[2015లో వచ్చిన గోదావరీ నదీ పుష్కరాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రసారం చేసిన
“గోదావరీ తీరంలోని దివ్యక్షేత్రాలు”
అన్న ప్రత్యేక కార్యక్రమానికి నేను వ్రాసిన స్క్రిప్ట్స్ లో నాసిక్ పై వ్రాసిన స్క్రిప్ట్ ఇది]
ఉపోద్ఘాతం
ప్రాచీనకాలం నుండి ప్రపంచంలో గురుస్థానాన్ని వహించిన మన పవిత్ర భారతదేశం ఓ ఆధ్యాత్మిక వని మాత్రమే కాదు అఖండ విజ్ఞాన ఖని కూడా!
ఈ దేశంలో ఆధ్యాత్మిక సాహిత్యంతో బాటు గణితం, పరిసర విజ్ఞానం, భౌగోళిక శాస్త్రం, వైద్య విజ్ఞానంకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఎందరో మేధావులు తమ బుద్ధి కుశలతతో ఉద్గ్రంథాలను వ్రాసారు. అటువంటి వారిలో ఒకడు ప్రముఖ ఆయుర్వేద ఆచార్యుడైన చరకుడు.
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధిని పొందిన “చరక సంహిత” అనే ఆయుర్వేద గ్రంథాన్ని వ్రాసిన వైద్యశిరోమణి చరకుడు. చరక సంహితలో నీటి లక్షణాలను వివరిస్తూ ”జలమ్ ఏకమ్/ విధమ్ సర్వమ్/ పతతి ఐంద్రమ్/ నభస్థలాత్” అని వివరించాడు చరకుడు.
ఆకాశం నుండి ఇంద్రదేవుని అనుగ్రహరూపంగా నేలపై పడే వర్షపు నీళ్ళు ఒకేవిధంగా ఉన్నట్టు కనిపించినా దేశ, కాల, పరిస్థితులకు అనుగుణంగా వేరు వేరు గుణాలను కలిగివుంటాయని చరకుని అభిప్రాయం. నేటి ఆధునిక విజ్ఞానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. జీవులకు ప్రాణాధారమైన ఈ మార్పులను గమనిస్తూ ఆ మార్పులకు అనుగుణంగా పండుగలను, ఉత్సవాలను, పర్వకాలాలను నిర్ధారించారు మన సనాతన ఋషీశ్వరులు.
మనం ప్రతి నిత్యం ఉపయోగించే జలం త్రిలోకాధిపతి ఐన ఇంద్రుని కానుకగా వర్షపు రూపంలో భూమిపైకి దిగివస్తుంది. ఆకాశం నుండి వ్రాలిన వర్షపు నీరు బావులు, కుంటలు, చెరువులలోకి చేరుతుంది. అంతేకాదు అనేక నదుల రూపంలో వందల మైళ్ళు ప్రవహిస్తాయి. నదులలోని నీరు సముద్రంలోకి చేరి, ఆవిరిగా మారి, మేఘంలోకి ప్రవేశించి, మళ్ళీ వర్షమై కురుస్తుంది. ఈ జలచక్రం అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం తిరిగినన్ని నాళ్ళు సృష్టి చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది. ఇదొక అంతమెరుగని జల ప్రయాణం….పంచభూతాలలో ఒకటైన నీరు మనకు చేస్తున్న గొప్ప ఉపకారం!
నీరు జంతుజాలానికీ, వృక్షజాతులకీ ప్రాణాధారమైనది. జలమే సకల జగత్తుకు తల్లి వంటిది. ఈ కారణంగానే ప్రపంచంలోని జీవనదుల తీరాలు అనేక నాగరికతలకు జన్మస్థానాలైనాయి. విశిష్టమైన సంస్కృతులు ఈ తీరాలలోనే ఆవిర్భవించాయి. అవే మానవ నాగరితా వికాసానికి తొలి అడుగులైనాయి.
