గంగా గోదావరీ మందిరం
రామతీర్థం తీరంలో వెలసిన మహిమాన్విత ఆలయం శ్రీ గంగా గోదావరీ మందిరం. ఈ మందిరంలో పరమపావని ఐన గంగా గోదావరీ దేవి వివిధ హారాలతో అలంకృతురాలై, దివ్యమకుటధారిణియై భక్తులకు దర్శనమిస్తుంది.
“నానారత్న మయాభాఢ్యామ్/ లసన్మకుట ధారిణీమ్/ ముక్తామాణిక్య సమ్మిశ్ర/ దివ్యాభరణ భూషితామ్” – “తల్లీ, అనేక రత్నాలను, ఆభరణాలను, ప్రకాశించే కిరీటాన్ని ధరించిన నీకు మా నమోవాకాలు” అంటూ ఎవరు గోదావరీ దేవిని స్తుతించి, నమస్కరిస్తారో వారికి అనంత పుణ్యం లభిస్తుంది.
గోదావరీ నది దక్షిణాభిముఖంగా ప్రవహించే పుణ్యస్థలమైన రామతీర్థం వద్ద వెలసిన ఈ గంగా గోదావరీ మందిరాన్ని నిత్యం వందలాది భక్తులు దర్శించుకొంటారు. మందిరంలో నెలకొనివున్న అమ్మవారి పాదాలకు భక్తితో నమస్కరించి, ఆ నదీమతల్లి అనుగ్రహానికై ప్రార్థిస్తారు.
ముఖ్య ప్రాచీన గోదావరీ మందిరం
రామతీర్థం పరిసరాల్లో వెలసిన మరొక దివ్య మందిరం శ్రీ ముఖ్య ప్రాచీన గోదావరీ మందిరం. ఈ మందిరంలో గోదావరీ దేవి చతుర్భుజాలతో అలరారుతూ భక్తులకు దర్శనమిస్తుంది. మందిర అంతర్భాగంలో నల్లని రాతితో చేసిన కూర్మం ఐహిక వాంఛలనుండి మానవులు దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇస్తూ కనిపిస్తుంది.
గర్భాలయంలో కర్మసాక్షి, ప్రత్యక్షదైవమైన సూర్యుడు, ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని ప్రసాదించే చంద్రుడు, బుద్ధిబలాన్ని, స్థైర్యాన్ని అనుగ్రహించే హనుమంతుని మూర్తుల్ని కలిగిన వెండి కవచం, ఆ కవచం ముందు భాగంలో ఆకుపచ్చని చీరను ధరించిన గోదావరీ దేవి దర్శనమిస్తుంది. భారతీయ సనాతన సాంప్రదాయంలో రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఆకుపచ్చ రంగును శాంతికి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో సంతోషంతో కూడుకున్న జీవితానికి సూచనగా ఆకుపచ్చ రంగును ఉపయోస్తారు. ఆవిధంగా గోదావరీ దేవి ఆకుపచ్చని చీరతో దర్శనమిస్తూ గోదావరీ నదీతీర ప్రాంతాల్లోని ప్రజలు సుఖశాంతులతో జీవితాలను గడుపుతారని సూచిస్తూ ఈ ముఖ్య ప్రాచీన గోదావరీ మందిరంలో నెలకొనివుంది. అనేక హారాలను అలంకరించుకుని, నయనానందకరంగా దర్శనమిచ్చే గోదావరీ దేవిని ముఖ్యప్రాచీన గోదావరీ మందిరంలో దర్శించుకుని ధన్యులవుతారు భక్తులు.
