ఆధ్యాత్మ రసరంజని – పద్మ పురాణ ఆధారమైన ఆధ్యాత్మ కథనము
కన్నడ మూలం : సి.హెచ్. రఘునాథాచార్యులు
తెలుగు అనువాదం : సి. రఘోత్తమ రావు
@@@@@
ఉపోద్ఘాతం
రైతు పొలంలో ఏ విధమైన విత్తనాలను వేస్తాడు ఆ రకమైన ఫలాన్నే పొందుతాడు. అలాగే, ఏ కర్మను ఈ జీవి చేస్తాడో దానికి తగిన ఫలాన్నే అనుభవించాలి. “ఎవరు పిల్లలు? ఎవరు స్నేహితులు? ఎవరు స్వజనులు? ఎవరు బంధువులు?” అన్నదాన్ని తెలిసుకొని సుఖదు:ఖాలను వదిలిపెట్టి శాంతతను పొందాలి.
మహాత్ములైన పండితులు తత్వజ్ఞానంతో ఇతర విషయాలలో అనవసరమైన చింతను తగిలించుకొని బాధపడరు. పంచభూతాత్మకమైన, కేవలం సంధి జర్జరమైన దేహాన్ని ఆత్మ మిత్రునిగా చేసుకొన్నాడు. ఆత్మ అనువాడు మహా పుణ్యవంతుడు. అన్ని చోట్లా ఉండేవాడు. అన్నింటినీ అర్థం చేసుకోగలవాడు. సర్వ సిద్ధి పొందినవాడు, సర్వాత్ముడు, సాత్వికుడు, సర్వ సిద్ధినీ ఇచ్చేవాడు, సర్వమయుడు, నిరంజనుడై ఒంటరిగా తిరుగేవాడు.
ఇలా నిర్జనమైన వనంలో తిరుగాడుతూ ఉన్నప్పుడు పరాక్రమవంతులు, కాంతిమంతులు, బుద్ధివంతులు, పుణ్యాత్ములూ ఐన నలుగురు తమ మిత్రుడైన వాయువు (ఊపిరి)తో కూడి రావడాన్ని గమనించిన ఆత్మ “వీళ్ళు ఒకరితో ఒకరు ఏదో ఆలోచనలని చేస్తున్నారు” అని అనుకొని జ్ఞానం వైపు చూచి “వాళ్ళని చూడు ! నీవు నా మాట విని వారి వద్దకు వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకురా” అని అన్నాడు.
అప్పుడు జ్ఞానము “వాళ్ళతో నీకు ఏమి ప్రయోజనం ? వివరంగ నాకు చెప్పు. ” అని అడిగింది.
అప్పుడు ఆత్మ ” ఓ జ్ఞానమా ! ఆ ఐదు మందీ మహాప్రాజ్ఞులు, రూపవంతులు, మనస్వులు. నీవు దౌత్య కార్యంలో నిష్ణాతుడివి. అందువల్ల నేను చెప్పింది కొద్దిగా విని వారి వద్దకు వెళ్ళు. మాట్లాడించు” అన్నాడు.
అప్పుడు జ్ఞానము “హే ఆత్మన్ ! నీవు కూడా నేను చెప్పేది విను. నేను నిజాన్ని చెబుతున్నాను. సత్యాన్ని తెలుపుతున్నాను. హే తండ్రీ ! వీరి సంబంధాన్ని ఎప్పటికీ నీవు చేయరాదు. మహామతివి, శుద్ధాత్మవు, మంచి కోర్కెలనే వ్యక్తపరచువాడివైన నీవు ఆ ఐదుగురి సంగతిని తెలుసుకున్నచో నీకు మోహం కమ్మగలదు” అన్నది.
ఆత్మ, “ఓ జ్ఞానమా ! నీవి వీరితో సంబంధం వద్దని ఎందుకు అడ్డుపడుతున్నావు? ఓ పండితుడా, దాని కారణాన్ని నిశ్చయంగా, యధార్థంగా చెప్పు” అన్నాడు.
జ్ఞానం, “వీరి సహవాస మాత్రం చేతనే మహత్తరమైన దు:ఖం కలుగుతుంది. ఆ ఐదుమందీ దు:ఖానికి మూల కారణాలు. శోకసంతాపకారులు. ఇది నిజం” అని పలికాడు.
“ఓ జ్ఞానమా ! అలాగే జరుగని. నీ మాటనే పాటిస్తాను.” అని పలికి, ఆత్మ ధ్యానముతో కూడెను.
ఆత్మతో సంభాషణం
అనంతరం ఆ ఐదుమందీ ఆత్మను చూసారు. వారు “బుద్ధి”ని పిలిచి “హే కల్యాణీ ! మేము ఆ ఆత్మతో సఖ్యం నెరపడానికి నీవు దౌత్యం నడుపు. నీవు ఆ ఆత్మ వద్దకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని ఆధారమైనవారు, శుభప్రదకారకులూ, మహాత్ములూ ఐన పంచ తత్వాలు నీతో స్నేహం చేయడానికి కోరుతున్నారు అని చెప్పు. ఈ కార్యాన్ని నీవు ఇప్పుడే నెరవేర్చాలి” అని పలికారు.
దాని బుద్ధి – “పూజ్యులారా! అలాగే కానివ్వండి! ఈ ఉత్తమ కార్యాన్ని నేను నెరవేరుస్తాను” అని చెప్పి, ఆత్మ వైపుకు దారితీసింది.
