నీవు మాయలోనా? నీలోననే మాయా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మొదటగా ఓ కన్నడ కీర్తనలోని ఈ భాగాన్ని చదవండి.

 

నీ మాయయొళగో నిన్నొళు మాయయో

నీ దేహదొళగో నిన్నొళు దేహవో కృష్ణా!

బయలు ఆలయదొళగో ఆలయవు బయలొళగో

బయలు ఆలయగళు నయనదొళగో

నయన బుద్ధియదొళగో బుద్ధి నయనద ఒళగో

నయన, బుద్ధిగళెరడు నిన్నొళగో కృష్ణా!

 

తెలుగు అనువాదం:

 

నీవు మాయలోనున్నావో, మాయే నీలోన ఉన్నదో

నీవు దేహములో ఉన్నావో, దేహమే నీలోన ఉన్నదో

 

బయలు ఆలయమందునో, ఆలయమే బయలులోనో

బయలు, ఆలయాలు రెండూ నయనాలలోనో

నయనము బుద్ధిలోనో, బుద్ధి నయనములోనో

నయన, బుద్ధులు రెండూ నీలోనో, కృష్ణా!

 

పదహారు-పదిహేడు శతాబ్దాల మధ్య జీవించిన కనకదాసు ఈ కీర్తనను వ్రాసాడు. కృష్ణదేవరాయల సమాకాలీనుడే గాక విజయనగర ప్రభువుల తరఫున అనేక యుద్ధాలను చేసిన వీరుడు. కేశవుడే వెంటబడి తనపై పాటలు వ్రాయమని కోరినట్టుగా ఇతని జీవిత చరిత్రలో వస్తుంది. ఇవన్నీ ఎలాగున్నా, కనకదాసు రచనలు మాత్రం అద్భుతం, అమోఘం, అపూర్వం అని మాత్రం చెప్పగలను.

చదవడానికి చాలా సులువుగా అనిపించి, బాగా అర్థమైపోయిందనిపించేలా ధ్వనించే పై కీర్తనలోని లోతు ఆలోచించే కొద్దీ నా మతిని పోగొట్టింది. 

ఇంతకూ కనకదాసు చెబుతున్నదేమిటి? అచింత్యుడైన భగవంతుడి గురించా? తన అవగాహనాలేమి గురించా? లేక సైన్స్ గురించా?

 

“నీవు మాయలోనున్నావో, మాయే నీలోన ఉన్నదో”

 

ఏమిటీ మాయ?

 

“మ” అంటే మంచిది అర్థాన్ని “మాంగ్ మానే” అనే ధాతువు నుండి రాబట్టవచ్చు.

అలానే “యా” అంటే వెళ్ళడం, పొందడం అనే అర్థాలు “యా ప్రాపణే” అనే ధాతువు ద్వారా స్థిరపరచవచ్చు.

 

ఈ ధాత్వర్థాలతో చూసినప్పుడు మాయా అంటే “పొందబడిన మంచి” అనిగానీ “మంచిని పొందడం” అని గానీ తెలుకోవచ్చు. (మాయ అన్న పదానికి మిథ్యాత్వం అనే మరో అర్థం కూడా ఉంది. కానీ పై కీర్తనలోని మాయ ఈ అర్థంతో వాడబడలేదని నా అభిప్రాయం.)

మాయా అన్నది కొలబద్ధ ఐనప్పుడు “నీవు కొలవబడదగ్గవాటిలో ఉన్నావో లేక అవే నీలో ఉన్నాయో” అని చదువుకొన్నప్పుడు కనకదాసు ఏం చెప్పబోతున్నాడన్నది తెలియలేదు.

