మధ్వాచార్య ఆలోచనా సరళి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది  వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు.  తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ వస్తూంది.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు ఇలా పూర్వీకులు అందించిన జ్ఞానానికి కొందరు స్వకపోల జ్ఞానాన్ని  జోడించి ఆ జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి ఆ సిద్ధాంతాన్ని స్థిరీకరించుకోవడానికి  శ్రుతులను, స్మృతులను వెతుక్కొని ఏదో విధంగా వాటిని సమన్వయపరచి ప్రచారంలోకి తెచ్చుకొన్న తత్వాలు ఉన్నాయి. కాని వాస్తవం మారదు. అసలైన తత్వం వాస్తవాన్ని మానవ జీవితానికి అనువర్తింపచేయునపుడు ప్రాపంచిక జ్ఞానాన్ని/ అనుభవాలను  త్రోసిరాజనలేదు! 

ప్రపంచానికి మధ్వులు అందించిన తత్వ జ్ఞానం వేదవాజ్ఞ్మయంలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రోదిచేసి సమన్వయ పరచి ప్రతిపాదించినది. మధ్వులు అందించిన ఈ తత్వజ్ఞానం ఆయన అనుయాయులైన శ్రీజయతీర్థులు చాల చక్కగా వివరించి మహా తార్కిక శక్తిగా వాసికెక్కారు.

ఆయన తరువాత వ్యాసతీర్ధులు మధ్వాచార్య తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి పంచారు. వీరు అందించిన ఈ తత్వ జ్ఞానం కొందరికే అందింది. ఇతర ఆచార్యుల గ్రంధాలకు ఉన్న ప్రాచుర్యం వీటికి గతం లో లేదు ఇప్పుడూ అంతగా కానరాదు. కానీ అంతర్జాలం ప్రభావంతో వీరి గ్రంధాలు కొన్ని ఇప్పడు ప్రపంచానికి “కొన్ని క్లిక్కుల” దూరంలో లభ్యం ఔతాయి.   భవిష్యత్ లో మధ్వాచార్య ప్రభావం సాధకులపై ఎలా ఉంటుదో ఊహించలేము.

భగవద్గీత లో దాగిన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎవరో ఒక ఆచార్యుల భాష్యం చదివితే సరిపోదు.  మనకు ఉన్న ఆచార్య త్రయం (శంకర, రామానుజ, మధ్వాచార్యులు) చేసిన భాష్యాలు చదివితేనే మన మనోనేత్రానికి  “సాక్షి” ఆధారంగా అసలైన సంపూర్ణమైన తత్వజ్ఞానం గోచరమౌతుంది. సాధన కేవలం ఒక్కరి భాష్యం చదవడం తోనే ఆగిపోతే అసూయ ప్రబలుతుంది మినహా స్థిరమైన జ్ఞానం సిద్ధించదు. 

భారతీయ తత్వవేత్తలు, తార్కికులు కార్యా-కారణ సంబంధాలను (KAARYA IS TEMPORARY AND KAARANA IS PERMANENT) తర్కంతో విశ్లేషించి వాస్తవాన్ని కనుగొనడమే ముఖ్యమని భావించక, అలా తెలుసుకొన్న వాస్తవానికి ఆధ్యాత్మిక అనుమానాన్ని(శబ్ద ప్రమాణాన్ని) జోడించి విశదీకరించారు. ఇలా చేయడానికి ముందు మన పూర్వీకులు ఒక చట్రం నిర్మించి, తమ తర్కాన్ని దానిలో లో బిగించి,  దానిని సమస్త వాజ్ఞ్మయానికి అన్వయించడంలో తమ ప్రజ్ఞా పాటవాలు చూపారు. ఇది భారతీయ తత్వ శాస్త్ర కారులు అవలంబించిన విధానం.

ఈ విధానంలో ముఖ్యంగా  తాత్విక శోధన మూడు విధాలు గా జరుగుతుంది.

