దివ్య దీపావళీ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

 

మానవుని జీవితం ప్రకృతిపై ఆధారపడినది. నిప్పు, నీరు, గాలి  వంటి ప్రాకృతిక శక్తులను చూసి భయపడిన ఆదిమానవుడు వాటిల్ని కొలవడం మొదలుపెట్టాడని పరిశోధకులు చెబుతారు. అయితే, ఆర్ష విజ్ఞానానికి పుట్టినిల్లైన భారతదేశంలో ప్రభవించిన ఋషులు, మునులు ఆయా ప్రకృతి శక్తుల్ని అర్థం చేసుకోవలసిన తీరును విపులంగా వివరించారు.

 

*****

ప్రాచీనమైన పురాణాలు, భగవంతుణ్ణి “దీపవిద్యుత్తారకాగ్ని- చంద్రసూర్యశ్చదీప్తిమాన్” అని వర్ణించాయి. అంటే దీపము, మెరుపు, నక్షత్రము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు మొదలైన తేజోమయ వస్తువుల్లో ఉండే తేజస్సు ఆ భగవంతుడేనని అర్థం. తేజోరాశులైన సూర్య, చంద్రులు నారాయణుని కుడి-ఎడమ కన్నులుగా వెలుగుతుంటారు. అవే శక్తులు మానవుని కంటిలో ఉండి, “చూపు” అన్న శక్తిని కలిగిస్తున్నవని వేదాలు చెబుతున్నాయి. “ప్రద్యుమ్న” అన్న పేరుగల భగవంతుడే ఆయా తేజోరూపాలలో ఉన్నాడని వేదాలు చెబుతున్నాయి. ఈ “ప్రద్యుమ్న” రూపమే జీవరాశుల కంటిలో ఉంటుంది. ఆ కళ్ళకు “దృష్టిశక్తి”ని ప్రసాదిస్తూవుంటుంది. అలా, కంటిచూపును అందిస్తున్న భగవంతుణ్ణి కన్నులారా చూడలేని లోపాన్ని నివారించుకోవడానికి చేసేదే దీపారాధన. ఇందుకే “దీపం జ్యోతిః పరంబ్రహ్మ” అని మన పూర్వీకులు చెప్పారు!

*****

ఇంతకూ దీపం అంటే ఏమిటి? ఆ పదానికి గల ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి? అన్న ప్రశ్నలు తరచూ కలుగుతుంటాయి. దివ్య దీపావళి పండుగ సందర్భంగా ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం!

దీప అన్న సంస్కృత పదం “దీపయతి” అన్న ధాతువు నుండి పుట్టింది. దీప అంటే ’వెలుగు’, ’సౌందర్యం’, ’లక్ష్మీదేవి’ అనే అర్థాలు ఉన్నాయి. ఏవిధంగానైతే ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇల్లంతా వస్తువులతో నిండుతుందో, అదేవిధంగా దీపం ఇంటిని వెలుగుతో నింపుతుంది. ఇంటికి, ఇంటిలోని వారికి ఓ సౌందర్యాన్ని తెచ్చియిస్తుంది. కనుకనే పెద్దలు “దీపమ్ జ్యోతిః పరంబ్రహ్మ / దీపమ్ సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వమ్ / సంధ్యాదీప నమోస్తు తే” అని దీపాన్ని కీర్తించారు / ప్రార్థించారు. తన నిశ్చలమైన, అమోఘమైన వెలుగుతో వ్యక్తులను, వస్తువులను మనకు పరిచయం చేయించే దీపం పరమాత్మునితో సమానం. దీపం వల్లనే చీకటి కమ్మినా, మనం పనులను చేసుకోగలుతున్నాం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైన ఓ దీపమా, నీకు నా నమస్సులు!

*****

దీపం దేవుడు ఎలా అయింది? దీపానికి, దేవునికి గల సంబంధం ఏమిటి? దీపావళికి గల ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి? – ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి. ఆ ప్రశ్నలకు విజ్ఞులు, విద్వాంసులూ అయిన మన పూర్వీకులు చెప్పిన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం!