“నీవు దేహములో ఉన్నావో, దేహమే నీలోన ఉన్నదో”

“దిహ్ దేగ్ధి” అనే ధాతువు నుండి దేహ అన్న పదం పుట్టింది. దిహ్ అంటే సంపాదించడం, ప్రోగుచేయడం అనే అర్థాలున్నాయి. సుఖ-దుఃఖాలను, పుణ్య-పాపలను, జ్ఞాన-అజ్ఞానాలను సంపాదించడమో, ప్రోగు చేసుకోవడమో ఈ దేహం ద్వారానే సాధ్యం. మరో మాటలో చెప్పుకోవాలంటే ద్వైదీభావంతో కూడుకొన్నదే దేహం. ఇలాంటి దేహంలో “కొలవబడదగ్గవాడో లేక కొలవలేనటువంటి వాడో’ అయిన “మాయా” పరమాత్ముడు ఉన్నాడు. అది కూడా లోన ఉన్నాడో, బైటే ఉండి కథను నడిపిస్తున్నాడో తెలియదు. ఇదీ పల్లవిలోనే కనకదాసు చేసిన మకతిక-తికమక.

 ఇది తర్కమా లేక వేదాంతమా అన్నది మరో ప్రహేళిక.

 ఆ తర్వాతి చరణంలో కనకడు ఏం చెప్పాడో చూద్దాం!

 

బయలు ఆలయమందునో, ఆలయమే బయలులోనో

బయలు, ఆలయాలు రెండూ నయనాలలోనో

నయనము బుద్ధిలోనో, బుద్ధి నయనములోనో

నయన, బుద్ధులు రెండూ నీలోనో, కృష్ణా!

ఇరుకు గల్లీలో ఉండే గుడికి, ఆరుబయల్లో ఉండే గుడికి బోలెడు తేడా ఉంటుంది. కనకదాసు కాలంలో విశాలమైన ప్రాంగణం కలిగివుండే గుడులే ఎక్కువేమో! వాటిల్ని చూసి చూసి చూసి ఇలా వ్రాసేసాడనిపిస్తోంది. నా వరకూ ఇది మహ గొప్ప ప్రశ్న. అంతే కాదు మహ గొప్ప సిద్ధాంతం కూడానూ.

నిరుపయోగంగా పడివుండే బంజరు భూమి కనబడితే దాన్ని దురుపయోగం చేయందే ఊరుకోదు మానవజాతి. అదే స్థలంలో ఓ గుడి వెలసిందంటే ఎక్కడలేని నక్క వినయాలు బయల్దేరుతాయి. పొర్లు దండాలు పెట్టేంత వరకూ పోతాయా ధూర్త వినయాలు. వృధాగా పడివున్న బయలు ప్రాంతంలో దేవుడి సన్నిధానం లేదా? నాలుగు స్థంభాలు, ఒక పైకప్పు, అందులో ఓ విగ్రహముంటేనే పవిత్రత వస్తుందా? అని నిలవేసినట్టుగా ఉందా మొదటి వాక్యం.

ఆపై మరో తీవ్రమైన వాక్చాలనం చేస్తాడు కనక నాయకుడు. ఎలాగంటే “బయలు, ఆలయాలు రెండూ నయనాలలోనో” అని. నిజమే కదా! బయలును చూసిన కళ్ళే దేవాలయాన్నీ చూస్తున్నాయి. మొదటిదాన్ని చూసిన చూపు కంటే రెండవదాన్ని చూసే చూపులో ఏదో తేడా ఉంది. ఏమిటది?

“నయనము బుద్ధిలోనో, బుద్ధి నయనములోనో” – అదీ సంగతి! బుద్ధి పల్టీలు కొట్టింది. బయల్ని చూసినప్పుడు కలగని భక్తిభావాన్ని ఓ రాతి కట్టడాన్ని చూడగానే కలిగించింది. ఇదో మానసిక వైపరీత్యం కాదా? ఇంతకీ ఈ విపరీతానికి కారణం కళ్ళా? బుద్ధా? లేక రెండూనా!!

“నయన, బుద్ధులు రెండూ నీలోనో, కృష్ణా!” – దెబ్బకు కుతర్కం సమసిపోయింది. కొలవబడీ, కొలవబడలేని “మాయ”గాడు బయల్లోను, ఆలయంలోనూ, కంటిలోనూ, బుద్ధిలోనూ – అన్నింటిలోనూ ఉంటూ ఎక్కడికక్కడ నన్ను మాయ చేసేస్తున్నాడు.