ఆత్మను చూచిన బుద్ధి “ఓ పూజనీయా! నేను బుద్ధిని. మహాత్ములైన పంచ తత్వాలూ నన్ను దూతిగా మీ వద్దకు పంపారు. వారి మాటలను మీరు ఆలకించండి. ఆ తేజస్సు మొదలైన ఐదుమంది తత్వాభిమానులు అక్షయమైన మీ స్నేహాన్ని కోరుతున్నారు. ఓ మహాప్రజ్ఞా, ప్రేమపూర్వకమైన స్నేహాన్ని వారితో మీరు చేయాలి. ఈ ధ్యానాన్ని విడవండి.” అని పలికింది.
దానికి ప్రతిగా జ్ఞానం ఇలా అనెను “ఓ ఆత్మా ! ఆ ఐదుమందితో నీవు ఎప్పటికీ స్నేహం చేయకూడదు. వీరి సంపర్కం వల్ల నీవు ఖచ్చితంగా దు:ఖపడతావు. నీవు నాకంటే తక్కువ జ్ఞానివి. నానంతో నీవు ఎలా కర్మలను చేయగలవు? అందువల్ల నా మాట విను. వీరితో స్నేహం చేయకు. నా మాట వినలేదంటే, ఓ మహాత్మా, నీకు గర్భవాసం సంభవిస్తుంది. నా మాటవినకుంటే జ్ఞానహీనుడివైన నీవు అజ్ఞానిగా మారిపోగలవు”. ఈ విధంగా ఆత్మకు బోధన చేసి, జ్ఞానము మౌనం వహించింది.
అప్పుడు ఆత్మ, తనను వెదుకుకుంటూ వచ్చిన బుద్ధిని చూచి “ఓ శోభనాంగి, మంగళాంగీ! ఈ ధ్యాన, జ్ఞానాలు నా మంగళ కాంక్షులు. నా యోగక్షేమాన్ని ఎప్పుడూ కోరేవారు. వీరిని వదిలి నేను రావడం మంచిది కాదు. కనుక ఓ బుద్ధీ! ఇప్పుడు నేనేమి చేయాలి?” అని పలికాడు.
అది విన్న బుద్ధి వెనుదిరిగి వెళ్ళి ఆ ఐదుమందికీ ఆత్మ యొక్క వివరాలను, ధ్యాన జ్ఞానాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించింది. అప్పుడు ఆ పంచతత్వాలు తామే ఆత్మ వద్దకు వెళ్ళి “మీతో ఎల్లప్పుడూ స్నేహాన్నికోరుకుంటున్నాము. ఓ లోకేశా! మీరు శుద్ధత్వముతో కూడి వుండడంవల్ల మేము మీ వద్దకు వచ్చాము. మీరే స్వంతంగా విచారణ చేసి మాకు సమాధానమివ్వండి” అని ప్రార్థించారు.
ఆత్మను – “మీరైదుమందీ స్వయంగా నా వద్దకు వచ్చారు. స్నేహాన్ని కోరుతున్నారు. ఐతే స్నేహాన్ని పెంపొందించే ముందు మీ గుణాలను, ప్రభావాన్ని వివరించండి” అని కోరాడు.
పంచభూతాల, పంచేంద్రియాల పరిచయం
అప్పుడు
భూమి – “సర్వ కార్యాలకూ నేను ముఖ్యస్థానాన్ని. చర్మ, మాంసాలతో కూడిన మూలభూత అస్తికలు ధృఢంగా ఉండడానికి, గోళ్ళతో కూడిన దేహ మధ్యభాగంలో నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నాసికా గమనముండే గంధము నా భృత్యుడు” అని పలికింది.
ఆకాశము – “నేను ఆకాశాన్ని. దేహం పై నా ప్రభావమేమిటన్నది నీకు చెబుతున్నాను, విను. లోపలా, బయటా వ్యాపింప అవకాశమున్నవాడినై శూన్య స్థానంలో నేను నివసిస్తాను. శ్రవణేంద్రియాలు నా సేవకులు” అని పలికాడు.
వాయువు – “నేను ఐదురూపాలతో, ఏ స్వరూపం కావలంటే ఆ స్వరూపం తో ఉంటాను. తదనంతరం నిఃశ్వాసం లో ఉంటాను. కర్మకాయంలో స్థితుడనై ఉంటాను. శుభాశుభకర్మలను చేస్తాను. ఇది నా ఆత్మ గుణం. దేహంలో స్పర్శ గుణం కలవాడే నా మంత్రి.” అని పలికెను.
తేజస్సు – “సూర్యుని వలే దేహంలో నిత్యమూ నేను వెలుగుతుంటాను. లోపలా, బయటా ఉండే సర్వ ద్రవ్య, అద్రవ్య వస్తువులను, దుష్ట అదుష్ట పదార్థాలను కన్నుల ద్వారా చూపిస్తాను. రెండు కళ్ళు నా మంత్రులు. సేవకులు కూడా. వీరి వల్లనే నా రాజ్యము, ద్రవ్యమూ లభించేది. ఓ ఆత్మా ! ఇదే నా ప్రభావం ” అని అన్నాడు.
ఆపః (నీరు) – “శుక్ర (తేజస్సు), మజ్జ, లాలాజలం, పల, చర్మ గ్రంథులలోని రక్తం, ఇవన్నీ కదలాడడానికి నేను ప్రేరణనిస్తాను. పగలు, రాత్రి దేహాన్ని అమృతం తో చక్కగా పోషణ చేస్తాను. ఇలా అతి ప్రాచీనమైన నా ప్రభావం ఈ దేహమనే పట్టణం లో చేస్తున్నాను. ఉత్తమమైన రుచులను గుర్తించే నాలుక నాకు భృత్యుడు” అని పలికెను.