ఐదువేల సంవత్సరాల క్రితం సింధూనదీ తీరంలోని హరప్పా-మొహంజొదారో ప్రాంతాలలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నాగరికత సింధూ నాగరిత. సింధూ ప్రజలు నీటికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సింధూ నాగరికులు నీటిని త్రాగడానికి, స్నానం చేయడానికి మాత్రమే కాక ఔషధంలా కూడా వాడేవారని పరిశోధకులు కనుగొన్నారు. విశాలమైన వీధులలో వెలసిన లోతైన నీటి బావులు హరప్పా నాగరికత సాధించిన ప్రగతికి గొప్ప నిదర్శనాలని పరిశోధకులు పేర్కొన్నారు. ఈవిధంగా ప్రాచీన యుగాల నుండీ భారతీయులకు నీటి వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉండేదని తెలుసుకోవచ్చు.
నీరు ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైనదని వేదాలు కీర్తిస్తున్నాయి. ఈ నీరు అన్ని జంతుజాలాల శరీర పోషణకు, శుద్ధికి ఉపయోగపడుతుంది. అంతే కాదు ఒక దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది.
అంతరంగ శుద్ధికి భారతీయ సాంప్రదాయం ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో బహిరంగ శుద్ధికి అంతే ప్రాధాన్యతను ఇచ్చింది. ఇందులో భాగంగానే మడి, మైల అన్న భావనలు వచ్చాయి. దేహాన్ని, మనసును శుద్ధి చేసుకునేందుకే తీర్థయాత్ర అనే సంప్రదాయాన్ని ఏర్పరిచారు ప్రాచీన భారతీయులు.
ఆకలి వేసిన బిడ్డ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వస్తుంది. ఆకలితో ఏడుస్తున్న బిడ్డ దగ్గరకు తల్లి పరుగెడుతుంది. అలాగే జ్ఞానులు, యోగులు, మహానుభావులు తాము ఉన్న చోటుకే ఆ పరాత్పరుని రప్పించుకుంటారు. సాధనా మార్గంలో బుడి బుడి అడుగులు వేస్తున్న భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడు భగవంతుడు. భక్తులు భగవంతునికి దగ్గరవడానికి చేసేదే ’ప్రయత్నం’ అంటారు. అలాంటి ఒక ముఖ్య ప్రయత్నమే “తీర్థ పర్యటన”.
తీర్థ యాత్రలను చేసే వారి మనసు నిశ్చలమైన భక్తితో నిర్వికారుని నిర్మల రూపాన్ని చింతించడంలో లీనమవుతుంది. పుణ్యక్షేత్రాలలో ఉండే దివ్య తీర్థాలు, నదులలో స్నానం చేయడం వల్ల దేహము, మనసు పవిత్రమవుతాయి. ఆ పవిత్రమైన మనసులో దేవుడు నెలకొంటాడు.
@@@@@
పరమాత్ముని వివిధ అంగాల నుండి పుట్టినవే నదులుగా పేరు పొందాయని పురాణాలు తెలుపుతున్నాయి. పరమ పవిత్రమైన, సర్వశ్రేష్ఠమైన గంగానది, శ్రీమన్నారాయణుని పాదకమలం నుండి ప్రభవించింది. వరాహ స్వామి దంతాల నుండి తుంగ, భద్రా నదులు జన్మించాయి. ఆవిధంగానే వరాహ స్వామి నేత్రాల నుండి నేత్రావతీ నది ఆవిర్భవించాయని పురాణాలు తెలుపుతున్నాయి. సర్వలోకశుభకరుడైన భగవంతుడు అమితమైన దయతో సృష్టించిన ఈ పవిత్ర నదీ నదాలు భారతదేశం నాలుగు దిక్కులా ప్రవహిస్తూ, భారతీయులకు మహోపకారాన్ని చేస్తున్నాయి.
భగవంతుడి దివ్యదేహం నుండి ఆవిర్భవించిన నదులను స్మరిస్తూ “గంగే చ యమునే చైవ/ గోదావరి సరస్వతి/ నర్మదా సింధు కావేరీ/ జలేస్మిన్ సన్నిధం కురు” అంటూ స్నానాన్ని ఆచరించడం ప్రాచీన సాంప్రదాయం. ఈ గంగా, యమునా మొదలైన మహానదులు అటు భుక్తిని ఇటు ముక్తిని అందిస్తున్న పుణ్య జీవ ధారలు. ఈ నదులలో గంగ తరువాత పరమ పవిత్రమైన నది – దక్షిణ భారతావనిలో ప్రవహిస్తున్న గోదావరీ నది.
