పండుగ లేనినాడు జీవితం దండుగ అని అనిపిస్తుంది.
సంబరం లేని పూట బ్రతుకు దుర్భరంగా అగుపిస్తుంది.
ఇందుకే కాబోలు మన పూర్వీకులు ఉత్సవాలను, ఊరేగింపులను, జాతరలను ఏర్పాటుచేసారు. “తమ్ భూమిమ్ దేవనిర్మితమ్” అని పురాణాలు పొగడిన పవిత్రభూమి అయిన భారతదేశంలో దేవతలు అవతరించారు. వారి రాకతో మానవులు తరించారు. “అమృతమ్ గమయ” అని అన్నట్టుగా మహామహుల జన్మదినం మనందరికీ పర్వదినం. అటువంటి మహోత్కృష్ట పర్వదినాల్లో ప్రముఖమైనది కృష్ణజన్మాష్టమి. ఈ శుభసందర్భంలో సర్వోత్కృష్టుడయిన శ్రీకృష్ణుడు వెలసిన దివ్యక్షేత్రాలను దర్శిద్దాం!
* * * *
శ్రీకృష్ణుడు లీలామానుషవిగ్రహుడు, లీలాలోలుడు, లీలామోహనుడు!
“చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడనట్టి” బాలుడు – శ్రీకృష్ణుడు
“దిట్ట బాలులతో తిరిగి వీధుల కొట్టి నుట్లను పట్టిన కోలలు పైపై చూపుతూ” తిరిగినవాడు – శ్రీకృష్ణుడు
“కొమ్మల చీరలంటిన గోపాలకృష్ణుడు” – శ్రీకృష్ణుడు
“ఏపుగ సుద్దులెల్లా ఇట్టే యశోదతో గోపిక” లాడుకున్న తుంటరి – శ్రీకృష్ణుడు
“ఆవుల, పెయ్యల, అందరి ఇండ్ల వావిరి గాచిన వాడు” – శ్రీకృష్ణుడు
“బింకపు మోతల పిల్లగోవి వాడు సింక సూపులవాడు” – శ్రీకృష్ణుడు
“పరతత్త్వంబగు బాలుడు పరిపరివిధముల బాలుడు” – శ్రీకృష్ణుడు
“పొందైన హితులు, ఆప్తులు, రసికులును, కవులు, అందముగా” కొలచిన కొంగుబంగారము – శ్రీకృష్ణుడు
“మంగళాత్మకమగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు” పేరు – శ్రీకృష్ణుడు!
“నచ్చిన వేంకట నగమున పచ్చల పదకపు బాలుడు” – శ్రీ వేంకటకృష్ణనాథుడు!
* * * *
వైకుంఠవాసుడయిన నారాయణుడు భూలోకాన్ని భూవైకుంఠధామంగా మార్చడానికై శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథినాడు, రోహిణీ నక్షత్రంలో, మథురా పట్టణంలో అవతరించాడు.
ఎనిమిది దిక్కులలోగల దుర్మార్గులను సంహరిస్తానని సూచించడానికై అష్టమి నాడు ప్రభవించాడని, రాక్షసులకు బలం పెరిగే అర్ధరాత్రివేళ అవతరించాడని – కృష్ణజననంలోని గూఢార్థాన్ని వివరించారు 16వ శతాబ్దికి చెందిన శ్రీవాదిరాజ తీర్థులు.
* * * *
ఏమీలేనితనం నుండి అన్నీ తానే అయిన ఘట్టం వరకూ సాగే శ్రీకృష్ణప్రస్థానంను అనుసరించడానికి ప్రతి తరమూ ప్రయత్నించింది…ప్రయత్నిస్తూనేవుంది. ఈ కారణం వల్లనే “దండి వైరులను తరమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో” అంటూ అన్నమాచార్యుడు “వెండి పైడియగు వేంకటగిరిపై” వెలసిన “కొండలయ్య” వేంకట కృష్ణుణ్ణి పాడి, పొగిడాడు. అటువంటు యదుకులస్వామి, సాధుసజ్జనుల ఆరాధ్యమూర్తి అయిన శ్రీకృష్ణుడు వెలసిన దివ్యక్షేత్రాలను ఇప్పుడు దర్శిద్దాం!
