రామ వనవాస ఘట్టాల భూమిక – నాసిక క్షేత్రం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

శ్రీ సుందర నారాయణ మందిరం

నాసిక్ పుణ్యక్షేత్రంలో అరుణా-వరుణా-గోదావరీ సంగమస్థలమైన రామకుండం వద్ద గోదావరీ దక్షిణ తీరంలో వెలసిన అద్భుత దేవాలయం శ్రీ సుందర నారాయణ మందిరం. నాసిక్ లో గల ప్రాచీన మందిరాలలో అత్యంత సుందరమైనది, ప్రముఖమైనది ఈ సుందర నారాయణ మందిరం. 18-19వ శతాబ్దాల మధ్య అప్పటి మరాఠా సర్వాధికారులైన పేష్వాల కాలంలో హోల్కర్ వంశస్థులు ఈ ప్రాంతాన్ని జాగీర్దారులుగా పరిపాలించారు. పద్దెనిమిదవ శతాబ్దంకు చెందిన గంగాధర యశ్వంత చంద్రచూడ్ అనే హోల్కర్ రాజవంశీకుడు ఈ శ్రీ సుందర నారాయణ మందిరంను 1756 వ సంవత్సరంలో నిర్మించాడు. శిల్పశాస్త్ర అద్భుతంగా భావించే ఈ దేవాలయన్ని నిర్మించడానికి ఆ రోజుల్లోనే సుమారు పది లక్షల రూపాయలను వెచ్చించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది.

రామతీర్థం సమీపంలో వెలసిన శ్రీ సుందర నారాయణ మందిర ప్రధాన శిఖరం నలుదిక్కులా చిన్న చిన్న గోపురాలను కలిగి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన శిఖరానికి ముందుభాగంలో వృత్తాకారంలో నిర్మించిన ఆలయ అంతరాళ పైభాగం, అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. మహారాష్ట్ర ప్రత్యేకత ఐన నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో సుందర నారాయణ స్వామి కొలువైవున్నాడు.

ప్రస్తుత ఆలయం మూడువందల యాభైసంవత్సరాల క్రితం నిర్మించబడినా, ఇక్కడి సుందర నారాయణుని విగ్రహం అత్యంత పురాతనమైనదని చెబుతారు. ఈ స్వామిని సుందర నారాయణుడని పిలవడానికి ఒక ఆసక్తికరమైన స్థలపురాణ కథనం ఉంది.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

పూర్వం జలంధరుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి, మహాశివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని, తనకు చావు రాకుండా ఉండేట్టు ఒక వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో ఉన్మత్తుడైన జలంధరుడు సకల లోకాలను, సర్వ జీవాలను పీడించసాగాడు. సమస్త దేవతలను ఓడించిన జలంధరుడు చివరకు తనకు వరాన్ని ప్రసాదించిన పరమ శివుని మీదకే దండెత్తి వెళ్ళాడు. జలంధరుని అమిత శక్తికి శివప్రసాదితమైన వరబలంతో బాటు అతని భార్య ఐన సతీ తులసి పాతివ్రత్యమే అసలైన కారణమని గ్రహించారు దేవతలు. బృందాదేవిగా పిలువబడే సతీ తులసి పాతివ్రత్యాన్ని భంగం చేసి, జలంధరుణ్ణి శక్తిరహితునిగా చేయడానికై శ్రీమన్నారాయణుడు జలంధరుని రూపాన్ని ధరించి వెళ్ళాడు. ఆవిధంగా బృందాదేవి పాతివ్రత్యం భంగమై, జలంధరుడు తన శక్తిని కోల్పోయాడు. అదే అదనుగా భావించిన పరమశివుడు జలంధరునికి తాను ఇచ్చిన అవధ్యత్వ వరాన్ని ఉపసంహరించి, జలంధరుణ్ణి నిముషమాత్రంలో సంహరించాడు.

అంతఃపురంలో తనతో నివసిస్తున్నది మాయా జలంధరుడనీ, సాక్షాత్తు విష్ణుమూర్తియే తన పతి వేషాన్ని ధరించి వచ్చాడని గ్రహించిన బృందాదేవి అందవికారునిగా మారమని లక్ష్మీపతిని శపించింది. లోకకళ్యాణార్థమై, మాయా జలంధరునిలా అవతరించిన మహావిష్ణువు బృందాదేవి శాపాన్ని స్వీకరించి వికార రూపాన్ని పొందాడు. “సాక్షాత్ మన్మథ మన్మథః” అని శ్రుతిస్మృతులు కీర్తించిన మహావిష్ణువు సతీ తులసి శాపానికి లోనై విరూపిగా మారాడు. తదుపరి నాసికా క్షేత్రాన్ని చేరి, ఇక్కడి పవిత్ర గోదావరీ జలాల్లో స్నానం చేసాడు. పరమమంగళదాయిని ఐన గోదావరీ జలస్పర్శతోనే నారాయణుని వికార రూపం తొలగిపోయి, పూర్వ సౌందర్యం ప్రాప్తించింది. బృందాదేవిగా పిలువబడే తులసీ మాత పాతివ్రత్య మహిమను, పుణ్య గోదావరీ జలాల ఘనతను చాటి చెప్పేందుకు ఆనాటి నుండీ “సుందర నారాయణ” అన్న సార్థక నామధేయుడై ఇక్కడ వెలసాడు వైకుంఠవాసుడు. ఈ కథకు గుర్తుగా సుందర్ నారాయణ స్వామి శ్రీ లక్ష్మీ, తులసీ సమేతుడై ఈ మందిరంలో భక్తులకు దర్శనమిస్తాడు.

