’దేవవ్రత’ భీష్ముడు

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

 (ఈ వ్యాసం ’తానా’ పత్రికలో మొదటిసారిగా ప్రచురితమయింది)

సర్వశక్తుడయిన భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షసాధనలో అగ్రగాములుగా నిలిచేవారు దేవతలు. ఇంతటి సాధనాశీలులైన దేవతలు ఏదో ఒక కారణం వల్ల ’శాపగ్రస్తు’లై భూమి మీదకు దిగివస్తారు. మొత్తం పద్దెనిమిది పురాణాలనూ పరిశీలించి చూస్తే ఈ విషయమే మళ్ళీ మళ్ళీ కనబడుతూవుంటుంది.

ఓ విధంగా దేవతలకు ’శిక్షాస్థలం’ వంటిది ఈ భూమి. అయితే దేవతలకు విధించిన శిక్ష, మానవులకు రక్షాకవచం కావడం అత్యంత ప్రధానమైన అంశం. వివిధ దేవతలు శాపాల పాలై, భూమిపై జన్మలెత్తగా సంపూర్ణంగా లాభపడింది మానవులే!

ఈ కోవలో అగ్రగామిగా నిలచే వాడే భీష్ముడు. ఆ వివరాలేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం.

భీష్ముడి అసలు పేరు ’దేవవ్రత’ (దేవవ్రతుడు). ఇతను కురు వంశంలో వచ్చిన ప్రతీప మహారాజు కుమారుడైన శంతను మహారాజు కుమారుడు. గంగాదేవి ఇతని తల్లి. అయితే నిజానికి దేవవ్రతుడు దేవలోకంలోని ఎనిమిదిమంది వసువులలో “ద్యు” అన్న పేరుగల ఒక వసువు. వశిష్ఠ ఋషి శాపం వల్ల మానవజన్మను ఎత్తాడు. ఇతని శాపానికి కారణం ఇతని భార్య అయిన వరాంగి. ఈ దేవలోకపు వరాంగికి భూలోకంలో అదే పేరుగల ఓ రాకుమార్తెతో చెలిమి ఎక్కువ. మానవులన్న తరువాత జనన-మరణాలకు లోబడినవారు కనుక తన ప్రియ మిత్రురాలైన భూలోక వరాంగి మృత్యుంజయి కావాలని భావిస్తుంది. వశిష్ఠుని వద్ద గల నందిని అనే దివ్యగోవును భూలోక వరాంగి వద్దకు చేరిస్తే ఆమె శాశ్వతమైన ఆయుష్షుతో జీవిస్తుందని తెలుసుకొన్న దేవలోక వరాంగి తన భర్త అయిన ’ద్యు’ను దొంగతనానికి ప్రోత్సహిస్తుంది. అతను తనతో బాటు సోదరులైన ఏడుగురు వసువులను వెంట తీసుకుని వెళతాడు. వీరందరూ వశిష్టుని ఘోరశాపానికి గురి అవుతారు. చివరకు ’ద్యు’ నామక వసువే అసలు ముద్దాయి కావడం వల్ల అతనే మానవునిగా జన్మించాలని, అతనికి మిగిలిన ఏడుగురు వసువుల బలము, జ్ఞానము, ఆయుష్షు లభిస్తాయనే ఏర్పాటు జరిగింది. మిగిలిన ఏడుగురు మానవులుగా పుట్టిన వెంటనే చంపబడి శాపవిముక్తులయ్యే విధంగా మరొక ఏర్పాటు జరిగింది. సాధారణ మానవుల గర్భంలో జన్మించడానికి జంకుతున్న అష్ట వసువులు మహావిష్ణువు కుమార్తె అయిన గంగాదేవిని ఆశ్రయిస్తారు. ఆమె వారికి జన్మనిచ్చి, ఏడుగురు బిడ్డలను హతమార్చడం ద్వారా శాపవిముక్తుల్ని చేసేందుకు అంగీకరిస్తుంది. ఆవిధంగా శాపగ్రస్తుడైన ’ద్యు’ నామక వసు భూలోకంలో మానవునిగా అవతరిస్తాడు. అతనే ’దేవవ్రత’ అన్న భీష్ముడు.