“దివు” అన్న సంస్కృత పదానికి “ద్యుతి, కాంతి” అనే అర్థాలున్నాయి. ద్యుతి అంటే ప్రకాశం. కాంతి అంటే వెలుగు. దీప అన్న పదానికి కూడా ఇవే అర్థాలు ఉన్నాయి. కనుక ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన భగవంతుణ్ణి “దేవ” అన్న పేరుతో వేదోపనిషత్తులు భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయి. అలా కాంతికే కాంతియైన దేవదేవుణ్ణి భౌతికరూపంలో చూడడమే దీపోత్సవం. అదే దీపావళి. చీకటిలాంటి అజ్ఞానంలో మునిగిన మానవ హృదయంలో జ్ఞానమనే వెలుగు నిండి, ఆ వెలుగులో సుఖపడడమే దీపావళిలోని అంతరార్థం.

*****

కాంతిస్వరూపడయిన పరమాత్ముణ్ణి దర్శించడానికి దీపం ఒక సాధనం. బహుశా ఇందుకే కాబోలు, ఇంట్లో వెలుగుతున్న విద్యుద్దీపాలు ఆరిపోయి, మళ్ళీ వెలిగితే అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు దండం పెట్టుకునేవాళ్ళు! విద్యుద్దీపాలలో దైవత్వం లేకపోయినా వాళ్ళు చేసే నమస్కారంలో తరతరాల మన దీపారాధనా సంస్కారం కనిపిస్తుంది. అది ఏమాత్రం మూఢనమ్మకం కాదు అని దీపావళి పండుగ నిరూపిస్తోంది. ఇంతకూ దీపాన్ని ఎందుకు వెలిగించాలో, ఏమని ప్రార్థించాలో తెలుసుకుందాం!

“తమసో మా జ్యోతిర్ గమయా” అని వేదాలు ప్రార్థించాయి. చీకటి నుండి బయటపడి, వెలుగులోకి నడవడమే మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని, దాన్ని సాధించేందుకు మనం చేయాల్సిన ప్రయత్నాన్ని, ప్రతిరోజూ గుర్తుచేసేదే ’దీపం.

సర్వాంతర్యామి ఐన పరమాత్ముడు మనం వెలిగించే దీపంలో జ్యోతిరూపంగా వెలుగుతూ దర్శనమిస్తాడు. ఆ వెలుగులో మన యోగక్షేమాలను వహిస్తాడు. తమ కుటుంబం, సమాజం, దేశం బాగుండాలని ఎవరు కోరుకొంటారో వారందరూ ప్రతిరోజూ దీపారాధన చేయాలి. తమ ఇంటిలోనే కాదు మనసులో కూడా వెలుగును నింపుకోవాలి. ఎవరెవరు, ప్రతిరోజూ ప్రొద్దున, సాయంత్రం దీపారాధన చేస్తారో వారందరి ఆశయాలను భగవంతుడు నెరవేరుస్తాడు. తద్వారా కుటుంబాలు, సమాజం వెలుగులమయం అవుతాయి.

ఇలా ఇష్టార్థాలను తీర్చే పవిత్రమైన దీపాన్ని వెలిగించేప్పుడు ఓ ప్రార్థనా శ్లోకాన్ని చదవాలని విజ్ఞులు ఉపదేశించారు. ఇంట్లో దీపాలను వెలిగించేప్పుడు…

 

“స్నేహం  దీపో యథా ధృత్వా సర్వలోకోపకారకః

తథా భవాన్ మమ జ్ఞానం హృది ధారయ సంతతమ్”

అని ప్రార్థిస్తూ వెలిగించాలి.

“చేతిలో ధరించబడ్డ దీపం, ప్రజలకు స్నేహాన్ని పెంపొందించే విధంగానే నా హృదయంలో జ్ఞానం ఎల్లప్పుడూ నిలచివుండుగాక” అని ఈ శ్లోకానికి అర్థం. ఈ ప్రార్థన ఎంత ఉదాత్తమో కదా! ఇందులోని వాస్తవికత, నిజాయితీలను చవిచూసిన మనిషి యొక్క కళ్ళు చెమర్చుతాయి. ఇటువంటి ప్రార్థనతో దీపం వెలిగించిన ప్రతిరోజూ దీపావళియే.

అసూయరహితులై, సర్వజన క్షేమ చింతకులై దీపాలను వెలిగించే మానవుల హృదయంలోని అజ్ఞానం అనే నరకాసురుడిని, “సత్యభామ” పేరుగల వేదజ్ఞానప్రదాత అయిన లక్ష్మీదేవి సంహరిస్తుంది. అంటే మనసులో సత్యము నిత్యమూ వెలుగుతూ ఉంటుంది. అలా జ్ఞానదీపం వెలుగుతున్న ప్రతి గృహమూ వైకుంఠమే. సర్వలోకపాలకుడైన శ్రీహరి అక్కడే నివాసముంటాడు.

*****

చీకటి నింపే నిరుత్సాహాన్ని, వెలుగుతున్న దీపం పోగొడుతుంది. వెలుగు ఉన్న చోట ఉత్సాహం పెల్లుబుకుతుంది. అందుకే దీపాన్ని భగవత్సరూపంగా భావించారు భారతీయులు. దీపాలను వెలిగించే పధ్ధతిని, పాటించాల్సిన నియమాలను, చేయకూడని పనులను ఇప్పుడు తెలుసుకుందాం!

ఒకే వత్తిని వేసి దీపారాధనను చేయరాదని శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. రెండు వత్తులను కలిపి, ప్రమిదలో ఉంచి, ఆవు నేయి లేక నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆవు నేయి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. నువ్వుల నూనె లేక వేరుశెనగ నూనె లేక ఆముదం వరుస క్రమంలో తక్కువ ఫలితాలను ఇస్తాయి. ఏ నూనె వాడి దీపాన్ని వెలిగించినా భక్తితో చేయాలి. భక్తిలేని ఆడంబరాన్ని భగవంతుడు స్వీకరించడు. దీనినే ’భక్త్యా తుష్యతి కేశవః” అని భాగవత పురాణం వివరిస్తోంది.

రెండు వత్తులు గల దీపాలను స్త్రీలు వెలిగిస్తే మొదటి వత్తి భర్త క్షేమానికని, రెండవ వత్తి కన్నబిడ్డల సుఖశాంతులకని భావిస్తూ వెలిగించాలి.

పురుషులు వెలిగిస్తే ఒక వత్తి ధర్మాచరణకని, మరొక వత్తి సమజంలో గౌరవాన్ని కోరుతూ వెలిగించాలి.

పిల్లలు వెలిగిస్తే తల్లిదండ్రుల పట్ల గౌరవ మమకారాలను, విద్యాభివృద్ధిని కోరుతూ వత్తులను వెలిగించాలి.

దీపాలను దేవుని గదిలోను, తులసి కోట ముందు, తలవాకిలి గడపకు ఇరువైపులా వెలిగించడం ఆచారం. దేవుని గదిలోని దీపాన్ని ’అఖండం’గా…అంటే…ఆరకుండా వెలిగిస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కొలువైవుంటాయి. ఆపత్తులు పరిహరింపబడతాయి.

చక్కగా, కళకళలాడుతూ వెలుగుతున్న దీపాలను ఆర్పకూడదు. వాటంతట అవి శాంతించే వరకూ దీపాలను వెలగనివ్వాలని ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఒకవేళ, పొరబాటున దీపాన్ని ఆర్పివేయడం జరిగితే, తమ ఇష్టదైవం నామాన్ని 108 సార్లు తలచుకొని, దీపాన్ని మళ్ళీ వెలిగించాలి. ఈవిధంగా దీపారాధన క్రమాన్ని, అందులో దాగిన ఆధ్యాత్మిక మర్మాన్ని వివరించారు మన పెద్దలు. ఈ కారణాల వల్లనే ప్రతి ఇంటిలో, ప్రతి రోజూ, దీపారాధన జరగాలని ఆశించారు మన పూర్వీకులు.