సింహస్థ గౌతమీ గంగా గోదావరీ భాగీరథీ మందిరం
గోదావరీ నది మహానదిగా రూపుదిద్దుకునే నాసిక్ పట్టణంలోని రామతీర్థం ఒడ్డున మరొక గోదావరీ దేవి మందిరం ఉంది. ఈ మందిరాన్ని “సింహస్థ గౌతమీ గంగా గోదావరీ భాగీరథీ మందిరం”గా పిలుస్తారు. ఈ మందిరం అత్యంత వైశిష్ట్యపూర్ణమయిన మందిరం. ఈ మందిరాన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తెరుస్తారు. సింహరాశిలో బృహస్పతి ప్రవేశించడంతో గోదావరీ నదీ పుష్కరాలు ఆరంభమవుతాయి. ఈ పుష్కరాలనే మహారాష్ట్రలో “సింహస్థ కుంభమేళా”గా వ్యవహరిస్తారు. ఈ “సింహస్థ గౌతమీ గంగా గోదావరీ భాగీరథీ” మందిరాన్ని కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే తెరుస్తారు. పదమూడు నెలల పాటు సాగే కుంభమేళా సమయంలో ఈ మందిరం పదమూడు నెలల పాటు భక్తుల దర్శనార్థమై తెరచివుంటుంది. మిగిలిన సమయాల్లో ఈ మందిరాన్ని మూసివుంచుతారు. కుంభమేళాలో కాక ఇతర సమయాల్లో వచ్చే భక్తులు ఆలయ ద్వారం వద్దనే పూజలు జరిపి, సింహస్థ గౌతమీ గంగా గోదావరీ భాగీరథీ మాతను సేవిస్తారు.
ఈ మందిర ప్రాంగణంలో గౌతమ ఋషి విగ్రహం జటామకుటంతో, విశాల నేత్రాలతో భక్తులకు దర్శనమిస్తుంది. సప్తఋషులలో ఒకడైన గౌతమ ఋషి ప్రక్కనే ఆ మహాఋషి అర్ధాంగి, మహాపతివ్రత ఐన అహల్యాదేవి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. గోదావరీ నది ఆవిర్భావానికి కారకులైన ఈ ఋషి దంపతులకు నమస్కరించి కృతార్థులవుతారు భక్తులు.
దుతోండ్యా మారుతి
“గంగా గోదావరీ ఘాట్”గా కూడా పిలువబడే రామకుండ్ తీరంలో మహాబలశాలియై, సంజీవనగిరిధారి, లక్ష్మణ ప్రాణదాత ఐన హనుమంతుడు “దుతోండ్యా మారుతి”గా దర్శనమిస్తాడు. మరాఠాలో దుతోండ్యా అంటే రెండు ముఖములు కలిగిన అని అర్థం. ఇక్కడి హనుమంతుడు ద్విముఖాలతో దర్శనమివ్వడం విశేషం. దుతోండ్యా మారుతి విగ్రహాన్ని ఉత్తర, దక్షిణ దిశల్లో ఉండేట్టుగా మలచారు. దక్షిణ దిశగా వెలసిన మారుతి వీరాంజనేయ స్వామిగా ఉద్దండ గదాదండాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఆ వీరాంజనేయుడు తన పాదాలతో రాక్షసుణ్ణి సంహరిస్తూ, అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తాడు. ఉత్తర దిశగా వెలసిన ఆంజనేయుడు అత్యంత సౌమ్యమూర్తియై, ముకుళిత హస్తాలతో భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీరామచంద్రుని పట్ల గల అనన్య దాసభావాన్ని ప్రతిబింబిస్తూ దర్శనమిచ్చే ఈ దాసాంజనేయుణ్ణి ప్రతినిత్యం భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
“ప్రసన్నాంగరాగం/ ప్రభాకాంచనాంగం/ జగద్భీత శౌర్యం/ తుషారాద్రి ధైర్యమ్
తృణీభూత హేతిం/ రణోద్యద్ విభూతిం/ భజే వాయుపుత్రం/ పవిత్రాప్త మిత్రమ్”
అంటూ శ్రీ ఆంజనేయ భజంగ స్తోత్రం వర్ణించే హనుమంత రూప విశేషాలకు ప్రతీకగా ఈ దుతోండ్యా మారుతి భక్తులకు దర్శనమిస్తాడు.
గోదావరీ నది ప్రవాహ స్థాయిని సూచించే ప్రతిమగా కూడా దుతోండ్యా మారుతీ స్వామిని ఇక్కడి స్థానికులు భావిస్తారు. స్వామివారి విగ్రహంలోని ఏయే భాగాలు గోదావరి నీటిలో మునిగాయో చూసి, దానిని బట్టి వరద ప్రవాహాన్ని, నది లోతును అంచనా వేస్తారు స్థానికులు.
