Like-o-Meter
[Total: 0 Average: 0]
గడ్డిపూవు – 1
నీ పాదముల వ్రాలి
నా పాపముల జోలి
ఏనాటికౌను ఖాళీ?
ఈ దేహ సీమలో
శ్రీ దేవ సన్నధి
రాదేలనో స్వామీ!
ముందేమిటో ఎరుగ
సందేహ పాత్రునికి
సందేశమందదేమి?
ఈ సుఖమె నిత్యమని
లక్ష్యమ్ము మరచేను
శిక్షింపకోయి స్వామి
కాంక్షలన్నీ తొలగ
దీక్షానుబద్ధుడవ
ప్రక్షాళంబదేమి?
దిన నాథుడే మునుగ
తనుప్రాయమే తరుగ
వినిపించు మృత్యుఘంట
ఘనజ్ఞాన సాధనకు
మనసెపుడు మరలేను
నను బ్రోచు నారసింహ!
గడ్డిపూవు – 2
తిరుగాడి లోకమున,
నరనటన జేసేవ
మురహర నారసింహ!
సల్లాప కేళిలో
తల్లీనతను బొంది
సల్లక్షణమ్ములనె మరచి
కల్లోల మానసికి
సల్లీలలను దెలుపు
ఉల్లాసమేల స్వామి?
పరుల పంచన జేరి
పారతంత్ర్యమున కనలి
సార జ్ఞానశక్తి రహితుడయ్యి
మేర మీరిన వాన్కి
దారి జూపగ దలచి
గురువైతివా దేవా!