అస్తిత్వం –  మధ్వాచార్య తత్వ విచారణా సిద్ధాంతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

తత్వ విచారణ ప్రధానం గా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి:

  1. వాస్తవికత
  2. స్వతంత్రత

మొదటిది ఈ చరాచర జగత్తుని దేశ-కాల సంబంధాలతో వివరించడం. రెండవది పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించడం.  వాస్తవం తెలిసేది ఈ క్రింది మూడు లక్షణాల లో ఏదో ఒక లక్షణం గ్రహించడం ద్వారా:

  1. అస్తి (ఉనికి)
  2. భాతి (స్పృహ కలిగి ఉండడం)
  3. సత్తా (చైతన్యం కలిగి ఉండడం)

కనుక వాస్తవికతకు ప్రమాణం వీటిలో ఏ ఒక్కటైనా ఉండడమే. అప్పుడు రజ్జు సర్ప భ్రాంతి (తాడు పాములా కనబడడమనే అపోహ) తో బ్రహ్మ తత్వాన్ని వివరించడం సాధ్యం కాదు ఎందుకంటే రజ్జు (తాడు) మనిషి అవగాహన, అనుభవం,  స్మృతి లో ఉన్నది. అలాగే సర్పం కూడా. ఈ రెండూ  ఈ జగత్తు లో ఉన్న సత్యాలు. కనుక ఒక సత్యమైన విషయం తో ఒక అసత్యాన్ని(చిత్త భ్రాంతిని) ఎలా వివరించడం కుదురుతుంది? పైగా పాము అనే భావన భయహేతువు. అది మనిషి ఒక దేశకాల స్థితి లో పొందిన అనుభవం ద్వారా దక్కిన జ్ఞానం.  కనుక భ్రాంతికి మూలకారణం మనసు. మనసు తన ప్రజ్ఞతో లేని దానిని  ఉన్నది గా ఊహించుకోవడం ద్వారా జీవునికి భయం కలిగింది.  ఆ ప్రజ్ఞ ఒక దేశ-కాల స్థితి లో పొందిన అనుభవం ఆధారం గా దక్కినది. అంటే ఆజీవికి ప్రత్యక్షం గా నిజమైన ఒక సర్పాన్ని చూసినపుడు కలిగింది.

మరొక్క ఉదాహరణ:  తాబేటి వెంట్రుకలు.  ఇది ఒక ప్రతిపాదిత విషయంగా చెప్పినా వాస్తవం లో ఇది చూడడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది వాస్తవం లో ఏ దేశ-కాల పరిస్తితులలోనూ ఉండే విషయం కాదు. పైన చెప్పిన రజ్జు సర్ప భ్రాంతి లో రజ్జు, సర్పమూ సత్యాలే ఎందుకంటే అవి దేశ-కాల స్థితులలో కనిపించేవే. వాస్తవం అంటే అనుభవైకవేద్యం గా ఉండడమే. అంటే దీని తాత్పర్యం పైన తెలిపిన “రజ్జు సర్ప భ్రాంతి”, “తాబేటి కేశాలు” బ్రహ్మ తత్వాన్ని వివరించడానికి వీలుకాని పోలికలు.

వాస్తవం – మాంసనేత్ర గోచరం

సత్యాన్ని ఉనికి,  వాస్తవం గా చూడడం పైనే శంకరుల తాత్విక ప్రతిపాదన ఆధారపడి ఉంది.  “కనిపించేది మాయ” అని “కనిపించనిది సత్య”మని ఆయన ప్రతిపాదన (బ్రహ్మ సత్యం జగన్మిథ్యా) . సాక్షీభూతమైన ప్రపంచ దృగ్విషయాలు (వాన, గాలి, చెట్టు, గుట్ట, పిట్ట నది, భూమి, ఋతువులు) సత్యం కాదు అని శంకరులు అనడంతోనే అసలైన సాధకులలో తాత్విక జిజ్ఞాస పెరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు తత్వ శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశ్యం – వాస్తవాన్ని అవాస్తవాన్ని, మారే దానిని, మారని దానిని వేరు చేసి చూపడమే.  కనిపించే ఈ జగత్తు వెనుక దాగివుండే  ’కనిపించని పరమ సత్యాన్ని’ తెలుసుకోవడమే పరమావధిగా తాత్వికులు వారి సాధనను కొనసాగించారు ఈ ప్రపంచంలో.   ఆధునిక భౌతిక శాస్త్రం మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలేక్ట్రికల్ ఎనర్జీ ని సాధించడం కూడా ఒక విధమైన తత్వ సాధనే.

