ఉపోద్ఘాతం:
ఇది ఆంగ్ల నూతన సంవత్సరము.
ఇది పాశ్చిమాత్యులకు పండుగ సమయమైననూ, భారతీయులు సైతమూ పాలుపంచుకొంటున్నారు. ఇట్టి సమయములో భారతీయ మనోవైశాల్యమును తెలిపెడి కొన్ని వివరములు తెలుపుట అప్రస్తుత ప్రసంగము కాబోదు అన్న భావనతో ఈ వ్యాసమును మీముందు ఉంచుతున్నాను.
ప్రస్తావన:
జననము – మరణము అనెడి రెండు మజిలీల నడుమ రమారమి అరవై, డెబ్బై సంవత్సరముల పాటు సాగే మానవజీవనము యొక్క ముఖ్యోద్దేశ్యము గురించే భారతీయ ఋషి, మునులు ఆలోచించారు. గాఢమైన ఏకాంతములో, ఘనమైన ఏకాగ్రతను మేళవించి, బయటి కన్నులను బంధించి, అంతరంగ చక్షువులను విశాలముగా తెరచి, తమ హృదయాకాశములో వెలిగిన పరమాత్మ అనుగ్రహపూర్వకమైన జ్ఞానంతో వారు కనుగొనిన నిత్యసత్యములే “వేదము”లని ప్రసిద్ధి చెందినవి. ఈ వేదములను సాక్షాత్కరించుకొన్నవారు కలరేగానీ, రచించినవారు లేరు. ఆవిధముగా వ్యక్తిగత దోషములు అంటని నిర్దుష్టమైన జ్ఞానభాండారములు వేదములు.
నేటి సమాజములో ఆర్ష విజ్ఞానము పట్ల చులకన భావము మెండుగా ఉన్నది. వేదోపనిషత్తులు బోధిస్తున్నవి మూఢనమ్మకాలనీ, తర్కానికి అందని భ్రమలనీ ప్రచారము జరుగుతున్నది. పురాణములన్నియూ పుక్కిటివని, ఎవరో పనిలేనివారు అదేపనిగా కూర్చుని తయారుచేసిన కాల్పనిక కథలనీ నేటి తరమువారు నమ్ముతున్నారు. ఇవియన్నియూ ఊహించని వ్యవహారములు కావు. భాగవతము, భవిష్యోత్తర పురాణము మొదలైనవాటిలో విశదపరచిన కలియుగ లక్షణములలో మునుపు చెప్పుకొన్నవి కూడా ఉన్నాయి. కావున ఈ యుగములో వైదిక విజ్ఞానమును ఆమోదించువారికన్ననూ తిరస్కరించువారి సంఖ్య ఎక్కువ. ఈ వ్యాసము వైదికవిద్యలను నమ్మువారితో బాటు తటస్థముగా ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని వ్రాయడము జరిగినది. అలాగునని వైదికవిద్యలను నమ్మనివారు చదవరాదని అర్థము కాదు. ఈ వ్యాసములో నిరూపితమగు విషయములు సాధారణములై, సర్వజనీనములైనవి గనుక ఆసక్తిగల వారెవ్వరైననూ చదివి ఆనందించగలరు.
మనుష్యుల యొక్క అస్తిత్వము వారు తిను ఆహారముపైనే ఆధారపడివున్నది. అలాగునే పరిసరముల పైననూ ఆధారపడివున్నది. పరిసరములలో గాలి, నీరు ప్రధానమైనవి కాగా ఆహారములలో అన్నము ప్రధానమైనది. కావున మానవులను శాస్త్రము “అన్నగత” ప్రాణులని పిలుస్తున్నది. మానవులు నానా రకములైన సుఖాలను అనుభవించుటకు కావలసిన శక్తియుక్తులన్నీ ఈ అన్నము మీదనే ఆధారపడినవి. అందువల్లనే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు తానే అన్నస్వరూపమని పేర్కొన్నాడు. “అన్నమ్ పరబ్రహ్మ స్వరూపమ్” అని కదా పెద్దలు చెప్పునది!
ఇటువంటి మహత్తరమైన అన్నము గురించి ఒక ప్రత్యేక వేదసూక్తము ఉన్నది. అదే “అన్నసూక్తము”. ఈ సూక్తములోని విషయములను తరచి చూచి, అర్థము చేసికొన్న మన పూర్వీకులు తమ దైనందిన జీవితములను ఎంత లోతుగా పరిశీలించి, అధ్యయనము చేసినారో తెలుస్తుంది. అంతేగాక నిత్యజీవితములోని ప్రతి అంగమునూ ఒక యజ్ఞముగా భావించి నడచుకొన్న రీతి మనకు ఆదర్శప్రాయము. ఈ “అన్న సూక్తము”లోని కొన్ని ముఖ్యమైన వివరములను తెలుసుకొందాము.