ఆ తరువాత, పంచ తత్వాల సేవకులైన ముక్కు, చర్మము, కన్నులు, నాలుక మాట్లాడసాగినవి.
చర్మం: “పంచరూపాత్మకమైన అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను ఈ దేహంలో నెలకొనేట్టు చేసి వారి బాహ్యాభ్యాంతర కార్యాలను స్పష్టంగా తెలుసుకున్నాను. శీతోష్ణాలు, ఎండ, వాన, అదరడము మొదలైన వాటిని కూడా తెలుసుకున్నాను. మనుషులు సంస్పర్శ ద్వారా వారి అంగ శ్లేషాదులను ఎరిగివున్నాను. నా ముఖ్య గుణం స్పర్శ. ఓ ఆత్మన్ ! పై పేర్కొన్న వాటన్నింటిని నా వ్యాపారం ద్వారా నిరూపించాను” అని పలికెను.
కన్నులు: “సంసారంలో చెడు, మంచి అని ఎవేవి ఉన్నాయో వాటిని బుద్ధి నాకు ప్రేరేపిస్తుంది. అప్పుడు మేము వాటిని చూస్తాము. లేదంటే లేదు. మేము ఈ దేహంలోనే నివసిస్తాము. మా ఇద్దరికీ రూపమే గుణం. ఓ మహామతియైన ఆత్మ ! ఈ దేహంలో మా వ్యవహారిమిదే అని తెలుసుకో” అని పలికివని.
నాలుక: “నేను బుద్ధితో కూడి రస భేదాల విచారణ చేస్తాను. ఉప్పు, పులుపు మొదలైన వాటిని, నీరస స్వాదులైన తీపి, మధురాలను చింతన చేస్తాను. ఈరీతిగా నిత్యయుక్త వ్యాపారాలతో నేను దేహంలో నివసిస్తాను. ఓ ఆత్మా ! అన్ని ఇంద్రియాలకు బుద్ధియే ముఖ్య నాయకురాలు, ప్రేరకురాలు” అని చెప్పెను.
పంచాత్మలు బుద్ధి ని చూసి “ప్రియమైనదానా ! నీవు నీ స్వకీయ కర్మల గురించి చెప్పు” అని పలికిరి. అపుడు
బుద్ధి: “ఓ మహామతియైన ఆత్మన్ ! నేను లేకుంటే ఈ దేహం నశిస్తుంది. అలాగే
నేను ఉంటే ఈ దేహానికి హాని లేదు. అందువల్ల హే ఆత్మన్ ! నన్ను స్వీకరించి ఎల్లడెలా నాతోనే ఉండే ప్రవృత్తి ఉన్నవాడై శోభిల్లు” అనెను.
అనంతరం కర్మ ఆత్మను గురించి ఇలా పలికింది:
“ఓ మహాప్రాజ్ఞా ! నేను కర్మను. నీ వద్దకు వచ్చాను. హే తాతా ! నేను నీకు ప్రేరణనిచ్చు దానను.” అనెను.
” ఏది పద్ధతి? ఎలా చేయాలి ? ఏ మార్గంలో వెళదాము ?” మొదలైన ప్రశ్నలను వేసి ఆత్మ ఆ ఐదుగురితోనూ ఇలా అనెను
“మీరు ఐదుమంది సర్వసాధారణంగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు కదా ? అందువల్ల మీతో స్నేహాన్ని పెంపొందించడాన్నే నేను కోరుకుంటున్నాను. ఐతే మీరందరూ సమగ్రంగా సర్వ విషయాల్లోనూ నాతోనే మైత్రిని కోరడంలోని కారణాలను పూర్తిగా వివరించండి” అని కోరెను.
మైత్రిని కోరడం వెనుకగల కారణాలు
పంచాత్మలు ఇలా పలికినవి “మా అందరి స్నేహంతోనే పిండోత్పత్తి జరుగుతుంది. ఓ సువ్రతా ! ఆత్మా ! ఎపుడైతే నీవు ఆ పిండంలో వాసిస్తావో అపుడు మేమందరం నీ అనుగ్రహార్తులమై నీతోడనే ఆ పిండంలో వాసిస్తాము. అందువల్ల, ఈ కారణమాత్రం చేత మేము నీ మైత్రిని ఎల్లప్పుడూ కోరుతాము”.
ఆత్మ: “సరే ! అలాగే కానివ్వండి. మహాభాగులారా ! మీకు ప్రియమైన కార్యాన్నే నేను చేస్తాను. ఇక సందేహ పడకండి. స్నేహమే ప్రేమకు కారణం కదా !” అని పలికెను.
మహాత్ముడైన జ్ఞానం అడ్డుపడుతున్ననూ, ఈ స్నేహము వద్దని ధ్యానం నివారిస్తున్ననూ, మహాత్ముడు, పూజ్యుడు అయిన ఆత్మ పంచేంద్రియాల సహవాసంలో చేరిపోయాడు.
గర్భకోశంలో వారిచే ప్రమోహితుడై, రాగద్వేషాదులతో కూడి, పంచతత్వములతో సమాయుక్తుడై, ఆ ఆత్మ దేహగతుడైనాడు. ఎపుడైతే గర్భంలో పడెనో మూత్రాదులతో కూడి దుర్గంధయుక్తమైన పిచ్ఛలావర్తములో మునిగెను. అప్పుడు అతను “భో భో! ఓ పంచాత్మలారా ! మీరందరూ నా మొరను ఆలకించండి. మీ సహవాసం చేతనే నాకు ఈ మహాదు:ఖం సంభవించింది. ఇపుడు మహాభయంకరమైన ఈ ఘోర పిచ్ఛలంలో పడ్డాను” అని రోదించెను.