నాగర నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఆ వాస్తుకళకు అనుగుణంగా మండపం, మహామండపం, అంతరాళం, గర్భగృహాలను కలిగి భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా వైభవ చిహ్నంగా వెలుగొందుతూ దర్శనమిస్తుంది. ఆలయ మహామండపంలోకి ప్రవేశించగానే జయ, విజయులతో కూడి, శిలాతోరణసహితమైన మహామండప ద్వారం భక్తులను స్వాగతిస్తుంది. ఈ ద్వారాన్ని దాటి వెళితే విశాలమైన అంతరాళం సుందర శిల్ప శోభితమై, కళానిలయమై భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అంతరాళ పైకప్పు వృత్తాకారంలో మలచబడి వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గుండ్రటి నల్లరాతి భాగాలను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మించిన ఈ అంతరాళపు పైకప్పు శతసహస్రదళ శోభితమైన విష్ణుచక్రంలా భాసిస్తూ కనిపిస్తుంది. సర్వాంగ సుందరంగా నిర్మితమైన అంతరాళాన్ని దాటి వెళితే శ్రీ సుందర నారాయణ స్వామి కొలువైవున్న గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ గర్భాలయ అంతర్భాగంలో కంజదళాయతాక్షుడైన సుందర నారాయణుడు నీలవర్ణ శిలాప్రతిమ రూపంలో దర్శనమిస్తాడు. మయూరాలను కలిగిన రజత కిరీటంతో, ఆదిశేషుని ఫణి ఛత్ర ఛాయలో శ్రీమహాలక్ష్మి, శ్రీ తులసీ బృందాదేవీ సమేతుడై దర్శనమిస్తాడు సుందరనారాయణుడు. శతకోటి మన్మథుల్ని సైతం ధిక్కరించే సౌందర్యంతో ప్రకాశిస్తున్న నారాయణున్ని దర్శించిన భక్తులు అమితానంద పరవశులవుతారు. తులసీ దేవి పాతివ్రత్య దీక్షను స్మరించుకొని ధన్యులవుతారు భక్తులు. లోకాధిదేవుడైనప్పటికీ ఒక మామూలు మానవునిలా మహాపతివ్రత శాపాన్ని స్వీకరించిన విష్ణుమూర్తి దయార్ద్ర హృదయాన్ని తలచుకొని హర్షపులకితులౌతారు భక్తులు. సకల చరాచర లోకపాలకుడైన సుందర నారాయణుని దర్శన భాగ్యంతో తమ నాసిక్ తీర్థయాత్ర ఫలవంతమయిందని భావిస్తారు భక్తులు.

శ్రీ మహాలక్ష్మీ, తులసీదేవి సమేతుడైన శ్రీ సుందర నారాయణ స్వామి పాదాల చెంత పక్షిరాజైన గరుత్మంతుడు భక్తులకు దర్శనమిస్తాడు. వినమితగాత్రుడై, వినీతభావంతో రెండు చేతులనూ జోడించి నిలచిన గరుత్మంతుడు అచంచల దైవభక్తికి, శరణాగతి భరితమైన ప్రపత్తికి నిలువెత్తు నిదర్శనంలా భాసిస్తూ దర్శనమిస్తాడు.

సాధారణంగా శిలాప్రతిమలు గట్టి శిలలతో మలచబడతాయి. వాటిని వేలితో మీటితే శబ్దాన్ని ప్రకటించవు. కానీ నల్లటి రాతితో నిర్మితమైన సుందర నారాయణస్వామి విగ్రహాన్ని మీటితే బోలుగా ఉండే వస్తువు చేసే ధ్వనిలాంటి శబ్దం వస్తుందని ఆలయ అర్చకులు చెబుతారు. అద్వితీయమైన భారతదేశ శిల్పుల నేర్పరితనానికి ఈ విగ్రహం ఒక భవ్య నిదర్శనమని పరిశోధకులు పేర్కొంటారు.

శిల్పకళా విన్యాస మందిరమైన శ్రీ సుందర నారాయణ మందిరానికి మరొక అద్భుత వైశిష్ట్యం ఉంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున బాలభానుని లేత కిరణాలు సుందర నారాయణ స్వామి పాదాలను స్పృశించడం ఈ ఆలయంలో ఆవిష్కృతమయ్యే ఓ అద్భుత దృశ్యం. భారతీయ శిల్పస్రష్టల అద్భుత కళాదృష్టికి, సాంకేతిక నైపుణ్యానికి గీటురాయిగా భాసించే ఈ సుందర నారాయణ మందిరం నాసిక్‍ను దర్శించే ప్రతి భక్తుడు తప్పక వీక్షించాల్సిన అపూర్వ దేవాలయం.

@@@@@

“సుందరే సుందరో రామః” అని ఖ్యాతి గడించిన శ్రీరామచంద్ర పవిత్ర కరస్పర్శతో పావనమైన రామతీర్థానికి అద్వితీయమైన ప్రత్యేకత ఒకటి ఉంది. శ్రీ రామతీర్థం దక్షిణ తీరంలో శ్రీ సుందర నారాయణ స్వామి నెలకొనివున్నాడు. ఆవిధంగానే ఉత్తర తీరంలో శ్రీ కపాలేశ్వర మహాదేవుడు కొలువైవున్నాడు. ఈ పవిత్ర రామ తీర్థం కేవలం అరుణా-వరుణా-గోదావరీ సంగమ స్థలంగానే కాక శివకేశవుల మైత్రీధామంగా కూడా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం కార్తీక చతుర్దశి రోజున ఈ రామతీర్థం వద్ద “హరి హర్ భేంట్” అన్న పేరుతో శివ-కేశవుల పరస్పర మిలనం జరుగుతుంది. వైష్ణవుల ఆరాధ్యదైవమైన శ్రీ సుందర నారాయణుడు, శైవుల పరదైవమైన శ్రీ కపాలేశ్వరుడు కార్తీక చతుర్దశి నాడు పల్లకీలను అధిరోహించి రాత్రివేళ సరిగ్గా పన్నెండు గంటలకు పరస్పరం కలుస్తారు. ఈ “హరి హర్ భేంట్”లో భాగంగా కపాలేశ్వరునికి తులసీ పత్రాలను, సుందర నారాయణునికి బిల్వపత్రాలను అర్పిస్తారు. ఈవిధంగా త్రివేణీ సంగమ స్థలమైన రామతీర్థం శివ-కేశవ భక్తి సంయోగమై, వివిధ భావాల అన్యోన్యతకు ఆలవాలమై, ఆధ్యాత్మిక సమరసకు ఆలనంబనమై అలరారుతోంది.

@@@@@

మహారాష్ట్రలోని నాసిక్ గోదావరీ గలగల్లో శ్రీరామ కథల్ని సుశ్రావ్యంగా వినిపించే అద్వితీయ క్షేత్రం. పినతల్లి కైకేయి వచనానుసారం సీతా లక్ష్మణ సమేతుడై వనవాసానికి తరలిన శ్రీరాముడు ఈ నాసిక్ క్షేత్రంలో వసించాడని శ్రీమద్రామాయణం తెలుపుతోంది. రావణాసురుని సోదరి అయిన శూర్పణఖ నాసికను లక్ష్మణుడు ఖండించి విసిరేసిన ప్రాంతం గనుక “నాసిక్”గా పేరు పొందిన ఈ క్షేత్రం అనేకానేక ఆధ్యాత్మిక, చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది.

పవిత్ర దేవాలయాలు, పావన కుండాలు అడుగడుగునా వెలసిన నాసిక్ ప్రాంతం మనోహరమైన పంచవటీ ప్రాంతంగా రామాయణ ఇతిహాస ప్రసిద్ధమయింది. ఈ పంచవటి ప్రాంతంలోనే శ్రీరాముడు అందమైన పర్ణశాలను నిర్మించుకొని సీతాసమేతుడై నివసించాడు. ఈ పంచవటిలోనే శూర్పణఖ ముక్కు, చెవులను లక్ష్మణుడు ఖండించాడు. శూర్పణఖ నాసిక పడిన స్థలం “నాసిక్”గా పేరు పొందింది. ఈ పంచవటీ పరిసరాలలోనే మారీచుడు మాయామృగవేషధారియై, బంగారు జింకగా పరుగులెత్తి రామబాణఘాతానికి అసువులు బాసాడు. ఈ పంచవటీ పర్ణకుటి చుట్టూ అనన్య భ్రాతృసేవకుడైన సౌమిత్రి తన ’లక్ష్మణ రేఖ’ను లిఖించాడు. ఈ పంచవటీ సీమలోనే లంకాధిపతియైన రావణుడు సీతాదేవిని అపహరించాడు.

రమణీయంగా సాగే రామాయణ గాథ, గోదావరీ నదీ ప్రవాహంలా, కీలకమైన మలుపును ఈ పంచవటి సీమలోనే తిరుగుతుంది. ఇంతటి ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతను కలిగిన నాసిక్ క్షేత్రంలోని శ్రీ తిలభాండేశ్వర మందిరం, శ్రీ గోరారామ్ పర్ణకుటి, ఐదు వటవృక్షాల నడుమ వెలసిన “సీతా గుహ”, శ్రీ లక్ష్మణరేఖా మందిర్, శ్రీ సీతాపహరణ్ మందిర్, శ్రీ కాట్యా మారుతీ మందిరం, శ్రీ శేషనాగ మందిరం మొదలైనవి ప్రముఖ దర్శనీయ స్థలాలుగా ప్రసిద్ధి కెక్కాయి.