భరతఖండంలోని ఏడు మహానదుల్లో గోదావరి ఒకటి. గంగ తరువాత అత్యంత పవిత్రమైనది ఈ నది. మహారాష్ట్రలోని ఆది జ్యోతిర్లింగ క్షేత్రమైన త్ర్యంబకం ఈ నదికి పుట్టినిల్లు. మన రాష్ట్రంలోని అంతర్వేది మెట్టినిల్లు. పుట్టినింటి నుండి దాదాపు 1500కి.మి ప్రవహించి మెట్టినింటిని చేరుతుంది. తాను ప్రయాణిస్తున్న ఈ దారి పొడవునా ప్రకృతిని, జంతువులను, మానవులను ఉద్ధరిస్తూ, ఊరడిస్తూ సాగుతుంది ఈ గోదావరి.
గోదవరీ నది మహిమ పద్మ, వరాహ, బ్రహ్మాండ పురాణాల్లో వర్ణితమై ఉంది. అంతే కాదు ప్రతి రోజు చేసే సంకల్పంలో “గోదావర్యా: దక్షిణే తీరే….” అని చెప్పడం గోదావరీ వైశిష్ట్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఆది జ్యోతిర్లింగ క్షేత్రమైన త్య్రయంబకేశ్వరంలోని బ్రహ్మగిరి పర్వతంపై ఆవిర్భవించిన గోదావరీ నది ఆ పుణ్యధామం నుండి ప్రయాణించి, త్య్రయంబకానికి నలభై కిలోమీటర్ల దూరంలో గల చక్రతీర్థం వద్ద పశ్చిమవాహినీ గంగ తో సంగమిస్తుంది. ఈ చక్రతీర్థం వద్దనే ఉద్ధృత ప్రవాహ రూపాన్ని దాల్చే గోదావరి తన తదుపరి మజిలీగా నాసిక్ పట్టణాన్ని చేరుతుంది.
నాసిక్ పట్టణం
మహారాష్ట్రలోని ప్రముఖ పట్టణాల్లో నాసిక్ ఒకటి. ఈనాడు అనేక పరిశ్రమలతో కూడి, ప్రముఖ ఉత్పాదక కేంద్రంగా పేరు పొందిన నాసిక్ పట్టణం ప్రాచీనకాలం నుండి మహాపుణ్యస్థలిగా పురాణ ప్రసిద్ధమయింది. కృతయుగంలో ప్రజాకంటకులైన ముగ్గురు రాక్షసుల్ని విష్ణువు, శివుడు కలసి వచ్చి ఈ ప్రాంతంలో సంహరించడం వల్ల “త్రికంటకం” అని, ద్వాపర యుగంలో “జనస్థానం” అని పిలువబడిన ఈ ప్రాంతం త్రేతాయుగంలో “పంచవటి”గా ప్రసిద్ధి చెందింది. నాలుగు యుగాలలోనూ పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందిన నాసిక్ ను ’దక్షిణ కాశీ’గా కూడా పిలుస్తారు.
భారతదేశపు ప్రముఖ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలలో నాసిక్ పట్టణానికి సంబంధించిన ఉల్లేఖనాలు ఉన్నాయి. మధ్యయుగాల దక్షిణ భారతదేశ చరిత్రలో నాసిక్ ప్రాంతం అత్యంత కీలకమైన పట్టణంగా ఆవిర్భవించింది. ఆవిధంగా నేటి నాసిక్ పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణంగా వెలుగొందుతోంది.
రామకుండ్/గంగా గోదావరీ ఘాట్
చక్రతీర్థం నుండి బయలుదేరిన గోదావరీ నది నాసిక్ పట్టణాన్ని చేరాక మొదటగా ఇక్కడి “రామతీర్థం”లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రామతీర్థాన్ని “రామకుండ్” అని కూడా పిలుస్తారు.
