భజగోవిందము – తెలుగు అనువాద సహితము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

శంకర భగవత్పాదుల విరచిత భజగోవిందము – విద్యాప్రకాశ వర్ణితము

శ్రీ వెంకటేశ్వర ప్రేరిత రమాకాంత ఆంధ్రానుసారము

అంకితము శ్రీవారి పాద పద్మములకు

——————————————–
శ్రుతి స్మృతి పురాణానమ్ ఆలయం కరుణాలయం|
నమామి భగవత్ పాదం, శంకరం లోక శంకరం||

ఓం శ్రీ వేంకటశ్వరాయనమః
విశ్వేశ్వర ఓ వెంకట నాయక !
విశ్వాధార ! విష్ణు స్వరూప !
విమల జ్ఞానము విభుదుల కొసగెడి
గోవిందము నా కంఠము నిమ్మా!

లంబోదర ఓ అంబాతనయా !
గంగాధర సుత జ్ఞాన గణేశ !
మోదక హస్తా ! మంగళ దాయక !
శంకర గేయము సాగగ నిమ్మా!

చదువుల తల్లి చంపకవల్లి !
మృదు నీ కరమును మాపై మోపవే !
ఆత్మజ్ఞానము అవగతమవగ
దీవెనలిచ్చి దయలను జూపవే! 

భజగోవిందము – నివేదనము

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు
వేద వేదాంగముల విహిత విఙ్ఞానులు
విద్యాప్రకాశులు విశ్వ గురువులు వీరు
వీరి పదములయందు వాలి ప్రార్ధించిన
విశ్వఙ్ఞానము యెల్ల విదితమగు తధ్యము.

 

జీవియనే యీవిహంగానికి భక్తి, జ్ఞానము అనేవి రెండు, యిరు రెక్కల లాంటివి. ఇవి రెండూ బలంగా ఉంటే గాని యీ జీవన విహంగం భగవత్ ముఖంగా పయనించ లేదు. ఒక రెక్కతో యీ ప్రయాణం సాగలేదు. అందుకే శంకర భగవానులు జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యం యిచ్చారో, భక్తికి అంత ముఖ్యతను కూర్చారు. ఆకారణంగానే స్వామి ఎన్నో స్తోత్రాలను రచించి మనకందించారు.

యీ సంసార మోహంలో పడ్డ జీవి జీవితం యొక్క పరమార్ధం మరచి, దారి తప్పి గమ్యం మరచి పోతాడు. సంపదల సముపార్జనే జీవిత పరమార్ధంగా భావించి ఎన్నో అకృత్యాలకు పాల్పడు తాడు. యీ సంసారంలో ప్రతి ప్రాణి చేస్తున్న జీవ కార్య భాగాలు పుట్టుట, పెరుగుట, ఆహర సంపార్జన, తినుట, త్రాగుట, నిద్రించుట, క్రీడించుట, శరీర సుఖము, సంతానోత్పత్తి చేయుట. మానవుడు యీజీవులకన్నా యింకొక మెట్టు దిగజారి ‘సంపాదన’ అనే దుర్ వ్యసనంలో చిక్కుకొని పరమార్ధం పూర్తిగా మరచిన దయనీయ స్ధితికి చేరాడు. చివరకు జర, వ్యాధుల పాలై అన్ని జీవుల లాగే మరణిస్తూమరలా జన్మిస్తూ యీ జీవిత చక్రంలో మరల పడుతున్నాడు. కేవలం జన్మ జన్మకు ధరించే శరీరము మాత్రమే వేరు. ప్రతి ప్రాణి ఒకే విధమైన జీవ కార్యాలు చేస్తుంటే మనిషికి, మానుకు, మృగానికి తేడా ఏమిటి ? అన్ని జీవులకు లేనిది, మనిషికి మాత్రమే ఉన్నది, కేవలం జ్ఞానం. అది లోపించినపుడు మనిషికి మృగానికి తేడా లేదు. మనిషికి తన అస్తిత్వం తెలిసేలా జేసేది కేవలం జ్ఞానం మాత్రమే! అలామనిషి తన అస్తిత్వం తెలుసుకోలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఏమిటి ?