శ్రీ తిల భాండేశ్వర మందిరం

పావన పుణ్యస్థలి అయిన నాసిక్ పట్టణంలో వెలసిన ప్రసిద్ధ శివాలయం శ్రీ తిల భాండేశ్వర మందిరం. ఇతిహాస ప్రసిద్ధమైన పంచవటి ప్రాంతంలో నెలకొనివున్న శ్రీ తిలభాండేశ్వరాలయం చాలా ప్రాచీనమైనది. ఈ స్వామివారి ఉల్లేఖన పద్మాపురాణంలో ఉందని అర్చకులు తెలిపారు. యుగయుగాల నుండి ఇక్కడ వెలసివున్న శ్రీ తిలభాండేశ్వర స్వామిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దర్శించి, పూజించాడని స్థలపురాణం వల్ల తెలుస్తోంది. అత్యంత ప్రాచీనమైన తిలభాండేశ్వర మందిరలోకి ప్రవేశించగానే ఆలయ ప్రాంగణంలో బృహత్తరమైన నంది విగ్రహం కనిపిస్తుంది. పదునైన కొమ్ములను కలిగి, నాలుగు వేదాలనే నాలుగు పాదాలుగా కలిగిన నందీశ్వరుని దర్శనం వల్ల ఆనందం కలుగుతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. నందీశ్వరుని వల్ల ప్రాప్తమైన ఆనందంతో శివుణ్ణి దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. నందికేశుని ముందు భాగంలో మరాఠా ఆలయ సంప్రదాయ చిహ్నమైన కూర్మవిగ్రహం దర్శనమిస్తుంది. ఏకాగ్రతకు, నిశ్చలతకు, వైరాగ్యానికి నిదర్శనంగా కూర్మవిగ్రహాన్ని ప్రతి ఆలయంలోను మలిచారు మరాఠా శిల్పులు.

సకలానందప్రదాయకుడైన నందీశ్వరునికి ఎదురుగా అత్యంత ప్రాచీనమైన శ్రీ తిలభాండేశ్వర స్వామివారు లింగరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. తామ్రలోచనుడు తామ్రకవచ ధారియై భక్తజన తాపత్రయాపహారియై దర్శనమిస్తాడు.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

సర్వదోషవిమర్ధకుడైన తిలభాండేశ్వరుణ్ణి అర్చించడానికి ప్రదోషకాలంలో సకల దేవతలు విచ్చేస్తారని ప్రతీతి. పరమ పవిత్రమైన ప్రదోష సమయం నిత్య ప్రదోషం, పక్షప్రదోషం, మాస ప్రదోషం, మహాప్రదోషమనే నాలుగు విధాలుగా ఉంటుందని శాస్త్రకారులు తెలియజేసారు. సూర్యుడు అస్తమించడానికి కొద్ది ముందుగా, సూర్యాస్తమయం అయిన తరువాత కొద్దికాలం ఉండే సమయాన్నే ప్రదోషమని వ్యవహరిస్తారు. ఈ సమయంలో ఉమామహేశ్వర స్వామిని అర్ధనారీశ్వర తత్వంతో చింతన చేయాలి. పవిత్ర కైలాస స్థలిలో పరమశివుడు ఆనంద తాండవం చేసేది కూడా ఈ ప్రదోష సమయంలోనే అని చెబుతారు. విశిష్ఠమైన ఈ ప్రదోష సమయంలో శ్రీ తిలభాండేశ్వరుని అర్చనకై సకల దేవతలు తరలివస్తారు.

సర్వలోకపూజితుడైన తిలభాండేశ్వరునికి మరో వైశిష్ట్యం ఉంది. ఈ లింగం ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతూ ఉంటుందని అర్చకులు తెలిపారు. ఈకారణం చేతనే స్వామివారికి తిలభాండేశ్వర్ అన్న సార్థనామం వచ్చిందని చెబుతారు. నిత్యప్రవృద్ధుడై, సత్యశివసుందరాత్మకుడై అలరారే త్రిలోచనుడిని తిలభాండేశ్వరునిగా అర్చించి, తరిస్తారు భక్తులు.

శ్రీ రామ స్వహస్త కరార్చితమైన తిలభాండేశ్వర దర్శనానంతరం భక్తులు శ్రీరామపర్ణశాలను దర్శిస్తారు.

శ్రీ రామపర్ణశాల

శ్రీరామపట్టాభిషేక సంరభంలో సమస్త అయోధ్యా ప్రజలు పరవశులై ఉండగా అలనాడు ఎప్పుడో ఇచ్చిన వరాలను కోరి శ్రీరామ వనవాసానికి తెరను తీస్తుంది కైకేయి. మంథర ఎక్కించిన దుర్బోధ విషంతో సంయమనం కోల్ఫోయిన కైకేయి, రామునికి బదులుగా తన కుమారుడైన భరతునికి పట్టం కట్టమని దశరథ నృపతిని బలవంతం చేస్తుంది. అటు రాముణ్ణి వదులుకోలేక ఇటు ఆడిన మాటను తప్పలేక నలిగిపోతాడు దశరథుడు. సవతి తల్లిని స్వంత తల్లిగానే భావించిన శ్రీరాముడు తండ్రి మాటను పాటించి అరణ్యాల దిశగా అడుగులు వేసాడు. అయోధ్యను వీడి తరలిన రాఘవుడు మహారణ్యమైన దండకారణ్యాన్ని చేరాడు.

దక్షిణ భారతదేశమంతా పరచుకొనివున్న విశాలమైన కీకారణ్యం ఈ దండకారణ్యం. నానా జంతు సమాకీర్ణమైన ఆ దండకారణ్యమంతటా అనేక ఋష్యాశ్రమాలు ఉండేవని రామాయణ మహాకావ్యం వర్ణిస్తోంది. “తాపసాశ్రమ మండలమై” వెలుగొందుతున్న ఆ దండకారణ్యంలో పవిత్రాత్ముడైన అగస్త్యఋషి ఆశ్రమం ఫలపుష్పభరితమై భాసించేది.