ఆధునికత పెరిగిపోయిన నేటికాలంలో, ఎలెక్ట్రిక్ బల్బులను వెలిగించి, వాటినే దీపాలుగా భావించే అలవాటు కొనసాగుతోంది. కానీ ఆ కృత్రిమ దీపాలలో భగవంతుని సన్నిధానం ఉండదని, శాస్త్రోక్తంగా వెలించే నేతి దీపాలు లేక నూనె దీపాలలో మాత్రమే భగవంతుని సాన్నిధ్యం ఉంటుందని తెలుసుకోవాలి. ఆవిధంగా దీపావళి రోజున – మట్టి ప్రమిదలలో, నువ్వుల నూనెతో, శ్రేష్టమైన పత్తి వత్తులను రెండు రెండుగా జోడించి, దీపాలను వెలిగిస్తే, దీపలక్ష్మి అనుగ్రహిస్తుంది.

దీపానికి గల మరో విశేషం ఏమిటంటే, ప్రకాశవంతంగా వెలిగే దీపంలో మూడు వర్ణాలు కనిపిస్తాయి. దీపపు వత్తి వద్ద నీలం రంగును, దానికిపైన ఎరుపును, మిగతా భాగమంతా బంగారువర్ణంతో నిండివుండడాన్ని చూడవచ్చు. ఇవి త్రిగుణాలకు సంకేతాలని పెద్దలు విశదీకరించారు. అదేవిధంగా, ఈ మూడు త్రిమూర్తులకు, లక్ష్మీ-సరస్వతీ-పార్వతులకు నిదర్శనాలని కూడా వివరించారు విజ్ఞులు. ఇలా, త్రిమూర్తి స్వరూపమైన, ముగురమ్మల సన్నిధానం కలిగిన దీపాలను ఇంటిలో ప్రతిరోజూ వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి నాడు వెలిగిస్తే విశేష ఫలం లభిస్తుంది.

ఆశ్వీజ మాసం తరువాత వచ్చే కార్తిక మాసం దీపారాధనకు అత్యంత శ్రేష్టమయినది. స్థితికారకుడైన విష్ణువుకు, లయకారకుడైన శివునికి చాలా ఇష్టమయిన కార్తిక మాసంలో, సంప్రదాయానుసారంగా రెండు వత్తులతో, శ్రేష్టమయిన నేయి లేక నూనెతో స్త్రీలు, పురుషులు, పిల్లలు దీపారాధన చేసి ఎన్నో సత్ఫలితాలను సాధించవచ్చు. ఈ దీపాలను, వివిధ రకాల దేవతా మూర్తుల ఆకారంలో వెలిగించడం కూడా చక్కటి ఫలితాలను అందిస్తుంది.

*****

దీపావళి పండుగ అనగానే పిల్లలు టపాకాయలను కాల్చి ఆనందిస్తుంటారు. ఆ ఆనందం ఎంతో అపురూపమైనది. వింత వింత శబ్దాలను చేస్తూ, రంగుల్ని విరజిమ్మే టపాసులతో బాటు పిల్లలకు దీపావళిని సంప్రదాయ పద్ధతిలో ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో చెప్పవలసింది పెద్దలే. పిల్లలకు దీపం, దీపారాధనల వైశిష్ట్యాన్ని, వాటిలోవున్న వైజ్ఞానిక కోణాన్ని వివరించడానికి దీపావళి కంటే అద్భుతమైన అవకాశం మరొకటి లేదు. కనుక పెద్దలు ముందుచూపుతో పిల్లలను తీర్చిదిద్దాలి. అప్పుడే వ్యక్తికి, సంఘానికి, దేశానికి శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. దుఃఖాలు నశిస్తాయి. మనం రోజూ కోరుకునే నిజమైన “సుఖం” లభిస్తుంది. అలా నిజమైన సుఖం లభించడమే దీపావళి!

కలియుగపు చీకట్లను పారద్రోలి, సత్యయుగపు వెలుగులను అందించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మా కులదైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడు ఈ పావన దీపావళి సందర్భంగా మిమ్మల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.

*****

 

 

 

 

Your views are valuable to us!