అపుడు పంచాత్మలు – “హే రాజన్ ! గర్భము పూర్ణమయ్యేవరకు ఇక్కడే నివసించండి. అనంతరం మీరు ఈ స్థానం నుండి నిర్గమించే అవకాశం వస్తుంది. సంశయపడకండి. ఈ దేహదేశంలో మీరు మాకు రాజు. ఈ రాజ్యాన్ని ఇలాగే, చక్కగా నడిపించండి. ముందు ముందు మీరు మహా సుఖాన్ని అనుభవిస్తారు.” అని పలికినవి.
వారి మాటలను విని ఆత్మ దు:ఖంతో పీడితుడై అక్కడి నుండి బైటకు వెళ్ళిపోవడానికి నిశ్చయించి పలాయన పరుడయ్యెను.
స్నేహం వల్ల కలిగిన గర్భదుఃఖం
గర్భము ప్రతిదినమూ ఖేదమొంది, వ్యాకులమయ్యెను. దానివల్ల ధర్మాత్ముడైన ఆత్మ దు:ఖాక్రాంతుడై అనేకమైన పీడల చేత అత్యంత అభిపీడితుడై, అధోముఖంగా గర్భమందు ఉండిపోయెను. మోహమనే వలకు చిక్కి ఆధి(మనోవ్యథ), వ్యాధి(శరీర సంబంధి)తో బంధితుడై, ఉపద్రవాలచే సమాక్రాంతుడై “హా ! హా ! భూతమునై, విచేతనుడనై, మహాదు:ఖంతో కూడి, అత్యంత ప్రపీడితుడనైతిని కదా” అని వగచి జ్ఞానముతో ఇట్లనెను:
“ఓ మహాప్రాజ్ఞా ! ఆనాడు నీ మాటలను నేను చెవినపెట్టలేదు. ధ్యానము నన్ను ఎంత నివారించిననూ వినక ఈ మహా సంకటంలో పడ్డాను. ఓ ప్రాజ్ఞా! ఈ సుదారుణమైన గర్భవాస దశ నుంచి నన్ను రక్షించు. ఒడ్డుకు చేర్చు” అని ప్రార్థించెను.
అపుడు జ్ఞానము “ఓయీ ఆత్మా ! వద్దు వద్దని నాచేత వారితుడవైననూ నీవు వినలేదు. మహాక్రూరులైన ఈ పంచాత్ములతో చేరి గర్భసంకటంలో పడ్డావు. నీవిపుడు ధ్యానాన్ని ఆశ్రయించు. ధ్యానం చేయడం వల్ల నీవు సుఖాన్ని పొందగలవు. నీకు ఈ గర్భవాస దశనుండి విడుదల కలుగుతుంది. సందేహపడకు” అని పలికెను.
ఆత్మ జ్ఞానము పలికిన పలుకులను విని, జ్ఞానతత్వాన్ని తెలుసుకొని, ధ్యానమును పిలచి “ఓ ధ్యానమా ! నా మాటలను సావధానంగా విను. నిన్నిపుడు శరణు కోరుతున్నాను. నిత్యమ్ము నీవు నన్ను రక్షించు” అని కోరెను.
ధ్యానము “అలాగే కానిమ్ము !” అనెను. ఆ మాటలను విన్న ఆత్మ ధ్యానంగతుడయ్యెను. ధ్యానముతో కూడిన ఆత్మ గర్భంలో స్థితుడై భగవధ్యానం చేస్తూ మోహరహితుడయ్యెను. ఎపుడైతే ఆత్మ ధ్యానగతుడయ్యెనో అపుడే గర్భజన్య భయము విస్మృతమై మరపుకు వచ్చెను. ఆ ఆత్మ ధ్యాన, జ్ఞాన సహితుడై మోహవర్జితుడయ్యెను.
పంచాదశాంగులో గర్భస్తేన పీడా విజాయతే ||
అన్న రీతిలో గర్భము 25 అంగుళములదై ఉండడంవల్ల గర్భపీడ సంభవిస్తుంది. ఇలా సంపీడ్యమానియై, మూర్చితుడై జ్ఞాన, ధ్యానాలతో కూడియే భూమిభాగములో పడి, దివ్యమైన ప్రాజాపత్య వాయువు వల్ల గర్భము నుండి వేరుపడెను. భూమి స్పర్శ చేతనే జ్ఞాన, ధ్యానములు విస్మృతులవగా, సంసార మోహ సందగ్ధుడై, ఆత్మ, ప్రియమైన తల్లి వద్దనే స్థిరుడై, గుణదోషములతో ఆవరించబడి, మహామోహముతో కూడి, స్తన్య అన్న పానాదులనే దినదినమూ కోరసాగెను.
ఇలా సంపృష్టమానియైన ఆత్మ పంచాత్మకులతోడనే పాపకారకులైన ఇంద్రియములతోనూ, సర్వ విషయములతోనూ, విస్తారమైన బంధువర్గము, భార్య, అతిమోహము, సమ్మోహముఅతో దినదినమూ ఆకుల, వ్యాకులగ్రస్తుడై ఉండసాగెను.