సింహస్థ గోదావరీ మహాకుంభమేళా సందర్భంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధ “షాహీ స్నాన్” ఇక్కడే జరగడం వల్ల ఈ రామతీర్థాన్ని “గంగా గోదావరీ ఘాట్” అని కూడా పిలుస్తారు.
అనేక దేవాలయాలతో పరివేష్ఠితమైన ఈ రామతీర్థం భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రామతీర్థం వెనుక భాగంలో సుమిత్రా తనయుడు, నిత్యరామసేవదీక్షాదక్షుడైన లక్ష్మణస్వామి పేరుతో వెలసిన లక్ష్మణ తీర్థం దర్శనమిస్తుంది. ఈ తీర్థంలోని పవిత్ర గోదావరీ జలాల్లో భక్తులు స్నానమాచరిస్తారు.
లక్ష్మణ కుండం తరువాత అంజనాసుతుడు, అక్షకుమారహర్తుడు, శ్రీరామపాదారవింద దాసుడైన హనుమంతుడి పేరుతో వెలసిన హనుమాన్ కుండం దర్శనమిస్తుంది. ఈ తీర్థంలో కూడా భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు.
శ్రీ రామతీర్థం పుణ్యతీర్థంగానే కాక పవిత్ర నదీ సంగమ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థంలో గోదావరీ – అరుణా – వరుణా నదుల సంగమం జరుగుతుంది. ఈ అరుణా, వరుణా నదులు అంతర్వాహినులుగా వచ్చి గోదావరిలో కలుస్తాయి. నదుల కంటే నదీ సంగమ ప్రదేశాలు ఉత్తమమైనవని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఆవిధంగా గోదావరీ-అరుణా-వరుణా నదుల సంగమస్థలి ఐన రామతీర్థం అత్యంత పవిత్రమైన స్నానఘట్టంగా ప్రసిద్ధిని పొందింది.
జన్మస్థలి ఐన త్ర్యయంబకం నుండి పశ్చిమవాహినిగా ప్రవహిస్తూ వచ్చిన గోదావరీ నది ఈ రామతీర్థం వద్దనే దక్షిణాభిముఖంగా ప్రవహించడం ఆరంభిస్తుంది. ఆవిధంగా ఈ రామతీర్థం వద్దనే గోదావరీ నది “దక్షిణ వాహిని” అన్న ఖ్యాతిని పొందుతుంది.
“పంచవట్యాం విశేషేణ/ గోదా దక్షిణ వాహినీ/ శ్రీ రామచంద్ర ప్రసాదేన/ భక్తి ముక్తి ప్రదాయినీ” అని శాస్త్రాలు ఈ దక్షిణవాహినీ ప్రదేశాన్ని విశేషంగా వర్ణిస్తున్నాయి. పంచవటీ క్షేత్రమైన నాసిక్ వద్ద శ్రీ రామచంద్రుని ప్రసాద రూపంలో లభిస్తున్న దక్షిణవాహినీ గోదావరీ నది భక్తి ముక్తి ప్రదాయినీ అని తలచి, నమస్కరించే భక్తులను ఆ శ్రీరామవరప్రసాది ఐన గోదావరీ మాత తప్పక అనుగ్రహిస్తుంది.
నదీ సంగమ క్షేత్రాలతో బాటు నదులు తమ దిశలను మార్చుకునే ప్రదేశాలను ఉత్తమ క్షేత్రాలుగా పురాణాలు, సంహితలు కీర్తిస్తున్నాయి. ఆవిధంగా రామతీర్థం ఒక ప్రత్యేకమైన, విశిష్ఠమైన, అమోఘమైన పుణ్యతీర్థం. నదీ దిశా పరివర్తనా క్షేత్రంగాను, మూడు నదుల సంగమక్షేత్రంగాను వాసికెక్కిన అరుదైన క్షేత్రాలలో ఈ రామతీర్థం ఒకటి. ఈ కారణం వల్లనే ఇక్కడ నిత్యం వందలాది భక్తులు పుణ్య స్నానాన్ని ఆచరించి తరిస్తుంటారు.
శ్రీ రామచంద్రుడు వనవాస కాలంలో దశరథునికి ఇక్కడే పిండప్రదానం చేయడం వల్ల ఈ తీర్థానికి “రామతీర్థం” అన్న సార్థక నామధేయం కలిగింది. “రామతీర్థం”లో పిండప్రదానం చేస్తే పితరులు బ్రహ్మలోకాన్ని పొందుతారని స్థలపురాణం తెలుపుతోంది. రామకుండంలో పితృశ్రాద్ధాన్ని నిర్వహించడం వల్ల పితరులు బ్రహ్మలోకప్రాప్తితో బాటు నిర్వహించిన వారికి పితృదోషం తొలగిపోతుందని ప్రతీతి. భారతీయ ధర్మశాస్త్రం గతించిన పితరులకు అంత్యక్రియలతో బాటు శ్రాద్ధకర్మలను కూడా చేయాలని సూచిస్తోంది. శ్రాద్ధకర్మల్ని ఆచరించకపోవడం వల్ల “పితృదోషం” సంభవిస్తుందని ధర్మశాస్త్రం హెచ్చరిస్తోంది. నాసిక్ పుణ్యక్షేత్రంలో వెలసిన రామతీర్థంలో శ్రాద్ధకర్మల్ని నిర్వహిస్తే పితృదోషం తొలగిపోతుందని స్థలపురాణం తెలుపుతోంది. శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన “రామతీర్థం”లో భక్తులు గతించిన తమ పితరులకు పిండప్రదానం చేస్తారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను “పితరులు” అని పిలుస్తారు. ప్రపంచంలో జీవించడానికి కావలసిన వ్యవహారాల పట్ల జ్ఞానాన్ని, అవగాహనను కల్పించడంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్రను పోషిస్తారు. బిడ్డలను ఎల్లప్పుడూ రక్షించడానికై తపన పడే వ్యక్తి కనుక తండ్రిని “పిత” అని పిలిచింది శాస్త్రం. బిడ్డల మనసును తెలుసుకొని వారిని ఊరడించి, పోషించే తల్లిని “మాతా” అని ప్రేమతో పిలిచింది శాస్త్రం. వీరిద్దరినీ కలిపి “పితరులు” అని ఉమ్మడిగా పిలుస్తారు. ఆవిధంగా పుత్రులు తమకు రక్షణను, ప్రేమను, పోషణను అందించిన పితరుల పట్ల గౌరవాన్ని కలిగివుండాలి. “మాతృదేవోభవ/ పితృదేవోభవ” అన్న వేదవాక్కును అనుసరించి తల్లిదండ్రుల పట్ల పూజ్యభావాన్ని ఎల్లప్పుడూ కలిగివుండాలి. వేదోక్తమైన ఈ విషయాన్నే మరింత స్పష్టం చేస్తూ మహాకవి కాళిదాసు కూడా “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అని తల్లిదండ్రుల వైశిష్ట్యాన్ని, గొప్పదనాన్ని దశదిశలా చాటాడు.
పితరులు జీవించివున్నప్పుడే కాక వారు గతించిన తరువాత కూడా వారి అనుగ్రహాన్ని కోరుతూ పూజించాలని గరుడపురాణం స్పష్టం చేస్తోంది.
మరణించిన పితరుల తృప్తికై అత్యంత శ్రద్ధతో చేసే కార్యమే “శ్రాద్ధ కర్మ”గా ప్రసిద్ధికెక్కింది. జన్మను ఇచ్చి, ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మానవ దేహాన్ని ఇచ్చి, రక్షణను, పోషణను అనుగ్రహించిన తల్లిదండ్రులను స్మరించుకొంటూ వారు గతించిన రోజున అత్యంత శ్రద్ధతో చేసే పూజాక్రమమే “శ్రాద్ధం.”
“ఆయురారోగ్య మర్థం చ/ పుత్రపౌత్రాదికం తథా/ వాంఛద్బిః సతతం స్తవ్యాః/ స్తోత్రేణానేన వై యతః” పవిత్ర కార్యమైన శ్రాద్ధకర్మను నిర్వహించి, పితరులను స్మరించిన వారికి ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యాభివృద్ధితో సహా పుత్రలాభం కూడా కలుగుతుందని గరుడపురాణంలో సాక్షాత్ శ్రీకృష్ణపరమాత్మ విశదీకరించాడు.
