్సిన బాధ్యత మీకున్నది” అన్నాడు నలగాముడు.
“ప్రభువులు నన్ను అగౌరవపరుస్తున్నారు”
“ఈ స్థితిని మీరే తెచ్చుకున్నారు” అన్నది నాగమ్మ కుటిలంగా నవ్వి.
“విడమర్చి చెప్పటం విజ్ఞుల లక్షణం”
“అంతేనా? ఈ పల్నాటి దొంగలను రెచ్చగొట్టించి, దొంగతనాలు చేయించి, ప్రజాజీవితాలను అస్తవ్యస్తం చేసింది మీరు. మీ పేరు ప్రఖ్యాతలకోసం చాపకూటి సిద్ధాంతలను ఏర్పరిచి జాతులను భ్రష్టుల్ని చేసింది మీరు.
దాయాది బిడ్డలైన మలిదేవాదుల పక్షాన చేరి నలగామరాజులపై కక్షా కార్పణ్యాన్ని కల్గించిది మీరు. మీ గౌరవం కోసం “వైష్ణవాన్ని” భుజానవేసుకుని “శైవాన్ని” నాశనం చేస్తున్నది మీరు.”
“నాగమ్మా! హద్దు మీరుతున్నారు”
“నిజాన్ని మీరు వినలేకపోతున్నారు” అన్నాడు నలగాముడు.
అంతే, పరిస్థితి ఇంత వక్రించిందని, ఇంత తక్కువకాలంలో పల్నాటి ప్రభువులను ఆరవల్లి నాగమ్మ తన వైపుకు తిప్పుకుంటుందని ఊహించలేని బ్రహ్మనాయుడు దిమ్మరపోయాడు.
“మీ పై అభియోగాలకు సమాధానమేమిటి?” అని నరసింగరాజంటే-“మౌనం అర్ధాంగీకారమే” అన్నది నాగమ్మ.
“ప్రభువులు నన్ను అవమానపరుస్తున్నారు”
“కాదు; నిజాల్ని వీక్షిస్తున్నాను” అన్నాడు నలగాముడు.
“గౌరవం లేనిచోట మంత్రిగా నేనుండలేను.”
“మీ ఇష్టం” అన్నాడు నలగాముడు.
అనుగురాజు మరణించిన తర్వాత నలగాముణ్ణి కంటికి రెప్పలా చూసుకుని, రాజ్యాధికారాన్ని కల్గించి-మంచి ప్రభువుగా తయారుజేశాడు. అయితే కథ ఇప్పుడు తారుమారయ్యింది. కాలనాగు విషం తలకెక్కిన నలగాముడు మంచిని ఏనాడో పోగొట్టుకున్నాడు.
“మీరు నన్ను శంకిస్తున్నారా?”
“అది మీకే తెలియాలి” అన్నది నాగమ్మ.
**********
సశేషం