సంసారబంధనం
ఇలా మహామోహముతో సందగ్ధుడైన ఆత్మ (జీవి) నదిలోని చేప బెస్తవాని వలకు తగులుకొన్న రీతి చలించడానికి కూడా అవకాశము లేక, ప్రబంధితుడై, బంధువులు, ఇష్టులు, అనుంగుచెలికాండ్రు, భార్య, పుత్రులు, అనురాగాది మోహములనెడి సర్వతో ధృఢమైన బంధనములతో చిక్కుబడెను.
ఈవిధముగా ఆత్మ, వ్యాపకమైన ప్రపంచముచే ఆక్రమించబడినవాడై, జ్ఞాన విజ్ఞాన భ్రష్టుడై, రాగద్వేషములతో హతుడై, కామ క్రోధాది పీడితుడై, కర్మచే బద్ధుడై మహా మూఢుడయ్యెను.
కామేన పీడ్యమానస్తు క్రోధేనైవ తధైవ వా|
ప్రకృత్యా కర్మణా బద్ధో మహామూఢో విజాయతే||
ఇలా ఎప్పుడైతే ఆ ఆత్మ కామక్రోధ వశుడౌతాడో లోభ, రాగాది అరిషడ్వర్గాలనెడి దుష్టులచే ఆక్రమించబడ్డాడు.
ఇయం భార్యా హ్యయం పుత్ర ఇదం మిత్రమిదం గృహం |
ఏవం సంసారజాలేన మహామోహేన బంధితా ||
ఈమె నా భార్య, ఈతడు నా పుత్రుడు, ఇది నా ఇల్లు, వీడు నా మిత్రుడుఅనెడి సంసారపు వలలో బంధితుడయ్యెను.
అపుడు నిరంతరమూ, అహోరాత్రులూ పుత్రశోకాదులతో దు:ఖితుడై ఉండడమే కాక, ముసలితనంతోను, రోగాది ఉపద్రవములతోనూ, మనోవ్యథతోనూ ఆవరించబడెను. అభిమానముతోను, మానభంగాది నానా దుఃఖములతోనూ ఖండించబడి విచేతనుడై, పరాధీనుడయ్యెను. మూయబడెను.
పగటిపూట చైతన్యరహితుడై, శక్తిరహితుడై, రాత్రిపూట కలలను కంటూ సుఖ, దు:ఖాలను చింతిస్తూ దిన దినమూ వైకల్పముచే వ్యాప్తుడై, సంసారమందే తిరుగుతున్న ఆత్మ ని:శంకి, నిస్సంగి, బంధుహీన, వస్త్రరహితుడు, ప్రకాశవంతుడు, సదా సంతుష్టుడైన “వైరాగ్యము” ను చూసెను.
వీతరాగుడు
అపుడు కామక్రోధ వివర్జితుడైన ఆ వైరాగ్యమును చుచి, ఆత్మ “నీవు ఎవరు ? ఇలా దిగంబరంగా నా వద్దకు, నా పరివార జనం ముందు నిలబడుటకు సిగ్గువేయడంలేదా ? స్త్రీలు, వృద్ధులు, యువతులు, ఇలా వీరందరి మధ్యన దుస్తులు వేయక, అనావృతుడవై నిలబడి అవమానం పొందగలవు. ఇది నీకు శోభనివ్వదు” అనెను.
అపుడు వీతరాగుడైన వైరాగ్యము ఇలా పలికెను:
“ఇక్కడ నాకై కనబడువారెవరు? నేను ఎప్పుడు నగ్నముగా లేను? నేను జ్ఞానమనెడి వస్త్రాన్ని కప్పుకున్నవాడిని. నీవు అనినట్టు నగ్నంగా లేను. ఎపుడైతే ఇంద్రియ, విషయాదుల వశవర్తియైన నీవు నిజమైన నగ్నదేహివి. దివ్యమైన మర్యాదను విడిచిన నగ్నత్వము నీది” అనెను.
ఆత్మ: “ఓ సువ్రతా! నీకు ఖచ్చితముగా తెలిసినచో చెప్పుము. పురుషుని ఏది మర్యాద?” అనెను.
మహామతియైన వైరాగ్యము ఆత్మను చూచి “సుఖ, దుఃఖములలో స్థిరచిత్తుడై ఎల్లప్పుడూ ఉండడము. వాటియందు సర్వభావములచేతనూ ఎప్పటికీ చెడని సుస్థిరత్వాన్ని పొందాలి. అదే మర్యాద” అని పలికి “సిగ్గు” గురించి వివరించ సాగెను.
సిగ్గు – వివరణ
“ఇలా నేను చేయకూడదు. ఇది అసత్పథము. దుష్టమార్గము. నగ్నస్థానము వివిక్షితమైనది. సాజాత్యముతో ఇది అకర్మము. చేయరానిది. నగ్నస్థానము వివర్జిత స్థానము. నేను ఇలా చేయరాదు. ఇది అనుచితము. అని ఈ విధముగా పశ్చాత్తాపములో తల్లీనమవడమే లజ్జ (సిగ్గు) అని పిలువబడును. ఒక లోక విషయమును చెప్పెదను వినుము.
కుమ్మరివాడు చక్రములో మట్టిముద్దను పెట్టి, సూత్రముతో త్రిప్పి, నానా విధములైన వస్తువులను తన ఇచ్చమేరకు, అవసరము మేరకు తయారుచేయును. అలానే ఈ బ్రహ్మ కూడా నానా రూప దేహాదులను సృష్టిస్తాడు. అనంతరం ఏదైనా ఒక కారణం చేత, కులాలుని కుండలవలే, వాటిని నాశనమూ చేస్తాడు. ఓ ఆత్మా ! ఏవైతే నాశనము చెందుతాయో అవన్నీ అలోకము. ఏవైతే సర్వదా ఉంటాయో, లోకములో స్థిరంగా ఉంటాయో, ఏవి సనాతనములో వాటి విషయములో అవశ్యముగా సిగ్గును చూపించవలెను. ఐతే ఇటువంటి సనాతన స్థిరములైనవి ఈ భూలోకములో లేవు. ఆకాశము, వాయు, తేజస్సు, భూమి, జలము – ఈ ఐదూ సర్వత్ర సంస్థితములై లోకములని పిలవబడినవి. ఇవి అన్నిచోట్లా ఉంటాయి. వీటి విషయములో ఎవరికి సిగ్గును విధించబడినది ? ఓ ఆత్మా ! ఇపుడు నీకు స్త్రీల రూపము గురించి వివరిస్త్రాను సావధానంగా వినుము”.
స్త్రీ వర్ణన
“ఓ ఆత్మా ! ఇప్పుడు నీకు స్త్రీల రూపాన్ని చెబుతాను వినుము. ఎలా ఒక్క చంద్రుడు నీటితో కూడిన కుండలో విరాజిల్లుతూ కనిపిస్తాడో అలాగే నీవు కూడా సర్వత్రా విరాజిల్లుతున్నావు. వేలకొద్దీ జంతువులలో మోహబద్ధుడవై మహాత్మ్యముతో కూడి స్థావర జంగమాలన్నింటిలోనూ నీవు స్థితుడవై ఉన్నావు. మాయా మోహమయమైన యోని ద్వారమునుండి, యౌవనముతో కూడి కనిపించు ఉన్నతమైన కుచములతోను స్త్రీ విరాజిల్లుతుంది. చర్మం, మాంసం ఆరీతిగా వృద్ధి చెందుతుంది.
జనలోకంలో పతనానికి ఇలాంటి మోహరూపం ప్రదర్శించబడుతుంది. విధాత తన వినోదానికి, లీలకై ఇటువంటి సృష్టి చేస్తాడు. ఎలా స్త్రీలో, పురుషులూ అలానే. ఇలాంటి జీవులు సర్వత్రా సంస్థితులై ఉంటారు. కుచము మరియు యోని విహీనులు ఎవరో వారే నిజమైన జీవన్ముక్తులే !.
నరుడు “పురుషుడ”నియూ, స్త్రీ “ప్రకృతి” అనియూ పిలవబడుతారు. ప్రకృతియని పిలువబడే స్త్రీ పురుషునితోడ రమించి క్రీడిస్తుంది. ఈ క్రీడా వినోదం వల్ల ముక్తి ఎన్నడూ రాదు. హే ఆత్మా ! ప్రకృతితో కూడియే స్త్రీ, పురషులిద్దరిలోనూ నీవు కనబడాతావు. ఇలా ఉన్నప్పుడు ఎవరు ఎవరి యందు సిగ్గు పడాలి?ఈ విషయమందు సమ మనస్కుడవై నడచుకొనుము.
వృద్ధస్త్రీ వివరణ
ఇపుడు వృద్ధ స్త్రీ విషయాన్ని వివరిస్తాను వినుము. ఏ స్త్రీ దేహము వార్ధ్యక్యముతో జర్జరితమై, తెల్లబడిన జుత్తుతో, వ్యాకులతతో కూడిన స్త్రీలనే వృద్ధ స్త్రీలని పిలచుట లోక సహజము. ఐతే, నిత్యమూ జీవపార్శ్వమందే సమాధిలో సమాశ్రితయై జ్ఞానముతో వృద్ధి చెంది, సమాస్థితురాలై “సుమతి” నామముతో అలరారు యువతి కూడా, వృద్ధురాలే ఐవుండును. ఇటువంటి సుమతి స్వర్గలోకాలలోనూ అందరి చేతా సర్వదా గౌరవింపబడును. ఇట్టి స్త్రీలలో లజ్జను పాటించాలి.
ఇంకొకటి చెబుతాను విను. ప్రాణుల అంగ ప్రదేశాలలో సదాకాలము చేతననొంది స్థితురాలైన పరజ్ఞానప్రదాయిని అయినది ఎవరో ఆమెను “ప్రాజ్ఞా” అని కీర్తించారు. ఆ “ప్రజ్ఞ” ప్రాణుల ఆలనా పాలన నిర్వహించి “అమ్మ” అన్న సమాఖ్యాతురాలై ఉన్నది. ఆమెయే “సుమతి” నామకురాలై సర్వలోక పోషణకూ, సర్వ ప్రాణుల హితానికీ స్థితురాలౌ మాతృమూర్తిగా పరికల్పితురాలైనది. సంసార ద్వారములలో నిత్యమూ ఏయే రూపములు బహుదుఃఖ ప్రదర్శకాలై ఉన్నారో అవి యన్నియూ మాతృస్థానానికి అర్హమైనవి కావు. ఇటువంటి వారు దుఃఖప్రదులే కానీ మాతృమూర్తులు కారు. ఈ విధంగా మాతృ రూపమును తెలుసుకొనుము అని చెబుతూ “మరి యేదైనా చెప్పవలెనా?” అని ఆత్మను అడిగెను.
ఆత్మ – “నాకు సంతాపమును నాశనము చేయుటకే వచ్చిన మీరు ఎవరు? మీ స్వంత స్వరూప కథనాన్ని విస్తారంగా, సమాఖ్యానం చేసి చెప్పండి” అని అడిగెను.
వీతరాగుని కథనం
అప్పుడు వీతరాగి – “ఎవరి దశ చేత కామము వెనుదిరి పారిపోవునో అటువంటి నన్ను “వీతరాగ” అని పిలుస్తారు. శుద్ధుడవై ఈ కర్మలను ప్రయత్నపూర్వకంగా విచారణ చేసి తెలుసుకొనుము. అన్యథా ఇది తెలిసేది కాదు. నా సమీపానికి “ఆశ” అనేది ఎన్నటికీ, ఏ కారణనానికీ రాలేదు. క్రోధ, లోభ, మోహాలు అన్నియూ ఆశ రహితుడైన నా చేత భయపడి సంపూర్ణ లయాన్నే పొందుతాయి. వివేకమే నాధనము. నీకు మంగళమవని. ” అని పలికెను.
ఆత్మ – “వివేకమనెడి పేరు గలిగిన నీ సహోదరుడు ఎటువంటివాడు? నీ స్వంత సహోదరుని లక్షణాన్ని నాకు వివరించు. నీ సహోదరుడు నాకూ సహోదరుడే” అని అనెను.
వీతరాగి – “అతని రూపాన్ని, లక్షణనాన్ని నేను నీకు చెప్పను. ఓ మహాభాగా ! ఆ నా సహోదరుని ఆహ్వానాన్ని నేను చేస్తాను” అని చెప్పి “ఓ వివేకీ ! నాయందు ఉన్న స్నేహము చేత సమ్మానితుడవై ఇటుకు రమ్ము. మా ఇద్దరి మాటలనాలకింపుము” అని పలికెను.
వివేకియు “శాంతి” మరియు “క్షమా” అన్న ఇద్దరు భార్యలతో కూడి అక్కడకు వచ్చెను.
వీతరాగుని సోదరుడు వివేకి
వీతరాగుని సహోదరుడైన వివేకి సర్వతత్వమును ఎరిగినవాడు. సర్వదర్శి. సర్వవ్యాపి. సకల సందేహాలకూ శత్రువు. అతను ఉన్న చోట సందేహాలకు చోటు లేదు. జ్ఞానవత్సలుడైన వివేకికి “ధారణ” మరియు “ధీ:” అనే ఇద్దరు కుమార్తెలు. “యోగము” ఆతని పెద్ద కుమారుడు. “మోక్షము” అతని మహా గురువు.
నిర్మలుడు, నిరహంకారి, ఆశలు లేనివాడు, నిష్పరిగ్రహుడు(దానము తీసుకొననివాడు), సర్వవేత్త, అన్ని వేళలోనూ ప్రసన్నాత్ముడు, గతద్వంద్వుడు (సుఖాసుఖ, లాభాలాభ, జయాపజయ మొదలైన ద్వంద్వ భావాలను వదిలిపెట్టినవాడు) ఐన వివేకియు గుణములనెడి ఆభరణాలతో శోభితుడై, తనకు అమాత్యులైన “సత్య” మరియు “ధర్మ” లతో కూడి వీతరాగి సమీపానికి వచ్చెను.
“సమూహూతుడనై, నీవు పిలవడం వల్ల వచ్చాను. ఏ కారణానికి నన్ను పిలచావు ?” అని అడిగెను.
అందుకు వీతరాగి “మనముందు నిలబడిన ఈ పురుషుడు, “ఆత్మ” నామధేయుడు. ఈతడు సర్వవ్యాప్తుడు. నాకు స్వామి. ఓ భ్రాతా ! ఇప్పుడీతడు మహా పాశములచే నియంత్రితుడై అల్లాడుతున్నాడు. దారుణమైన సంసారములో మోహ బంధనాలచే ఆవిష్టుడై, పంచ తత్వాలచే బంధితుడై జ్ఞాన, ధ్యాన వివర్జితుడైనాడు. నీవు తత్వశాస్త్రములో పండితుడవు. ఈ ఆత్మను నీవే విచారించి వినుము” అనెను.
ఆ మాటలను విన్న వివేకి “విశ్వనాయకుడవైన ఓ ఆత్మా ! మీరు సుఖముగా ఉన్నారా ? మీరు ఈ సంసారములోకి అడుగిడిన తరువాత ఎలాంటి శుభాలను అనుభవించారు ?” అని ప్రశ్నించెను.
ఆత్మ – ” నాచే గర్భవాసములో దారుణమూ, అసహ్యమూ ఐన మహద్దుఃఖములు అనుభవింపబడినవి. మహాప్రాజ్ఞా ! ఈ శరీరం వచ్చిన తరువాత జ్ఞానవిభ్రష్టనై లోకసంగతుడనై లోకులతోనే కలిసిపోయి నాచే బాల్యములో చేయరానివి, చేయదగ్గవి ఐన అన్ని కృత్యాలు చేయబడ్డాయి. యౌవనంలో భార్యచే కూడి అనేక రీతుల రతిక్రీడలో ఆసక్తుడనైతిని. వార్ధక్యం వచ్చిన పిదప పుత్రశోకాది దు:ఖాలతోను, భార్యావియోగముతోనూ అహోరాత్రాలూ సంతప్తుడనై , సమ్మూఢనై దినే దినే కృశించాను. కనుక ఓ మహామతీ ! పగలుగానీ, రాత్రిగానీ ఎలాంటి సుఖమూ ఎరుగనివాడనైనాను. ఇపుడు మీరే నాకు ఉపదేశము చేయాలి. వేటివల్ల నేను సుఖాన్ని పొందగలను? సంసారమనే ఈ వల నుండి నాకు ఇప్పుడే విడుదల కావాలి.”అనెను.