అన్నింటినీ అనుమానించడం, ప్రతిదానికీ తర్కాన్ని వెదకడం, పాతవన్నీ పుక్కిటివని అనుకోవడం, విలువలేనిదానికి విలువనిచ్చి, ఉన్నదాన్ని త్రోసిపారేయడం….వామ్మో ఎన్ని వ్యసనాలో ఈ మనిషికి. “”కృష్ణో వ్యసనకర్షకః” అని అన్నట్టుగా నా వ్యసనాలన్నింటినీ లాగి అవతల పారేయ్.

కనకదాసు ఇలానే అనుకొని వ్రాసాడని కాదు గానీ నాకు కలిగిన భావాన్ని వ్రాసాను. అంతే.


మరో కోణం:

సైన్స్ సహాయంతో అన్నింటినీ తెలుసుకోగలనన్న ధీమా మానవుడికి ఉంది. ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. చైతన్యశీలమైన సృజనాత్మకతను నిరంతరం కలిగివుండడం మానవులకు మాత్రమే సాధ్యం. కనుక సైన్సే మార్గం, సైన్సే దారిదీపం అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఆ రభసలో పాతవన్నీ పుక్కిటివేనని కొట్టిపారేయడం, “మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్” అని ప్రాచీనుల్ని నిరసించడం తగదు.

పై కీర్తనలో కనకదాసు అదే చెబుతున్నాడని అనిపించింది. ఎందుకంటే…..ఇందుకు!

సైన్స్ ప్రకారం ఈ సృష్టిలోని వింతలన్నింటినీ మనిషి కళ్ళు చూడలేవు. ఎందుకంటే అవి చూడగలిగే కాంతి యొక్క తరంగదైర్థ్యం (wavelength of light) చాలా అల్పమైనది. సైంటిఫిగ్గా చెప్పాలంటే 400 – 800 నానో మీటర్ల మధ్యలోనే మనిషి కళ్ళు చక్కగా చూడగలుగుతాయి. ఈ పరిధికి పైన గానీ, క్రింద గానీ ఉన్న సృష్టి విశేషాలను చూసే సామర్థ్యం వాటికి లేదు. కానీ సృష్టిలో ఈ పరిధికి ఇవతల, అవతల బోలెడు విశేషాలున్నాయి.

ఇంతటి పరిమితికి లోబడిన కళ్ళు బయలుని, ఆలయాన్ని చూడగలుగుతోందే తప్ప ఆ మట్టిలో, రాతిలో, ప్రతి కణంలో ఉండే “మాయా” వినోదిని చూడలేకపోతోంది. అపరిమితమైన శక్తి కలిగివుండేదనుకొనే ’బుద్ధి’ కూడా కంటి యొక్క పరిమితికి లోబడిపోతోందే కానీ దాన్ని మీరి ఆలోచించడం లేదు. కాబట్టి నేను చూస్తున్న ఈ ప్రపంచం, ఈ వస్తు సముదాయం నిజంగా అలానే ఉంటాయా లేక నా కంటి యొక్క శక్తిహీనత వల్ల ఇంతకంటే స్పష్టంగా చూడలేకపోతున్నానా? హే కృష్ణా! అన్నింటిలోనూ నిండివుండే నిన్ను ఎప్పుడు చూస్తానో! అనే ఆర్తి ఈ కీర్తనలో ధ్వనిస్తోంది.


ప్రపంచంలోని వస్తుసముదాయం రంగులమయం. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్ని మౌలికమైన వర్ణాలు (primary colours) అని సైన్స్ చెబుతోంది. ఈ మూడు రంగుల యొక్క సమ్మేళనంతో ఇతర రంగులు ఏర్పడుతున్నాయి. మానవుడి కన్ను మాత్రం ఈ మూడు రంగుల్ని మాత్రమే విశ్లేషిస్తుంది. ఇతర జీవజాలాల కళ్ళు వేరే రంగుల్ని చూడగలుతాయని సైన్స్ చెబుతోంది. “సృష్టి అనంతమైన”దని మన పూర్వీకులు ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది అదీ కనకదాసు వల్ల.

“ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం”

“బహుచిత్ర జగత్ బహుధాకరణాత్ పరశక్తి రనంత గుణః పరమః కరుణః”

* * * * * 

Your views are valuable to us!