యీ మాయా నిద్రలోనికి జారి మైమరచిని మనలాంటి వారిని సంస్కరించి, భగవన్ ముఖులను జేయడమే శ్రీ శంకర భగవత్ పాదుల “భజగోవింద” ఉద్దేశ్యము. కాలడి గ్రామంలొ సాక్షాత్తు శంభుని అంశలో పుట్టి, పిన్న వయసులోనే, అపార జ్ఞాన సాగరాన్ని ఔపాసన పట్టిన ప్రజ్ఞామూర్తి భగవత్ పాదులు శ్రీ ఆదిశంకరులు. వారు ఒక రోజు శిష్య సమేతంగా కాశీపురంలో వెళ్ళతుండగా, కాటికి కాళ్ళు జాపుకొని మరణానికి నేడో రేపో సిద్ధంగా వున్న ఒక పండు ముదుసలి బ్రాహ్మణుడు, వ్యాకరణ పాఠాలు వల్లిస్తూ కనపడతాడు. శంకరులకు అతని దీనావస్థను జూచి, అతని అజ్ఞానానికి జాలిపడి, దయతలచి అతన్ని ప్రభోధం చేసి, జ్ఞాన భిక్షనొసగి, భగవత్ పరంగా అతనిని మళ్ళించే ఉద్దేశ్యంతో కొన్ని హిత వచనాలు అతనికి చెప్పారు, స్వామి పక్కనే ఉన్న శిష్యులు కూడా కొన్ని జోడించారు. ఆ మేలు కొలుపే ‘మోహముద్గరము’గా ప్రసిద్ధి చెందిన యీ భజగోవింద స్తోత్రము. మన మందరము ఆ బ్రాహ్మణుడి కోవకు చెందిన వారమే, కనుక యీ “భజగోవిందం” శంకరాచార్య స్వామి మానవాళికి యిచ్చిన వరం. మాధవుని పై మనసులేక, మోహమయ మాయలో వస్తు సంపదల వెనుక, సంసార సుఖములనే మృగతృష్ణలు వెతకుచూ పరుగులు తీస్తున్న మనలాంటి ప్రతి వ్యక్తి కూడా మూఢమతే! అందుకే స్వామి ఆవృద్ధ బ్రాహ్మణుడిని “మూఢమతే! “ యని సంభోధించి, ఒక్క వాక్యంలోనే కర్తవ్య పథాన్ని వివరించారు.

భజ గోవిన్దం భజ గోవిన్దం
గోవిన్దం భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞకరణే


మూర్ఖుడా! ఓ వృద్ధుడా! గోవిందుని స్మరింపుము, ఈ తరుణంలో యీ అవసాన దశలో యీ వృద్ధావస్థలో యీ వ్యాకరణ గ్రంధము “డుకృఞకరణే” పఠనం, మననం, కంఠస్థం నీబ్రతుకును ఉద్ధరించదు. నీ కంఠానికి యమపాశం ఏక్షణం లోనైనా తగలొచ్చు, అప్పుడు యీ వ్యాకరణ పాఠం నిన్ను రక్షింపజాలదు. తస్మాత్ జాగ్రత! యని ప్రభోదించారు.

 
యీ ప్రభోధము మన అందరికి వర్తిస్తుంది. మనలాంటి సాధారణ జనులు యీ వస్తు విషయప్రలోభం నుంచి బయట పడాలంటే యీ ప్రబోధం మనకందరికి అర్ధమగు రీతిలో ఉండాలనే ఉద్దేశ్యంతో శుకబ్రహ్మాశ్రమ సంస్థాపకులు, గురుపుంగవులు, శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు భజగోవిందాన్ని సులభశైలిలో వివరించారు. వారి వివరణ ఆధారంగా జేసుకొని పాడుకొనేందుకు అనువుగా ఉండాలనే భావనతో యీ చిన్ని ప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నాను.

శ్రీ ఆది శంకరుల, మరియూ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వార్ల పాద పద్మాలకు యీరచన సమర్పిస్తున్నాను యిందు గల సద్గుణములన్నీ శ్రీ ఆది శంకరులవి, వారి రచనను వివరించిన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారివి, లోపములన్నీ నావి. సాధు పురుషులు సహృదయంతో తప్పులు మన్నించ ప్రార్ధన.

సత్పురుషులందరు దీనిని చదివి, పాడుకొని ఆనందిస్తారని, స్వాములవార్లు చెప్పిన మాటలు చెవిన బెట్టుకొని జీవితాలను సార్ధకం చేసుకొంటారని ఆశిద్దాం!

Your views are valuable to us!