 

 

 

 

  • జ్ఞానం యొక్క సిద్ధాంతం లేదా జ్ఞానం యొక్క స్వభావము దాని విస్తృతి (epistemology) తెలుసుకోవడం. 
  • జీవుల / పదార్థాల స్వభావాన్ని,  అట్టి జీవుల / పదార్థాల తో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని తాత్విక దృష్టి తో వివరించే విధానం.  ఈ విధానంలో జ్ఞానం పట్ల జరిగే  తార్కిక అధ్యయనం. అంటే, చిట్టచివరికి ఉండేది ఏది? అది ఎలా ఉంటుంది అనే శోధన  (metaphysics). 
  • విశ్వంలో గోచరమయ్యే తారతమ్యాలు వాటి పరస్పర సంబంధాలతో కూడిన  వ్యవస్థ ను అధ్యనం చేయడం (ontology). 
  • వీటితో పాటు ఇతర వేదాంతుల ప్రతిపాదనలను, సిద్ధాంతాలను ఆకళింపు చేసుకొని వాస్తవాన్ని వివరించడం నిజమైన తత్వ జ్ఞానం.  

మన పూర్వీకులు చేసిన తత్వ  ప్రతిపాదనలు ఎన్నో ఆలోచనల/ విశ్లేషణ ఫలితంగా చేసిన ఒక మహత్తరమైన మానసిక ప్రయత్నం. వీటిని అధ్యయనం చేయడం వలెనే మనసు వికసించి అసలైన తత్వం వైపు మళ్ళుతుంది. వీటిని త్రోసిరాజని చేసే సాధన “రెండు గుప్పెళ్ళు మూసి, నేను నాకు ఇష్టం వచ్చిన ఒక గుప్పిట తెరుస్తాను దానిలో నీ ఉంగరం లేక పొతే ఇక లేనట్లే అని అనడం”.  గతం లో జరిగిన తర్కమంతా/ తత్వశోధన అంతా  ఆ తర్కజ్ఞుల గతంతో సంబంధం ఉన్నదే!! 

ఈ విధానంలో మధ్వులు తనకు  పూర్వీకులైన ఇరువది ఒక్క మంది (21) భాష్యకారులు బ్రహ్మ సూత్రాల పై చేసిన వ్యాఖ్యానాలను అధ్యనం చేసి వాటి విమర్శిస్తూ, విశ్లేషిస్తూ తనదైన భాష్యాన్ని బ్రహ్మసూత్రాల పై వ్రాసారు.

ఉదాహరణకు చార్వాక సిద్ధాంతంలో ఉన్న బాహ్య ప్రపంచ స్పృహ, అనుభవం అనే అంశాలను సమర్ధన చేసి అదే సిద్ధాంతం లో ఉన్న లౌకిక కోరికలను తీర్చుకోవడానికి ప్రతిపాదించిన నైతికతను, భౌతిక వాదాన్ని,నాస్తిక వాదాన్ని(దేహాత్మవాదం) ఖండించారు. ఎందుకంటే మనిషి మనుగడ కేవలం లౌకిక కోరికలు తీర్చుకోవడం కోసమే కాదు జీవన పరమార్ధమైన జనన-మరణ చక్రచ్చేదనం కనుక అందుకు కావలసిన ఆధ్యాత్మిక సంపదను సంపాదించడం. చార్వాకుడు కేవలం ప్రత్యక్ష ప్రమాణం వద్దనే ఆగి పోయాడు. అనుమాన, శబ్ద ప్రమాణాలను ఉపయోగించలేదు. ఈ విశ్వంలో కేవలం ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే తెలుసుకొనే విషయాలు మాత్రమే లేవు ఇతర రెండు ప్రమాణాల ద్వారా మరెన్నో తెలుసుకోవలసినవి ఉన్నాయి. 

అలాగే గౌతమ బుద్దుడు చెప్పినట్లు జీవితాన్ని ఆస్వాదించడం తప్పు అని, ఈ బాహ్య ప్రపంచాన్ని విడనాడి క్రమేణా ఆత్మహత్యా సదృశమైన నిర్వాణాన్ని పొందమని మధ్వులు చెప్పలేదు.  అలాగని కేవలం స్వర్గసుఖాలు పొందడానకి చేసే వైదిక తంతులకు జీవితాన్ని దాసోహం చేసి సంతసించమని మీమాంసకారులు చెప్పినట్లు చెప్పలేదు.  ఎందుకంటే ఇలా జీవితాన్ని పరిమార్చడం కర్మలు చేయడం వెనుక గల ధ్యేయాన్ని/వైదిక జ్ఞానాన్ని విడనాడడమే. “హరి పాద వినమ్ర విధియాసతతం” అని మధ్వులు మొత్తం సమస్త వేద వాజ్ఞ్మయ సారాన్ని ఒక్క మాటలో చెప్పారు.  తత్వజ్ఞానం ఇట్టి వినమ్రతను మనిషి పొందేలా చేయాలి అహంకారాన్ని కాదు.  

వైదిక కర్మలను ఆచరించడం వలన జీవి ఆ కర్మఫలాలను అవశ్యం పొందుతాడు కానీ అలా ఫలాలను పొందడం పరమార్ధం కాదు. ఆ కర్మలు క్రమేణా జీవిలో ఒక నిబద్ధతను కలిగించి తద్వారా కర్మలనాచరించే విధానంలో పరిపక్వత కలిగి అది జీవి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానంగా మారుతుంది. ఇలా చేయగా, చేయగా జీవికి  పరమాత్మ పట్ల భక్తి పెరిగి ఆ భక్తి భావనతో  కర్మఫలాలను భగవతప్రసాదంగా అనుభవించడం అలవడుతుంది. తద్వారా  కర్మలు చేయడం భగవంతుడి కోసమని భావించడం (తత్కర్మ హరితేషాం యతు), వాటి ఫలితాలపై ధ్యాస కించిత్తు కూడా లేకుండా ఉండడం జీవికి సులభసాధ్యమౌతుంది. ఇది తత్వజ్ఞానం పొందిన జీవి చేరే ఉత్కృష్ట స్థితి. ఎందుకంటే వేదాల సారం కర్మలు చేయడం కాదు, పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం – అన్నీ నావల్లనే జరుగుతున్నాయని, అన్నీ నేనే ఐవున్నాని అని కాదు! 

కానీ ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం నిష్కామ్య కర్మాచరణ ద్వారానే. జైనులు సిద్దాన్తీకరించినట్లు “అహం సుఖి” అనే ఆత్మభావన సరియైనదని మధ్వులు చెప్పారు.  అంటే ఆత్మ తనను తాను:

  • తెలుసుకొనేది
  • తెలుసుకోబడేది
  • తెలిసినది

అనే మూడు స్థితుల సమ్మేళనం అని తెలుసుకొంటుంది, కానీ అహం బ్రహ్మాస్మి అని కాదు. 

సాధకుల తత్వజ్ఞన సముపార్జనకు దోహదపడే కొన్ని మహత్తరమైన విషయాలను/ ఆలోచనా విధానాలను మధ్వులు పరిచయం చేసారు అవి ముఖ్యం గా : 

  • స్వతంత్ర – పరతంత్ర స్థితులు
  • సాక్షి
  • భేదం అనే విషయాన్ని ధర్మి (One who practices dharma)  స్వరూపం గా సవిశేష భిన్నం  (identity – in – difference)
  • పైన పేర్కొన్న విషయం నుంచి జీవుల మధ్య ఉన్న స్వరూప భేదం.
  • పరబ్రహ్మము – జీవి మధ్య ఉన్న సంబంధం  బింబ – ప్రతిబింబ సంబంధం.
  • పరాధీనవిశేషాప్తి ఆధారం గా జీవులు ముక్త స్థితి లో సైతం పరతంత్రులుగా ఆనంద తారతమ్యంతో ఉండడం. 

ఈ పదజాలం దీని వెనుక ఉన్న భావజాలం తత్వ విచారణలో ఒక సమూల సంస్కరణను తీసుకొని వచ్చాయి. ఎందుకంటే ఇవి పూర్వాచార్యులు ప్రతిపాదించిన విషయాలకు భిన్నంగా తాత్వికుల ప్రశ్నకు సమాధానాలు ఇచ్చాయి. ఒక్కసారి వీటి ఆవశ్యకతను ఆకళింపు చేసుకొంటే తత్వశాస్త్రంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం వెతికే విధానమే సమూలంగా మారిపోతుంది. ఒక కొత్త ఒరవడి,  ఆధారం, పీఠిక, ఆధ్యాత్మిక ప్రపంచం గోచరమౌతాయి.

 *** 

 

Your views are valuable to us!