అపుడు వివేకి – ” ఓ జగత్పతి! నీవు శుద్ధుడవు. నిర్ద్వంద్వుడవు. పాపసంబంధము లేనివాడవు. అందువల్ల నీకు పాపము లేదన్నది ప్రసిద్ధము. సుఖప్రదుడూ, మహాత్ముడు ఐన వీతరాగి యొక్క వశుడవై ఆతని అనుసరించుము. వనానికి తరలు. ని:సంశయముగా నీ సంతాపము నాశనము కాగలదు. ఎవరినైతే “నగ్నముగా ఉండుటకు సిగ్గులేదా?” అని ప్రశ్నించావో ఆ వీతరాగి వల్లనే నీకు శాంతి దొరకుతుంది” అని చెప్పను.
దీనిని ఆలకించిన ఆత్మ మళ్ళీ వీతరాగిని దర్శించి, అత్యంత దైన్యముతో- “మహాత్మా ! నా మాటల నాలకింపుము. దేనివల్లనైతే నాకు సుఖము లభిస్తుందో ఆ మార్గాన్ని చూపండి” అని ప్రార్థించెను.
వీతరాగి – “అలాగే కానిమ్ము మహాప్రాజ్ఞ ! నీ మాట మేరకే నడవనిమ్ము. సుఖకరమైన నిర్ణయాన్ని నీవు తీసుకున్నావు” అని పలికి “వివేకియే నీకు సరియైన మార్గదర్శనము చేయగలడు. వెళ్ళి అతనిని విచారించుము” అనెను.
ఈ విధంగా వీతరాగిచే ప్రేరితుడైన ఆత్మ శుద్ధసత్తముడైన వివేకిని చేరి “మీరు నాకు సుఖమును చూపించండి. నేనిపుడు వీతరాగిచే ప్రేరితుడనై వచ్చాను. మిమ్మల్ని శరణు కోరుతున్నాను. దారుణమైన సంసారమునుండి నన్ను రక్షించండి” అని వేడెను.
వివేకి – “మహాప్రాజ్ఞా! నీకు సుఖము జ్ఞానము చేతనే కలుగును. కనుక జ్ఞానమును శరణు వేడుము’ అనెను.
నిజమైన సుఖానికి గల మార్గం
ఇలా వివేకముచే ఉక్తుడైన ఆత్మ ఎక్కడ జ్ఞానము ప్రతిష్టాపింపబడి ఉండునో అక్కడకు వచ్చి –
“భో భో జ్ఞాని ! మహా తేజస్వి! సర్వభావదర్శి! నిన్ను శరణుజొచ్చుతున్నాను. సుఖ మార్గాన్ని నాకు దర్శనము చేయించు”మనెను.
జ్ఞానము – “ఓ లోకేశా! నేను నీ భృత్యుడను. ఐతే నీవు నన్ను తెలుసుకోకున్నావు. పూర్వము నేను, ధ్యానము నిన్ను నివారించాము. సంసార బంధనము వద్దని వారించాము. ఐనా మీరు పంచాత్ముల సాంగత్యమును కోరితిరి. మహాత్మా ! మీరు ధ్యానాన్ని ఆశ్రయించండి. అతడే మీకు సుఖాన్ని ఇవ్వగలడు” అనెను.
ఆత్మ ధ్యానమును సమీపించి “ఓ ధ్యానమా ! సుఖమును, అత్యంతిక సిద్ధి సౌఖ్యాన్ని నాకు చూపించు.” అనెను.
అపుడు ధ్యానము ఆత్మను చూచి “ఓ మహాభాగా! సర్వ కర్మలలోనూ ఎప్పుడునూ నన్ను వదిలిపెట్టకు. నీవు ఎల్లప్పుడు నాతోను, వీతరాగముతోను, వివేకముతోను, జ్ఞానముతోనూ కూడియే ఉండుము. అప్పుడే నీవి ఆత్మవాన్ అని పిలువబడేదవు. వికల్పరహితుడవై శోభిల్లగలవు. ఎలాగున గాలి లేని చోట దీపము స్థిరముగా ఉండి, వెలిగి, కజ్జలమును(కొడికట్టుటను) విడిచిపెట్టునో అలాగే సమస్త దోషాలను జ్ఞాన, ధ్యానలనెడి అగ్నిలో కాల్చి, నిర్వాణనమును పొందుము. అపుడే నీకు భగవద్దర్శనము కాగలదు.
ఏకాంత స్థితుడు, నిరాహారి, మితమైన ఆశలు కలవాడు, సర్వదా అమృతమయుడవు కమ్ము. నిర్ద్వంద్వుడు, శబ్దసంహీనుడు, సర్వసంగ రహితుడవూ కమ్ము. నిశ్చలోపాసనలో స్థితుడవు కమ్ము. ఆత్మాంతర్గతుడవై, ఆత్మస్థుడైన పరమాత్ముడను మనస్సుతోను. ధ్యానముతోను, స్థిరబుద్ధితోను దర్శించుము. మహావిష్ణువుయొక్క పరమ పదాలైన వైకుంఠ, శ్వేతద్వీప, అనంతాసనాలనబడే త్రిధామాలను
పొందుము” అని ఉపదేశించెను.
~పద్మపురాణ ఆధారమైన ఆధ్యాత్మ కథనము సమాప్తము~
***