శ్రీ స్వయంభు బాణేశ్వర మహాదేవ మందిరం
సింహస్థ గౌతమీ గంగా గోదావరీ భాగీరథీ మందిరానికి అత్యంత సమీపంలో శ్రీ స్వయంభు బాణేశ్వర మహాదేవ మందిరం భక్తులకు శివ దర్శన సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఐదుపడగలతో కూడి, తామ్రమయమైన నాగఫణి ఛాయలో శ్రీ బాణేశ్వర మహాదేవుడు భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తాడు. స్వామివారికి ఎదురుగా ప్రమథగణ ప్రథముడైన నందీశ్వరుడు అమృతశిలా శిల్పరూపంలో ఆసీనుడైవుంటాడు. శ్రీ బాణేశ్వర మహాదేవ్ ప్రక్కలో గణనాయకుడైన విఘ్నేశ్వరుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు. ఎటువంటి గోడలు, అడ్డంకులు లేని సరళ సుందరమైన మందిరంలో కొలువైవున్న స్వయంభు బాణేశ్వర మహాదేవ్ ను అనునిత్యం భక్తులు సేవించి, తరిస్తుంటారు.
శ్రీ నీలకంఠేశ్వర మందిరం
శ్రీ రామ కుండం తీరాననే వెలసిన మహత్తర శివ సన్నిధానమే శ్రీ నీలకంఠేశ్వర మందిరం. దాదాపు మూడువందల యాభై సంవత్సరాల క్రితం 1662వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం నల్లటి నిప్పురాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం త్ర్యయంబకేశ్వరాలయ నిర్మాణాన్ని పోలివుంటుంది. శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ మందిరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మందిరంలో రెండు నందులు వెలసివుండడమే మొదటి ప్రత్యేకత. గర్భాలయంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి లింగానికి రెండు పానమట్టాలు ఉండడం మరొక ప్రత్యేకత. రెండు నందులు, రెండు పానమట్టాలతో విలసిల్లే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరంను అనునిత్యం వందలాది భక్తులు దర్శించి, తరిస్తుంటారు.
రామతీర్థం నుండి శ్రీ నీలకంఠేశ్వర మందిరానికి దారి తీసే మెట్లను ఎక్కి మందిర ప్రాంగణంలోకి ప్రవేశించగానే నల్లరాతితో చేసిన నంది విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివుని ప్రమథగణాల్లో ప్రథముడైన ఈ నందీశ్వరుడు మహాశంకరునికి వాహనం మాత్రమే కాదు కైలాసానికి ద్వారపాలకుడు కూడా. శ్రీ నీలకంఠేశ్వర మందిరంలో ఆసీనుడైవున్న ఈ నందిని శివుని ప్రమథగణాల్లో అగ్రగణ్యుడైన కాలభైరవుడే ఇక్కడ ప్రతిష్టించాడని ప్రతీతి. ఇందుకు నిదర్శనంగా నందీశ్వరుని ముఖభాగం క్రింద నిలబడివున్న కాలభైరవ మూర్తి భక్తులకు దర్శనమిస్తుంది. పరమశివుని అంశగా భావించే కాలభైరవుడు చేతులు జోడించి, నీలకంఠేశ్వర స్వామిని తదేకంగా వీక్షిస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. కాలభైరవుని వెనుకభాగంలో నందీశ్వరుడు ఉదయరవి కిరణాల వెలుగులో ఉన్నతాసీనుడై దర్శనమిస్తాడు. ధ్యానభంగిమలో ఆసీనుడైవున్న నందీశ్వరుడు గర్భాలయంలో శతకోటి రవితేజాన్ని మీరి మిరుమిట్లు గొలిపే శివతేజాన్ని కన్నార్పకుండా చూస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. ఈ శివగణాల దర్శనంతో భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి, శివనామస్మరణతో మందిరంలోకి ప్రవేశిస్తారు.
శ్రీ నీలకంఠేశ్వర మందిరంలోని మహామండపం అష్టభుజాకృతిలో దర్శనమిస్తుంది. ఈ మందిరం అష్ట దిక్కులలోనూ అద్భుత శిల్పసౌందర్యం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మూడువందల యాభై ఏళ్ళ క్రిందట మలచిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా నిలచివుండి కనువిందుగా కనిపిస్తాయి. అష్టభుజాకృతిలో వెలసిన ఈ మహామండపంలో శ్వేత నందికేశ్వరుడు మనోహరమైన భంగిమలో ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే నందీశ్వరుడు నలుపు వర్ణంలో, కాలభైరవ ప్రతిష్టితమై దర్శనమిస్తే ఆలయ అంతర్భాగంలోని ఈ శ్వేత నందీశ్వరుడు మార్కండేయ ఋషి ప్రతిష్టితుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఈ శ్వేత నంది ముఖం క్రింది భాగంలో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న మార్కండేయుడు భక్తులకు దర్శనమిస్తాడు.
పూర్వం మృకండ మహర్షి తపస్సు చేసి అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి కుమారునిగా పొందాడు. పరమశివ భక్తుడైన మార్కండేయుడు నిరంతర శివధ్యాన నిమగ్నుడై, నిత్య శివారాధనతత్పరుడవుతాడు. మార్కండేయుని ఆయుష్షు తీరడంతో అతని ప్రాణాలను హరించడానికై మృత్యుదేవత ఐన యమధర్మరాజు విచ్చేసాడు. శివధ్యానపరాయణుడైన మార్కండేయుడు శివపూజను పూర్తి చేసి వస్తానని చెబుతాడు. అందుకు సమ్మతించని యముడు తన కాలపాశంతో మార్కండేయుణ్ణి బంధించబోతాడు. భయభీతుడైన మార్కండేయుడు తాను పూజిస్తున్న శివలింగాన్ని బలంగా ఆలింగనం చేసుకొంటాడు. యముడు విసిరిన కాలపాశం మార్కండేయుడితో బాటు శివుణ్ణి కూడా బంధిస్తుంది. కుపితుడైన పరమశివుడు ప్రత్యక్షమై దుర్నిరీక్ష్యమైన త్రిశూలంతో దండధరుడైన యముణ్ణి శిక్షించాడు. శివభక్తుని పట్ల చేసిన అపచారాన్ని మన్నించమని యముడు ప్రార్థించడంతో కపర్ది శాంతించి మార్కండేయునికి అఖండమైన ఆయుష్షును వరంగా కటాక్షించాడు.
శివనామస్మరణలోని శక్తిని ప్రపంచానికి ప్రదర్శించిన భక్త మార్కండేయుని దర్శనాన్ని నీలకంఠేశ్వర మందిరంలో పొందిన భక్తులు శివమహిమను స్మరించుకొంటారు.
అష్టకోణాత్మకమైన మహామండపాన్ని దాటి చతుర్భుజాకారంలో నిర్మితమైన అంతరాళంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ అంతరాళం కూడా శిల్పకళాశోభితమై అలరారుతూవుంటుంది. అంతరాళం తరువాత శ్రీ నీలకంఠేశ్వరుడు వెలసిన గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది.
అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అలరారే గర్భగృహంలో నలుపు, తెలుపు పానమట్టాలతో, మహత్తరమైన తేజస్సుతో అలరారే శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు. జీవరాశులకు అంతరంగమై, అనవరతం వారిని ప్రేరేపించి, నడిపించే పరమశివుణ్ణి శ్వేత లింగరూపంలో దర్శించి పునీతులవుతారు భక్తులు.