వింధ్యా పర్వతాలను స్థంభింపజేసినందువల్ల అగస్త్య అన్న బిరుదునే పేరుగా గలిగిన ఆ మహితాత్ముని ఆశ్రమానికి సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు విచ్చేసాడు. ఆ మహాముని ఆతిథ్యాన్ని స్వీకరించిన పిదప ఆ దండకారణ్యంలో తాము నివసించడానికి అనువైన ప్రదేశాన్ని సూచించమని ఆ తాపసోత్తముణ్ణి ప్రార్థించాడు రాముడు. ఆ ప్రార్థనకు సంతసించిన అగస్త్యుడు శ్రీరామునికి మార్గదర్శనం చేసాడు. “ఇతో ద్వియోజనే తాతా/ బహుమూల ఫలోదకః/ దేశో బహుమృగః శ్రీమాన్/ పంచవట్య అభి విశ్రుతః” అని పంచవటిని వర్ణించాడు అగస్త్యుడు. “నాయనా రామా! నా ఆశ్రమం నుండి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రసిద్ధ స్థలం ఉంది. ఆ స్థలంలో కందమూలాలకు, ఫలాలకు, రుచికరమైన త్రాగు నీటికి ఎటువంటి కొదవా లేదు. మీ నివాసానికి పంచవటి అత్యంత అనుకూలమైనద”ని వివరించాడు అగస్త్యుడు.

అలనాడు అగస్త్యుడి సూచన మేరకు పంచవటిలో శ్రీరాముడు ఆశ్రమం నిర్మించుకున్న స్థలంలో నేడు శ్రీ గోరా రామ్ మందిరం వెలసివుంది. ఈ మందిరాన్ని “శ్రీరామ పర్ణశాల”గా కూడా పిలుస్తారు.

పుష్కలమైన జలప్రవాహంతో ప్రవహించే గోదావరీ తీరంలో వెలసిన పంచవటిని చేరిన శ్రీరాముడు, అక్కడి నైసర్గిక రమణీయతకు మైమరచాడు. ఎక్కడ చూచినా విరగకాచిన చెట్లు కనువిందు చేస్తుండగా, నానా జాతుల పక్షులు కలరవాలు చేస్తుండగా, లేళ్ళు, నెమళ్ళు గుంపులు గుంపులుగా స్వేచ్ఛా విహారం చేస్తున్న ఆ పంచవటీ సౌందర్యం అసమానం, నిరుపమానం, అద్వితీయమని తలచాడు శ్రీరాముడు. ఇంతటి ప్రాకృతిక సౌందర్య భరితమైన పంచవటిని నివాసస్థానంగా సూచించిన అగస్త్య మహామునిని తలచకుని మనసులోనే శతాధిక నమోవాకాలు అర్పించాడు. మన అవసరాలను గుర్తించి, తగిన సూచనలు, సలహాలను అందించిన వారిని ఎన్నడూ మరచిపోరాదనే ఉత్తమ గుణాన్ని అగస్త్యఋషి స్మరణ ద్వారా మనకు నిరూపించాడు ఆదర్శపురుషుడైన శ్రీరాముడు.

రమ్య గోదావరీ రమణీయ జలరాశితో కూడి, అసంఖ్యాత ఫల, పుష్పవృక్షాలతో భూలోక నందనవనంగా వెలుగులీనుతున్న ఆ పంచవటిలో పర్ణకుటీరం ఒకదానిని నిర్మించాల్సిందిగా తన సోదరుడైన లక్ష్మణున్ని ఆదేశించాడు రఘునందనుడు. అన్న ఆజ్ఞను ఔదల దాల్చిన సౌమిత్రి వెనువెంటనే ధృడమైన వెదురు గడలను వెదకి తెచ్చి స్థంభాలుగా నాటాడు. పటిష్టమైన మట్టితో గోడలను నిర్మించాడు. జమ్మి కొమ్మలు, దర్భలు, రెల్లుగడ్డిని వాడి పైకప్పును ఏర్పాటు చేసాడు. మహాబలశాలి, శతృసంహార సమర్థుడైన లక్ష్మణుడు నిర్మించిన ఆ పర్ణశాలను చూసి దశరథరాముడు అమిత సంతోషాన్ని పొందాడు. అత్యంత అభిమానంతో తమ్ముడుని కౌగిలించుకొని బహువిధాలుగా ప్రశంసించాడు రఘుకుల తిలకుడు.

“భావజ్ఞేన/ కృతజ్ఞేన/ ధర్మజ్ఞేన చ లక్ష్మణా/ త్వయా పుత్త్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ” అని మనసారా శ్లాఘించాడు. “ఓ లక్ష్మణా! నీవు ఇతరుల మనసులోని భావాలను గ్రహించడంలో సూక్ష్మబుద్ధివి. ధర్మాన్ని చక్కగా తెలుసుకొన్నవాడివి.  ఓ తండ్రిలా ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నావు. నీవు సతతమూ నా పక్కనే ఉండడం వల్ల తండ్రి లేని లోటు నాకు కనిపించడం లేద”ని లక్ష్మణున్ని పొగిడాడు శ్రీరాముడు.

శీతోష్ణ దుఃఖాల నుండి రక్షణను కల్పించిన వారిని గౌరవాభిమానాలతో చూడాలనే మహత్తర ధర్మసందేశాన్ని ఈ పర్ణశాల నిర్మాణ వృత్తాంతం ద్వారా మనకు వివరించాడు శ్రీరాముడు.

