భజగోవిందము – తెలుగు అనువాద సహితము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

భజగోవిందము – ఆశీర్వచనములు

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి ఆశీర్వచనములు
 
ప్రియమైన రమాకాంతరావు గారు,
శ్రీమత్ నారాయణాయనమః! అనేక మంగళాశాసనములు,

మీరు పంపిన భజగోవిందం అనువాదంతో గూడిన గ్రంధం అందింది. చాలా బాగుంది. తెలుగు పద్యాలు, వ్యాఖ్యలతో ఆపివేయక, ఇవి తెలియని వారికి ఆంగ్లంలో కూడా భావం తెలియచేసేట్లు వివరణ చాలా బాగుంది.

మనసున్న ప్రాణి మానవుడొక్కడే! దానిని చక్కగా వాడుకో గలిగితేనే మానవుడికి గుర్తింపు. మనసు వాడుకోగలిగిన వ్యక్తి, జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, తన చుట్టు ప్రకృతినీ, చివరకు పరమాత్ముని గూడా పరవశింప జేయ గల్గుతాడు.

 
ఇన్నిటిని సమన్వయం చేయ గలగాలంటే ఆ మనస్సుకు ఆర్ద్రత, శక్తి అనే రెండూ కావాలి. ఆర్ద్రత అంటే తడి. మనస్సులోని తడి వల్లనే తోటి వాడి కష్టాలకు కృంగి, వాటిని తొలగించే కృషి చేయ గలుగుతాడు. ఎదుటి వ్యక్తి సుఖాలకు తాను కలసి ఆనందించ గలడు. తన లోని శక్తి, తన లక్ష్యం వైపు చురుకుగా సాగ్గేట్టు చేస్తుంది. లక్ష్యం మరువ రాదు, సమాజాన్ని వదల రాదు. ఇటు శక్తిని, లోపల తడిని గూడ పొందేట్టు చేసే కార్యాన్వితమైన జ్ఞానాన్నే, నిజ మైన ప్రేమ లేక భక్తి అంటాం. మనిషికి ఉత్త జ్ఞానం చాలదు. ప్రేమతో ప్రయోజన వంతమైన పనిలోమనిషిని నిలపే జ్ఞానం కావాలి. ఉత్త జ్ఞానం పచ్చి కాయవంటి దైతే, ప్రేమ నిండిన జ్ఞానము రసములూరే ఫలము వంటిది. అదే కదా తినేవాడికి ఆనందాన్నిచ్చేది. భోక్త పరమాత్మయే! ఆయనే మన భారాన్ని మోసే ‘గోవిందుడు!’. ప్రేమ రసంగ పరిణమించిన జ్ఞానమే భజన.

ప్రేమ రసార్ద్రమైన హృదయంతో భగవంతుని శరణు జొచ్చి నిజమైన జీవనంలో ముందుకు సాగాలనేదే శ్రుతి శిరస్సుల సారం. దాని కెదురయ్యే అవరోధాలను తొలగించుకొనే ‘శక్తిని’ గూడ వాడే యిస్తాడు. అవేవి ? ఎలా తొలుగుతాయి. దానికి మనమెలా ఆగోవిందుని శరణు వేడాలి ? మన మనస్సు దాని యందే చెదర నీయక నిల పడడ మెలా? అనేవన్ని అందంగా పాడుకొనే వీలుగ సామాన్యులకు అందుబాటులో ఉండేట్లుగ, ధీమాన్యుల కైనా మనోరంజక మయేట్లుగ, బ్రహ్మ విద్య ఇదే అన్నట్లు, 32 బ్రహ్మ విద్యలకు ప్రతీక లన్నట్లు 32+1 = 33 శ్లోకాలతో శ్రీ ఆది శంకరాచార్యుల వారు కూర్చిన సుందరమైన స్తోత్ర రాజమే ‘భజగోవిందం’.

ఆ అందాలను అనుభవిస్తూ, పెద్దలందించిన వ్యాఖ్యానుసారం ఇమిడేట్లుండే అందమైన పద్యాలతో మీరు కూర్చిన ఈ కూర్పు సహృదయు సంతర్పణ కాగలదని ఆశిస్తూ మీకు అనేక మంగళా శాసనములు చేస్తున్నాం.

జై శ్రీ మన్నారాయణ!
చిన్న జియర్ స్వామి.
 
@ @ @ @ @
 
శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యా స్వరూపానంద స్వామి ఆశీర్వచనములు

శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యా స్వరూపానంద స్వామి.
పీఠాధీపతి, శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమము,
శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమము ఫీ ఓ
శ్రీ కాళహస్తీ 517640
 
9-9-2005

శ్రీమాన్ చాకలకొండ రమాకాంతరావు గారికి – నారాయణ స్మరణలు.

పవిత్రాత్మ స్వరూపా! మీరు భక్తి శ్రద్ధలతో పంపిన మీరచన “భజగోవిందము” ఆంధ్రానువాద రచన చేరినది. దానిని పరిశీలంచితిమి. మీ అనువాద రచన భక్తి రస భరితమై చాలా ఆహ్లాద కరముగ నున్నది. అచట చట వివరణ సుందరముగ వున్నది. 2 వ శ్లోకం, 7 వ శ్లోకం, 8 వ శ్లోకం, 9 వ శ్లోకం, 18 వ శ్లోకం వగైర చోట్ల, మీ ఆంధ్రానువాద వివరణ చాల సుందరంగా కండ్లకు కట్టి నట్లుంది. 3 వ శ్లోకం, ‘నారి ..’ అనే చోట మీ ఆనువాదం శంకరుని అభిప్రాయాన్ని తేట తెల్లంగా అందిస్తూ అదే సమయంలో అసభ్య పదజాలాన్ని వాడకుండా చాల సంస్కార వంతంగా అనువదించారు. మెత్తం మీద మీ రచన చాలా ఇంపుగ, సొంపుగ, అందరికి అర్ధమయ్యే రీతిలో హృదయాన్ని హత్తు కొనే టట్లుంది. చాలా సంతోషం.

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఇటువంటి రచనలను ఇంకను మీ చేత రచింప జేయుగాక. భగవంతుడు, సద్గురువులు మిమ్మల్ని అనుగ్రహింతురు గాక!

స్వామి విద్యా స్వరూపానంద.

@ @ @ @ @
 

Your views are valuable to us!