గణపతి తత్వం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.5]


2016లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‍కు నేను వ్రాసిన స్క్రిప్ట్ ఇది


వేదాలు, ఉపనిషత్తులనే పునాదులపై సనాతన ధర్మం నిలచివుంది. ఈ గ్రంథాలలో వివిధ దేవతల వివరాలు, వారి ఉపాసనా మార్గాలను వివరించడం జరిగింది. మాండూక్య ఉపనిషత్తు “వైశ్వానర” అన్న భగవద్రూపాన్ని వివరిస్తూ పందొమ్మిది ముఖాలు కలిగిన వైశ్వానర రూపంలోని ప్రధాన ముఖం గజముఖమని పేర్కొనడం జరిగింది. “అహమ్ వైశ్వానరో భూత్వా” అన్న గీతావాక్యం ప్రకారం శ్రీహరియే గజముఖుడయిన వైశ్వానరుడు. “విశ్వంభర” అన్న మరో పేరును కలిగిన ఈ రూపమే విఘ్నవినాయకునిలో పూజలందుకొంటోంది. ఇంతటి వైశిష్ట్యం కలిగిన గజముఖ తత్వాన్ని వినాయకచవితి సందర్భంగా తెలుసుకుందామా!

*****

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ దేవగణ వంద్యుడు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షదైవమై, ధర్మపరిరక్షకుడై భక్తకోటి పూజలందుకుంటున్నాడు. కలి ప్రభావం వల్ల ధార్మికులకు కలిగే విఘ్నాలను నివారిస్తూ ఉన్నాడు. అటువంటి విఘ్నహర్తుడు సయితం శ్రీరామవతార సమయంలో రావణాసుర వధకు పూనుకున్నప్పుడు ఆదిపూజితుడైన పార్వతీనందనుణ్ణి అర్చించాడు. వినాయక శాపానికి గురైన చంద్రుణ్ణి వినాయక చవితి నాడు చూసిన కారణంగా ప్రాప్తమయిన నీలాపనిందను శ్రీ కృష్ణావతారంలో భరించాడు. ఆవిధంగా భూలోకంలో సాధకులు వినాయకుణ్ణి పూజించే విశిష్ట ఉపాసనకు మార్గం వేసాడు.

వేదాలలో గణపతి

నాలుగు వేదాలలో మొదటిదయిన ఋగ్వేదం గణపతిని రెండు మంత్రాలతో కీర్తిస్తోంది. విఘ్నేశునికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఉల్లేఖనాలు ఇవేనని పండితులు పేర్కొన్నారు. “గణానాం త్వాం” అన్న ఋగ్వేద మంత్రంలోని మొదటి అక్షరం “గ”, చివరి అక్షరం అనుస్వారం. ఈ రెండింటి కలయికగా ఆవిర్భవించిన బీజాక్షరం “గం.” గౌరీపుత్రుడైన గణేశుడు “గం” అనే బీజాక్షరానికి అధిదేవతగా వేదం పేర్కొంది. యజుర్వేదం మహాశివుణ్ణి “నమో గణభో” అని వర్ణిస్తూ శివుణ్ణి గణపతిగా పేర్కొంది. “ఆత్మా వై పుత్ర నామాసి” అన్న విధంగా గణపతి అయిన శివుని కుమారుడు కూడా గణపతి పేరుతో ప్రసిద్ధి చెందాడు. గణేశ సహస్రనామం, గణేశ పురాణం వంటి ప్రాచీన శాస్త్రాలు గణపతిని కీర్తించాయి.