నాసిక్ లోని పర్ణకుటి ప్రాంతంలో “శ్రీరామ పర్ణశాల మందిరం”లో ఆనాడు లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను గుర్తుచేసేవిధంగా నమూనా కుటీరాన్ని నిర్మించారు. వెదురు గడలతోను, గడ్డితోను ఏర్పాటు చేసిన ఈ పర్ణశాల రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో శోభాయమానంగా కనిపిస్తుంది. శ్రీరామ పర్ణశాలను దర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతారు.

శ్రీ రామ పర్ణకుటి

“శ్రీ రామ పర్ణకుటి”లో సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు భక్తులకు దర్శనమిస్తాడు. తెల్లటి పాలరాతితో చేసిన సీతా, లక్ష్మణ, శ్రీ రామచంద్రుని విగ్రహాలను దర్శించి తరిస్తారు భక్తులు. సరయూనదీతీరవాసి అయిన శ్రీరామచంద్రుణ్ణి గోదావరీ తీరంలో కనులారా కాంచి ఆనందపరవశులవుతారు భక్తులు. భవ్య అయోధ్యాపురవాసి అయిన దశరథాత్మజుణ్ణి సరళసుందర పర్ణకుటీ నివాసిగా దర్శించి ఆ శ్రీరాముని సత్య శివ సుందర స్వరూప చింతనలో మగ్నులవుతారు ఆస్తికులు.

ఒకనాడు విలువైన స్వర్ణాభరణాలను, పట్టుపీతాంబరాలను ధరించిన సీతారాములు ఈ పర్ణకుటిలో నారవస్త్రాలను ధరించివుండడాన్ని ఊహించి భావోద్వేగానికి లోను కాని వారు ఉండరు. సమస్త పరిచారికా బృంద సహితయై రాణీవాస సుఖాలను అనుభవించిన సీతమ్మ తల్లి ఈ పర్ణకుటిలో కటికనేలపై శయనించడాన్ని తలచుకుని తల్లడిల్లని మనసు ఒక్కటైనా ఉండదు. భోగభాగ్యాలలో తులతూగుతున్నప్పుడు, దుర్గమారణ్యంలో సకల భోగవర్జితులై జీవించాల్సి వచ్చినప్పుడు సీతా రాముల ఆప్యాయతలో కాని, అభిమానంలో కానీ, పరస్పర అన్యోన్యతలో కానీ ఇసుమంతైనా లోపం రాలేదని ఆదికవి వాల్మీకి వివరించాడు. ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులై జీవించినప్పుడు అది ఆదర్శ దాంపత్యమై అలరారుతుందని పంచవటీ పర్ణకుటీర జీవనవిధానం ద్వారా లోకానికి చాటారు సీతారాములు. ఈ పర్ణకుటిలో సీతారాముల ముఖకమలాల దర్శనమాత్రం చేతనే దాంపత్య జీవన సౌభాగ్య రహస్యాన్ని సులభంగా గ్రహిస్తారు భక్తులు.

ఈ పర్ణకుటిలో రఘుకుల తిలకునితో బాటు పరమయోగులను, జ్ఞానరహితులను సమానంగా ఆదరించి, అనుగ్రహించే పంఢరినాథుడు కూడా కొలువై దర్శనమిస్తాడు.

లక్ష్మణ నిర్మితమైన పర్ణశాలలో సీతా సమేతుడై నివసించిన శ్రీరాముడు బ్రహ్మయజ్ఞాది నిత్యకార్యక్రమాలను నిర్వహించేవాడు. వివిధ పురాణాలను, ఇతిహాసాలను పఠిస్తూ, సీతా లక్ష్మణులతో వేదాంత చర్చలను జరిపేవాడని ఆదికవి వాల్మీకి వర్ణించాడు. గృహస్థులైనవారు నిత్యానుష్ఠాన పరాయణులై, సాత్విక పురాణ పఠనాన్ని, ఉత్తమ గ్రంథాల శ్రవణాన్ని, ధార్మిక విషయాలపై చర్చలను తమ తమ ఇళ్ళలో ప్రతిరోజూ నిర్వహించాలనే అమోఘ సందేశాన్ని అందించాడు శ్రీరాముడు.

శ్రీరామ పర్ణశాల వీక్షణం సకల సాంసారిక తాపోపశమనం, బహుజన్మార్జిత దుష్కర్మ విదారణం, శ్రీరామానుగ్రహకారకం!

సీతా గుహ

రమ్య గోదావరీ తీరంలోని సౌమ్యపరిసరయుక్తమైన పంచవటిలోని శ్రీరామ పర్ణశాల వద్దనే రావణాసురుని సోదరి అయిన శూర్పణఖ గర్వభంగం జరిగిందని ఆదికావ్యమైన శ్రీమద్రామాయణం వివరిస్తోంది. శూర్పణఖ సోదరులైన ఖరదూషణాదుల బారి నుండి సీతమ్మను రక్షించడానికై శ్రీరాముడు నిర్మించాడని చెప్పే “సీతా గుహ” ఈ పర్ణకుటికి సమీపంలో ఉంది.