ఈ సమస్త భారతదేశంలో రెండు పానమట్టాలను కలిగిన ఏకైక శివాలయం ఈ నీలకంఠేశ్వర మందిరమేనని చెబుతారు. ఈ రెండు పానమట్టాలలో ఒకటి నలుపు వర్ణంలోను, మరొకటి తెలుపు వర్ణంలోను దర్శనమిస్తాయి. శివుని భూషణమైన నాగాభరణం సాధారణంగా స్వామివారి వెనుక భాగంలో పడగలు విప్పుకుని దర్శనమిస్తుంది. కానీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరంలోని శ్వేత నాగు శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పుకొన్నట్టుగా కాక నేలపై ప్రాకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని స్వామివారి వెనుక భాగంలో గోడకు బిగించిన అద్దంలో నుండి భక్తులు స్పష్టంగా చూడవచ్చు. శ్రీ నీలకంఠేశ్వరుని గర్భాలయం నుండి వీక్షిస్తే ఈ ఆలయ విశిష్ఠత ఐన రెండు నందులనూ ఏకకాలంలో వీక్షించవచ్చు.
అనేక విశిష్ఠతలకు నెలవైన శ్రీ నీలకంఠేశ్వర మందిర దర్శనం భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడిస్తుంది. ప్రాచీన శిల్పకళా నైపుణ్యంతో అలరారే ఈ మందిర దర్శనం నాసిక్ పర్యటనలో ఒక అపురూపమైన ఆధ్యాత్మిక మజిలిగా మిగులుతుంది.
శ్రీ ప్రాచీన గోరా రామ మందిరం
శ్రీ నీలకంఠేశ్వర మందిరం ప్రక్కనే, కూతవేటు దూరంలో వెలసిన మరొక అద్భుత ప్రాచీన మందిరం శ్రీ ప్రాచీన గోరా రామ మందిరం. నీలకంఠేశ్వరాలయం ప్రక్కనే గల చిన్న సోపాన మార్గాన్ని ఎక్కి ఈ మందిరాన్ని చేరుకుంటారు భక్తులు. ఈ ఆలయం 1782వ సంవత్సరంలో స్థాపించబడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి మరాఠా సామ్రాజ్యాధినేత ఐన మాధవరావ్ పేష్వా వద్ద న్యాయవాదిగా పని చేసిన దేవేరావ్ హింగ్నే ఈ ఆలయాన్ని నిర్మించాడు.
శ్రీ గోరా రామ్ మందిరంలోని శ్రీరామ పంచాయతనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమంత సమేతుడై శ్రీ రాముడు దర్శనమిస్తాడు. ఈ మందిరంలో వెలసిన శ్రీరాముడు ధవళవర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. “నీలోత్పల శ్యామమ్/ రామమ్/ రాజీవలోచనమ్” అని భక్తులు కీర్తించినట్టుగా ఎల్లప్పుడూ నీలమేఘశ్యామునిగా దర్శనమిచ్చే దశరథరాముడు, ఈ మందిరంలో శుద్ధ శ్వేత వర్ణంలో దర్శనమిస్తాడు. ఇందుకే ఈ రాముడు గోరా రామునిగా ప్రసిద్ధి చెందాడు. మరాఠాలో గోరా అంటే తెలుపు రంగు అని అర్థం. ఆవిధంగా శ్వేతవర్ణంలో ఇక్కడ వెలసిన శ్రీరాముణ్ణి “గోరా రామ్”గా పిలుస్తారు భక్తులు.
ఇరువైపులా సీతా లక్ష్మణులతో కూడిన గోరా రాముడు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాడు. శ్రీ గోరా రామునికి ఇరువైపులా కొలువైవున్న సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా తెలుపు రంగు మేని ఛాయతో దర్శనమివ్వడం మరొక విశేషం. శ్రీ గోరా రామునికి ఎదురుగా అమిత బలసంపన్నుడు, లంకానగర విధ్వంసి, రామపదసరసీరుహ భృంగమైన హనుమంతుడు దర్శనమిస్తాడు.
శ్రీ గోరా రామచంద్రునికి ఎదురుగా గంగాదేవి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీరామ వనవాస సమయంలో గుహుడు తన పడవపై సీతా రామచంద్రుల్ని ఆహ్వానించి, గంగానదిని దాటించిన ఘట్టం రామాయణంలో హృద్యంగా వర్ణించబడింది. ఆ గంగానదియే గోదావరిగా రూపుదాల్చి ఈ నాసిక్ పట్టణంలో ప్రవహిస్తోంది. ఇందుకు గుర్తుగా ఈ ఆలయంలో గంగా విగ్రహాన్ని స్థాపించారు.