గణేశ తాపినీ ఉపనిషత్తు గజముఖుణ్ణి ఓంకారానికి సంకేతంగా వర్ణించింది. “తతశ్చ ఓమ్ ఇతి ధ్వనిరభూత్ స వై గజాకారః” అని గణేశ తాపినీ ఉపనిషత్తు వాక్యం ఇందుకు నిదర్శనం. ఈ ఓంకారం – అకార, ఉకార, మకార సంయోగమై అత్యంత పవిత్రమైనది, ప్రభావవంతమైనది. సర్వవేదసారమైన ఈ ప్రణవాక్షరానికి గణపతిని సంకేతంగా భావించింది వేదం. ప్రణవాక్షరాన్ని సంస్కృతంలో వ్రాసినపుడు ఆ అక్షరం ప్రధానభాగం గణపతి తొండాన్ని, కుడిభాగం అతనికి ప్రియమైన మోదకాన్ని, పైభాగం గణపతి శిరస్సుపైనుండే అర్ధచంద్రాకృతిని పోలివుంటాయి. కనుక గణపతిని ప్రణవాక్షర సంకేతంగా భావించింది గణేశ తాపినీ ఉపనిషత్తు. ఈ కారణం వల్ల సర్వవిధ కర్మారంభంలో, విఘ్ననివారణకై ఓంకారాన్ని ఉచ్ఛరించడం జరుగుతుంది. ఇలా విఘ్నేశ్వరుడు వేదమంత్ర ప్రతిపాద్యుడై, ఉపనిషత్ప్రసిద్ధుడై, మంత్రాధిష్టాన దేవతగా భాసిస్తున్నాడు.

వీటితో బాటు బోధాయన గృహ్యసూత్రాలలో కూడా గణపతి ఆరాధనా వివరాలు ఉన్నాయి. గణపతికి చెందిన ఎన్నో అపురూప విశేషాలు వైదిక సాహిత్యంలో ఉండేవని, వాటిలో ఎన్నో కాలప్రవాహంలో కొట్టుకుపోయాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అలా కాలానికి ఎదురీది నిలచిన వేద శాస్త్ర విజ్ఞానం, ఆధునికత వ్యామోహంలో నశించకుండా ఉండేవిధంగా ఆ విఘ్నేశుడే రక్షించాలి.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

పురాణాలలో గణపతి

గణేశుని పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. వేదవ్యాసుడు వ్రాసిన 18 పురాణాలు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి క్రమాన్ని వివరిస్తున్నాయి. అయితే, ఈ కథనాలను పరస్పర విరుద్ధాలైనవిగా కాకుండా, ఒక్కొక్క కల్పంలో జరిగిన వాటిగానే అర్థం చేసుకోవాలి. ఆవిధంగా ఇప్పుడు వినాయకుని ఆవిర్భావ ఘట్టాలు కొన్నింటిని చూద్దాం!

“పినాకి భార్యా తనుజ మృద్భవ” అన్న విధంగా గౌరీదేవి దేహ వ్యర్థం నుండి గణేశుడు జన్మించాడనే స్కాందపురాణంలోని కథ బహుప్రసిద్ధిని పొందింది. బ్రహ్మవైవర్త పురాణంలో పుత్రభిక్షకై పార్వతి, శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా, వైకుంఠవాసుని వరం వల్ల గణపతి ఆవిర్భావం జరిగిందని తెలుస్తోంది. పురాణ కథ ఏదైనా, విఘ్నేశ్వరుని ఆవిర్భావం పరమశివుని సంకల్పానికి అనుగుణంగానే జరిగింది.

పురాణాలలో మహాగణపతి వైభవం అనేక విధాలుగా వర్ణించాడు వేదవ్యాసుడు. మహాశివుని వైభవాన్ని వివరించడానికై ఆవిర్భవించిన లింగపురాణం గణేశుణ్ణి వేనోళ్ళా కొనియాడింది.

తవావతారో దైత్యానాం వినాశాయ మమాత్మజ దేవానాం – ఉపకారార్థం ద్విజానాం బ్రహ్మవాదినాం

అంటూ సదాశివుడు తన పుత్రుణ్ణి ఆశీర్వదించాడని వివరిస్తోంది లింగపురాణం. దుష్టులైన దైత్యుల వినాశనం, శిష్టులైన దేవతలు, సాధకులకు ఉపకారం – ఇవే గణేశుని అవతారం ప్రధాన ఉద్దేశాలని లింగపురాణం నిరూపిస్తోంది.

గజముఖుడైన వినాయకుణ్ణి వేదాలు, పురాణాలతో బాటు సంహితలు, ఆగమశాస్త్రాలు కూడా బహుధా పొగిడాయి. అత్యంత ప్రాచీన సంహితగా గుర్తింపబడిన పాద్మసంహితలో చతుర్ముఖ బ్రహ్మ – శ్రీమన్నారాయణ సంవాద రూపంగా గణపతి జన్మవృత్తాంతం వర్ణితమయింది.

మహావిష్ణువు పంచరూపాలలో ఒకటైన ప్రద్యుమ్న రూపం నుండి ప్రభవించిన మహాద్భుత తేజోమూర్తి ఈ గణేశుడని పాద్మసంహిత వర్ణిస్తోంది. శిష్టులకు విజయాన్ని, దుష్టులకు విఘ్నాలను కలిగించే విశిష్ట దేవతగా వినాయకుణ్ణి పాద్మసంహిత వర్ణించింది. ఈవిధంగానే ప్రాచీనమైన నారద పాంచరాత్రమనే ఆగమ శాస్త్రం కూడా గణపతిని అత్యంత హృద్యంగా వర్ణించింది. ఇందులో గణపతి ఆదిమూర్తి అని, సర్వశ్రేష్ఠుడని, గజవదనుడని, ముక్తిదాత అని ఉల్లేఖించబడ్డాడు.

వినాయక తత్వాన్ని వివరించే అద్భుత చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమయినది – ’మహాభారత రచన,’

సర్వజీవ ప్రణేతారం వందే విజయదం హరిమ్

సృష్టిలోని సమస్త జీవులకు విఘ్నాలను తొలగించి, విజయాలను కటాక్షించే పరమాత్మగా శ్రీహరిని పురాణాలు కీర్తిస్తున్నాయి. అటువంటి మహాదైవం వేదవ్యాసునిగా అవతరించి, పంచమవేదమైన మహాభారతాన్ని లిఖించ సంకల్పించాడు. సకల వేదసారమయిన మహాభారతంకు కలియుగంలో విఘ్నమే ఎరుగని శాశ్వత స్థానాన్ని పొందింపజేయాలన్న సంకల్పంతో విఘ్ననివారకుడైన గణపతితో వ్రాయించాడు వేదవ్యాసుడు.

ఒక్క క్షణమైనా విరామాన్ని తీసుకోకుండా వ్యాసుడు ఆశువుగా చెబుతుంటే ఒక్క అక్షరమైనా పొల్లు పోనీకుండా వేగంగా వ్రాసాడు విఘ్నేశుడు. “జయా” అన్న మరో సార్థక నామాన్ని కలిగిన భారతాన్ని వ్రాసిన మూషికవాహనుణ్ణి భాద్రపద శుద్ధ చవితి నాడు కొలిచిన వారికి సర్వజయాలు, సకల శుభాలు కలుగుతాయని ఈవిధంగా సూచించాడు వేదవ్యాసుడు.

శిల్పశాస్త్రంలో గణపతి

కంటికి కనబడని దివ్యతత్వాలను మానవులకు పరిచయం చేయించే శాస్త్రమే శిల్పశాస్త్రం. ఈ శాస్త్రానికి అనుసారంగా తీర్చిదిద్దినవే విగ్రహాలు. వీటిలో ఆయా దేవీదేవతల విశేష సాన్నిధ్యం ఉంటుంది. కనుకనే భారతీయ సనాతన సంప్రదాయంలో విగ్రహారాధనకు విశిష్ట స్థానం ఉంది.

“ప్రతిమాసు అప్రబుద్ధానం” అని శాస్త్రకారులు పేర్కొన్నారు. అనగా సాధనాక్రమంలో తొలిదశలో ఉన్నవారికి విగ్రహారాధన ద్వారా జ్ఞానం సిద్ధిస్తుందని అర్థం. ఈ కారణం వల్లనే ఈ భరతభూమిలో ఎన్నో దేవాలయాలు వెలసాయి. సాధనా మార్గంలో బుడిబుడి నడకలు వేస్తున్న సాధకులకు ఆలంబనగా ఎందరో దేవతలు విగ్రహ రూపంలో సాక్షాత్కరించారు.

శీఘ్రంగా అనుగ్రహించే దేవతగా పేరుపొందిన “క్షిప్ర ప్రదాయక” గణపతికి మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొలువైన వినాయకుని విగ్రహ లక్షణాలను క్రియాసారం అనే తంత్రగ్రంథం చాలా చక్కగా వివరించింది.

చతుర్భుజం బహుత్కుక్షిం సర్వలక్షణ సంయుతం – సర్వాభరణ సంయుక్తం నాగయజ్ఞోపవీతినం

అంటూ నాలుగు చేతులు, పెద్దదయిన పొట్ట, పామునే యజ్ఞోపవీతంగా ధరించిన సర్వలక్షణశోభితుడు, అనేక ఆభరణయుక్తుడు అయిన గణేశుణ్ణి మనం పూజించాలి.

వినాయక చతుర్థి – గణేశ పూజ

ఆగమోక్తమైన రూపంలో భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ నందనుణ్ణి శాస్త్రీయంగా పూజించిన వారికి జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు లభిస్తాయి. నామజపం వల్ల పాపనాశానాన్ని, ధ్యానం వల్ల మోక్షాన్ని కటాక్షించే మూషికవాహనుణ్ణి వినాయక చవితినాడు అర్చించాలి.

ఏకదంతుడైన విఘ్నేశ్వరుడు ఎన్నో రూపాలలో, ఎన్నో నామాలతో ప్రపంచవ్యాప్తంగా పూజలందుకొంటున్నాడు. భక్తులు వారి వారి మనోభావాలకు అనుసారంగా గణపతిని “శక్తి గణపతి”గా, “విఘ్నగణపతి”గా, “హేరంబ గణపతి”గా, “మహాగణపతి”గా, “నృత్యగణపతిగా”, “ఋణమోచక గణపతి”గా, “యోగ గణపతి”గా పూజిస్తుంటారు. శిల్ప శాస్త్రం ప్రకారం గణపతి “ఆయుధాలు”, “సౌందర్య వస్తువులు”, “పూజా వస్తువులు” అనే మూడు విధాలైన విశేషాలను ధరించి దర్శనమిస్తాడు. సుమారు ఇరవై నాలుగు ఆయుధాలు, ఇరవై సౌందర్య వస్తువులు, పద్నాలుగు పూజావస్తువులను చేతిలో ధరించి, మూషిక వాహనుడై దర్శనమిచ్చే మహాగణపతిని పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగి, సర్వాభీష్టాలు నెరవేరుతాయి.

గౌరీపుత్ర నమస్తేస్తు సర్వసిద్ధి వినాయక – సర్వసంకటనాశాయ గృహాణార్ఘ్యం నమోస్తు తే” అంటూ పరమ పవిత్రమైన భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధ్యక్షుడైన మహాగణపతిని, అతని అంతర్యామి అయిన విశ్వంభరుణ్ణి పూజించి, అర్ఘ్యాన్ని అర్పించిన వారికి శుద్ధభక్తి, విశుద్ధ జ్ఞానం, పునరావృత్తిరహితమైన మోక్షం సిద్ధిస్తాయి. సర్వ శక్తుడైన మహేశపుత్రుణ్ణి, ఏకదంతుణ్ణి, షణ్ముఖ అగ్రజుణ్ణి వినాయక చవితి నాడు పూజించిన వారు బ్రహ్మవాదులై, మోక్షసాధనా మార్గంలో నడుస్తూ పరమపదాన్ని చేరుతారు. వినాయకుణ్ణి అర్చించి, కీర్తించిన వారికి విద్యాబుద్ధులతో బాటు అధ్యయన, అధ్యాపనా సామర్థ్యం ప్రాప్తిస్తుంది. “వివర్జిత నిద్రాయ నమః” అని పూజించేవారికి బుద్ధిశక్తిని, ధారణ సామర్థ్యాన్ని అందిస్తాడు ఈ వినాయకుడు. ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వర ప్రార్థన, పూజతో ఆరంభిస్తే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మందబుద్ధిని పరిహరించి, వేదజ్ఞానాన్ని ప్రసాదించే క్షిప్రవరదుడైన శంకర తనయుణ్ణి ఆర్తితో అర్చించినవారి మానవుల మనస్సులలోని కశ్మలాన్ని తొలగిస్తాడు.

మూషిక వాహనం – ఆధ్యాత్మిక అంతరార్థం

విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడు విచిత్రమైన మూషికవాహనాన్ని అధిరోహిస్తాడు. వింతైన మోదకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇంతకూ మూషికానికి, మోదకానికి గల ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఏమిటి?

ఆదిపూజితుడిగా మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే లంబోదరుడు మూషికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముంది. వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుక ఇంద్రియ లౌల్యానికి నిదర్శనం. ఆవిధంగా అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీక అయిన ఎలుకపై సర్వవిద్యాసమన్వితుడైన విఘ్నేశుడు కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు. అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి విఘ్నేశ్వరుడు.

మోదకం – అంతరార్థం

గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువబడే ఈ మోదకం బొజ్జ గణపయ్యకు ప్రియమైన ఆహరం కావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం దేవతలు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైన మోదక రూపంలో కూర్చి పార్వతీపరమేశ్వరులకు సమర్పించారట. జగజ్జనని అయిన పార్వతీదేవి ఆ మోదకాన్ని తన పుత్రులైన గణపతి, కుమారస్వాములకు చెరి సగం పంచి ఇవ్వబోయింది. ఈ విభాగాన్ని నిరాకరించిన పుత్రులిద్దరూ ఆ మోదకం తమకే కావాలని పట్టుబట్టారు. అప్పుడు గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఎవరు తమ భక్తిని నిరూపిస్తారో వారికే మోదకం దక్కుతుందని చెప్పింది పార్వతీదేవి. తల్లి మాటను ఆలకించిన షణ్ముఖుడు తన మయూర వాహనం ఎక్కి వెనువెంటనే సమస్త తీర్థ క్షేత్రాలను దర్శించడానికి బయలుదేరాడు. వినాయకుడు మాత్రం “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అంటూ తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణలు చేసాడు. విఘ్ననాయకుని వినయాన్ని, విజ్ఞతను వీక్షించిన హిమాలయ తనయ ఆ దివ్య మోదకాన్ని మూషికవాహనుడికి అనుగ్రహించింది. ఆవిధంగా మోదకం వినాయకునికి అత్యంత ప్రియమైన భక్ష్యంగా మారింది. ఆనాటి నుండి పార్వతీతనయుడు మోదకప్రియునిగా త్రిలోకఖ్యాతిని పొందాడు.

సంస్కృతంలో మోద అంటే అత్యంత ఉన్నతమైన సంతోషమని అర్థం. ఆవిధంగా మోదక అంటే సంతోషాన్ని కలిగించేదని అర్థం. జీవులకు నిజమైన సంతోషాన్ని కలిగించేది జ్ఞానం మాత్రమే అని సకల శాస్త్రాలు చాటుతున్నాయి. మోదకం పైనుండే పొరలు పంచభూతాలను సూచిస్తాయి. ఆ లోపల ఉండే మెత్తటి, తియ్యటి పూర్ణం భాగం ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనం. ఈవిధంగా మోదకం ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే మోక్షదాయకమైన వేదాంత జ్ఞానాన్ని సాధించే సూక్ష్మాన్ని బోధిస్తుంది. ముక్తిహేతువైన జ్ఞానదాయకునిగా కీర్తిని పొందిన గణపతి ’మోదక హస్తు’నిగా, ’మోదక ప్రియుని’గా సాక్షాత్కరిస్తూ భక్తుల తాపత్రయాలను తొలగించి, జ్ఞానప్రాప్తిని అందిస్తున్నాడు.

సమర్పణ

నటరాజ నాట్యానికి వాద్య సహకారాన్ని అందించే నృత్య గణపతిని, వేదవ్యాసుని భారతరచనకు సహకరించిన విద్యా గణపతిని, గోకర్ణక్షేత్రంలో శివుని ఆత్మలింగాన్ని స్థాపించిన విజయ గణపతిని – ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి తత్వచింతన ద్వారా తృప్తి పరచి, మానసిక, వాచిక, కాయికాలనే మూడు విధాలైన పూజలను అర్పించాం. శ్రీకృష్ణ – రుక్మిణీదేవి దంపతులకు ’చారుదేష్ణ’ అన్న పేరుతో ద్వాపరయుగంలో జన్మించిన మహాగణపతి, శ్రీవేంకట కృష్ణుని సేవకులమైన మనందరిని సంపూర్ణంగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం.

@@@@@

ఆధారాలు:

1. “సిద్ధి వినాయక” – దాస సాహిత్య ప్రాజెక్్ట, తితిదే ప్రచురణ.

2. నేను విన్న, చదివిన ప్రవచనాలు, పుస్తకాలు.

5 thoughts on “గణపతి తత్వం

  1. మాండూక్య ఉపనిషత్ లో వైశ్వానర వివరణ:జీవుని జాగృతి అవస్థలో బహిర్ముఖంగా ఉంటాడు. అందుకని జీవునికి వ్యష్టి (As one unit) లో బహిష్ ప్రజ్ఞ  అని పేరు.  అదే సమిష్టి (As a combined force of all వ్యష్టిs) కి వైశ్వానర అని పేరు. అంటే జాగృతి అవస్థలో జీవుని కర్మలకు శక్తి ప్రదానం చేసేది వైశ్వానరుడు అన్నమాట. 
    అలాగే స్వప్న అవస్థలో జీవుని అంత: ప్రజ్ఞ  అంటారు.  సమిష్టి ని తైజసాత్మ అంటారు.  సుషుప్తి లో జీవుని ప్రజ్ఞాన ఘన  అని సమిష్టి ని ఈశ్వర అంటారు.  తురీయావస్థ (దానిని అవస్థ అనడం సబబు కాదు) లో వ్యష్టి-సమిష్టి అవకాశం లేదు. దానినే బ్రహ్మన్ లేక పరమాత్మ అంటారు.  దీనిలో గణపతి ప్రస్తావన ఎలా వచ్చిందో ఆ బ్రహ్మన్/పరమాత్మ కే ఎరుక 

  2. ఆర్యా! మీ జ్ఞానవర్థకమైన ఈ వ్యాసంద్వారా నిజమైన మోదకమనెడి ఆధ్యాత్మికజ్ఞానామృతాన్ని అందించినదందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు🙏

  3. గణపతిని గురించిన ఎన్నో.. గొప్ప విషయాలను క్రోడీకరించి…తెలిపిన వ్యాసకర్త కు ధన్యవాదాలు..👏👏👏👏 గణేశ చతుర్థి శుభాకాంక్షలు..🌸🌸🌸🌸🌸🌸

Your views are valuable to us!

%d bloggers like this: