శ్రీ దశభుజ సిద్ధి వినాయక స్వామి మందిరం
గోరా రామ్ ఆలయ ప్రాంగణంలో గోరా రామ్ కంటే ప్రాచీనమైన శ్రీ దశభుజ సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంది. శ్రీ దశభుజ సిద్ధి వినాయక స్వామి ప్రతిష్ఠాపన 1623లో జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. శ్రీ దశభుజ వినాయక మందిరంలోకి ప్రవేశించగానే గణేశునికి అగ్రభాగంలో నందీశ్వర సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. గణేశుని కుడివైపు రామభక్తుడైన హనుమంతుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు. ఎడమవైపు గురుదేవుడైన దత్తాత్రేయుడు నెలకొని కోరిన భక్తులకు జ్ఞానప్రదానం చేస్తూ సాక్షాత్కరిస్తాడు.
శ్రీ గోరా రామ మందిరంలో అనేక విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. రాక్షస సంహారాన్ని చేస్తున్న అంబికాదేవి విగ్రహం సజీవమూర్తిలా భక్తులకు గోచరిస్తుంది. శ్రీ గోరా రామ్ సమీపంలో వెలసిన శివపార్వతుల విగ్రహం నయనమనోహరంగా ఉంటుంది. పరమశివుడు చతుర్భుజుడై ధ్యానముద్రలో జపం చేస్తుండగా, పార్వతీదేవి రెండు చేతులను జోడించి వినమ్రురాలై దర్శనమిస్తుంది. శ్రీ గోరా రామ్ కు మరోవైపు సర్వవిఘ్న నివారకుడైన సిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు.
నాసిక్ తీర్థయాత్రలో విశిష్ఠమైన శ్రీ గోరా రామ మందిర దర్శనం భక్తులకు అలౌకిక ఆనందాన్ని అందిస్తుంది.
శ్రీ నారో శంకర మహాదేవ మందిరం
నాసిక్ పుణ్యస్థలిలో, గోదావరీ నదీ తీరంలో, రామ్ ఘాట్ గా పిలువబడే రామతీర్థం సమీపంలో వెలసిన భవ్య శివమందిరం శ్రీ నారో శంకర మహాదేవ మందిరం. నలుదిక్కులా ఎత్తైన రాతి గోడను కలిగి, నాలుగు మూలల్లో కోట బురుజులను పోలిన మందిర నిర్మాణాలతో వినూత్నంగా దర్శనమిచ్చే నారో శంకర మహాదేవ మందిరం నాసిక్ పట్టణంలోని దర్శనీయ స్థలాల్లో ఒకటిగా ప్రసిద్ధి కెక్కింది.
నాసిక్ పట్టణంలో గల ప్రాచీన దేవాలయాలన్నీ దాదాపు నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. శ్రీ నారో శంకర మహాదేవ మందిరం మాత్రం “హేమాడ్‍పంథి శైలి”లో నిర్మితమయింది. తొమ్మిదవ శతాబ్దం నుండి పద్నాల్గవ శతాబ్దం వరకూ దేవగిరిని రాజధానిగా కలిగి తుంగభద్ర-నర్మదా నదుల మధ్యభాగాన్ని పాలించిన సేవున యాదవ రాజుల కాలంలో సాహిత్యం, శిల్పకళలు కొత్త పుంతల్ని త్రొక్కాయి. 1259 నుండి 1274 వరకూ యాదవ సామ్రాజ్యాన్ని పాలించిన రాజా మహాదేవ్, రాజా రామచంద్రల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన హేమాడ్‍పంత్ గొప్ప సాహిత్యవేత్తగా, ఆలయ నిర్మాతగా పేరుగాంచాడు. హేమాద్రి అన్న పేరుతో కూడా ప్రసిద్ధి చెందిన హేమాడ్‍పంత్ మేధస్సులో జన్మించిన అద్భుత ఆలయ నిర్మాణ కళను “హేమాడ్‍పంత్ శైలి”గా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ శైలిలో నిర్మించిన ఆలయాలలో అధికశాతం ఆలయాలు నల్లరాతిని, సున్నంను వాడి నిర్మించడం జరిగింది. ఆలయ అంతర్భాగాలలో సుందరమైన శిల్పాలను ఒకే రాతిలో మలచి స్థాపించడం హేమాడ్‍పంత్ శైలిలోని ప్రత్యేక ఆకర్షణగా ప్రసిద్ధి కెక్కింది.
పదమూడవ శతాబ్దంలో ప్రాణం పోసుకున్న హేమాడ్‍పంత్ నిర్మాణ శైలిలో మలచిన శ్రీ నారో శంకర ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. నాసిక్ పట్టణంలో హేమాడ్‍పంత్ శైలిలో వెలసిన ఏకైక ఆలయం ఈ నారో శంకర మహాదేవ మందిరం.
నారో శంకర్ రాజేబహద్దూర్ అనే జాగీర్దార్ ఈ ఆలయాన్ని నిర్మించిన ఈ ఆలయం 1747వ సంవత్సరంలో భక్తుల దర్శనార్థం ఆరంభించబడింది. ఆనాటి నుండి ఈ మందిరాన్ని నారో శంకర మందిరంగా వ్యవహరించడం ప్రారంభించారు భక్తులు. ఈ మందిరం దూరం నుండి చూస్తే ఒక కోటలాగా దర్శనమిస్తుంది. పదకొండు అడుగుల ఎత్తైన ప్రహరీగోడ ఈ ఆలయం చుట్టూ నిర్మించబడింది. నాలుగు మూలల్లో “బరసాతి” అని పిలువబడే నాలుగు గుమ్మటాలను నిర్మించారు ఆనాటి శిల్పులు. కొన్నేళ్ళ క్రితం వచ్చిన గోదావరీ వరదలలో ఒక గుమ్మటం కూలిపోవడంతో ప్రస్తుతం కేవలం మూడు గుమ్మటాలు మాత్రమే కనిపిస్తాయి.
శ్రీ నారో శంకర్ మహాదేవ్ మందిరం చుట్టూ నిర్మించబడిన పదకొండు అడుగుల ఎత్తైన గోడలపై అనేక రమ్య శిల్పాలను మలిచారు ఆనాటి స్థపతులు. ఆలయ ప్రహరీ గోడ వెలుపలి భాగంలో తీర్చిదిద్దిన ఈ సర్పాకృతి నిగూఢ తంత్ర రహస్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. భారతీయ సనాతన తత్వ చింతనలో సర్పానికి ఒక ప్రత్యేక స్థానముంది. కలలో పాము కనిపించడాన్ని బట్టి స్వప్నఫలాలను వివిధ రీతుల్లో విశ్లేషించింది భారతీయ స్వప్నశాస్త్రం. పురాణాలలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన వివిధ సర్పాల పేర్లు ఉన్నాయి. శ్రీమన్నారాయణునికి పానుపుగా, ఆసనంగా సర్పమే దర్శనమిస్తుంది. ఆవిధంగానే పరమశివునికి, గరుత్మంతునికి సర్పాలనే ఆభరణాలుగా చిత్రించడం జరుగుతుంది. మానవుల ప్రాణానికి, కుండలినీ శక్తికి, మృత్యువుకు, ప్రకృతికి ప్రతీకగా కూడా సర్పాన్ని ఉపయోగించినట్టు పురాణాలు మొదలైన శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
నారో శంకర్ ఆలయ కుడ్యంపై భక్తులను ఆకర్షించే మరో శిల్పం మహిషాసుర మర్దిని విగ్రహం. దుర్మార్గానికి ప్రతీక ఐన మహిషాసురుణ్ణి సంహరిస్తున్న దుర్గాదేవిని చూడడానికి రెండు కళ్ళు చాలవని భావిస్తారు భక్తులు. జీవకళ ఉట్టిపడే మహిషాసురమర్దిని శిల్పాన్ని దర్శించిన భక్తులు భక్తిభావంతో తన్మయులవుతారు.
కోటగోడను తలపించే ఎత్తైన ప్రహరీ గోడ, అందమైన బరసాతి గుమ్మటాలతో బాటు నారో శంకర మందిరంలో చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించే మరో అంశం ఆలయ ప్రధాన ద్వారం పై కనిపించే భారీ లోహ గంట. 1739లో మరాఠా సైన్యం వాసాయ్ ప్రాంతంలో పోర్చుగీసు సైన్యాన్ని యుద్ధంలో ఓడించి, వారి నుండి ఈ భారీ ఈ గంటను స్వాధీనం చేసుకొన్నారు. ఆనాడు మరాఠా సైన్యంలో కీలకమైన పదవిలో ఉన్న నారో శంకర రాజేబహదూర్ ఈ గంటను మరాఠా విజయానికి గుర్తుగా ఈ ఆలయ ద్వారంపై అలంకరించాడు. ఈ గంట పంచధాతువులతో నిర్మించబడి దాదాపు వెయ్యి కిలోల బరువు కలిగివుంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ గంట నుండి వెలువడే శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుందని ప్రతీతి.
హిందూ విజయ చిహ్నమైన భారీ గంటను కలిగిన ప్రధాన ద్వారం లింగాకారాన్ని పోలివుండి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది. సుందరమైన స్థంభాలతో కూడిన ప్రధాన ద్వారాన్ని దాటి ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు నారో శంకర మహాదేవ మందిరం భవ్య శిల్పకళా సౌందర్యంతో అలరారుతూ దర్శనమిస్తుంది.
ఆలయ స్థంభాలపై, కుడ్యాలపై ఋషులు, దేవతా మూర్తులతో బాటు మయూరాలు, గజరాజులు, దేవతా వృక్షాల వంటి ప్రాకృతిక అంశాలను అత్యంత నైపుణ్యంతో మలచారు ఆనాటి శిల్పులు. భారతీయ సనాతన సంప్రదాయంలో కేవలం మానవులే కాదు సమస్త ప్రకృతికీ స్థానముందని నిరూపిస్తాయి నారో శంకర్ ఆలయంలోని శిల్పాలు.
ఆలయంను చేరడానికి ఏర్పాటు చేసిన మెట్లను దాటి వెళితే ఎత్తైన వేదిక మీద కొలువుదీరిన నందికేశ్వరుడు ఏకాగ్ర ధ్యానంలో ఉన్నట్టుగా దర్శనమిస్తాడు. నల్లరాతితో చేసిన ఈ నంది సర్వలక్షణ శోభితమై కనిపిస్తుంది. సనాతన సంస్కృతిలో వృషభంను ధర్మానికి ప్రతినిధిగా భావిస్తారు. ఈ ధర్మ దేవత తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలపై నిలచి సృష్టిని రక్షిస్తూవుంటుంది. కలియుగంలో తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలు కుంఠితాలై “సత్యం” అనే ఒకే పాదంపై నిలుస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ యుగధర్మానికి నిదర్శనంగా నందీశ్వరుడు మూడు పాదాలను ముడుచుకుని, ఒక్క పాదాన్ని మాత్రమే ఎత్తిపట్టినట్టుగా దర్శనమిస్తాడు.
మహారాష్ట్ర ఆలయాల్లో దర్శనమిచ్చే కూర్మప్రతిమ నారో శంకర్ మందిరంలో కూడా భక్తులకు దర్శనమిస్తుంది. దైవసాన్నిధ్యంలో మానవులు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండాల్ని, తమ దృష్టిని భగవంతుని ప్రతిమపైనే కేంద్రీకరించాలనే సందేశాన్ని ఈ కూర్మప్రతిమలు అందిస్తాయి.
పరమశివుని ప్రియవాహనమైన నందీశ్వరుణ్ణి దర్శించిన అనంతరం భక్తులు ఆలయ మహామండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మహామండపం ఒక అద్భుత శిల్పకళా ప్రదర్శనశాలగా భాసిల్లుతూ చూపరుల్ని ఆకర్షిస్తుంది. సుందరమైన కళాకృతులతో శోభిల్లే ఆలయ స్థంభాలు భారతీయ శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి.
మండపం పైభాగం వివిధ సంగీత వాయిద్యాలను ధరించిన శివగణాలను కలిగి అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. నాట్యశాస్త్రానికి ప్రాణం పోసిన నటరాజ స్వామి నర్తించే తాండవ నృత్యానికి తమ వంతు సహకారాన్ని అందించడానికై నాదస్వరం, తాళం, మురళి, మృదంగం వంటి వాయిద్యాలను ధరించి నిలబడ్డారు ఈ శివగణాలు. పరమ శివుడు నర్తించే తాండవం నుండి “తా”ను, పార్వతీదేవి అభినయించే ’లాస్యం’ నుండి లాను స్వీకరించి “తాళ” శబ్దం జన్మించిందని విద్వాంసులు తెలిపారు. ఈ తాళమే భారతదేశ శాస్త్రీయ సంగీతానికి, నృత్యానికి ప్రాణమై నేటికీ వీనులవిందు చేస్తోంది.
శివగణ శోభితమైన మహా మండపాన్ని దాటి వస్తే ఆలయ గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది. గర్భగృహ ద్వారానికి ఇరువైపులా శరభ విగ్రహాలను తీర్చిదిద్దారు. ద్వారం పైభాగంలో పరమశివుని పుత్రుడు, సకల విఘ్న నివారకుడైన గణనాథుడు కొలువైవుంటాడు. మహాశక్తి కేంద్రంగా భాసించే గర్భాలయంలో శ్రీ రామేశ్వర స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాడు.
నీలవర్ణపు శిలలో మలచబడిన శ్రీ రామేశ్వర స్వామి లింగం పంచఫణామండితమైన రజతమయ నాగేంద్రుని ఛాయలో వెలసి దర్శనమిస్తాడు. దేవనాగరి లిపిలో వ్రాసిన “శ్రీరామ” నామం భక్తులకు సాక్షాత్తు పరమశివుడే ఉపదేశిస్తున్న తారకమంత్రంలా భాసిస్తూ దర్శనమిస్తుంది.
ఒకానొక అల్ప ద్వాదశి నాడు విష్ణు సహస్ర నామాన్ని జపించే సమయం లభించక, మహేశ్వర అర్ధాంగి ఐన పార్వతీదేవి లోకహితంకై తన స్వామిని ప్రశ్నిస్తూ “స్వామీ! కాల అభావం వల్ల విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించలేని భక్తులకు ఏది త్రోవ?” అని అడిగింది. పరమదయాళువైన పరమశివుడు అందుకు సమాధానంగా “శ్రీరామ రామేతి/ రమే రామే మనోరమే/ సహస్రనామ తత్త్యుల్యం/ రామనామ వరాననే” అనే మహత్తర సందేశాన్ని అందించాడు. విష్ణు సహస్రనామాన్ని ఏదైనా ప్రబల కారణంచే పూర్తిగా పఠించలేని వారు అత్యంత భక్తితో “శ్రీరామ” అని తలచినంతనే నామసహస్ర పారాయణ ఫలాన్ని ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తాడని శంకరుడు ఉపదేశించాడు. ఈ ఉపదేశం కైలాసవాసుని కరుణకు నిదర్శనంగా భక్తులు భావిస్తారు.
గర్భాలయంలో విరాజితుడైన శ్రీ రామలింగేశ్వరుని లింగంపై దర్శనమిచ్చే “శ్రీరామ” తారక మంత్రాన్ని తనివారా చూసి, మనసారా రామనామాన్ని స్మరించి పులకిస్తారు భక్తులు.
అనేక విశిష్ఠతలకు పెట్టిన పేరైన నారో శంకర్ మహాదేవ్ మందిరంలో భక్తులను విశేషంగా ఆకట్టునే అంశం మరొకటి ఉంది. అనేక ఆలయాలలో గర్భగృహంలోని విగ్రహాలకు అభిషేకం చేస్తే ఆ జలాలు బైటకు వెళ్ళడానికై ఏర్పరిచే నాళం సాధారణంగా గోముఖంతో కూడివుంటుంది. కానీ నారో శంకర్ మహాదేవ్ మందిర్ లో ఏర్పాటు చేసిన నాళం మొసలి ముఖాన్ని పోలివుంటుంది. ఈ మకర ముఖం తాంత్రిక ఉపాసనలో ఒక భాగమని ఆలయ అర్చకులు వివరించారు.
శ్రీ నారో శంకర్ మహాదేవుని గర్భాలయ వెనుక భాగంలో అపురూపమైన యమధర్మరాజ విగ్రహం ఉంది. మహిష వాహనుడై దర్శనమిచ్చే యమధర్మరాజు విగ్రహంను ఇక్కడ మాత్రమే చూడవచ్చునని ఆలయ అర్చకులు తెలిపారు. జీవుల పాపపుణ్యాలను విచారించి, తదనుగుణంగా శిక్షణను, రక్షణకు కల్పించే ధర్మస్వరూపంగా యమధర్మరాజును భావిస్తారు. సూర్యపుత్రుడైన యముడు మార్కండేయ మహర్షి ఆయుష్షును హరించడానికై వచ్చి పరమశివుని చేతిలో పరాజితుడైన పురాణ కథనం భక్తిప్రబోధకమై, శివశక్తి వైభవ నిదర్శనమై అలరారుతోంది. నారోశంకర్ మందిరంలో గల యమధర్మరాజు విగ్రహాన్ని దర్శించిన భక్తులు మార్కండేయ కథను గుర్తుకు తెచ్చుకుని భక్తి పరవశులవుతారు.
సప్తశృంగీ ఆలయం
నారో శంకర్ మహాదేవ్ మందిరానికి అత్యంత సమీపంలో “సప్తశృంగీ ఆలయం” దర్శనమిస్తుంది. నారో శంకర్ మందిరానికి కుడివైపున ఉన్న ఈ మందిరం సరళ సుందరంగా నిర్మించబడింది. ఈ మందిర అంతర్భాగంలో ఆదిశక్తి స్వరూపిణిగా భావించే సప్తశృంగీ మాత భక్తులకు దర్శనమిస్తుంది. మహోన్నత విగ్రహ రూపంలో, పద్దెనిమిది చేతులతో అలరారే సప్తశృంగీ మాతను భక్తిశ్రద్ధలతో వీక్షించి తరిస్తారు భక్తులు. ఈ ఆలయ ఆవిర్భావానికి కారణమైన ప్రాచీన కథనం అత్యంత ఆసక్తిదాయకం.
పూర్వం ఒక భక్తుడు నాసిక్ పట్టణం నుండి 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన సప్తశృంగీ మాత ఆలయానికి వెళ్ళేవాడు. సప్తశృంగి పర్వతంపై కొలువైవున్న పరాశక్తి స్వరూపిణి ఐన సప్తశృంగీ మాతను నిత్యం అర్చించి, తరించేవాడు. ఈవిధంగా అనేక సంవత్సరాల పాటు ఆ భక్తుడు ప్రతి నిత్యం నాసిక్ నుండి సప్తశృంగీ పర్వతాన్ని చేరి అమ్మవారిని ఆరాధించేవాడు.
కాలక్రమేణా ఆ భక్తుడు వార్ధక్యం మీద పడి వృద్ధుడయ్యాడు. తనను అర్చించడానికై అధిక శ్రమకు ఓర్చి వచ్చిన ఆ వృద్ధ భక్తుణ్ణి చూసిన సప్తశృంగీ మాత, కరుణారసభరితయై, “భక్తా! నీవు వృద్ధడవయ్యావు. కనుక నేనే నీ ఇంటికి వస్తాను. నీ ఇల్లు చేరేంతవరకు వెనక్కు తిరిగి చూడకు!” అని చెప్పింది. అమ్మ కారుణ్యానికి అమిత సంతోషభరితుడైన ఆ వృద్ధ భక్తుడు నాసిక్ వైపుకు అడుగులు వేసాడు. అమ్మవారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా ఆ వృద్ధుణ్ణి అనుసరించింది. నాసిక్‍ను చేరిన వృద్ధుడు నగరంలో ప్రవహిస్తున్న గోదావరీ నదిని దాటుతూవుండగా హఠాత్తుగా నదీ ప్రవాహం పెరిగింది. ఆ ఉద్ధృత ప్రవాహంలో దాదాపుగా మునిగిపోయిన భక్తుడు అమ్మవారు ఎలావున్నారో చూద్దామన్న అతృత పెరిగి వెనక్కు తిరిగి చూసాడు. తన హెచ్చరికను మర్చిపోయి, ఇచ్చిన ఆజ్ఞను భక్తుడు జవదాటడంతో సప్తశృంగీ మాత గోదావరీ ఒడ్డున, ఈ మందిరం వెలసిన స్థలంలోనే శిలాప్రతిమగా మారి నిలచింది. ఆనాటి నుండీ ఇక్కడే, ఈ మందిరంలోనే భక్తుల పూజలను అందుకొంటోంది. నాసిక్ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులు రామతీర్థం వద్ద వెలసిన సప్తశృంగీ మాతను తప్పక దర్శిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని మనసారా అర్థిస్తారు.
శ్రీ కపాలేశ్వర మందిరం
రామతీర్థానికి అత్యంత సమీపంలో ఉన్న మరో దర్శనీయ దేవాలయం శ్రీ కపాలేశ్వర మందిరం. రామతీర్థానికి సమీపంలో, ప్రధాన రహదారి ప్రక్కనే ఈ కపాలేశ్వర మందిరం దర్శనమిస్తుంది. సుమారు యాభై మెట్లను ఎక్కి ఈ దేవాలయాన్ని చేరవచ్చు. ఈ మెట్లమార్గం మొదట్లో “శ్రీ కపాలేశ్వర్ మందిర్” అన్న నామఫలకం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈ మెట్లను దాటి వెళితే ప్రాచీనమైన కపాలేశ్వర మందిరాన్ని చేరుతారు భక్తులు. శ్రీ కపాలేశ్వర మందిరం సుమారు ఆరువందల సంవత్సరాల ఇతిహాసాన్ని కలిగిన పురాతన మందిరం. పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన పేష్వాలు ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేసినట్టుగా స్థానిక ఇతిహాసం వల్ల తెలిస్తోంది. పేష్వాలకు అత్యంత ప్రీతిపాత్రమైన “నాగర నిర్మాణ శైలి”లో ఈ మందిరాన్ని పునర్ నిర్మించారు. ప్రాచీనమైన కపాలేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం భారతదేశంలో శివుని ముందు నంది ఉండని ఏకైక శివాలయంగా ప్రఖ్యాతి వహించింది. పరమశివుడు తన వాహనమైన నందీశ్వరుణ్ణి గురువుగా భావించడం వల్ల ఇక్కడ నందీశ్వరుడు ఉండడని చెబుతారు. కపాలేశ్వరుని ముందు వినమ్రమూర్తియైన నందీశ్వరుడు లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.
పూర్వం బ్రహ్మదేవుని ఐదో తలను పరమశివుడు ఖండించవలసిన సందర్భం ఏర్పడింది. బ్రహ్మపురాణం మేరకు దేవతలకు, దానవులకు ఘోరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో దేవతల ప్రార్థనను మన్నించి శివుడు తన శివగణాలతో బాటు యుద్ధంలో పాల్గిన్నాడు. త్రిశూలధారి ధాటికి ఆగలేని రాక్షసులు కకావికలై పలాయనం సాగిస్తున్నప్పుడు బ్రహ్మదేవుని ఐదో తల ఆ రాక్షసులను యుద్ధం చేయవలసిందిగా సలహా ఇచ్చింది. రాక్షసులు యుద్ధరంగానికి మరలి వస్తే వారికి తప్పక సహాయం చేస్తానని చెప్పింది బ్రహ్మదేవుని ఐదో తల. ఈ విపరీతాన్ని చూసి భయపడిన దేవతలు మళ్ళీ శివుణ్ణి శరణువేడారు. దేవతలకు హాని తలపెడుతున్న ఆ ఐదో తలను ఖండించవలసిందిగా కోరారు. సురపక్షపాతియైన పరమశివుడు వెనువెంటనే బ్రహ్మదేవుని ఐదో శిరస్సును ఖండించాడు. ఆవిధంగా శంకరునికి బ్రహ్మహత్యా దోషం సంభవించింది. బ్రహ్మదేవుని ఐదో తల కపాలమై శివుని చేతికి శాశ్వతంగా అంటుకుంది. ఈ సందర్భంలో నందీశ్వరుడు తన కుమారునితో మాట్లాడుతూ ’అరుణా-వరుణా-గోదావరీ’ సంగమ స్థలమైన రామకుండంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యాదోషం పోతుందని చెబుతాడు. ఆ మాటలను ఆలకించి, ఆనందభరితుడైన శివుడు వెంటనే రామతీర్థంలో గల అరుణా-వరుణా-గోదావరీ సంగమంలో పవిత్రస్నానం చేసి దోషవిముక్తుడయ్యాడు. భూలోకానికి తరలివెళ్ళిన తన స్వామిని అనుసరిస్తూ వచ్చాడు నందీశ్వరుడు. రామతీర్థం వద్ద బ్రహ్మకపాలం నుండి, బ్రహ్మహత్యనుండి విముక్తిని పొందిన శివుడి ముందు వినయభావంతో నిలయబడ్డాడు. అందుకు శివుడు “నందీ! బ్రహ్మకపాలం నుండి విముక్తిని పొందిన ఈ ప్రాంతంలో నేను కపాలేశ్వర అన్న నామధేయంతో వెలుస్తాను. కానీ బ్రహ్మహత్యాదోష నివారణా మార్గాన్ని చూపిన నీవు నాకు గురువుతో సమానం. కనుక నీవు ఇక్కడ నా అనుచరునిగా ఉండకూడ”దని వారించాడు. ఆవిధంగా ఈ కపాలేశ్వర మందిరంలో ఎక్కడా నంది విగ్రహం కనిపించదు.
ఇంతటి వైశిష్ట్యపూర్ణమైన కపాలేశ్వర మందిరంలో వెలసిన శ్రీ కపాలేశ్వర స్వామి వారి భవ్యలింగం, రజత కవచంతో వెలుగులీనుతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ కపాలేశ్వర్ మందిరంలో త్రిపుండ్ర భూషితుడైన త్రినేత్రుడు సాకార శివలింగరూపంలో సాక్షాత్కరిస్తాడు. “రక్షోగణక్షపణ/ దక్ష మహాత్రిశూలం” అంటూ కవి గాయక భక్త మునిగణాలచే వంద్యుడైన పరమశివుణ్ణి కపాలేశ్వర స్వామిగా దర్శించి తరిస్తారు భక్తులు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు మ్రోగించే ఘంటానాదం ఓంకార ప్రణవనాదంలా ధ్వనిస్తూ ఉండగా పంచాక్షరీ మంత్రాధ్యక్షుడైన ఈ సురాధ్యక్షుణ్ణి దర్శించడం మహాద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిర్వికారుడు, నిరంజనుడు ఐన త్రిపురాంతకుని దర్శనం వల్ల త్రిజన్మపాపసంహారమైనట్టుగా భావిస్తారు భక్తులు. శిరసున వెలసిన గంగమ్మతో, శేషనాగ ఫణి ఛత్రం నీడలో వెలసిన శ్రీ కపాలేశ్వరుని దివ్యదర్శనంతో ఆనందపరవశులై పులకిస్తారు భక్తులు. గర్భాలయంలో, కపాలేశ్వరుని లింగం వెనుక పైభాగంలో గణనాథుడైన గణపతి, దుష్ట దానవ భంజని ఐన మహిషాసురమర్దిని విగ్రహాలు రజత కవచాలతో కూడి కన్నుల పండువగా భక్తులకు కానవస్తాయి.
కపాలేశ్వర మందిర అంతరాళంలో భుజంగశ్రేష్ఠుని ఫణిమండల ఛాయలో వెలసిన పంచముఖ శివ ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ దర్శనమిస్తుంది. ఈశాన, తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ అన్నవే శివుని పంచముఖాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో తత్పురుష ముఖం తూర్పుదిక్కును, సద్యోజాత ముఖం పశ్చిమదిశను, వామదేవ ఉత్తరదిక్కును, అఘోర ముఖం దక్షిణదిక్కును ప్రతినిధిస్తాయి. ఐదవదైన ఈశాన ముఖం ఆకాశాన్ని వీక్షించేదిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. యోగీశ్వరుడైన పరమశివుడు ఈ పంచముఖాల ద్వారా అమోఘమైన తత్త్వ రహస్యాలను సాధకులకు అందజేస్తాడని జ్ఞానులు విశదీకరిస్తున్నారు. పరమ పవిత్రమైన పంచముఖ శివస్వరూపాన్ని కపాలేశ్వర మందిర అంతరాళంలో దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు.
నంది విగ్రహం ఉండని ఏకైక శివాలయంగా ప్రసిద్ధికెక్కిన కపాలేశ్వర్ మందిరం ఆవరణలో చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. వీటిలో అనేక దేవీ దేవతలు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆవరణలోనే దేవతా వృక్షమని పేరుపొందిన అశ్వత్థ వృక్షం క్రింద వెలసిన ప్రత్యేక మండపంలో పార్వతీపుత్రుడు, విఘ్నగణనాయకుడు, క్షిప్రవరప్రదాత ఐన విఘ్నేశ్వరుడు కొలువై దర్శనమిస్తాడు.