దండకారణ్యాన్ని ప్రవేశించిన సీతారామ లక్ష్మణులు, అగస్త్య ఋషి సూచించిన పంచవటి ప్రాంతంలో, గోదావరీ నదీ తీరాన, పర్ణకుటిని నిర్మించుకుని నివసించారు. లక్ష్మణ నిర్మితమైన ఆ పర్ణకుటిలో రఘుకులోద్భవుడు సదాచార సంపన్నుడై, సదా పురాణ ప్రవచనాసక్త మానసుడై విరాజిల్లుతూ సీతా సమేతుడై నివసించాడు. సుందరుడు, నీలమేఘశ్యాముడు, జటామకుట మండితుడైన సాకేత రాముణ్ణి రాక్షస స్త్రీ అయిన శూర్పణఖ చూసింది. విశాలమైన వక్షస్థలము కలిగినవాడు, పద్మదళాయతాక్షుడు, ఆజానుబాహువైన రామచంద్రుణ్ణి తిలకించిన శూర్పణఖ కామ వివశురాలయింది. వెంటనే శ్రీరాముణ్ణి సమీపించి “ఓ వీరుడా! నేను అందమైన స్త్రీని. నీ భార్యగా చెప్పుకునే ఈ సీత వృద్ధురాలు. వికారమైన రూపం కలిగినది. కనుక నీవు నన్ను పెళ్ళాడి సుఖించు!” అని కోరింది. వికృతమైన ఆ కోర్కెను విన్న జానకీనాథుడు చిరునవ్వు నవ్వి “శూర్పణఖా! నేను వివాహితుడను, పైగా నా భార్య నాతోనే ఉంది. ఇప్పుడు నిన్ను పెళ్ళాడితే నీకు దుర్భరమైన సవతి పోరు తప్పదు. అదిగో మహావీరుడైన నా తమ్ముడు, లక్ష్మణుడు అక్కడున్నాడు. భార్యాదూరుడై నన్ను అనుసరించి వస్తున్నాడు. నీ కోర్కె తీరాలంటే యువకుడు, అందగాడైన లక్ష్మణున్ని ఆశ్రయించు” అని చెప్పి పంపాడు. కామాతురయైన శూర్పణఖ, లక్ష్మణున్ని చేరి తన వికృత కోర్కెను వెలిబుచ్చింది. అందుకు ప్రతిగా లక్ష్మణుడు ఆమెను మళ్ళీ తన అన్నవద్దకే పంపించాడు. త్రిలోకసుందరియైన సీతాదేవితో రాముడు సుఖాసీనుడై కూర్చునివుండడాన్ని సహించని శూర్పణఖ భీకరంగా అరుస్తూ సీతాదేవి వైపుకు దూకి, తీక్షణమైన తన గోళ్ళతో ఆమెను గాయపరచబోయింది. అందుకు కోపించిన రాముడు, ఆ రాక్షసిని నిలువరించవలసిందిగా లక్ష్మణున్ని ఆదేశించాడు. అన్న ఆజ్ఞను విన్న లక్ష్మణుడు, కరవాలంతో శూర్పణఖ ముక్కును, చెవులను కోసి ఆ కురూపిని విరూపిగా మార్చాడు.

లక్ష్మణునిచేత ఖండితాలైన కర్ణ, నాసాలతో పెడబొబ్బలు పెడుతూ పర్ణకుటి సమీపప్రాంతమైన జనస్థానంలో నివసిస్తున్న తన సోదరుడు ఖరుని వద్దకు పరుగెత్తింది శూర్పణఖ. తన చెల్లెలి దుస్థితిని చూసిన ఖరాసురుడు తీవ్ర కోపంతో తన అనుచరులైన పద్నాల్గు వేల మంది రాక్షసులను పిలచి, రామలక్ష్మణుల్ని సంహరించాల్సిందిగా ఆదేశించాడు. అంతేగాక తన సోదరుడైన దూషణున్ని వెంట తీసుకుని స్వయంగా తానే దండేత్తి వచ్చాడు. ఆ రాక్షస సేనను అల్లంత దూరం నుండే చూసిన రాముడు ధనుర్భాణాలను చేత తీసుకొని బయలుదేరాడు. దుష్టరాక్షస సంహార క్రీడను ఆరంభించే ముందు సాధుమూర్తి, సౌశీల్యవతి, సుకుమారి అయిన తన భార్యను భద్రస్థానంలో దాచాలనే తలంపు కలిగింది. అప్పుడు వెనువెంటనే ఓ గుహను నిర్మించాడు. ఆవిధంగా శ్రీరామ నిర్మితమైన గుహే “సీతా గుహ”గా ఈనాడు నాసిక్ పట్టణంలో వెలసింది. “రామోపి బంధుం సీతామ్ చ/ గుహాయాం స్థాప్య వేగతః/ చకార రాక్షసైర్ యుద్ధం/ శస్త్రైర్ అస్త్రైర్ భయాపహమ్/” అంటూ రామ నిర్మిత గుహను గురించి వివరాలను అందిస్తుంది ఆనంద రామాయణం. ప్రముఖ తెలుగు కవులైన కీర్తిశేషులు శ్రీ గుండు లక్ష్మణశాస్త్రి గారు – “రక్కసు లేగుదెంతురని/ రాముడు సీతను దమ్మునిన్ గుహన్/ జక్కగ నుండబంచి/ సునిశాత శరంబులు విల్లు దాల్చి” అని అంటూ ఈ రోమాంచిత ఇతివృత్తాన్ని తేట తెలుగులో అనువదించారు.

