ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవిహారా లక్ష్మీనారసింహా!
ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా!
కులశైల కుంభినీ కుముదహిత రవిగగన చలననిధి నిపుణ నిశ్చల నారసింహా! ॥ఫాల॥
వివర ఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవ దివ్య పరుష లాలాఘటనయా!
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా! ॥ఫాల॥
దారుణోజ్జ్వల ధగధ్ధగిత దంష్ట్రానల వికారస్ఫులింగ సంగక్రీడయా!
వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణప్రకట వేంకట నారసింహా! ॥ఫాల॥
భావం:
నీ నుదుటన ఉన్న కంటి నుండి వెలువడే ప్రకాశవంతమైన మెరుపులతో ఆడుతూ విహరించే నరసింహమూర్తీ! నీ లలితమైన నిశ్వాసానికి (నిట్టూర్పుకి) ప్రళయకాలంలో వీచే గాలికుండే శక్తి ఉంటుంది.
భయంకరమైన కొలిమితిత్తిలో నిప్పు రాజేసే బలం ఉంటుంది. ఆ నిట్టూర్పుతో కులశైలాలు, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశం కదిలిపోతోంటే, నువ్వు మాత్రం నిశ్చలంగా ఉన్నావు.
దుర్మార్గులను చూసి వారి కాలం తీరిందని వికటాట్టహాసం చేసేందుకు ఘనమైన నీ నోటిని తెరిచావు. ప్రియమైన గుణాలకు జలధివంటి వాడివైన నీ లాలాజలం సకల జీవజాలాన్నీ నశింపజేయగలదు.
శత్రువులైన దానవుల వంశాలను భస్మం చేయడానికి నీ కోరలు (దంష్ట్ర) పటపటలాడుతుంటే, వాటిలో ఉత్పన్నమయే అగ్నికణాలు ధగధగలాడుతున్నాయి. నీవు మా వేంకటేశ్వరుడివే!
పదకవితాపితామహుని కీర్తనల భాండాగారంలోనిది ఈ కీర్తన. హిరణ్యకశిపుని వధకై స్తంభంలోంచి ఉద్భవించిన నరసింహమూర్తిని స్తుతిస్తూ సాగుతుంది. అన్నమయ్య కాలానికి ఉన్న తెలుగుకీ ఇప్పటి భాషకీ ఐదువందల సంవత్సరాల పైగా తేడా ఉన్నందువలన కొన్ని తెలుగు పదాలు సైతం ఇప్పటి తరానికి అర్థం కాకపోవచ్చు. పైగా దేవభాషలో ఉన్న ఈ కీర్తన భావాన్ని (మరీ ప్రతిపదార్థ తాత్పర్యాలతో కాకుండా) వివరించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.