అన్న సూక్తం విశేషాలు:
- “అన్నమ్ న నింద్యాత్” – అన్నమును నిందింపకు. ఎందుకనగా, అన్నమే ప్రాణమును నిలుపుతున్నది. అన్నము స్వీకరించే శరీరము నిలువగలుగుతున్నది. అన్నమును తినుటవల్లే సంతానమును పొందుచున్నారు. కావున అన్నమును నిందించరాదు. నింద యనిన కేవలము తిట్టుటయే కాదు. నిర్లక్ష్యము కూడా ఒక నిందయే. భగవంతుడే అన్నదాత గనుక, ముందుగా దానిని అతనికి నివేదించాలి. అటుపై ఒకరిద్దరు అతిథులకో, భిక్షుకులకో దానము చేయాలి. తర్వాతే మనము స్వీకరించాలి. ఇలా చేయక కేవలము మన కడుపునే నింపుకొనుటను భారతీయ ధర్మము నిషేధించినది. నిషేధకర్మను ఆచరించుట ధర్మమును తప్పుటయే. అదే “నింద” అనబడును. కావున ఒకరికి పెట్టక మనమే తినరాదని ఈ సూక్తము చెబుతున్నది. ఇట్టి మహత్తర మానవత్వమును బోధించుచున్న సూక్తము సమాజమునకు హానికరమైన ఎట్టి మూఢనమ్మకమూనూ చెప్పడము లేదని ప్రజలు గ్రహించగలరు.
- “అన్నమ్ న పరిచక్షీత”– అన్నమును దొంగిలించకు. ఎందుకనగా, అన్నము పరమాత్ముని యొక్క రూపము. అన్నములో అతని తేజస్సు నిండియున్నది. అన్నమును ఒకరి నుండి దానరూపములో స్వీకరించాలే గానీ దొంగిలించరాదు. ఇక్కడ మరొక్క విశేషము తెలియవలెను. అన్నమును దొంగిలించుటతోబాటు అమ్ముట కూడా పాపకరమైన కార్యమే. నేడు వీధికి వంద సంఖ్యలో అన్నవిక్రయశాలలు (హోటల్స్) ఉన్నవి. ఇందులో వండబడినవి రుచికరమైనప్పటికీ మంచిజ్ఞానమును పెంపొందింపలేవు. ఎందుకనగా, మొదటగా ఆ వంటలు భగవంతునికి నివేదింపబడవు. రెండవదిగా వంటవాళ్ళు దేహశుచిని పాటిస్తారేమో గానీ ఆత్మశుచిని పాటించుట అరుదే. కల్మషమైన మనసుతో వండు పదార్థములలో సూక్ష్మమైన రూపములో కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అలాంటి అన్నపదార్థములను తిన్నవారిలో కూడా కలిపురుషుని ప్రభావము ఎక్కువగును. వాని ప్రభావ తీవ్రతతో మనుష్యులలో కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలు పెరిగి చివరకు మొత్తము సమాజము కలుషితమై, కష్టాల పాలగును. ఇలాగున, మనలను కలిబాధ నుండి తప్పించేందుకే వేదములు ప్రాకులాడుచున్నవని ఈ సూక్తము ద్వారా ప్రజలు గ్రహించగలరు. వేదజ్ఞానము ప్రజాహితమునే కోరుతున్నది గానీ ప్రజలను మూఢులను చేయుటలేదు కదా!
- “అన్నమ్ బహు కుర్వీతా” – అన్నమును అనేకవిధములుగా సన్మానింపవలెను. ఎందుకనగా, అన్నము పంచభూతములనూ, పంచతన్మాత్రలనూ తనలో ఇముడ్చుకొన్నది. అన్నము భూమిలో పండును. అది పండుటకు వర్షము కావలెను. వాతావరణములో సరియగు వేడి ఉండవలెను. అన్నము వలనే పంచప్రాణములూ (పంచవాయువులు) తృప్తినొందును. అన్నములో చక్కటి గంధము (వాసన) ఉన్నది. అన్నములో “రుచి”యను స్పర్శవిశేషమున్నది. అన్నములో పరమాత్ముని రూపమున్నది. అన్నములో “అమృతము” అను రసమున్నది. ఈ విధముగా పంచభూతములు మరియు తన్మాత్రలను కలిగిన అన్నమును మనము పవిత్రభావనతో చూడవలెను.
- “తస్మాత్ సర్వౌషధ ముచ్యతే” – కావున అన్నము “సర్వ ఔషధ”మని పిలువబడుచున్నది. ఎందుకనగా, మనిషి స్వీకరించు అన్నము నాలుగు విధములుగా జీర్ణమవుతున్నది. జీర్ణమయిన అన్నములో ఒక భాగము మాంసము, కండరముల వృద్ధికై వినియోగపడుతున్నది. రెండవభాగము ఎముకలలో పటిష్టతను పెంచే “మజ్జ”గా మారుతున్నది. మూడవభాగము రక్తముగా మారుతున్నది. నాల్గవభాగము “మనస్సు”గా రూపాంతరము చెందుతున్నది. కావున మానవుల శారీరిక, మానసిక ఆరోగ్యము వారు తినెడి ఆహారముపై ఆధారపడివున్నది. ఎవరు శుద్ధము, సాత్వికమూ అయిన ఆహారమును సేవిస్తారో వారి శరీరము, మనసు నిర్మలములై, అనారోగ్యరహితములై ఉంటాయి. ఆరోగ్యవంతులైన మానవులు ఉత్తమ సమాజాన్ని నిర్మించగలరు. భగవంతునికి నివేదించడము వల్లనే ఆహారములోకి శుద్ధత్వము వస్తుంది. నిర్భాగ్యులకు దానము చేయడము ద్వారా అది సాత్వికముగా మారుతుంది. కడుపునిండిన నిరుపేదలు నిండుమనసుతో అన్నదాతను పొగడడం ద్వారా అన్నదాతకు మానసికబలము లభిస్తుంది. ఇలా చేయనివారికి అదే అన్నము విషమై, నీచమైన ఆలోచనలతో నిండిన మనసును పెంపొందిస్తుంది. కావున అన్నమే అమృతము, అన్నమే విషము. అన్నమే జీవితము, అన్నమే మృత్యువు. ఈవిధముగా ప్రజలను హెచ్చరించి, సరైన మార్గములో నడపడానికి తహతహలాడుతున్న వేదము సమాజమునకు శ్రేయస్సును చేకూరుస్తున్నదే గానీ హాస్యాస్పదమగు మూఢనమ్మకాలను ప్రోదిచేయడము లేదని ప్రజలు గ్రహించగలరు.
పైవిధముగా మానవుల నిత్యావసర వస్తువైన అన్నము యొక్క విశ్వరూపాన్ని సరళంగా, సుందరంగా, విజ్ఞానపూర్వకంగా ఆవిష్కరించే “అన్నసూక్తము” మన జీవితాలను సుఖమయము చే్సుకోవడంలో ఎంతగానో దోహదపడుతుంది.
నేటి సమాజము, ఉన్నవారు-లేనివారు అని వర్గాలుగా విడిపోయి, వర్గపోరాటములు విరివిగా జరుగుతున్నాయి. ప్రభుత్వము, విప్లవకారులు పరస్పరమూ ఆయుధాలతో ఒకరి నొకరు హతమార్చుకొంటున్నారు. ఏతన్మధ్యే ప్రజలు కూడా ఈ హింసలకు బలి అవుతున్నారు. ఈ రక్తపాతమునకు ముఖ్యకారణం పిడికెడు అన్నము.
ప్రజాహితచింతకులైన మన భారతీయ ఋషులు చెప్పిన బోధనల యొక్క సారాంశమును అవగతం చేసుకొన్ననాడు ఉన్నవారు, లేనివారికి అన్నదానము చేసి ఆదరించగలరు. తద్వారా సమాజములో జరుగుతున్న అనవసర వర్గపోరాటములకు స్వస్తి చెప్పగలరు. తూటా కంటే మాటే బలవత్తరమని ఆనాడే మన ఋషి, మునులు గ్రహించారు. అందుకనే వేదాల రూపములో మనకు బోధన చేసారు. నేడు మనము చేయవలసినదల్లా వారి మాటలను శిరసావహించి నడవడమే. సులభములైన ఈ కనిష్ట ధర్మములనూ ఆచరించలేనినాడు మనము మానవులుగా పిలుచుకొనుటయే వ్యర్థము!
~స్వస్తి~