కాకుత్థ్స తిలకుడైన రఘురాముని స్వహస్తాలతో నిర్మితమైన ఈ ఐతిహాసిక గుహను ప్రస్తుతం “శ్రీ సీతా గుహా సంస్థాన్” అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రతిరోజు వందలాది భక్తులు ఈ సీతా గుహను దర్శించుకోవడానికై వస్తుంటారు.

చుట్టూ మహావృక్షాలతో ఆవృతమైన సీతా గుహా మందిర్ ప్రవేశ ద్వారం గుండా లోనికి వెళితే రాముల వారు సీతమ్మ రక్షణకై ఏర్పరచిన గుహ భక్తులకు దర్శనమిస్తుంది. ఇరుకైన ప్రదేశంలో సీతా గుహ నెలకొనివుండడం వల్ల క్యూ పద్ధతిని పాటిస్తూ గుహాదర్శనంను చేసుకొంటారు భక్తులు. నెలమాళిగలా నిర్మితమైన సీతా గుహను దర్శించడానికై కొన్ని మెట్లను దిగాల్సివస్తుంది. ఈ మెట్లను దిగి క్రిందకు వెళితే మూడు భాగాలుగా నిర్మించబడిన సీతా గుహను చూడవచ్చు.  గుహను దర్శించుకున్న భక్తులు మళ్ళీ మెట్లను ఎక్కి ఈ ద్వారం గుండా బయటకు వస్తారు.

సీతా గుహ చుట్టూ ఐదు మహా వటవృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలను సాక్షాత్తు శ్రీరాముడే నాటాడని స్థానిక కథనం వల్ల తెలుస్తోంది. ఈ ఐదు వటవృక్షాల వల్లనే ఈ ప్రాంతాన్ని “పంచవటి”గా పిలుస్తారని స్థానిక ఐతిహ్యం చెబుతోంది.

శూర్పణఖకు లక్ష్మణునిచే జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఖరదూషణులు పద్నాల్గు వేల మంది రాక్షసుల్ని వెంట తీసుకుని శ్రీరామునిపై దండెత్తి వచ్చారు. ఆ యుద్ధంలో సీతాదేవికి ఎలాంటి హాని కలగరాదని భావించిన రాముడు ఆమెను ఈ గుహలో దాచాడు. సీతమ్మను దాచిన ఈ స్థలాన్ని సులభంగా గుర్తుపట్టాలన్న ఉద్దేశంతో ఈ గుహ చుట్టూ ఐదు వటవృక్షాలను నాటాడు శ్రీరాముడు. త్రేతాయుగం నాటి ఆ వటవృక్షాలు నేటికీ సీతా గుహ చుట్టూ నెలకొనివున్నాయి. బలిష్ఠమైన కాండాలతో, పొడవైన కొమ్మలతో, పచ్చని ఆకులతో, అనాది నిత్యాలై భాసించే పంచ వటవృక్ష దర్శనంతో తమ జన్మలు ధన్యమయ్యాయని భావిస్తారు భక్తులు. సీతా గుహ దర్శనార్థమై వచ్చే భక్తులు ఈ ఐదు వటవృక్షాలకు ప్రదక్షిణలు చేస్తారు. భక్తుల సౌకర్యార్థమై, ఈ వృక్షాలను సులభంగా గుర్తించడానికై ఒకటి నుండి ఐదు వరకూ సంఖ్యలను కలిగిన బోర్డులను ఏర్పాటు చేసారు నిర్వాహకులు.

సనాతన హైందవ సంప్రదాయంలో వటవృక్షానికి మహత్తర స్థానం ఉంది. త్రిమూర్తి సన్నిధానయుక్తమైన వటవృక్షంలో వ్రేళ్ళు బ్రహ్మదేవుని సన్నిధానాన్ని కలిగివుంటాయి. కాండంలో శ్రీమహావిష్ణువు కొలువైవుంటాడు. అగ్రభాగంలో పరమశివుడు నెలకొనివుంటాడు. పరమపవిత్రమైన వటవృక్షాన్ని పూజించడం వల్ల సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్ని పూజించినట్టే అవుతుందని శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. వృక్షజాతుల్లోకెల్లా సుదీర్ఘకాలం జీవించే వటవృక్షాన్ని స్త్రీలు పూజించడం వల్ల వారి భర్తలు చిరాయువులై జీవిస్తారనే విశ్వాసం అనాది నుండి నెలకొనివుంది.

వటవృక్షానికి పూజలు నిర్వహించి, ప్రదక్షిణలు చేస్తే త్రిమూర్తుల ఆశీస్సులు లభించి తద్వారా ఉత్తమ సంతానం కలుగుతుందని, మాంగల్య సౌభాగ్యం ఇనుమడిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇంతటి మహత్తును, ప్రాశస్త్యాన్ని కలిగిన వటవృక్షాలను శ్రీరాముడు ఏరికోరి మరీ ఇక్కడ స్థాపించాడు. శ్రీరామ పవిత్ర కరస్పర్శను పొందిన ఈ వటవృక్షాలను సేవించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. సంతానాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధిని కోరేవారి కోరికలు నెరవేరుతాయి. ఈ విశ్వాసంతో ఇక్కడ ప్రతినిత్యం వందలాది ఆస్తికులు శ్రీరామ స్థాపితాలైన ఈ వటవృక్షాలను సేవించి తరిస్తుంటారు.

Your views are valuable to us!