వాస్తవాన్ని నిర్ధారించడానికి కావలసిన మరొక అంశం అర్ధక్రియాకారిత్వం. అంటే ముత్యపు చిప్పలో వెండి ని చూడడం ద్వారా కేవలం మరొక భ్రాంతి కలుగుతుంది తప్ప ఆ వెండితో వస్తువులు చేసికోగలడం సాధ్యం కాదు. కాబట్టి వాస్తవం అనేది సర్వకాలాల లోనూ ఉండేది. అది తర్కం తో సాధించేది కాదు.  ఇప్పుడు గోచరమయ్యే  జీవులు, జగత్తు యొక్క ఆయుష్షు  పరిమితమైనా అవి సత్యాలే ఎందుకంటే అవి ఒక దేశ-కాల స్థితికి సంబందిచినవి కనుక అవి గోచరమయ్యే వరకూ ఈ ప్రపంచం లో అవి వాస్తవాలే.

వాస్తవికత దాని క్రమము

పరమాత్మ ఎంత సత్యమో ఈ చరాచర జగత్తు అంతే సత్యమని, అది దాని ఉనికికి ,మార్పుకి పరమాత్మ పై ఆధార పడి ఉంటుంది అనేది ఇప్పటి వరకూ చేసిన చర్చలో విదితమే.  ఒకానొక దేశ-కాల స్థితి లో ఉన్న ఒకానొక చరమైన లేదా ఆచరమైన అస్తిత్వం (ఒక జీవి గాని, ఒక రాయి గాని) మాత్రమే సత్యం కాదు దాని పరివర్తన, నాశము కూడా పరమాత్మపై ఆధారపడి ఉండేవే అనేది ముఖ్యమైన సత్యం. ఎందుకంటే ఒక పెద్ద బండరాయి ముక్కలుగా మారి (గ్రానైట్) ఒక ఇంటిలో నివాసముండే ఒక జీవికి నిద్రకు ఉపయుక్తమౌతే అది కార్య-కారణ సంబంధం ద్వారా భగవంతుడు ఏర్పాటు చేసిన పరివర్తన. అలాగే జీవి తల్లి గర్భం లో చేరిన నాడే అది పుట్టే తేది, అది పొందే సంపత్తి, విద్య, చేసే కర్మలు, చివరికి మరణించే సమయం – ఇవన్నీ పూర్వజన్మ, కర్మల ఫలితాలుగా జన్మజన్మకూ జీవిని వెన్నంటే వస్తుంటాయి.  ఇలాంటి గుప్తమైన వ్యవస్థను  ఏర్పాటు చేసిన వాడు  సర్వతంత్ర స్వతంత్రుడైన ఆ పరమాత్మ.

కేవలం ఈ సృష్టిని పరమాత్మ తత్వం తో అనుసంధానం చేయడానికే పంచభేదాల ను ప్రతిపాదించారు మధ్వాచార్య.  ద్వైత సిద్ధాంతం యొక్క ముఖ్యోద్దేశ్యం ఈ చరాచర జగత్తు ని యధాతధం గా ఆకళింపు చేసుకొని దాని పట్ల ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేందుకు కాదు, దాని పరతంత్రాన్ని తెలుసుకొని తద్వారా స్వతంత్రమైన భగవానుని తత్వాన్ని తెలుసుకోవడానికి మాత్రమె. ఊహకు అందని వివిధత్వం, అనేకత్వం, తారతమ్యం ఉన్న ఈ విశ్వం ఇలా ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉండడానికి కారణం ఈ సృష్టికి వెనుకనుండి నడిపించేవాడు ఉండడం వలెనే. భాగవత పురాణం ఇందుకు సాక్షి.  ప్రహ్లాదుడు “హరిఅంతటా ఉన్నాడు. ” అన్న మాటను నిజం చేయాడానికి – సమస్త స్థావర జంగామాలలో నిండి నిబిడీకృతమై ఉండి వాటి జీవన గతిని హేలగా నిర్దేశిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు – హిరణ్యకశ్యపుడు ఒక స్తంభాన్ని వేలితో చూపి “ఇక్కడున్నడా” అని అడిగిన వెంటనే  ఆ స్థంభాన్నిపగులగొట్టి నారసింహావతారంలో బహిర్గతుడయ్యాడు. అంటే రాయి లో ఉన్నదీ వాడే , పావురాయి లో ఉన్నదీ వాడే!

ద్వైత సిద్ధాంతం పై మరింత సమాచారానికై  ఈ ఉచిత ఈ-పుస్తకాన్ని చూడండి >>  “మధ్వాచార్య తత్వజ్ఞాన ప్రదీపికా

 

*****

Your views are valuable to us!