 

[amazon_link asins=’8184006888,B00EYQPTBQ,9352010175,9352294890′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’518cfd6c-0d2b-11e9-bf01-1d1c7a1124f7′]

మరొకవైపు గంగాదేవి భర్త అయిన వరుణుడు (సాగరుడు) చతుర్ముఖ బ్రహ్మ శాపానికి గురై భూలోకంలో కురువంశస్థుడయిన ప్రతీప మహారాజుకు కుమారునిగా ’శంతను’ అన్న పేరుతో అప్పటికే జన్మించివున్నాడు. అష్ట వసువులకు అభయమిచ్చిన గంగ తన మూలరూపంతోనే ఇలకు దిగి, నేరుగా ప్రతీప మహారాజు వద్దకు వెళ్ళి అతన్ని మెప్పించి, శంతనును వివాహమాడుతుంది. ఆవిధంగా ఆమె మొదటి ఏడుగురు వసువులకు వరుసగా జన్మనిచ్చి, గంగానదిలో ముంచడం ద్వారా శాపవిముక్తుల్ని చేస్తుంది. ముందుగానే నిర్ణయమయిన విధంగా దేవవ్రతుని జననం తరువాత కొద్దికాలం అతన్ని పెంచి, పెద్దవాణ్ణి చేసి, బృహస్పతి మరియు పరశురాముని వద్ద విద్యాభ్యాసం చేయించి, శంతనుకు అప్పజెప్పి దేవలోకాన్ని చేరుతుంది.

అటుపై శంతను మత్స్యగంధిగా పేరుపొందిన సత్యవతిని వివాహమాడుతాడు. ఆ సందర్భంలో సత్యవతి బిడ్డలే కురు సామ్రాజ్యానికి ఉత్తరాధికారుల్ని చేస్తానని, తాను అవివాహితునిగా మిగులుతానన్న భీషణ ప్రతిజ్ఞ చేసి దేవవ్రతుడు ’భీష్మ’ అన్ని బిరుదును పొందుతాడు. పిమ్మట ’కురుకుల పితామహా’ అన్న కీర్తికి పాత్రుడై, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని, అర్జునుని చేతిలో రోమానికి (వెంట్రుక) ఒక్క బాణం చొప్పున కొట్టించుకుని, అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం దాకా జీవించి, పరమ పవిత్రము, భక్తి-జ్ఞాన-వైరాగ్యదాయకము అయిన విష్ణుసహస్రనామకర్తయై, మాఘ శుక్ల అష్టమి నాడు విష్ణు సాయుజ్య రూపమైన శాపవిముక్తిని పొంది, తన మూలరూపమయిన ’ద్యు’ నామక వసువుగా మారి దేవలోకాన్ని చేరుకుంటాడు. ఇదీ సంక్షిప్తంగా భీష్మ చరిత్ర.

అయితే, ఈ భీష్ముని పాత్ర వల్ల వేదవ్యాసుడు మనకు చెప్పదలచిన ముఖ్యాంశం ఏది? అని ప్రశ్నించుకుంటే ఈ క్రింది సమాధానాన్ని పెద్దల విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏ వ్యక్తి “శాంత తను” (శంతను – శరీరంపై అదుపు సాధించినవాడు)గా ఉంటాడో అతనికి మందాకినీ (గంగా – జ్ఞానప్రవాహం) జీవిత భాగస్వామి అవుతుంది. ఆ సుందర దాంపత్యానికి ఫలంగా ’దేవవ్రత’ (ఆధ్యాత్మిక, ధార్మిక జీవనం) జన్మిస్తాడు. ఈ వ్రతం వల్ల లౌకిక ఆకర్షణలకు లొంగని సామర్థ్యం (భీష్మ) లభిస్తుంది. ఆ సామర్థ్యం వల్ల సహస్రనామం (సహస్రారం )లో భగవంతుని దర్శనం (మోక్షం) లభిస్తుంది. మరొకవిధంగా చూస్తే – శాంతగుణానికి (శంతను) జ్ఞానము (గంగా), సత్యము (సత్యవతి) అనే భార్యలు ఉంటే, అక్కడ దేవవ్రత (ధార్మికత) పుత్రరూపంలో ఉంటూ పాపకార్యాలకు భయాన్ని (భీష్మ) కలిగిస్తుంది.

ఇదీ భీష్మ చరిత్ర ద్వారా వేదవ్యాసుడు మానవులకు అందించిన మహత్తర సందేశం.

ఇక నిఘంటువుల అర్థాల మేరకు పరిశీలిస్తే భీష్మ అన్న పదం “భీ భయే”; “ణిచ్ షుకే (భావే) అన్న రెండు ధాతువుల సంయోగం వల్ల ఏర్పడించి. అనగా భీష్మ అంటే భయానకం అని అర్థం. మళ్ళీ మళ్ళీ పుట్టేవిధంగా చేసే పాపకర్మలకు భయాన్ని కలిగించేవాడే భీష్ముడు.

వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ|

అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే||

అంటూ భీష్మాష్టమి నాడు భీష్మునికి అర్ఘ్యప్రదానం చేసిన వారికి శాంతము, జ్ఞానము, సత్యనిష్ఠ, ధార్మికజీవనమనే వ్రతపాలన లభిస్తాయి.

 @@@@@

 

Your views are valuable to us!