“దేవైర్ అపి హి తర్ప యంతే/ యే శ్రాద్ధేశు స్వధోత్తరైః” అన్న పురాణ వచనాన్ని స్వయంగా ఆచరించి చూపిన ఆదర్శ పుత్రుడు శ్రీరామచంద్రుడు. అనాదినిత్యుడు, ఆదిమధ్యాంతరహిడు, దేవదేవోత్తముడైన శ్రీమన్నారాయణునికి తల్లిదండ్రులు లేరు. శ్రీరామ, కృష్ణాది అవతార రూపాలలో ఈ భువిపై వెలసినప్పుడు తల్లిదండ్రులను విశేషంగా గౌరవించి, పూజించాడు. వారు గతించిన తరువాత అంత్యకార్యాలను, శ్రాద్ధకర్మలను అత్యంత శ్రద్ధాభావంతో వినీతుడై ఆచరించాడు. కర్మబంధాలు లేని ఆ కర్మదూరుడు కర్మల్ని ఆచరించడం మానవులకు ఆ కర్మల గొప్పదనాన్ని పరిచయం చేయడనికే అని జ్ఞానులు ఉపదేశించారు.
“గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతి ఈతడే” అని అన్నమయ్య ప్రార్థించిన పరమపురుషుడు శ్రీనివాసుడే శ్రీరామునిగా అవతరించి పవిత్ర గోదావరీ నదీ తీరంలో వెలసిన ఈ రామతీర్థంలో పితృకార్యాన్ని నిర్వహించాడు.
“తస్య పాప విముక్త్యర్థం/ యత్క్షణం తర్పయామ్యహమ్/ ఇతి గౌతమీ తటే త్రీణి/ అంజలి ఉదకాని ప్రక్షిపేత్” అంటూ ఎవరు మూడు దోసిళ్ళ తో గోదావరీ జలాన్ని తీసుకుని పితృదేవతలకు జలతర్పణం చేస్తారో వారు సర్వపాపాల నుండి విముక్తులవుతారని పురాణాలు చాటుతున్నాయి. శ్రీరామచంద్ర పవిత్ర హస్తస్పర్శతో పునీతమైన పావన గోదావరీ జలాలతో రామతీర్థంలో అర్పించే పితృతర్పణం అనన్య సామాన్యమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. పితృదేవతల అనుగ్రహాన్ని పొందదలచిన భక్తులు ఈ రామతీర్థంను తప్పక దర్శించాలి.
శ్రీ రామతీర్థంలో భక్తులు పిండప్రదానంతో బాటు అస్థినిమజ్జనం కూడా చేస్తారు. ఇక్కడ ప్రతిరోజూ దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి మరణించిన తమ వారి అస్థికలను రామతీర్థంలో నిమజ్జనం చేస్తారు. ఈ తీర్థంలో నిమజ్జనం చేసిన అస్థికలు మూడు గంటలలోనే సంపూర్ణంగా కరిగిపోతాయని స్థానికులు చెబుతారు. రామతీర్థం ఒడ్డున అస్థినిమజ్జనానికై ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసారు. ఈ ప్రత్యేక స్థలంలోనే భక్తులు అస్థినిమజ్జనం చేస్తారు.
పరమ పవిత్రమైన రామతీర్థం చుట్టుప్రక్కల పురాణ ప్రసిద్ధాలైన దేవాలయాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఈ దేవాలయాల్లో శ్రీ సుందర నారాయణ మందిరం, శ్రీ నీలకంఠేశ్వర మందిరం, శ్రీ కపాలేశ్వర మందిరం, శ్రీ గంగా గోదావరీ మందిరం, శ్రీ నారో శంకర మందిరాలు ప్రముఖమైనవి. ఈ ఆలయాల నుండి వినవచ్చే ఘంటానాదాలతో పవిత్ర రామతీర్థం పరిసరాలు భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి.