[2016లో వచ్చిన కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రసారం చేసిన “కృష్ణానదీ తీరంలోని పుణ్య క్షేత్రాలు” అన్న ప్రత్యేక కార్యక్రమానికి నేను వ్రాసిన స్క్రిప్ట్]
ఉపోద్ఘాతం
శుక్ల యజుర్వేదంకు చెందిన నిరాలంబ ఉపనిషత్ ప్రకృతి తత్వాన్ని విశదంగా వివరించింది.
“అగ్ని, నీరు, ఆకాశం, తేజస్సు, వాయువులనే పంచభూతలతో కూడినదే ప్రకృతి. ఈ పంచభూతాలు పరబ్రహ్మ ప్రతిరూపాలు. అద్వితీయుడైన ఆ పరబ్రహ్మ తాను సృష్టించిన ఆకాశం, గాలి, నీరు మొదలైన ప్రకృతి శక్తులలో తానే ఇమిడివున్నా”డని నిరాలంబ ఉపనిషత్ స్పష్టం చేస్తోంది.
“అఘోరమ్ సలిలమ్ చంద్ర గౌరీ వేద ద్వితీయకమ్” అని కృష్ణ యజుర్వేదమ్‍కు చెందిన పంచబ్రహ్మోపనిషత్ చెబుతోంది. శివుని పంచరూపాలలో ఒకటైన అఘోర రూపం నుండి నీరు పుట్టిందని ఈ ఉపనిషత్ మంత్రానికి అర్థం. అదేవిధంగా, “ఆదిత్యాత్ ఆపో జాయంతే” అని సూర్యోపనిషత్, సూర్యుని వల్లనే నీరు పుడుతోందని చెబుతోంది.
వేదం “ఆపో వై సర్వే దేవాః” అని అంటూ వివరిస్తోంది. పంచభూతాలలో ఒకటి, మొదటిదీ అయిన నీటిలోనే దేవతలందరూ నివసిస్తున్నారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా జలతత్వం గొప్పదనాన్ని చాటి చెప్పారు. పార్వతీపతియైన ఈశ్వరుడు గంగను తలపై ధరించాడు. సరస్వతీపతియైన చతుర్ముఖ బ్రహ్మ నీటిలో పుట్టిన తామర నుండి జన్మించాడు. లక్ష్మీపతి ఐన మహావిష్ణువు సముద్రాన్నే ఇల్లుగా చేసుకొన్నాడు.
ఇలా, సృష్టి జరిగిన నాటి నుండీ, జలతత్వం, వర్షమై జాల్వారుతూ, తళతళా మెరుస్తూ, గలగలా పారుతూ, సముద్రంలోకి చేరుతూ అలా…అలా…అనంతకాలం నుండి ఆగకుండా సాగిపోతూనే ఉంది!
*****
అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదతో అలరారుతున్న మహోత్కృష్ట భారతదేశంలో అపూర్వమైన సహజ సంపదలు ఎన్నెన్నో ఉన్నాయి. తూర్పు దిక్కున బంగాళాఖాతం / దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా సముద్రాలను కలిగిన భారతదేశం ప్రపంచంలో విస్తారమైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగిన అతి కొద్ది దేశాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది.
మూడు వైపులా సముద్రాలను కలిగిన భారతదేశంలో నాలుగు చెరగులా మహోన్నతమైన పర్వతాలు ఉన్నాయి.
ఈ పర్వతశ్రేణుల నడుమ విస్తారమైన మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఈ మైదానాలలో దట్టమైన అరణ్యాలు విస్తరించివున్నాయి.
ఈ సముద్రాలు, గిరులు, అరణ్యాలు ఎన్నెన్నో సహజ సంపదలతో, వనరులతో, ఖనిజాలతో విలసిల్లుతున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ దేశం నిండుగా ప్రవహిస్తున్న నదులు ఒక ఎత్తు.
*****
భారతదేశ నదులు
భారతదేశంలో ప్రవహిస్తున్న నదులను హిమాలయ నదీ వ్యవస్థగాను, ద్వీపకల్ప నదీ వ్యవస్థగాను విభజించారు శాస్త్రవేత్తలు. ఉత్తరానవున్న హిమాలయాల నుండి పుట్టే గంగా, బ్రహ్మపుత్ర మొదలైన నదులను హిమాలయ నదులుగా పేర్కొంటారు. ఇతర ప్రాంతాలలోని పర్వతాలు, పీఠభూముల నుండి పుట్టే గోదావరీ, కృష్ణా, కావేరీ వంటి నదులను ద్వీపకల్ప నదులుగా పిలుస్తారు.
వ్యవసాయం, సుగంధ ద్రవ్యాల సాగుబడి, అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రధాన వృత్తులుగా మసలిన మన దేశంలోని ఈ నదులు దేశ ఆర్థిక వ్యవస్థకు మానవుల జీవనానికి ప్రాచీనకాలం నుండి ముఖ్యమైన ఆధారాలుగా నిలచివున్నాయి.
ప్రకృతిని ప్రేమించిన మన పూర్వీకులు, గంగా, గోదావరీ, కృష్ణా వంటి జీవనదులను ప్రాణం లేని నీటి పాయలుగా కాక జలరూపంలో ప్రవహిస్తున్న తల్లి ప్రేమగా భావించారు. ఈవిధంగా భారతీయులకు, ఈ నదులకు తల్లి-బిడ్డల అనుబంధం ఉంది. ఈ అపురూపమైన అనుబంధం వల్లనే జీవనదులను కన్నతల్లుల్లా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం!
నదులంటే తల్లులు అనే పవిత్ర భావం రైతులకే కాదు మహానుభావులైన గురుదేవులకు కూడా కలిగింది. వైదిక మత పునరుద్ధరణకర్తలైన శంకర భగవత్పాదుల వారు “గంగాష్టకం” అన్న స్తోత్రాన్ని రచించి గంగానదిని అత్యంత గౌరవభావంతో అర్చించారు.
పదహైదు-పదిహేడు శతాబ్దాల మధ్య కర్నాటక ప్రాంతంలో జీవించిన శ్రీ వాదిరాజ తీర్థుల వారు తమ 120 ఏండ్ల పరిపూర్ణ జీవితంలో భారతదేశమంతా ఆరుసార్లు పర్యటించి “తీర్థప్రబంధం” అనే ఉద్గ్రంథాన్ని రచించారు. ఈ అద్భుత గ్రంథంలో గంగానది వంటి ప్రపంచ ప్రఖ్యాత నదితో బాటు పయస్విని వంటి అజ్ఞాత నదులను సైతం వర్ణించారు.
అమరకవి, అద్భుత నాటకకర్త ఐన మహాకవి కాళిదాసు, ఆదికవి, రామాయణ కావ్యకర్త ఐన వాల్మీకి మహర్షి మొదలైన మహానుభావులు సైతం తమ కావ్యాలలోను, నాటకాలలోను నదీమతల్లుల్ని అనేక విధాలుగా ప్రస్తుతి చేసారు. తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు “దేవదేవునికి నీ తెప్పల కోనేరమ్మా – వేవేల మొక్కులు -లోకపావనీ – నీకమ్మా!” అంటూ స్వామిపుష్కరిణీ తీర్థజలాలను ప్రస్తుతి చేసాడు.
ఈవిధంగా భారతీయుల సాహిత్యంలోను, కళలలోను, సంస్కృతిలోను చివరకు వారి నిత్యజీవితంలోను నదులు విడదీయలేని భాగమయ్యాయి.
నదీ జలాలు ఆకలిగొన్న కడుపులకు ఆహారాన్ని అందించాయి. నదీ తీరాలు నాగరికతకు నివాసాలయ్యాయి. నదుల గలగలలు, మానవులకు సంగీతాన్ని నేర్పాయి. వాటి వంపు, సొంపులు నాట్యాన్ని నేర్పాయి. నదుల నీటిలో ప్రతిఫలించే సూర్య కిరణాలు, చంద్రుని వెలుగు రేఖలు చిత్రకళకు నాందీ గీతాన్ని పాడాయి.
మానవ జీవనానికి ఆ భగవంతుడు ఇచ్చిన అనుపదులు ఈ నదులు!
“తాన్యేన పుణ్యక్షేత్రాణి యత్ర కృష్ణా వహిష్యతి” అన్న శ్లాఘనీయమైన దివ్యచరిత్ర కలిగిన పుణ్యనది – కృష్ణానది.
“శ్రీకృష్ణవేణీ ప్లవనాయ భూమౌ – వాంఛంతి దేవాః ఖలు మర్త్య జన్మ” – ఏ నదిలో స్నానం చేయడానికై దేవతలు సైతం మానవులుగా జన్మించడానికి ఇష్టపడతారో ఆ మహనీయ గుణార్ణవ జలరాశియే – మన కృష్ణవేణి.
రండి! ఈ మహానదీమతల్లిని స్మరిద్దాం! కొనియాడుదాం!
“నమామి కృష్ణవేణీమ్ / తరంగిణీమ్”
*****
కృష్ణా నది
నేటి మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగమైన మహాబలాద్రిపై సముద్రమట్టానికి 470 అడుగుల ఎత్తులో గల పర్వత శిఖరంపై కృష్ణమ్మ జన్మిస్తోంది. ఇక్కడి నుండి ముందుకు ప్రవహిస్తూ సుమారు 1400 కిలోమీటర్ల దూరాన్ని దాటి, ఈ గమనంలో ఎన్నెన్నో మజిలీలను, మహత్తర క్షేత్రాలను, చారిత్రిక ప్రాంతాలను స్పృశిస్తూ కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలను దాటుకుని, ఆంధ్రప్రదేశ్‍లో ప్రవేశించి, చివరగా…హంసలదీవి వద్ద…సాగరుణ్ణి చేరుతుంది. గోదావరిలానే, పశ్చిమ కనుమల్లో పుట్టి, తూర్పు సముద్రంలో కలిసే అపురూపమైన నది ఈ కృష్ణానది.
ఈ మహానది మన దేశంలోని గంగా, గోదావరీ, బ్రహ్మపుత్ర నదుల తరువాత ప్రవహించే నాల్గవ పెద్దనది. దీని పరీవాహక ప్రాంతం సుమారు 2,58,948 చదరపు కిలోమీటర్లు. సుమారు 1,400 కిలోమీటర్లు ప్రవహిస్తూ, 14 నదులను తనలో కలుపుకుంటూ, ఎన్నెన్నో పిల్లవాగులను లీనం చేసుకుంటూ, చెరువుల్ని నింపుతూ ప్రయాణించి వచ్చే కృష్ణమ్మకు శాంతం ఎక్కువేనని చెబుతారు. “శాంత వాహతే కృష్ణామాయి” అని అంటూ ప్రతి ఒక్కరూ కృష్ణమ్మలా శాంతగుణాన్ని కలిగివుండాలనే నానుడి మహారాష్ట్రలో వాడుకలో ఉంది. నాలుగు రాష్ట్రల గుండా పయనించే ఈ నదిపై పన్నెండు భారీ ఆనకట్టలతో బాటు సుమారు 40 ఆనకట్టలు ఉన్నాయి. ఈ నదిపై నిర్మించిన 13 జలవిద్యుచ్ఛక్తి కేంద్రాల నుండి కొన్ని వందల మిలియన్ వాట్స్ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతోంది.
కృష్ణా బేసిన్, సహజవాయు నిక్షేపాలకు, చమురు నిల్వలకు పెట్టింది పేరు. ఇవే కాకుండా బంగారం, డోలమైట్, యురేనియమ్ వంటి ఖనిజాలకు నిలయం ఈ నదీగర్భం.
ఈ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఒక్క సాంకేతిక, భౌగోళిక, ప్రకృతి సంపదలకు, ఖనిజ నిల్వలకే పరిమితం కాదు. ఈ తీరం పొడవునా భవ్య నాగరికతా వికాసానికి, అద్వితీయ కళావైభవానికి, అలౌకిక సంగీత, సాహిత్య సంపదకు, ఎన్నెన్నో మహత్తర చారిత్రిక ఘట్టాలకు, జీవన గమనాన్ని ఊహించని మలుపులు తిప్పిన సాంఘిక, రాజకీయ, సామాజిక మార్పులకు వేదికగా నిలచింది. మరీ ముఖ్యంగా ఐహిక ఫలాలను, ఆముష్మిక సాధనను అందించే దివ్య నిలయాలు, శక్తి చైతన్య వలయాలు, ఆత్మోన్నతికి ఆలవాలాలైన ఆలయాల ఆటపట్లు ఈ నది గట్లు!
రండి…ఆ కృష్ణమ్మ గమనాన్ని అనుసరిస్తూ మనమూ పుణ్యక్షేత్ర వీక్షణ చేద్దాం!
*****
పంచగంగా క్షేత్రం
పంచగంగా క్షేత్రం…కృష్ణానదీ ఆవిర్భావ స్థలం…
మహావిష్ణువు కృష్ణగా, బ్రహ్మదేవుడు వేణిగా, శివుడు కుముద్వతి లేక కొయినాగా ప్రవహిస్తున్న దివ్యక్షేత్రం ఇది. ఇక్కడే బ్రహ్మ పత్నులయిన సావిత్రి, గాయత్రిలు కూడా జలధారలుగా ప్రవహిస్తున్న మహత్తర క్షేత్రం…ఈ పంచగంగ!
ఈ ఐదు జలధారలు, జడలోని పాయలుగా, ప్రవహించే దృశ్యం…అనుపమానం…అసమానం!
ఇక్కడి ఆలయాన్ని దేవగిరి యాదవ రాజైన రాజా సింగదేవుడు 13వ శతాబ్దంలో నిర్మించాడు. ఆలయంలో, కృష్ణమ్మ పయనం నిర్విఘ్నంగా సాగడానికా అన్నట్టు విఘ్నేశుడు నెలకొనివున్నాడు.
కృష్ణమ్మ తన ప్రియవాహిని అని తెలియజేయడానికి కృష్ణానదీ జనకుడు, గీతాచార్యుడు, యోగీశ్వరేశ్వరుడూ అయిన శ్రీకృష్ణడు ఇక్కడే కొలువైవున్నాడు.
ఈ పవిత్ర పంచగంగ దర్శనం సకల పాపహరణం!
*****
మహాబలాద్రి పర్వతం
పూర్వం ఈ మహాబలాద్రి పర్వతం బ్రహ్మదేవుని యజ్ఞవాటిక. ఇక్కడ జరిగిన ఒక యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న అతిబలుడు, మహాబలుడనే ఇద్దరు రాక్షసులను విష్ణువు సంహరించాడు. శివభక్తులయిన ఆ రాక్షసుల కోరిక మేరకు, కైలాసవాసుడు ఇక్కడ అతిబలేశ్వరుడు, మహాబలేశ్వరుడు అన్న పేర్లతో ఇక్కడ వెలిసాడు.
పరమశివుడు రుద్రాక్ష రూపంలో స్వయంభు జ్యోతిర్లింగ లింగంగా సాక్షాత్కరించే దివ్యస్థలం – మహాబలేశ్వరుని ఆలయం!
*****
మహాబలేశ్వర్ నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో వెలసిన మహిమాన్విత శైవ, వైష్ణవ మూర్తిద్వయ క్షేత్రం – మాహులి. విష్ణు సన్నిధానం కలిగిన కృష్ణానదీ తీరంలోనే శివుడు “విశ్వేశ్వరు”నిగాను, “సంగమేశ్వరు”నిగానూ కొలువైవుండడం వల్ల ఈ క్షేత్రం “హరిహర క్షేత్రం” అని కూడా విఖ్యాతమయింది.
విశ్వేశ్వరుడు నెలకొనివున్న స్థలాన్ని సంగం మాహులిగాను, సంగమేశ్వరుడు కొలువైన స్థలాన్ని “శ్రీక్షేత్ర మాహులి”గాను నామాంకితాల్ని పొందాయి.
విష్ణుస్వరూపమయిన కృష్ణానది, బ్రహ్మస్వరూపమయిన వెణ్ణా నది ఈ ప్రాంతంలోనే సంగమిస్తున్నాయి. కనుకనే, ఈ సంగమ క్షేత్రం తీర్థస్నానాలకు, తీర్థవిధులకు, జప-తపాలకు ప్రసిద్ధమయింది. ఇక్కడి కృష్ణానది ఇరు తీరాలలోనూ ప్రాచీన మండపాలను…మందిరాలను…ఆలయాలనూ చూడవచ్చు.
శ్రీ సంగమేశ్వరస్వామి మందిరం, శ్రీక్షేత్ర మాహులి
ఇందులో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి వారి భవ్యలింగం వెలుగులీనుతూ భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుండ్ర భూషితుడైన త్రినేత్రుడు సాకార శివలింగరూపంలో ఇక్కడ సాక్షాత్కరిస్తాడు. “ఇంద్రాది దేవ గణ వందిత పాదపద్మమ్” అంటూ కవి గాయక భక్త మునిగణాలచే వంద్యుడైన పరమశివుణ్ణి సంగమేశ్వరునిగా ఇక్కడ భక్తుల పూజలను అందుకుంటున్నాడు. సంగం మాహులిలోని విశ్వేశ్వర మందిరంలో వెలసిన శివుడు సాక్షాత్తూ ’కాశీ విశ్వేశ్వరు’డే అని ప్రసిద్ధుడు. ఈ కారణం వల్లనే సంగం మాహులి – “దక్షిణ కాశీ” అన్న విశిష్టతకు పాత్రమయినది.
ఈ సంగమ స్థలం వద్ద వెలసిన ముఖ్యమైన మందిరం “కృష్ణా మాత మందిరం.” ఈ మందిరాన్ని “కృష్ణా మాయి మందిర్” అని కూడా పిలుస్తారు. ముఖమండపం, అంతరాళం, గర్భగుడులతో కూడిన ఈ ఆలయం నయనమనోహరంగా దర్శనమిస్తుంది.
ఈ మందిరంలో కృష్ణవేణీ నదీమతల్లి ఓ సురుచిర, శుభ్ర, సుందర విగ్రహరూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.
“కృష్ణే / కృష్ణాంగసంభూతే / జంతూనాం పాపహారిణి / నమస్తే సలిలశ్రేష్ఠే / గృహాణర్ఘ్యమ్ నమోస్తు తే” – అంటూ శ్రీకృష్ణుని పాదం నుండి ఆవిర్భవించిన కృష్ణానదికి ఎవరైతే సభక్తికంగా అర్ఘ్యాన్ని అర్పిస్తారో వారు సాక్షాత్తు కృష్ణభగవానుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కారణం వల్లనే శ్రీ క్షేత్ర మాహులిలోని కృష్ణా మాత మందిరాన్ని తప్పక దర్శించాలని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడి నుండి కదలి ముందుకు సాగే కృష్ణమ్మ చేరుకునే తదుపరి మజిలీ….నృసింహ క్షేత్రమయిన “కరాడ్” ప్రాంతం.
*****
ప్రీతి సంగమం – జ్వాలా నరసింహస్వామి
క్షేత్ర మాహులి నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలోను, సతారా జిల్లాలో ప్రముఖ పట్టణమైన కరాడ్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో “ప్రీతి సంగమం” అనే పవిత్ర నదీసంగమ స్థలం ఉంది.
సంగం మాహులి వద్ద వెణ్ణా నదిని తనలో కలుపుకుని, మహాప్రవాహపూరమైన కృష్ణానది ఇప్పుడు, ఇక్కడ, ఈ ప్రాంతం వద్ద కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. ఈ కోయినా నది కృష్ణా నదితో బాటు మహాబలేశ్వర పర్వతంలో పుడుతుంది. అక్కడి నుండి సుమారు వంద కిలోమీటర్లు విడిగా ప్రవహించి, ఈ ప్రాంతంలో కృష్ణానదిలో లీనమవుతుంది. ఇతర నదుల్లా కాకుండా నేరుగా, ముఖానికి ముఖాన్ని తాకించిన రీతిగా కోయినా నది కృష్ణలో కలుస్తుంది. కనుక ఈ సంగమ స్థలాన్ని “ప్రీతి సంగమ్” అని స్థానికులు పిలుస్తారు. నదుల కంటే నదీ సంగమ స్థలాలు అత్యంత పవిత్రమైనవని, అనంత పుణ్యప్రదాయకాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి. కనుక, ఈ సంగమ స్థలంలో చేసే స్నానం అత్యంత పవిత్రమైనది.
కృష్ణా – కొయినా నదుల సంగమం నుండి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో నరసింహాపూర్ అన్న గ్రామంలో ’జ్వాలా నరసింహస్వామి’ వారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి, షోడశబాహు అనగా పదహారు చేతులతో దర్శనమిస్తాడు. ఈ మూర్తి పూర్తిగా సాలగ్రామ శిలామయం. ఇదే ఈ విగ్రహానికి గల విశేషం. ఈ షోడశబాహు నరసింహుడు ఇక్కడ వెలయడానికి ఓ ఐతిహ్యం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో, వేదవ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి తపస్సు చేస్తుండగా, ఆయన తపఃఫలితంగా ఈ నరసింహుడు ఆవిర్భవించాడు. నోటి నుండి అగ్నిశిఖలను వెదజల్లుతూ ప్రత్యక్షం కావడం వల్ల “జ్వాలా నరసింహు”నిగా పేరుపొందాడు. మానవమాత్రులు చూసి సహించలేని ఈ దివ్యవిగ్రహాన్ని పరాశరుడు కృష్ణా జలాల్లో మజ్జనం చేయడం ద్వారా శాంతపరిచాడు. ఈ ఆలయ చారిత్రిక విశేషాలకు వస్తే, రెండవ శతాబ్దంలో కుండినగిరి ప్రాంతాన్ని పాలించిన రాజా భీమదేవుడు తొలిసారిగా ఆలయాన్ని కట్టించాడు. అనంతరం దేవగిరి యాదవ రాజులలో ఒకడైన రాజా రామదేవ్ పదమూడో శతాబ్దంలో ఆలయాన్ని పునర్‍నిర్మించాడు.
*****
హరిపూర్
జ్వాలా నరసింహుడు వెలసిన నరసింహాపూర్ నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో నెలకొనివున్న పరమ పావన క్షేత్రం – హరిపూర్. ఈ గ్రామాన్ని 18వ శతాబ్దంలో సాంగ్లీ పాలకుడయిన గోవింద హరి పట్వర్ధన్ నిర్మించాడు. అతని పేరు మీదుగా ’హరిపూర్’ అని పిలువబడుతోంది. కృష్ణాతీరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు సంగమేశ్వర మహాదేవునిగా కొలువైవున్నాడు.
ఈ ప్రాంతం ప్రసిద్ధ శైవక్షేత్రమే కాదు పవిత్ర సంగమస్థలం కూడా! హరిపూర్ వద్ద కృష్ణానది, తన ఉపనది అయిన గాయత్రీ నదితో సంగమిస్తుంది. గాయత్రీనదిని “వరణా” అన్న మరో పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడి సంగమేశ్వరాలయం ప్రాచీనమైనది. ఆధునిక ఆలయ నిర్మాణ శైలిని అనుకరిస్తూ నిర్మించిన ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో, నిటారుగా నిలబడిన దీపస్థంభం ఆ పరమశివుని జ్వాలాలింగ స్వరూపాన్ని గుర్తుకు తెస్తుంది. ఆలయం లోపల, అలనాటి హేమాడ్‍పంథి నిర్మాణశైలికి చెందిన నాలుగు స్థంభాలు మర్చిపోలేని పురాస్మృతులుగా భక్తులను పలకరిస్తాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు త్రిగుణాత్మక లింగరూపంలో సాక్షాత్కరిస్తాడు. “రక్షోగణ క్షపణ/ దక్ష మహాత్రిశూలం” అన్న శాస్త్రవచనానికి నిర్వచనంలా త్రిశూలధారి అయిన శూలి విగ్రహం గర్భాలయంలో ఠీవిగా నిలుచునివుంటుంది.
ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. గర్భాలయం పైభాగంలో ఓ గవాక్షం ఉంది. సూర్యుని కిరణాలు ఈ గవాక్షం గుండా వచ్చి లింగంపై ప్రతిఫలిస్తాయి. వైశిష్ట్యపూర్ణమయిన ఈ ఆలయాన్ని దర్శించడానికి నిత్యం ఎందరో భక్తులు వస్తూవుంటారు.
*****
నరసోబావాడి
పావన కృష్ణానది, హరిపూర్ నుండి ముందుకు సాగి, 70 కిలోమీటర్ల దూరంలో గల “నరసోబావాడి” క్షేత్రం వద్ద మరో ఉపనది అయిన పంచగంగా లేక సావిత్రీ నదిని తనలో కలుపుకుంటుంది.
ఈ ప్రాంతానికి “నరసోబావాడి” అని పేరు రావడానికి కారణం శ్రీ నరసింహ సరస్వతివారి సన్నిధి ఇక్కడ ఉండడం వల్ల. శ్రీ నరసింహ సరస్వతివారిని భగవాన్ దత్తాత్రేయుని రెండో అవతారంగా భావిస్తారు. కృష్ణానదీ తీరాన్ని ఆనుకుని, సంగమస్థలానికి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో కొలువైవున్న దత్తమందిరంలో దత్తాత్రేయుని దివ్యచరణ పాదుకలు నిత్య పూజలను అందుకొంటున్నాయి.
*****
మాయక్క మందిరం, చించిలి
నరసోబావాడిలో దత్త పాదుకలను అభిషేకించిన కృష్ణమ్మ అక్కడితో మహారాష్ట్రా విహారాన్ని పూర్తి చేసి, కుడచి గ్రామం వద్ద కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
నరసోబావాడి నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో, కర్నాటకకు చెందిన బెల్గాం జిల్లాలోని చించిలి గ్రామంలో, కృష్ణాతీరంలో నెలకొన్న శక్తి క్షేత్రం – “మాయక్క మందిరం.”
ఈ చుట్టుపక్కల అనేక గ్రామల ప్రజలకు ఈ మాయక్కదేవి ఆరాధ్యదేవత.
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రదేశం ఈ మాయక్క నిజనివాసం. అయితే కీల, కిట్ట అనే ఇద్దరు దుష్టుల్ని వెంటాడుతూ మహారాష్ట్ర నుండి కర్నాటకకు వచ్చింది మాయక్క. ఈనాటి చించలి గ్రామం వద్ద ఆ దుష్టుల్ని సంహరించింది. ఆపై ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోదలచింది. అందుకుగాను, చించలి గ్రామ మూలదేవత అయిన హిరిదేవిని దర్శించి, స్థలాన్ని కోరింది. “మొదటి పూజ తనకు జరిగే విధంగా” షరత్తు విధించి, మాయక్కకు స్థలాన్ని ప్రసాదించింది హిరిదేవి.
ఆనాటి నుండి ఈనాటికీ హిరిదేవికి పూజ, నైవేద్యం జరిగిన తరువాతనే మాయక్కకు పూజాదికాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ శక్తిదేవత జాగృత దేవత అని, కోరిన కోర్కెలను తీరుస్తుందని ప్రతీతి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మవారి జాతర జరుగుతుంది. అప్పుడు లక్షలాది మంది భక్తులు కర్నాటక, మహారాష్ట్రల నుండి తరలివస్తారు. “ఛాంగ భలో, హోక భలో” అంటూ ఉచ్ఛస్వరంతో నినదిస్తారు.
*****
ఆల్మట్టి ఆనకట్ట
బెల్గాం జిల్లా, చించలి గ్రామంలోని మాయక్కదేవి మందిరం ప్రాంతం నుండి ముందుకు సాగే కృష్ణవేణి ప్రయాణంలో తరువాతి ముఖ్యమైన మజిలి – “ఆల్మట్టి ఆనకట్ట.” చించలి నుండి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో గల ఆల్మట్టి ఆనకట్ట ఈనాటి సాంకేతిక నైపుణ్యానికి ఓ గీటురాయి. 26 క్రెస్ట్ గేట్లతో, సుమారు 49 మీటర్ల ఎత్తు, 1564.83 మీటర్ల పొడవు కలిగిన ఈ డ్యామ్‍ను కృష్ణానదిపై నిర్మించారు.
*****
యలగూరు వీరాంజనేయస్వామి
ఆల్మట్టి డామ్ నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలసిన సుప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రం – యలగూరు. జిల్లా కేంద్రమయిన బాగల్‍కోట నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యలగూరులో, ఆంజనేయుడు, కృష్ణానదీ తీరంలో వెలసి, “వీరాంజనేయస్వామి”గా పూజలందుకొంటున్నాడు. నిజానికి స్వామివారి అసలు నామధేయం “ఏళు ఊరేశ.” కన్నడ భాషలో “ఏళు” అంటే ఏడు అని; “ఊరు” అంటే తెలుగు పదమైన “ఊరు”లాగనే నివాసప్రదేశమని అర్థం. ఈవిధంగా ఈ చుట్టుపట్ల గల ఏడు ఊళ్ళకు పాలకుడు యలగూరేశుడు.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో సీతా సమేతుడై సంచరించాడు. పావన కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ నది, శ్రీరాముని పూర్వీకుడయిన ముచికుందుని పేరుతో పిలువబడుతున్నదే! కనుకనే శ్రీరాముడు తన పూర్వీకునిపై గల ప్రీతితో ఈ కృష్ణా పరీవాహక ప్రాంతంలో నివసించాడు. “యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ – తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్” అంటూ ఎక్కడెక్కడ రఘురాముడు ఉంటాడో అక్కడక్కడే దాసాంజనేయుడూ ఉంటాడు. ఈ ఆర్యోక్తిని నిజం చేస్తూ శ్రీరామ పాదారవింద కందళిత హృదయారవింద అయిన కృష్ణానది తీరంలో, ఈ ఎలగూరు ప్రాంతంలో, కేసరీనందనడు, అరిభంజనుడై, గదాధారియై, అభయహస్తాముద్రితుడై, యలగూరేశుడై భక్తులను నేటికీ రక్షిస్తున్నాడు.
*****
కూడలసంగమ
శ్రీరామ పాద సేవాసక్తుడయిన ఆంజనేయుని పాదాంబుజాలను యలగూరు క్షేత్రంలో సేవించిన కృష్ణమ్మ తన తదుపరి మజిలిగా “కూడలసంగమ” క్షేత్రాన్ని చేరుతుంది.
యలగూరు నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో గల కూడలసంగమం – కృష్ణా, మలప్రభా నదుల సంగమ స్థలం. ఇక్కడ పార్వతీపతి “సంగమేశ్వరు”నిగా వెలసాడు.
బాదామి చాళుక్యల శిల్పశైలిని ప్రతిబింబించే భవ్యమైన ఆలయంలో సంగమేశ్వరుడు కొలువైవున్నాడు. సంగమ అంటే సంబంధాన్ని ఏర్పరిచేది అని అర్థం. రెండు నదులను కలిసే స్థలం, మానవులను, భగవంతునితో అనుసంధానించగలిగే దివ్యస్థలాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ కారణం చేతనే మనోతత్వానికి అధిదేవత అయిన శివుడు సంగమేశ్వరునిగా నదీ సంగమస్థలాల్లో కొలువైవుంటాడు. కూడలసంగమ దేవుడయిన సంగమేశ్వరుడు, దివ్యతేజోవిభాసితుడై భక్తులకు దర్శనమిస్తాడు.
ఈ కూడల సంగమం జగజ్జ్యోతి బసవేశ్వరుని కార్యస్థలం.
పన్నెండవ శతాబ్దంలో వీరశైవమతాన్ని స్థాపించి, ఆ మతవ్యాప్తికి కృషి చేసిన బసవేశ్వరుడు ఇక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. జాతవేదముని అనే గురువు వద్ద విద్యను అభ్యసించాడు. చివరకు ఇక్కడే శివైక్యం చెందాడు. బసవేశ్వరుడు లింగైక్యం చెందిన స్థలమే నేడు “ఐక్య మండపం” అని ఖ్యాతిని పొందింది.
కృష్ణానది, మలప్రభా నదుల సంగమ ప్రదేశానికి అత్యంత సమీపంలో ఈ ఐక్యమండపం ఉంది. నిత్యం ఎందరో భక్తులు ఈ మండపాన్ని దర్శిస్తూవుంటారు.
*****
కృష్ణా నది విశేషాలు
దక్షిణభారత జీవనదుల్లో రెండవ పెద్దనది – కృష్ణానది.
పౌరాణిక కథనం మేరకు, కృష్ణానది ఉత్పన్నం సహ్యాద్రి పర్వతంపై, విష్ణుస్వరూపమయిన అశ్వత్థ వృక్షం వేళ్ళనుండి జరిగింది.
బ్రహ్మదేవుడు కృత, త్రేత, ద్వాపరాలనే మూడు యుగాలు ముగిసిన తరువాత, కలియుగానికి సంబంధించిన సృష్టికార్యాన్ని ప్రారంభించాడు. దానికి ముందు, రాబోయే కలియుగంలో మానవుల పాపభారాన్ని తగ్గించే ఉపాయం గురించి ఆలోచించాడు. తనను సృజించిన మహావిష్ణువును ఆశ్రయించి, ప్రార్థించాడు. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు తనదే అయిన ఒక అంశంను నదిగా సృష్టించాడు. అదే – కృష్ణానది.
కలియుగ కల్మషాలను కడిగివేసి కృష్ణభగవానుని కృపావీక్షణాలను అందించే అక్షీణ వాహిని ఈ కృష్ణవేణి!
*****
గాణగాపురం
పాపహారిణీ, మోక్షకారణకారిణి అయిన కృష్ణానదికి ఎన్నో ఉపనదులు ఉన్నాయి. వాటిలో భీమానది ఒకటి.
పశ్చిమ కనుమల్లో వెలసిన భీమాశంకర క్షేత్రం, ఈ నదికి పుట్టినిల్లు.
త్రిపురాసురులను సంహరించిన శివుడు, పశ్చిమ కనుమల్లోని మహాదేవ్ పర్వతశ్రేణికి వచ్చి, అక్కడ తపస్సు చేస్తున్న భీమకుడనే రాజును అనుగ్రహించాడు. ఆ రాజు నదిగా మారాడు.
శివవరప్రసాద ఫలమైన భీమానది తన జన్మస్థలి నుండి మరో ఐదు నదులను కలుపుకుని, ముందుకు సాగి, కృష్ణానదితో కలవడానికి పూర్వం గాణగాపురాన్ని చేరుతుంది. ఇక్కడ అమరజా అన్న మరో నదిని తనలో లీనం చేసుకుంటుంది. ఈ అమరజా నది, గుల్బర్గా జిల్లాలోని కొరళ్ళి అన్న ప్రాంతంలో పుట్టి, సుమారు అరవై కిలోమీటర్లు ప్రవహించి, గాణగాపురం వద్ద భీమానదిలోకి వచ్చి చేరుతుంది.
ఈ గాణగాపురం సుప్రసిద్ధ దత్తక్షేత్రం. కర్నాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లాలో గల గాణగాపురం భీమా-అమరజా నదుల సంగమానికి వేదిక.
ఈ సంగమం వద్దనే దత్తావతారి అయిన నృసింహ సరస్వతి స్వామివారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. తదనంతరం, తన సన్నిధానానికి గుర్తుగా ’నిర్గుణ పాదుకల’ రూపంలో ఇక్కడే వెలిసారు.
పద్నాలుగు, పదిహేనవ శతాబ్దాల మధ్య జీవించిన నృసింహ సరస్వతి వారు ఈ గాణగాపురంలోనే కొలువైవుంటానని భక్తులకు అభయప్రదానం చేసారని శ్రీగురుచరిత్ర చెబుతోంది.
“వసతి సంగమసే జాతే – నిత్య భిక్షసే తయావరే – గాణగాపురసే మధ్యాహ్న కాలే” అన్న గురుచరిత్ర వచనం ఇందుకు సాక్షిగా నిలుస్తుంది.
ఈనాటికీ నృసింహ సరస్వతి స్వామివారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏదో ఒక రూపంలో వచ్చి భక్తుల నుండి భిక్షను స్వీకరిస్తారని చెబుతారు. ఎందరో భక్తులు, నిర్గుణ పాదుకల సన్నిధానంలో ధ్యానమగ్నులై గురుదత్తుని స్మరణలో లీనమై, ఆధ్యాత్మికానంద పరవశులవుతుంటారు.
*****
“సాక్షాత్ కల్పలతాం” అని స్కాందపురాణం ప్రస్తుతించిన అనల్ప జలరాశి శ్రీ కృష్ణవేణి. సుందర వదనారవింద అయిన కృష్ణా నదీమతల్లి తాను జలరూపంలో ప్రవహించినంత మేరా సుజలాం, సుఫలాం, మలయజశీతలం కావిస్తోంది.
*****
దేవసూగూరు
గాణగాపురంలో దత్త భగవానుని నిర్గుణ పాదుకలకు జలాభిషేకాన్ని నెరపిన భీమానది, అక్కడి నుండి సుమారు రెండు వందల కిలోమీటర్లు ప్రవహించి వచ్చి, రాయాచూర్ జిల్లాలోని, దేవసూగూరు పట్టణం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది.
జిల్లాకేంద్రమయిన రాయచూర్ పట్టణం నుండి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దేవసూగూరులో, సూగూరేశ్వర స్వామి నెలవైవున్నాడు.
సూగూరేశ్వర స్వామి ఓ వీరశైవ సిద్ధాంత ప్రచారకుడు. ఇతని స్వస్థలం నేటి కాశ్మీర్ ప్రాంతం. పన్నెండవ శతాబ్దంలో కాశ్మీరు నుండి పర్యటనను ప్రారంభించి, కర్నాటకను చేరాడు సూగూరేశ్వరుడు.
ఇతను ఇక్కడకు రావడానికి మొదలు, శక్తిస్వరూపిణి అయిన ’నాగర ఎల్లమ్మ’ శక్తిపీఠంగా ప్రసిద్ధి కెక్కింది.
సూగూరేశ్వరుడు ఈ ప్రాంతానికి రాగా, ఆ వీరశైవ గురువుకు తగిన స్థానంను కల్పించింది నాగర ఎల్లమ్మ. ఆనాటి నుండి ఈ ఊరు “దేవర సూగూరు”గా పేరును పొందింది. సూగూరేశ్వరుడు వీరభద్రుని అవతారంగా భక్తులు భావిస్తారు. సూగూరేశ్వర ఆలయంలో వీరభద్రుని రూపంలో వెలసిన సూగూరేశ్వరుడు శతాబ్దాలుగా భక్తుల పూజలనందుకొంటున్నాడు.
*****
“కలడంభోది గలండు గాలి కలడాకాశంబునమ్” అని భాగవతం చెబుతోంది. పరమాత్ముడు సర్వంతర్యామి. పంచభూతాలలో నీరు మొదటగా పుట్టింది. కనుకనే పోతనామాత్యుడు “కలడంబోధి”ని అని అంటూ పద్యాన్ని మొదలెట్టాడు. భారతదేశంలో విష్ణు సన్నిధానాన్ని కలిగిన పవిత్ర నదులలో మొదటిది గంగ, రెండవది గోదావరి, మూడవదే కృష్ణవేణి. “ఇందుగల డందు లేడని” సందేహం లేని సాధకులకు కృష్ణవేణీ నదీజలాలో కృష్ణభగవానుని రూపమే దర్శనమిస్తుంది.
*****
భీమా-కృష్ణా సంగమం
గాణగాపురం వద్ద అమరజా నదిని తనలో కలుపుకున్న భీమానది అక్కడి నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో గల సంగమ స్థలం వద్ద కృష్ణానదిలో లీనమవుతుంది.
జిల్లా కేంద్రమయిన రాయచూర్ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సంగమం ఉంది. ఈ సంగమ స్థలం వద్ద భీమా నది – కృష్ణానది కంటే విశాలంగా ప్రవహిస్తుంది.
ఇతర సంగమ స్థలాల్లో ఉన్నట్టుగానే కృష్ణా-భీమా సంగమం వద్ద కూడా పరమశివుడు సంగమేశ్వరునిగా కొలువైవున్నాడు. అత్యంత ప్రాచీనమైన ఈ లింగం భక్తి-ముక్తి భావాల సంగమంగా భాసిస్తూవుంటుంది.
ఇక్కడితో, కృష్ణానది తన కర్నాటక ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇక్కడి నుండి, కోటి రతనాల వీణ / తెలంగాణ వైపుకు బిరబిరా నడుస్తుంది!
*****
మహావిష్ణువు దేహం నుండి జన్మించిన కృష్ణానది “స్నాన మాత్రేణ సర్వేషామ్ తావత్ పుణ్య వివర్ధనమ్” అన్న ఖ్యాతిని పొందింది. ఎవరు ఈ పావన నదిలో స్నానం చేస్తారో వారికి పుణ్యరాశి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. “పుణతి శుభమ్ కరోతి ఇతి పుణ్యమ్” అన్న వ్యాఖ్యానం ప్రకారం అనేక శుభాలకు కలిగించే భగవంతుని అనుగ్రహానికి పుణ్యం అని పేరు. అటువంటి పుణ్యం కృష్ణానదిలో స్నానం చేయడం వల్లనే మానవులు పొందుతారు.
*****
కృష్ణా గ్రామం
రాయచూర్ వద్దగల సంగమేశ్వరంలో భీమానదిని తనలో లీనం చేసుకున్న కృష్ణమ్మ తెలుగు ప్రాంతాలలో అడుగుపెట్టే తొట్టతొలి ఊరు – “కృష్ణా గ్రామం.”
కర్నాటక రాష్ట్రంలోని జిల్లా కేంద్రమయిన రాయచూర్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరం కృష్ణా గ్రామం ఉంది. తెలంగాణా రాష్ట్రం, మహబూబ్‍నగర్ జిల్లాలోని ఈ గ్రామానికి ఓ ఆధ్యాత్మిక విశేషం ఉంది.
కృష్ణా-భీమా నదులు సంగమించే సంగమస్థలం తరువాత భీమానదీ సమేత కృష్ణమ్మ ఒకే జలప్రవాహంగా అడుగుపెట్టే తొలి ప్రాంతం ఈ కృష్ణా గ్రామం. ఈ కారణం చేత కృష్ణాగ్రామం వద్ద ఆచరించే నదీస్నానం సంగమస్థలంలో చేసే స్నానానికి సమానమని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా పుష్కరాల సందర్భంలో లక్షలాది భక్తులు ఈ గ్రామ సమీప ప్రాంతాలలో గల వివిధ స్నానఘాట్లలో పుష్కర స్నానాలను ఆచరిస్తారు.
కృష్ణాగ్రామంలో నారాయణుడు శ్రీ వేంకటేశ్వరస్వామి రూపంలో వెలసి, అర్చన, పూజనాదుల్ని స్వీకరిస్తున్నాడు. శ్రీనివాసుని అందమైన నిలువెత్తు ప్రతిమ గర్భాలయంలో కొలువుదీరింది. శ్రీనివాసుని ఆలయం ప్రక్కనే దత్తాత్రేయుని మందిరం నెలకొనివుంది. దత్తమందిరం సమీపంలో శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారు దివ్యలింగరూపంలో వెలసివున్నారు.
*****
బీచుపల్లి
కృష్ణాగ్రామం వద్ద తెలుగుసీమలోకి ప్రవేశించిన కృష్ణమ్మ, కలియుగప్రత్యక్షదైవమైన శ్రీనివాసుణ్ణి సేవించి, అక్కడి నుండి వడివడిగా ప్రవహిస్తూ, సుమారు 70 కిలోమీటర్ల ప్రయాణాన్ని సాగించి, రామసేవాసక్తుడయిన హనుమంతుడు వెలసిన బీచుపల్లి క్షేత్రాన్ని చేరుకుంటుంది.
తెలంగాణా రాష్ట్రం, మహబూబ్‍నగర్ జిల్లా, ఇటిక్యాల్ మండలంలో గల బీచుపల్లి గ్రామం, అనేక పౌరాణిక, చారిత్రక ఘట్టాలకు నెలవు.
ఈ క్షేత్రం, కణ్వ ఋషి తపోభూమిగా పురాణ ప్రాశస్త్యాన్ని కలిగివుంది.
పదహారవ శతాబ్దంలో ద్వైత వేదాంతానికి చెందిన శ్రీ వ్యాసరాయ తీర్థుల వారు ఇక్కడ, విశిష్టమయిన ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. అలనాటి విజయనగర సామ్రాజ్యాధినేత అయిన శ్రీకృష్ణదేవరాయలకు రాజగురువయిన శ్రీవ్యాసతీర్థుల వారు తమ పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడి కృష్ణానదిని కణ్వ ఋషి తపఃస్థలిని చూసి ఇక్కడ ఎనిమిది అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు.
మరుసటి రోజు స్వామి విగ్రహం వద్ద భక్తితో నిలబడివున్న “బీచన్న” అనే బోయ బాలుణ్ణి చూసి, అతనికే పూజాకైంకర్య భాగ్యాన్ని అనుగ్రహించారు వ్యాసతీర్థులు. నాటి నుండి ఈ క్షేత్రం “బీచుపల్లి”గాను, స్వామివారు “బీచుపల్లి రాయడి”గాను ప్రసిద్ధిని పొందడం జరిగింది. ఇక్కడ కృష్ణానది దక్షిణవాహినిగా ప్రవహిస్తోంది.
*****
మహానది అయిన కృష్ణవేణీ నదీ నీటిని త్రాగడం, స్నానం చేయడం, ఆ నదిపై నుండి వీచే గాలిని పీల్చడం, ఇరు గట్లపై వెలసిన దేవాలయాలను దర్శించడం మహాపుణ్యప్రదాలైన కార్యాలని పురాణాలు చాటుతున్నాయి. ఈ నదీతీరాల్లో యజ్ఞాలు నిర్వహించడం, దానాలు చేయడం, పురాణ ప్రవచనాలు చేయడం, వినడం వంటి ధార్మిక కార్యక్రమాలు / ముక్తి సోపానాలు.
*****
శ్రీరంగనాథ ఆలయం
బీచుపల్లి వద్ద వ్యాసతీర్థ ప్రతిష్టిత వీరాంజనేయుని పాదపద్మాలను సేవించిన కృష్ణవేణమ్మ పరీవాహక ప్రాంతంలో, బీచుపల్లి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో వెలసిన మహాద్భుత ఆలయం – శ్రీరంగనాథ ఆలయం.
తెలంగాణా రాష్ట్రం, పెబ్బేరు మండలంలో, వనపర్తి పట్టణం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో వెలసింది శ్రీ రంగనాథాలయం.
రమణీయమైన ప్రకృతి నడుమ, కమనీయమైన శిల్పకళావైభవంతో, నిరుపమాన దేవాలయం.
రంగపుష్కరిణి ఒడ్డున, వనపర్తి సంస్థాన పాలకులు నిర్మించిన శ్రీరంగనాథ ఆలయం భారతీయ దేవాలయ నిర్మాణ కళకు, శిల్పకౌశలానికి, అమేయ ప్రతిభకు తార్కాణాలు. ఈ రంగపుష్కరిణిని, రంగసముద్రం అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణిలోని జలాలు, దివ్య కృష్ణవేణీ సన్నిధాన ప్రపూరితాలు. ఇక్కడ ఆచరించే స్నానం కృష్ణానదీ స్నానఫలాన్నే అందిస్తుంది.
*****
పావన కృష్ణానది ప్రవహించే పట్టణాలలోను, గ్రామాలలోను, పర్వత ప్రాంతాలలోను, అరణ్యాలలోను ఎక్కడ స్నానం చేసినా ’వాజపేయ యజ్ఞా’న్ని చేసిన ఫలం లభిస్తుందని స్కాందపురాణం చెబుతోంది. ఇందువల్లనే, కృష్ణానదిలో స్నానం చేయడానికై దేవతలు కూడా ఉత్సాహపడతారు. మానవులమైన మనం పుణ్యాన్ని సంపాదించడానికి, ఆ పుణ్య సంపాదనకు మూలమైన జ్ఞానాన్ని సంపాదించడానికి కృష్ణానది స్నానం చక్కటి మార్గం.
****
నివృత్తి సంగమం
శ్రీరంగనాథుడు కొలువైన శ్రీరంగాపురం నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో, కృష్ణాతీరంలో వెలసిన, అత్యద్భుత ప్రాచీన ఆలయ సముదాయం – శ్రీలలితా సమేత సోమేశ్వరాలయం.
ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో పదిహేను ఆలయాలు ఉన్నాయి. వీటిలో పన్నెండు ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలకు చెందినవే!
ఒకప్పుడు, ఈ ఆలయం, ఏడు నదుల సంగమక్షేత్రమయిన నివృత్తిసంగమంకు దగ్గరలోగల మంచ్యాలగడ్డ అన్న ప్రదేశంలో ఉండేది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో, ముంపుకు గురి అయ్యే అవకాశం ఉండడం వల్ల, సోమశిల గ్రామానికి తరలించడం జరిగింది. ఇక్కడ కృష్ణానది రెండు కనుమల నడుమ నుండి మహోద్ధృత గంగాప్రవాహ సంరభంతో పరవళ్ళు త్రొక్కుతుంది.
ఇక్కడే, కృష్ణానదికి ఆవలి గట్టున ఏడు నదుల సంగమస్థలమైన నివృత్తిసంగమం ఉంది.
భీమా, భవనాశిని, తుంగభద్ర, మలహారిణి మొదలైన నదులు కృష్ణానదిలో సంగమిస్తాయి.
ప్రస్తుతం ఈ క్షేత్రం కృష్ణానది ముంపుకు గురైంది. అయితే, ముంపుప్రాంతంలో ఉండిన సంగమేశ్వరుని ఆలయాన్ని ఒక ఎత్తైన ప్రాంతంలో పునర్న్మించారు.
నివృత్తి అంటే తొలగించడం అని అర్థం. సంగమం అంటే కలపడం అని అర్థం. నివృత్తి సంగమం అంటే పాపాలను తొలగించి పుణ్యాన్ని కలిగించే క్షేత్రమని అర్థం. ఇక్కడే కృష్ణమ్మ ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెడుతుంది.
*****
మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతంలో పుట్టి, ఆంధ్రప్రదేశ్‍లోని హంసలదీవి వద్ద సముద్రాన్ని చేరేంతవరకూ కృష్ణమ్మ ప్రవహించే ప్రతి అంగుళం పవిత్రం. జ్ఞాన, భక్తి, వైరాగ్య భాగ్యోదయకరం. మోక్షప్రదాయకం. కృష్ణానది పుట్టుక గాథను విన్నవారికి, విన్నవారి నుండి విన్నవారికి, నదీ స్నానం చేసినవారికి, ఆ నది ఒడ్డున పితృకార్యాలను నిర్వహించిన వారికి కలిబాధలు తొలగిపోతాయి. సద్బుద్ధి వృద్ధి చెందుతుంది.
*****
శ్రీశైలం
నివృత్తి సంగమం వద్ద సంగమేశ్వరుని సేవించిన కృష్ణమ్మ శివారాధనాపరురాలై, మరింత శివపూజను చేయాలన్న తలపుతో శివజటాజూటంలోని కురుల్లా, వంపులు తిరుగుతూ ప్రవహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలాన్ని చేరుతుంది.
పురాణాలలోను, శాసనాలలోను “శ్రీపర్వతం”గా పేర్కొనబడిన “శ్రీశైలం” దట్టమయిన నల్లమల అడవులలో, పవిత్ర పాతాళగంగ తీరంలో నెలకొనివున్న అద్వితీయ క్షేత్రం.
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి కొలువైవున్న ఈ మహిమాన్విత దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మూడవదిగాను, అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదైన భ్రామరీ పీఠంగా వినుతికెక్కింది.
భూగోళానికి నాభిస్థానంగా భావించే శ్రీశైలంలో, కృష్ణమ్మ ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ “పాతాళగంగ”గా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తులు మొదటగా ఈ కృష్ణాగంగమ్మను దర్శించి, పూజించి, పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ వరదాయిని అయిన శ్రీశైలం బహుళార్థసాధక ప్రాజెక్ట్ నెలకొనివుంది.
“కాశ్యాం తు మరణాన్ ముక్తిః స్మరణా దరుణా చలే దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే” – కాశీలో మరణించినా, అరుణాచలంలో శివుణ్ణి స్మరించినా, పునర్జన్మ ఉండదు. అయితే శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే చాలు జనన మరణ చక్రం నిలచిపోతుంది. కైవల్యం సిద్ధిస్తుంది.
*****
నాగార్జున సాగర్
సోమశిల నుండి ముందుకు సాగిన కృష్ణానది తన తదుపరి మజిలీ అయిన నాగార్జున సాగర్ ఆనకట్టను చేరుతుంది.
అంతవరకు, ఉరుకులు పరుగులతో సాగిన కృష్ణానది ఇక్కడ కొద్దిగా విశ్రాంతిని తీసుకుంటుంది.
సోమశిల నుండి సుమారు నాలుగు గంటల ప్రయాణ దూరాన్ని కలిగిన నాగార్జున సాగర్ ’ఆధునిక దేవాలయం’గా ఖ్యాతిని పొందింది. 1955లో ఆరంభమైన ఆనకట్ట నిర్మాణం 1967 వరకూ సాగింది.
490 అడుగుల ఎత్తుతో, 1.6 కిలోమీటర్ల పొడవుతో, 26 క్రెస్ట్ గేట్లతో ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా, ఠీవిగా నిలబడివుంటుంది ఈ నాగార్జునసాగర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట వ్యవసాయానికి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ముఖ్యమైన ఆధారంగా ఉంటూ జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.
*****
మాచెర్ల
నాగార్జునసాగర్ కు అత్యంత సమీపంలో గల అమోఘ వైష్ణవక్షేత్రం – చెన్నకేశవుడు కొలువైవున్న మాచెర్ల.
నేటి మధ్యప్రదేశ్ లోని జబల్‍పూర్ ప్రాంతం నుండి వలస వచ్చిన హైహయ వంశస్థులు పల్నాటిసీమలో రాజ్యాన్ని స్థాపించారు.
పన్నెండవ శతాబ్దం తొలినాళ్ళలో జరిగిన కారెంపూడి యుద్ధంలో జరిగిన నష్ట తరువాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వెళ్ళింది.
హైహయ వంశీకుడయిన నలగామరాజుకు మంత్రిగా ఉండి, తరువాత నాగమ్మ పన్నాగం వల్ల నలగామునికి దూరమయిన బ్రహ్మనాయుడు నేటి మాచెర్ల ఆలయాన్ని పునరుద్ధరించట్టు ఆధారాలున్నాయి.
శివుని పేర్లలో ఒకటైన మహాదేవ నామం పైన ఏర్పడిన మహాదేవి చెర్ల కాలక్రమంలో మాచెర్లగా స్థిరపడింది. నేటి చెన్నకేశవ ఆలయంలోని గిరీశ్వరస్వామివారి భవ్యలింగం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.
*****
మహాక్షేత్రాధి దేవతలు, మహానదులు, మహాత్ములు – మనల్ని ఉద్ధరించడానికే ఉద్భవిస్తారు. వీరి పవిత్ర స్పర్శతో రాజులు, పేదలు, సామాన్యులు పునీతులవుతారు. గర్భదారిద్ర్య బాధితుడూ, ఆగర్భ శ్రీమంతుడు అన్న తేడా లేక వారి వారి నిష్టకు, భక్తికి, అనుసంధాన బలానికే విలువనిస్తారు. ఆవిధంగా, కలియుగంలో కలిపురుషుని తాకిడికి తత్తరిల్లే భక్తుల కోసం ఐదు గంగలు ప్రవహిస్తున్నాయి. “కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః” అన్న విఖ్యాతిని పొంది ఐదు గంగలలో కృష్ణవేణి ఒకటి.
*****
వాడపల్లి
నాగార్జున సాగర్ లో విశ్రాంతిని తీసుకుని, మాచెర్ల చెన్నకేశవుణ్ణి సేవించిన కృష్ణమ్మ, ఉరకలు వేస్తూ చేరే తదుపరి మజిలీ – వాడపల్లి.
నాగార్జున సాగర్ నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలోను, మిర్యాలగూడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ వాడపల్లి క్షేత్రం ఉంది. కృష్ణానది ప్రధాన ప్రవాహం నుండి బయలుదేరిన ఓ పాయ, ఇక్కడ ప్రవహిస్తుంది.
ఈ నదీతీరంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మీనాక్షీ సహిత అగస్త్యేశ్వర స్వామి ఆలయం నెలవైవున్నాయి. వాడపల్లి ఓ సంగమ క్షేత్రం కూడా. ఇక్కడ మూసీగా పిలువబడే ముచికుందా నది కృష్ణలో లీనమవుతుంది. ఇది వ్యాసభగవానుని తపోస్థలిగా పురాణ ప్రసిద్ధిని పొందింది.
వాడపల్లిలో గల ప్రసిద్ధ శివాలయం – శ్రీ మీనాక్షీ సహిత అగస్త్యేశ్వరాలయం. పౌరాణిక కథనం ప్రకారం ఈ లింగాన్ని శివుడే స్వయంగా ప్రతిష్టించాడు.
అగస్త్య మహాఋషి తాను ఎల్లప్పుడూ పూజించే లింగాన్ని కుర్రవాడి రూపంలో ఉన్న శివునికి ఇచ్చి మూసీ-కృష్ణా సంగమంలో స్నానానికి వెళ్ళగా శివుడు నేలపై పెట్టేసాడని శివేచ్ఛగా సంభవించిన ఈ సంఘటనతో అగస్త్యుడు / ఈ లింగానికి పూజలు జరిపాడు. ఈ ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు.
*****
పానగల్
వాడపల్లి వద్ద కృష్ణానదిలో సంగమించే మూసీ నది అంటే ముచికుందా నది పరీవాహక ప్రాంతంలో, జిల్లకేంద్రమయిన నల్గొండ పట్టణం శివార్లలో వెలసిన అద్భుత శివాలయాల స్థలం – పానగల్.
కాకతీయుల కాలంలోను, అంతకు ముందు కాలంలోనూ మహావైభవంతో వెలసిన ఈ చారిత్రక నగరం నేడు ఓ సాధారణ పట్టణం. అయినా ఆనాటి వైభవానికి గుర్తులుగా మిగిలిన శ్రీ పచ్చల సోమేశ్వరాలయం, శ్రీ ఛాయా సోమేశ్వరాలు ఇక్కడ నెలకొనివున్నాయి.
పచ్చల సోమేశ్వర లింగంపై ఒకప్పుడు అపురూపమైన పచ్చలు ఉండేవి. కాలాంతరంలో పరమతస్థుల దాడిలో అవి దొంగిలించబడ్డాయి. మహావిరక్తశిఖామణి అయిన ఆదిమౌనీశ్వరునికి అలంకారాలాతో పనిలేదు. అందుకే పచ్చల సోమేశ్వరుడు నిశ్చల లింగ రూపంలో, భక్తవత్సలుడై ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు.
పానగల్లులో, కృష్ణా జలాల అంతర్వాహినిలతో పునీతమయిన ఉదయ సముద్రం తీరాన శ్రీ ఛాయా సోమేశ్వరుడు కొలువైవున్నాడు. రమ్యమైన ఆలయంలో, ఎప్పుడూ నీరు నిండివుండే గర్భాలయంలో, పార్వతీపతి కొలువైవున్నాడు. ఇక్కడి విశేషం ఒకటివుంది. గర్భాలయంలోని శివలింగంపై నిలువైన నీడ పగలంతా పడుతూనేవుంటుంది. ఈ నీడ ఎక్కడి నుండి పడుతోందో తెలియదు. ఈ నీడ వల్లనే ఈ స్వామిని “ఛాయా సోమేశ్వరుడు” అని పిలుస్తారు.
ఉదయం తూర్పున ఉండి, సాయంత్రానికి పడమరను చేరే సూర్యుడి స్థాన మార్పిడితో సంబంధం లేకుండా పొద్దున నుండి చీకటి పడేవరకూ ఈ నిశ్చలమైన నీడ అలా నిలబడేవుంటుంది. ఉదయసముద్రం చెరువులోకి రహస్యంగా వచ్చి చేరే కృష్ణమ్మ జలధారలానే, ఈ నీడ కూడా శివుడిని వీడకుండా సేవిస్తోంది. ఇదే ఛాయా సోమేశ్వరాలయంలో మనకు కనిపించే వింత!
*****
మట్టపల్లి
వాడపల్లి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో గల మరో పంచనారసింహ క్షేత్రం – మట్టపల్లి.
తెలంగాణా రాష్ట్రం, నల్గొండ జిల్లాలో వెలసిన మహాద్భుత లక్ష్మీనృసింహస్వామి ఆలయం ఇక్కడ కృష్ణాతీరంలో నెలకొనివుంది. పంచనారసింహ క్షేత్రాలయిన మట్టపల్లి ఒకటి.
ఇక్కడి కృష్ణాతీరం భరద్వాజ ఋషి తపోప్రాంతం. తంగెడ ప్రాంతపు పాలేగార్ అయిన అనుముల మాచిరెడ్డి అనే భక్తునికి కలలో కనిపించి తన ఉనికి తెలిపి ఆరె చెట్టు ఎదురుగా ఇప్పుడు ఆలయం ఉన్న గుహలో దర్శనమిచ్చాడు.
పద్మాసనస్థుడై, శంఖచక్రాలతో, రాజ్యలక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చే యోగానంద నృసింహుడు “అన్నాలయ్య”గా ప్రసిద్ధుడు. దక్షిణావృత శంఖం ఈ ఆలయంలో ఉండడం వల్ల, ఎవరు ఈ గుడిని దర్శిస్తారో వారికి అన్నానికి లోటు ఉండదు.
ఇక్కడ పదకొండు రోజుల పాటు / రోజుకు ముప్పైరెండు ప్రదక్షిణలతో స్వామిని సేవిస్తే రోగాలు ఉపశమిస్తాయి.
*****
వేదాద్రి
నల్గొండ జిల్లా నుండి కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించే స్థలంలో ఉన్న ఆదిక్షేత్రమే వేదాద్రి.
ఇది పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ, జ్వాలా నరసింహ, జల నరసింహ, ఉగ్ర నరసింహ అన్న రూపాలతో శ్రీహరి వెలసాడు.
ఇందులో జలనరసింహస్వామి కృష్ణానదీ గర్భంలో ఉన్నాడు కనుక మానవులకు కనబడడు. మిగిలిన నాలుగు మూర్తులనూ భక్తులు దర్శించవచ్చు.
మానవదేహంలోని సుషుమ్న నాడిలో నృసింహుడు కొలువైవుంటాడు. ఈ సుషుమ్న నాడి ప్రభావం వల్ల ధ్యానంలో ఏకాగ్రత కుదురుతుంది. కనుక ధ్యానసాధన చేసేవారు నృసింహస్వామిని సేవించాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి.
అటువంటి నరసింహుణ్ణి, వేదాద్రి క్షేత్రంలో కృష్ణమ్మ అనవరతం సేవిస్తుంది. ఆ పుణ్యజలాలో స్నానం చేసేవారికి సుషమ్ననాడీ స్థితుడయిన నరసింహుని దివ్యానుగ్రహం లభిస్తుంది.
*****
కృష్ణానదీ జలాలు ఒక పాయగా ప్రవహించినా, ఆ ప్రవాహ స్థలం పరమ పావనం. సకలదేవతలకూ నిలయం. ముక్తి దాయకం. నదీజలాల వల్ల శారీరిక ఆరోగ్యం లభిస్తుంది. నదీస్నానం వల్ల ఆత్మశ్రేయస్సు కలుగుతుంది. పవిత్రమైన ఆత్మను కలిగిన మానవులు మంచి పనులనే చేస్తూ, సమాజాన్ని బాగుపరుస్తారు. ఈవిధంగా నదులు మానవుల జీవితాలను శారీరకంగానూ, మానసికంగానూ ప్రభావితం చేస్తున్నాయి.
*****
మేళ్ళచెరువు శంభులింగేశ్వరాలయం
మట్టపల్లి వద్ద లక్ష్మీ నరసింహుని దివ్యచరణాలను సేవించిన కృష్ణమ్మ, ఒక కాల్వ రూపంలో మారి, కొలిచే స్వామి – శ్రీ స్వయంభు శంభులింగేశ్వరుడు.
నల్గొండ జిల్లాలోని ప్రముఖ శివాలయాలలో ఒకటైన మేళ్ళచెరువు శంభులింగేశ్వరాలయం అత్యంత ప్రాచీనమైనది.
కాకతీయుల కాలంలో భవ్యమైన శిల్పసౌందర్యంతో అలరారింది. కానీ నేడు ఆ సౌందర్యం కనుమరుగయింది. కానీ శంభులింగేశ్వరుడు మాత్రం కాలాతీతుడై, దినదినప్రవర్ధమానుడవుతూ, భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఒకప్పుడు చిన్నదిగా ఉన్న ఈ లింగం నేడు ఆరు అడుగుల ఎత్తుకు ఎదిగింది. ఒక్కొక్క అడుగు వద్ద గుండ్రటి వృత్తాకారపు నామం ఏర్పడడం విశేషం. మేళ్ళచెరువును “దక్షిణ కాశీ”గా కొలుస్తారు. ఎందుకంటే, కాశీ విశ్వనాథునిలా మేళ్ళచెరువు శంభులింగేశ్వరుడు కూడా స్వయం అభిషేక లింగం.
లింగం పైభాగంలో గంగాజలం నిత్యం జాలువారుతూనే ఉంటుంది. కనుకనే ఈ స్వామి కాశీ విశ్వనాథుని వలే మహిమాన్వితుడై భాసిస్తున్నాడు. ఇక్కడ స్వామి జరిగే అలంకార సేవను తప్పక చూడవలసిన అపూర్వ సేవ.
*****
నీరు, గాలి, నిప్పు, నింగి, నేల అనే ఐదు శక్తులు మనం అనుభవించడానికే గానీ హాని చేయడానికి లేవు. ఎప్పుడైతే ఈ శక్తులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడు వాతావరణం విషవలయంగా మారుతుంది. అలా కాకూడదన్న ఉద్దేశంతోనే పంచభూతాలను దేవతల్లా ఆరాధించే పద్ధతిని ఋషులు ఏర్పరిచారు. పంచభూతాలలో ప్రధానమైన నీరు జలదేవతగా పూజలను అందుకొంటోంది. కృష్ణుని కన్నకూతురు అయిన కృష్ణమ్మ ఆంధ్రులకు ఆరాధ్య దేవత. కృష్ణానదిని ఎంత స్వచ్ఛంగా, పవిత్రంగా మనం కాపాడుకుంటామో అంతే ప్రేమతో మన రాబోయే తరాలను రక్షిస్తుంది ఈ నదీమతల్లి.
*****
అమరావతి
మట్టపల్లి యోగానృసింహుణ్ణి అర్చించిన, కృష్ణవేణి శివారాధన తత్పరురాలై శివనామస్మరణ చేస్తూ చేరే తదుపరి మజిలీ – అమరావతి.
జిల్లాకేంద్రమయిన గుంటూరుకు 36 కిలోమీటర్ల దూరంలో వెలసిన అమరావతి “పంచ ఆరామా”లుగా పిలవబడే శైవ క్షేత్రాలలో ఒకటి.
’ధరణికోట’, ’ధాన్యకటకం’ అనే ఐతిహాసిక పేర్లను కలిగిన ఈ పుణ్యధామం శ్రీ అమరేశ్వర స్వామివారి దివ్యసన్నిధానమై ‘అమరారామం’ అన్న పౌరాణిక నామంతో అలరారుతోంది.
ఇక్కడ పరమశివుడు 15 అడుగుల ఎత్తుగల దివ్య, భవ్య, ధవళ లింగంగా దర్శనమిస్తాడు. అమరలోక సార్వభౌముడైన ఇంద్రుడు ప్రతిష్టించడం వల్ల అమరేశ్వరుడన్న పేరు వచ్చింది. పరమేశుని అర్ధాంగి అయిన పార్వతీదేవి ఇక్కడ ’బాలచాముండికా’ అన్న పేరుతో కొలువుదీరివుంది.
అమరేశ్వరాలయం కృష్ణానది దక్షిణ తీరంలో కొలువైవుంది.
*****
మంగళగిరి
మట్టపల్లిలో నరసింహస్వామిని సేవించి, అమరావతిలో అమరలింగేశ్వరుణ్ణి అర్చించిన కృష్ణమ్మ, మళ్ళీ నృసింహస్వామి ఉపసాకురాలై, మంగళగిరిని చేరుతుంది.
ఇక్కడ వెలసిన పానకాల నరసింహస్వామిని, ధర్మరాజు ప్రతిష్టించిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత నరసింహస్వామిని సేవించి, తరిస్తుంది కృష్ణమ్మ.
పూర్వం సముచి అనే రాక్షసుడు ప్రజాకంటకుడై తిరుగుతుండగా, ఇంద్రుడు విష్ణుమూర్తి దయతో, అతని ఆయుధమైన చక్రాన్ని ప్రయోగించాడు. మృత్యువునుండి తప్పించుకోవడానికై, సముచి, మంగళగిరి పర్వతంలో గల ఓ చీకటి గుహలో నక్కాడు. విష్ణుమూర్తి, ఉగ్ర నరసింహ రూపాన్ని ధరించి, చక్రంలో చేరి, సముచిని సంహరించాడు. స్వామివారి ఉగ్రరూపం నుండి వస్తున్న అగ్నిజ్వాలలకు దేవతలు, మానవులు భయపడ్డారు. అప్పుడు ఇంద్రుడి చేత అమృతాన్ని తెప్పించి సగం త్రాగి సగం ప్రసాద రూపంగా వెనక్కు ఇచ్చి శాంతించాడు నరసింహుడు.
ఆనాటి నుండీ మంగళగిరి నారసింహుడు భక్తులు సమర్పించే పానకంను సగం సేవించి సగం వెనక్కు ఇస్తూ భక్తలోకచింతామణిగా అలరారుతున్నాడు.
*****
బెజవాడ కనకదుర్గమ్మ
పానకాల స్వామిని సేవించి, తియ్యటి జలధారలను పొందిన కృష్ణమ్మ, “దుర్గే హే దుర్గే “ అంటూ విజయవాడ వైపుకు కదులుతుంది. బెజవాడ కనకదుర్గమ్మను సేవిస్తుంది.
“శ్రీమాతా లలితా ప్రసన్నవదనా శ్రీరాజరాజేశ్వరీ దుర్గాంబా నవకోటి మూర్తి సహితా మాం పాతు మాహేశ్వరీ” అంటూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రస్తుతి చేసిన విజయవాడ కనకదుర్గమ్మ “అమ్మగలయమ్మ చాల పెద్దమ్మ దయాంబురాశి” అయిన మేటి అమ్మ.
కృష్ణాతీరంలో, ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ తెలుగువారి ఆరాధ్యదైవం. పిలిస్తే పలికే తల్లి. కోరిన వరాలను తీర్చే కొంగుబంగారం. మల్లేశ్వరస్వామివారి అర్ధాంగి. పాండవమధ్యముడైన అర్జునునికి వరప్రదానం చేసిన కరుణాతరంగిణి.
ధర్మనిరతికి కట్టుబడిన మాధవవర్మ అనే మహారాజు ఓ పేద బాలుని మరణానికి కారణమైన తన కుమారునికి మరణశిక్షను అమలు జరిపాడు. మాధవవర్మ సత్యనిష్టకు సంతోషించిన దుర్గమ్మ చినుకుకు ఒక చిన్నము చొప్పున బంగారు వర్షాన్ని కురిపించింది. ఆవిధంగా విజయదుర్గ ’కనకదుర్గ’గా ఖ్యాతిని పొందింది.
ఇంద్రకీలాద్రి మహిమను దుర్గాసప్తశతి గ్రంథం విశేషంగా కీర్తించింది.
భారతదేశంలో గల 108 దుర్గాక్షేత్రాలలో 18 క్షేత్రాలు ప్రధానం కాగా వాటిలో విజయవాడ క్షేత్రం ప్రధానమైనది.
ఇక్కడ కృష్ణానది తూర్పు కనుమలను చీల్చుకుంటూ ప్రవహించడం విశేషం.
*****
కన్నతల్లికి పిల్లల మైల ఏమాత్రం అసహ్యాన్ని కలిగించదు. ఆమె ఎంతో ప్రేమతో, నిస్వార్థతతో బిడ్డలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడానికి పాటుపడుతుంది. మన నదులు కూడా అంతే! మన దేహ మలినాలను, మనం వదిలే వ్యర్థాలను అన్నింటినీ మోస్తూ, భరిస్తూ, నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండే అమ్మలు మన నదీమతల్లులు. అయితే, అమ్మను గౌరవించడం మన సంప్రదాయం. తల్లులయిన నదులను మనం గౌరవించాలి. స్వచ్ఛనదులకై స్వచ్ఛందంగా నడుం కట్టాలి.
*****
సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరాలయం
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో, విజయవాడ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో గల విశిష్ట ఆలయం – సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరాలయం.
ఈ ఆలయాన్ని సుమారు అరవై సంవత్సరాల క్రితం నిర్మించారు.
ఇద్దరు రైతులు అకారణంగా ఓ నాగుపాము చంపడం వల్ల వారికి అనేక కష్టాలు కలిగాయి. ప్రాయశ్చిత్తరూపంగా ఈ గుడిని నిర్మించారు. దానితో వారి బాధలు తొలగిపోయాయి. ఆనాటి నుండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఐదు పడగలు గల నాగప్రతిమ రూపంలో భక్తుల పూజలను అందుకుంటున్నాడు.
ఈ ఆలయానికి గల మరో విశేషం ఏమిటంటే – గుడిని కట్టడానికి కావలసిన స్థలాన్ని ఓ కపిల గోవు చూపించిదట!
నాగదోష నివృత్తికి, మంచి సంతానం కలగడానికి, నిత్యం ఎందరో భక్తులు ఇక్కడకు వచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు.
*****
మన భారతీయ సంస్కృతిలోని గొప్పదనమంతా “ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంది.” మనం గోదావరీ నదిని ’దక్షిణగంగా’ పిలుచుకుంటాం. అలాగే గంగమ్మతల్లిని ’ఉత్తరభారత గోదావరి’గా పూజిస్తాం. ఇలా సామరస్యంతో, సద్భావనతో, పరస్పర గౌరవంతో జీవించడాన్ని నదులు మనకు నేర్పుతున్నాయి. అందుకనే నదులను కాపాడుకోవాలి. కంటికి రెప్పలా కాచుకోవాలి. నదుల నుండి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నవారిగా ఇది మన కనీస కర్తవ్యం.
*****
శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు
విజయవాడ వద్ద దుర్గామల్లేశ్వర స్వామిని కొలిచి, అమ్మవారిని దర్శించిన వారికి విజయపరంపరలను అందించే, కృష్ణవేణి మునుముందుకు సాగి, చేరే దివ్యధామం – శ్రీకాకుళం.
ఈ క్షేత్రం “ధరాలోక వైకుంఠం”, “మహాక్షేత్రవతంసం”, “సర్వసిద్ధికరం”, “ఆంధ్రనాయకుని దివ్యదేశం.”
విజయవాడ నుండి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కొలువైన నిలయం.
సృష్టికార్యాలతో అలసిన బ్రహ్మదేవుడు కృష్ణాతీరంలో సేదతీరి ప్రార్థించగా ప్రత్యక్షమయిన విష్ణురూపమే శ్రీకాకుళేశ్వరుడు. కాలాంతరంలో ఆ రూపాన్ని ఆత్రేయ ఋషి విగ్రహరూపంలో ప్రతిష్టాపించాడు. ఆ తరువాత ఈ విగ్రహం అనేకమార్లు కనుమరుగై, మరలా మరలా ప్రతిష్టితమవుతూ వచ్చింది. చివరి ప్రతిష్టను 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు జరిపించాడు.
కృష్ణదేవరాయల సభా పండితుడు లొల్ల లక్ష్మీధర పండితుడు “శ్రీకళాం కాకుళేశః” అని అంటూ శ్రీకాకుళం పేరును వర్ణించాడు.
19వ శతాబ్దంలో ఈ ఆలయం కృష్ణానదిలో మునిగిపోయింది. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి 108 సీసపద్యాలతో “ఆంధ్రనాయక శతకం”ను ఆశువుగా చదివాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున కృష్ణమ్మ వెనక్కు తగ్గింది. ఆలయం యథాస్థితికి వచ్చింది.
ఇదీ కృష్ణమ్మ చూపించిన విష్ణుభక్తి.
ఇదీ ఆంధ్రవిష్ణువు ప్రదర్శించిన భక్తవాత్సల్యం.
“చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ! హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ! నమోనమస్తే! నమో నమస్తే!”
*****
గోవును, గాయత్రీ మంత్రాన్ని, గంగానదిని తల్లులుగా భావించి, పూజించే సంస్కృతి భారతదేశంలో తరతరాలుగా వస్తోంది. ఆ కోవలోనే కృష్ణవేణీ నదిని “కృష్ణమ్మ”గా తలచి, పిలిచి, కొలిచి తరిస్తోంది తెలుగు జాతి. ఈ నది భూమిపై బంగారు పంటలను పండిస్తోంది. ఎదలో పుణ్యాల పంటలను పండిస్తోంది. ఈ నదీమతల్లి భుక్తిదాత, భక్తిప్రదాత, ముక్తికి చేయూత. కనుకనే, కృష్ణమ్మ మనకు ప్రాతఃస్మరణీయురాలు.
*****
పెదకళ్ళేపల్లి
శ్రీకాకుళంలో శ్రీమహావిష్ణువును సేవించిన శ్రీకృష్ణవేణి, తన కళ్యాణ తరంగాల మంగళ ఘోషతో, సాగర సంగమానికై ఉరకలు వేస్తూ, కదళీపుర క్షేత్రాన్ని చేరుతుంది.
ప్రాచీన కదళీపురమే నేటి పెదకళ్ళేపల్లి గ్రామం.
ఇక్కడ శివుడు, కేశవుడు కొలువైవున్నారు. సహ్యాద్రి పర్వతంపై మహాబలేశ్వరుడు, శ్రీకృష్ణుని సన్నిధానంలో ప్రభవించిన కృష్ణమ్మ, తన పతి ఐన సాగరుణ్ణి చేరే ముందు ఈ పెదకళ్ళేపల్లిలో శ్రీ దుర్గానాగేశ్వరుణ్ణి, రుక్మిణీ సత్యా సమేత శ్రీవేణుగోపాలుణ్ణి కనులార తిలకించి, అర్చించి, పులకిస్తుంది.
*****
గంగానదిని పూజిస్తే గంగాధరుడయిన కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలం దక్కుతుంది. కృష్ణమ్మను పూజిస్తే యమునాతీర విహారి, భక్తమానస సంచారి అయిన శ్రీకృష్ణున్ని స్వయంగా అర్చించిన ఫలం లభిస్తుంది. భక్తులందరికీ కృష్ణానదీ అర్చనా భాగ్యంను అందించడానికే పుష్కరాలు ఏర్పడ్డాయి. ఈ నదీ మహోత్సవం పన్నెండేళ్ళకు ఒకసారి, గురుగ్రహం కన్యారాశిలో ప్రవేశించినపుడు వస్తుంది. కృష్ణభగవానుని సన్నిధి కలిగి తెలుగువారి పెన్నిధిగా విలసిల్లుతున్న కృష్ణమ్మకు పుష్కరం మనందరికీ శోభస్కరం, శుభపరంపరల ఆకరం.
*****
హంసలదీవి
పెదకళ్ళేపల్లిలో శివకేశవుల నుండి ఆశీస్సులను, అభినందనలను, ప్రజాభివందనలను స్వీకరించిన కృష్ణమ్మ వడివడిగా సుడులు తిరుగుతూ, గలగలమనే అడుగుల సవ్వడులతో ముగ్ధగా, అనురాగభరిత స్నిగ్ధగా, పతిసేవానురక్తబద్ధగా, కదలివచ్చి కడలిరాయని కౌగిలిలోకి ఒదుగుతుంది…ఈ హంసలదీవిలో!
మెట్టినింటికి వెళుతున్న కన్నకూతురిని, తన ఇంటి నుండి ఆ ఇంటి వరకూ దిగబెట్టడానికై వచ్చే తండ్రిగా, ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ హంసలదీవిలో సంతాన వేణుగోపాల స్వామిగా వెలసివున్నాడు. కన్ననాటి నుండి కన్నుల్లో పెట్టుకు పెంచిన కన్నకూతురిని కన్నులారా చూసుకోవాలనే కన్నతండ్రి కోరికకు కట్టిన రూపంలా యశోదాదేవి ముద్దుల కన్నయ్య హంసలదీవిలో నిలబడి కృష్ణా – సాగరసంగమాన్ని వీక్షిస్తున్నాడు. శుభపరంపరలు కలగాలని దీవిస్తున్నాడు. భార్యాభర్తల సమాగమం దైహిక, మానసిక, ఆధ్యాత్మిక భావనల త్రివేణీ సంగమం కావాలనే సందేశాన్ని అందిస్తున్నాడు.
*****
రండి! అఖండ కృష్ణానది ప్రచండ తరంగమండితుడైన సాగరుణ్ణి చేరే సమయంలో మనమూ దీక్షాబద్ధులం అవుదాం! మన సంస్కృతిని, సంస్కారాన్ని, వారసత్వ సంపదను, సగౌరవంగా సన్మానించుకుందాం! ధర్మదీక్షాదక్షులమై తరిద్దాం! జ్ఞాన, భక్తి, వైరాగ్యాలనే ఐశ్వర్యాలను సంపాదిద్దాం! మన అఖండ భారతదేశాన్ని ప్రపంచపటంపై విశ్వగురువుగా ప్రతిష్టిద్దాం! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని లీలామృత సాగరంలో అక్షీణ కృష్ణవేణిలా సంగమిద్దాం!
“ఓం నమో వేంకటేశాయ”
*****