* * * *
మథురా
“అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాః.”
భారతదేశంలోని ఏడు పుణ్యక్షేత్రాలు మోక్షాన్ని అనుగ్రహించే దివ్యధామాలు. వాటిలో ఒకటి మథురా నగరం. పవిత్ర యమునానదీ తీరంలో వెలసిన మథురా నగరం పౌరాణిక, ఐతిహాసిక విశేషాలను కలిగిన మహత్తర పుణ్య పట్టణం. పౌరాణిక గాధల ప్రకారం పరమశివుణ్ణి మెప్పించి, అతని త్రిశూలాన్ని వరంగా పొందిన మధు అనే రాజు పేరు మీదుగా మధుపురి అని పిలువబడి కాలక్రమంలో మథురగా మారిందని తెలుస్తోంది. అదేవిధంగా, యాదవవంశానికి చెందిన మధు రాజు పేరు మీదుగా మథురగా పిలువబడుతోందని మరో కథనం ఉంది. ఇక్కడే గల ’మధువనం’ అనే ప్రాంతంలోనే ధృవుడు మహావిష్ణువును సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఈ మహాక్షేత్రంలోనే అంబరీషుడు దుర్వాసుని కోపానికి గురుకాకుండా విష్ణుచక్రపరిరక్షితుడైనాడు. ఇలా పౌరాణిక, ఐతిహాసిక ప్రశస్తిని పొందిన ఈ పట్టణం నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఆగ్రా పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోను, దేశరాజధాని ఢిల్లీ నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఇక్కడ యమునా నది అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తూ, ఇరువైపులా 24 ఘాట్లను కలిగివుంది.
మధురా పట్టణం ప్రపంచ ప్రసిద్ధిని సాధించడానికి గల అసలైన కారణం పరంధాముడయిన శ్రీకృష్ణుడు ఇక్కడే ద్వాపరయుగంలో అవతరించాడు. ఈనాడు ’కృష్ణజన్మభూమి మందిర్’గా పిలువబడే ఈ స్థలంలో శ్రావణ బహుళ అష్టమి నాడు దేవకీవసుదేవులకు భగవంతుడు శిశుభావంతో ప్రకటమయ్యాడు. ’గర్భగృహ్’గా పిలిచే స్థలమే పూర్వం కంసుని చెరశాలగా ఉండేది.
కలియుగం ప్రారంభమైన తొలిరోజుల్లో, శ్రీకృష్ణుని మునిమనవడయిన వజ్రనాభుడు తొలిసారిగా కృష్ణజన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాడు. తరువాత సుమారు 2,300 సంవత్సరాల క్రితం గుప్తవంశానికి చెందిన రెండవ చంద్రగుప్తుడు మరోసారి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం 17వ శతాబ్దపు చివరిభాగంలో దాడికి గురై ధ్వంసమయింది. ఆ తరువాత 20 శతాబ్దంలో పండిత్ మదన్ మోహన్ మాలవీయ, జే.డి. బిర్లా నేతృత్వంలోని జన్మభూమి ట్రస్ట్ వారు పునర్ నిర్మించారు.
మథురలోని శ్రీకృష్ణజన్మస్థానం, నవీన నిర్మాణ శైలిలోని ఓ అద్భుత కట్టడం. ఎత్తైన ప్రవేశద్వారాన్ని కలిగి, సమున్నత గోపురాలతో అలరారే జన్మస్థాన మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రవేశద్వారంపై భాగంలో పార్థసారథి విగ్రహం దర్శనమిస్తుంది. మానవ జీవితసారం గీతాసారమేనని సందేశాన్ని ఇస్తుంది. విశాలమయిన ప్రాంగణంలో పలు అంతస్తులతో కూడిన జన్మస్థల మందిరం కానవస్తుంది. ఒకప్పుడు ఇక్కడే కంసుడు దేవకీవసుదేవులను బంధించిన కారాగృహం ఉండేది. ఇప్పుడున్న ఈ భవనాన్ని ఊర్ఝా ప్రాంత పరిపాలకుడయిన రాజా వీరసింగ్ బుందేలా నిర్మించాడు.
ఈ మందిరం అంతర్భాగంలో కృష్ణలీలలు, మహిమలు, ఉపదేశాలను వర్ణచిత్రాల రూపంలో చూడవచ్చు. మందిరం లోపల భక్తులు శ్రీకృష్ణుని దర్శనభాగ్యాన్ని తలుస్తూ భక్తితత్పరులై కనిపిస్తారు. “రాధే రాధే కృష్ణ కృష్ణా” అన్న నామస్మరణతో పరిసరాలు మారుమ్రోగుతుంటాయి.
ఈ మందిర ప్రాంగణంలో “ఠాకూర్ కేశవ్ దేవ్ మందిరం” ఉంది. ఇక్కడగల రాధాకృష్ణుల మూర్తులను భక్తులు దర్శస్తారు. హోలీ పండుగ సందర్భంలో ఈ ప్రాంగణంలో లఠ్‍మార్ హోలీ వేడుకల్ని నిర్వహిస్తారు.
శ్రీద్వారకాధీశ్ మందిరం
మధురలో మరో దర్శననీయ ఆలయం – శ్రీద్వారకాధీశ్ మందిరం. సుందరమైన నిర్మాణ శైలి, ఆకర్షణీయమైన ప్రవేశద్వారం ఈ మందిర ప్రత్యేకతలు. మందిరం లోపలిభాగంలో నగీషీలతో కూడిన స్థంభాలు ఉన్నాయి. ఆలయ అంతర్భాగంలో శ్రీద్వారకాధీశ్ విగ్రహం, చతుర్భుజాలతో అలరారుతూ దర్శనమిస్తుంది. 19వ శతాబ్దంలో గుజరాత్ లోని ఓ సంస్థానాన్ని పరిపాలిస్తున్న దౌలత్ రావ్ సింధియా వద్ద కోశాధికారిగా పనిచేసిన గోకుల్ దాస్ పారీఖ్ అనే భక్తునికి ఈ ద్వారకాధీశ్ విగ్రహం ఉజ్జయిని క్షేత్రంలో లభించింది. స్వామివారి ఆదేశానుసారం, ఉజ్జయిని నుండి తీసుకువచ్చి మథురా పట్టణంలో ప్రతిష్టించాడు గోకుల్ దాస్. మూడు అంచెల పీఠం పై భాగంలో చతుర్భుజ కృష్ణుడు ద్వారకాధీశునిగా దర్శనమిస్తాడు. పై రెండు చేతులలో గదను, శంఖాన్ని ధరించి, క్రింది రెండు చేతులలో పద్మాన్ని, చక్రాయుధాన్ని ధరించిన ద్వారకాధీశుణ్ణి కనులారా చూసిన భక్తులు ఆనందపరవశులవుతారు. స్వామివారి పక్కనే స్ఫటికంతో చేసిన రాధాదేవి విగ్రహం ఉంది.
* * * *
విశ్రాంతి తీర్థం
ఇరవై నాలుగు పవిత్ర తీర్థాలతో అలరారే యమునా నది, పవిత్ర కృష్ణస్పర్శతో పునీతయై, మథురా పరిసరాల్లో నిర్మలంగా ప్రవహిస్తుంది. ఇక్కడ గల తీర్థాలలో ప్రముఖమైనది ’విశ్రాంతి తీర్థం.’ భక్తులు చేసే మధురా పరిక్రమ ఇక్కడి నుండే ఆరంభమై, మళ్ళీ ఇక్కడే ముగుస్తుంది.
విశ్రామ్ ఘాట్ అని కూడ పిలువబడే విశ్రాంతి తీర్థం పురాణప్రసిద్ధమైనది. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తరువాత కొంత సేపు ఇక్కడ విశ్రమించాడు. ఈ నేపధ్యంలో ఈ తీర్థానికి విశ్రాంతి తీర్థమని పేరు వచ్చింది. స్థానికంగా దీనిని విశ్రామ్ ఘాట్ అని పిలుస్తారు. భగవంతునికి అలసట అన్నది లేనేలేదు. యమునా నదికి ప్రాముఖ్యతను కల్పించడం కోసమే కృష్ణుడు ఇక్కడ విశ్రమించాడని విద్వాంసులు వివరించారు. తన జలాల్లో స్నానం చేసే భక్తులకు సంసార భయాల నుండి విశ్రాంతిని కలిగిస్తుంది కాబట్టి ఈ తీర్థం విశ్రాంతి తీర్థంగా పేరును పొందిందని కూడా వివరిస్తారు విద్వాంసులు. ఈ తీర్థంలో, భక్తిపూర్వకంగా, కృష్ణనామస్మరణతో చేసే స్నానం వేయికోట్ల అశ్వమేధ యాగాలకు సమానమని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ విశ్రామ్ ఘాట్, శ్రీకృష్ణుని నామ సంకీర్తనా వైభవాన్ని అవిశ్రాంతంగా చాటే నిదర్శనమై భాసిస్తోంది.
* * * *
బృందావన క్షేత్రం
మధుర నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ’బృందావన’ క్షేత్రం ఉంది. ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని బ్రహ్మవైవర్త పురాణం చక్కగా వివరిస్తోంది. పూర్వం కేదారుడనే రాజు కుమార్తె అయిన వృందాదేవి శ్రీకృష్ణునికై తపస్సు చేసిన స్థలంగా ఇది పురాణప్రసిద్ధమయినది. వృందాదేవి పేరు మీదుగా ఈ క్షేత్రం వృందావనంగా ఖ్యాతికెక్కింది. గోకులం నుండి వృందావనానికి విచ్చేసిన గోపాలకృష్ణుడు చాలాకాలం ఇక్కడే నివసించాడు. కంసవధకై మధురకు తరలివెళ్ళేవరకు ఈ ప్రాంతంలో ఎన్నెన్నో లీలావిశేషాలను ప్రదర్శించాడు.
అగోచరుడైన ఆదిమధ్యాంతరహితుణ్ణి, వృందావన వాసులు కనులారా దర్శించి, తరించారు ఆనాడు! బృందావన విహారి వదిలి వెళ్ళిన జాడలను చూసి, ధన్యులవుతున్నారు భక్తులు ఈనాడు!
లక్ష్మీదేవి అవతారమైన రాధాదేవితో నారాయణస్వరూపుడయిన కృష్ణుడు నెరపిన లీలలు ఈ బృందావనమంతా నేటికీ పొడసూపుతుంటాయి. 84 చదరపు మైళ్ళ వైశాల్యంలో విస్తరించివున్న ఎన్నెన్నో వనాలు కృష్ణగీతాలను ఆలపిస్తూ, కృష్ణలీలల్ని స్మరిస్తూ కనిపిస్తాయి.
కాళీయమర్దనం జరిగిన ప్రాంతం…గోపీకా స్త్రీల వస్త్రాపహరణ స్థలం…అత్యంత ప్రాచీనమైన బన్ కీ బిహారీ ఆలయం…ఏడు అంతస్థులతో కూడిన భవ్యమైన గోవిందదేవ్ మందిరం…కృష్ణుడు విహరించిన భాండీరవనం…పరస్పరం అల్లుకున్న వృక్షాలతో కూడి / రాసక్రీడకు ప్రసిద్ధి చెందిన నిధివనం…రాధాకృష్ణుల ఏకాంతసేవకై ఏర్పాట్లు జరిగే స్థలం…ఇలా ఎన్నెన్నో విశేషాలతో అలరారే బృందావనం నేటికీ ద్వాపరయుగపు అనుభూతిని అందిస్తోంది. కృష్ణతత్వాన్ని, రాసలీలలోని వేదాంతసారాన్ని జిజ్ఞాసువులకు పంచుతూనేవుంది.
* * * *
గోవర్ధన క్షేత్రం
వృందావనానికి దగ్గరలో గోవర్ధన క్షేత్రం ఉంది. ఇక్కడే, భాగవత పురాణ ప్రసిద్ధమైన గోవర్ధన గిరి నెలకొనివుంది. ద్వాపరయుగంలో ఈ పర్వతం యాదవులకు పూజనీయమైన పర్వతంగా భాసించింది. తన అఘటనఘటనా సామర్ధ్యాన్ని యాదవులకు చూపించదలచాడు కృష్ణుడు. అందుకు గోవర్ధనగిరిని ఎంచుకున్నాడు. ఇంద్రుని ప్రీతికై చేయవలసిన యజ్ఞాన్ని కాదని, గోవర్ధన పూజను ప్రోత్సహించాడు. అందుకు ఆగ్రహించిన ఇంద్రుడు ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు ధారాపాతంగా కుంభవృష్టిని కురిపించాడు. అప్పుడు కృష్ణుడు చిటికెనవేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలకులను కాపాడాడు. గోవర్ధన గిరి ప్రాంతం చుట్టుపక్కల ఎన్నెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి.
వీటిలో మానసీగంగా ప్రధానమైనది. ఈ తీర్థం కృష్ణుని మనోసంకల్పం వల్ల ఉద్భవించినదిగా చెబుతారు. గోవర్ధనగిరికి వెళ్ళే మార్గంలో గోవిందకుండం…రాధాకుండం…కృష్ణకుండం…కుసుమసరోవరం వంటి మనోహరమైన తీర్థాలు భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీకృష్ణుని పవిత్ర స్పర్శకు నోచుకున్న ఈ తీర్థరాజాలు నేటికీ భక్తులకు శ్రీకృష్ణానుగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
* * * *
ద్వారకా
శ్రీకృష్ణుడే స్వయంగా నేతృత్వం వహించి, నిర్మించిన పరమ పుణ్యస్థలం – ద్వారకా!
ఈ పట్టణాన్ని ద్వారావతీ అని కూడా పిలుస్తారు. జరాసంధుని దండయాత్రాల నుండి తన ప్రజలను రక్షించడానికై, పశ్చిమ సముద్రం మధ్యలో, శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆనతి మేరకు దేవశిల్పి విశ్వకర్మ కట్టినదే ఈ ద్వారకా పట్టణం. తొమ్మిది ద్వారాలతో కూడిన నగరం కావడం వల్ల దీనికి ద్వారకా అన్న పేరు స్థిరపడింది. మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాలలో ఒకటిగా పురాణప్రసిద్ధమయినది.
ద్వాపరయుగపు చివరి భాగంలో, కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తరువాత, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తి కావించిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. నేడు మనం దర్శిస్తున్న ద్వారకా పట్టణం, కుశస్థలి అన్న పేరుగల మరో పురాణప్రసిద్ధ క్షేత్రమని విజ్ఞులు వివరిస్తున్నారు.
నేటి ద్వారకలో వెలసిన ప్రసిద్ధ ఆలయం శ్రీద్వారకాధీశ్ మందిరం. నిజానికి ఈ మూర్తి ’త్రివిక్రము’నిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. కానీ నేడు శ్రీకృష్ణుని స్వరూపంగానే ఆరాధిస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో, భవ్యమైన గోపురాలతో అలరారే ద్వారకాధీశ్ మందిరం అల్లంత దూరం నుండే భక్తుల మనసులను రంజింపజేస్తుంది. శ్రీకృష్ణుని దివ్యమంగళరూపానికి ప్రతిరూపంగా ఈ ఆలయం అలరారుతూవుంటుంది. గర్భాలయంలో కొలువైన ద్వారకాధీశుడు సర్వాలంకారశోభితుడై, నవరంధ్రాలతో కూడిన మానవదేహమనే ద్వారకకు తానే ప్రభువని చాటుతూ దర్శనమిస్తాడు.
* * * *
గురువాయూరు
ఉత్తరభారతదేశంలో గల శ్రీకృష్ణక్షేత్రాలతో సరిసమానంగా తులదూగే పుణ్యధామాలు దక్షిణ భారతదేశంలో కూడా ప్రభవించాయి. వీటిలో ’దక్షిణ ద్వారక’గా ప్రసిద్ధి చెందినది – గురువాయూరు.
నేటి కేరళ రాష్ట్రంలో నెలకొనివున్న గురువాయూరు ప్రపంచప్రసిద్ధిని పొందిన ’గురువాయూరప్ప’ కొలువైన దివ్యసన్నిధానం. ముద్దులొలికే చిన్నారి కృష్ణుడు ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాడు. మాతరిశ్వ, పవమాన, ముఖ్యప్రాణ మొదలైన పేర్లతో వేదప్రసిద్ధుడయిన వాయుదేవుని పేరు మీదుగా ’వాయుపురం’ అన్న పేరుతో ఆవిర్భవించిన దివ్యక్షేత్రం ఇది.
దేవగురువయిన బృహస్పతి, శ్రీకృష్ణుని తల్లిదండ్రులయిన దేవకీ వసుదేవులు అర్చిస్తున్న కృష్ణవిగ్రహాన్ని వాయుదేవుని సహాయంతో తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించాడు. కనుక ఈ క్షేత్రం గురువాయూరుగా ప్రసిద్ధిని పొందింది.
* * * *
మన్నారుగుడి
తమిళనాడులో వెలసిన శ్రీకృష్ణదివ్యక్షేత్రం – మన్నారుగుడి. పౌరాణికంగా ఈ ప్రాంతాన్ని చంపకారణ్యమని పిలుస్తారు. చారిత్రకంగా కుళోత్తుంగ చోళ విణ్ణాగరం అని, రాజాధిరాజ చతుర్వేది మంగళం అని పేర్లు ఉన్నాయి. ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. తరువాత విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయక రాజులు ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారు. 16 గోపురాలు, 18 విమానాలు, 7 ప్రాకారాలు, 9 తీర్థాలతో రాజగోపాలస్వామి ఆలయం భూలోక వైకుంఠంగా దర్శనమిస్తుంది.
ఇక్కడ శ్రీకృష్ణుడు “రాజగోపాల” మూర్తిగా దర్శనమిస్తాడు. పశువులను కాచే గోపాలునిలా, గోవులతో కూడి, తలపాగాను చుట్టి, ఒక చేతిలో తాడును, మరొక చేతిలో వెన్నముద్దను ధరించిన ’రాజమన్నారు’ స్వామి విగ్రహం అత్యంత సుందరమైనది. ఈ స్వామివారికి మరో విశేషం ఉంది. ధనుర్యాగం పేరుతో కృష్ణుణ్ణి సంహరించడానికి కంసుడు పన్నిన పన్నాగంలో భాగంగా కువలయపీడా అన్న ఏనుగు కృష్ణుణ్ణి చంపడానికని ప్రయత్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగు దంతాలను పీకి, సంహరిస్తాడు. ఈ ఉదంతానికి నిదర్శనంగా రాజగోపాల మూర్తి చేతిలో దంతం ఉంటుంది. ఈ విగ్రహాన్ని తదేకదీక్షతో చూస్తే స్వామివారు మనతో మాట్లాడుతున్నట్టుగా అగుపిస్తాడు.
“మాతనాడై మన్నారు కృష్ణా” అని అంటూ పురందరదాసు ఈ రాజగోపాలుణ్ణి “మాట్లాడించే కృష్ణమూర్తి”గా అభివర్ణించారు. ప్రతి కృష్ణభక్తుడు ఒక్కసారైనా దర్శించాల్సిన మహోత్కృష్ట క్షేత్రమై అలరారుతోంది ఈ మన్నారుగుడి.
* * * *
పూరి
ఒరిస్సా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. ఈ క్షేత్రాన్ని జగన్నాథపురిగా కూడా పిలుస్తారు. స్కాంద, బ్రహ్మ పురాణం మొదలైన పురాణాల్లో ఈ క్షేత్ర మహిమ వర్ణించబడింది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. శ్రీకృష్ణుడే జగన్నాథుడిగా ఇక్కడ అవతరించాడు.
ఇప్పుడున్న ఆలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గాంగేయ వంశస్థులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవుని కాలంలో ఆరంభమయిన నిర్మాణం అనంగభీముని హయాంలో పూర్తి అయినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. సుమారు 214 అడుగుల ఎత్తున్న ఆలయ విమానం సమున్నత మేరు పర్వతంలా భాసిస్తూవుంటుంది. ఆలయ లోపలి భాగంలో “జగన్మోహన” అని పిలువబడే ముఖమండపం ఉంది. దీనిని దాటగానే నాట్యమండపం, ఆపై భోగమండపం దర్శనమిస్తాయి. ఈ ఆలయాన్ని పంచరథ రేఖ అనే వాస్తునిర్మాణ శైలిని అనుసరించి నిర్మించారు.
ప్రధాన ఆలయంలో సుభద్ర, బలరామ సమేతుడైన జగన్నాథుణ్ణి దర్శించవచ్చు. ఈ ఆలయంలోని మూలవర్లు దారు ప్రతిమలు అంటే చెక్కతో చేయబడినవి. ’రత్నవేది’ అని పిలువబడే వేదికపై మూలమూర్తులు కొలువుదీరివుంటారు. జగన్నాథస్వామిని ’నీల మాధవ’ అని కూడా పిలుస్తారు.
పూరీ దేవాలయంలో ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి నూతన విగ్రహాల్ని ప్రతిష్టిస్తారు. కొత్త విగ్రహాల తయారీ చేసే కార్యక్రమాన్ని ’నవ కలేవర’ ఉత్సవంగా పిలుస్తారు.
తొమ్మిదివ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పూరిని దర్శించి, గోవర్ధన మఠాన్ని స్థాపించారు. పదహారవ శతాబ్దంలో పరమ వైష్ణవ భక్తుడైన చైతన్య మహాప్రభువు పూరీలో అనేక సంవత్సరాలు నివసించి స్వామిని సేవించాడు.
జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్సవం. విశాలమైన రథాలలో సుభద్ర, బలభద్ర, కృష్ణ విగ్రహాల ఊరేగింపును నిర్వహిస్తారు. ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు మొదలయ్యే జగన్నాథ రథోత్సవం పక్షం రోజుల పాటు సాగే అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుని రథాన్ని “నందఘోష” అని పిలుస్తారు. బలభద్రుని రథానికి “తాళధ్వజ” అని, సుభద్ర రథానికి “దేవదళన” అని పేర్లు ఉన్నాయి. రథయాత్ర వీక్షణకై ప్రపంచం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. జగన్నాథ నామ స్మరణతో పరిసరాలు మారుమ్రోగుతాయి.
* * * *
“శ్రీకృష్ణుడు” అన్న పేరు అలుపెరుగని అల్లరి, అలవికాని అభిమానం, అద్వితీయమైన ఆధ్యాత్మికతల అపురూప సమ్మేళనం. కృష్ణ శబ్దానికి అద్భుతమైన అర్థాన్ని చెబుతారు విజ్ఞులు. కృష అంటే పంటలు పండే భూమి. ’ణ’ అంటే శాంతిని కలిగించడం. భూదేవికి శాంతిని కలిగించేవాడినే కృష్ణుడని శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. కంసుడు, జరాసంధుడు మొదలైన క్రూరుల్ని సంహరించి భూభారాన్ని హరించాడని భాగవత పురాణం చెబుతోంది. వీటన్నింటినీ స్మరించుకొని, కృష్ణతత్వమే ఊపిరిగా జీవించిన శ్రీ వల్లభాచార్యుల వారు “యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం” అంటూ ఆ యాదవకృష్ణుడిని జగద్గురువుగా కీర్తించారు. “కృష్ణాయాక్లిష్టకర్మణే / గురవే సర్వసాక్షిణే” అంటూ గోపాలతాపినీ ఉపనిషత్తు కూడ కృష్ణుణ్ణి గురువుగా ప్రస్తుతి చేస్తోంది.
మానవ జీవన గమనాన్ని, సాధనను, సాఫల్య మార్గాన్ని అనేక రకాలుగా చూపించి, ఉపదేశించి, ఉద్ధరించే పరమ ప్రేమస్వరూపమైన శ్రీకృష్ణా! నీకు నమస్సులు!
* * * *
గీతాచార్యుడై భగవద్గీతను జగత్తుకు అందించిన విశ్వగురువైన శ్రీకృష్ణుని అవతార వైభవాన్ని మనకు తెలియజేసే పుణ్య సందర్భమే శ్రీకృష్ణజన్మాష్టమి. “గోవింద నందనందన గోపాలకృష్ణ నీ – భావము మాకు చిక్కె గోపాలకృష్ణా” అంటూ పదకవితాపితామహుడు అన్నమాచార్యులవారు రేపల్లె గోపాలుడే తిరువేంకటాద్రిపై కోనేటిరాయడిగా వెలిసాడనే తత్వరహస్యాన్ని మనకు తెలిపారు. శ్రీ వేంకట మాధవుని కృపాకటాక్షవీక్షణలు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ వీక్షకులపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్థిస్తూ….
* * * *