రామ వనవాస ఘట్టాల భూమిక – నాసిక క్షేత్రం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

సీతాపహరణం, మారీచ వధ ప్రదర్శన శాల

శ్రీ సీతా గుహా సంస్థాన్‍కు అత్యంత సమీపంలో ’సీతాపహరణం, మారీచ వధ ప్రదర్శన శాల’ ఉంది. ఈ ప్రదర్శన శాలలో పంచవటి ప్రాంతంలో జరిగిన రామాయణ ఘట్టాలను సుందరమైన విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శనలో – పంచవటి ఆశ్రమంలో పిండి దంచడం, పాత్రలను శుద్ధి చేయడం వంటి వివిధ గృహకృత్యాలను సంతోషంగా నిర్వహిస్తున్న సీతమ్మను చూడవచ్చు. బంగారు వర్ణంలో మెరుస్తూ ఆకర్షిస్తున్న మాయా లేడిని శ్రీరామునికి చూపిస్తున్న సీతను తిలకించవచ్చు. మారీచ సంహారానికై రామలక్ష్మణులు తరలి వెళ్ళగా సీతా దేవిని అపహరించడానికై వచ్చిన మాయా సన్యాసి వేషధారియైన రావణాసురుడు – ఇలా వివిధ రామాయణ ఘట్టాలను హృద్యంగా ఆవిష్కరించారు ఈ ప్రదర్శన శాలలో.

శ్రీ లక్ష్మణ రేఖా మందిరం

పంచవటిగా రామాయణ ఇతిహాసప్రసిద్ధమైన నాసిక్ నగరంలో శ్రీరామ పర్ణకుటి, సీతా గుహా సంస్థాన్ తర్వాత దర్శించవలసిన ప్రముఖ మందిరం – “శ్రీ లక్ష్మణ రేఖా మందిరం.” సీతా గుహ నుండి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీ లక్ష్మణ రేఖా మందిరం వెలసిన స్థలంలో లోక ప్రసిద్ధమైన “లక్ష్మణ రేఖ”ను రామానుజుడైన లక్ష్మణుడు గీసాడని చెబుతారు. ప్రస్తుతం ఈ స్థలంలో నూతన మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో సీతా రామ లక్ష్మణుల పాలరాయి విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఎత్తైన వేదికపై స్థాపించిన ఈ విగ్రహాల క్రింది భాగంలో అలనాటి లక్ష్మణ రేఖకు ప్రతిరూపంగా అర్ధచంద్రాకార నిర్మాణాన్ని స్థాపించారు నిర్వాహకులు.

ఆదికవి వాల్మీకి రచితమైన శ్రీమద్రామాయణంలో లక్ష్మణ రేఖ గురించి వివరాలు లభించవు. వంద కోట్ల శ్లోకాలతో కూడిన శతకోటి రామాయణాంతర్గతమని ఖ్యాతికెక్కిన ఆనంద రామాయణంలో ఈ లక్ష్మణరేఖ ప్రసక్తి వస్తుంది. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించిన ఆనంద రామాయణంలోని సారకాండం, సప్తమ సర్గలో “తథాపి శృణు మద్వాక్యమ్ యన్మయ అత్ర ఉచ్యతే హితమ్/ మయౌతామ్ ధనుషో రేఖామ్/ కృతాం త్వత్పరితోధునా” అన్న శ్లోకంలో లక్ష్మణుడు సీతా రక్షణార్థమై తన విల్లుతో ఆమె చుట్టూ రేఖలను లిఖించాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆనాటి నుండి ఒకరి హితాన్ని, సుఖాన్ని, రక్షణను కోరుతూ విధించే నియమాలను “లక్ష్మణ రేఖ”గా పిలవడం పరిపాటి అయింది. శ్రీ లక్ష్మణ రేఖా మందిర దర్శనంతో భక్తులు ధర్మశాస్త్రాలు మానవులకు విధించే నియమాలను, పద్ధతులను స్మరించుకొని అవన్నీ “లక్ష్మణ రేఖ” వలే మన బాగు కోసమే ఏర్పడినవి తలుస్తారు.

సీతా అపహరణ్ మందిర్

నాసిక్ పట్టణంలో శ్రీ లక్ష్మణ రేఖ మందిర్ తరువాత దర్శించ వలసిన మరో ముఖ్య మందిరం శ్రీ సీతా అపహరణ్ మందిర్. ప్రధాన రహదారి పక్కనే వెలసిన ఈ చిన్న మందిరమే సీతాపహరణ్ మందిర్. ఈ మందిరంలోకి ప్రవేశించగానే ఎదురుగా సీతాదేవి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా సీతాదేవి శ్రీరామ సమేతయై మాత్రమే దర్శనమిస్తుంది. కానీ ఈ సీతాహరణ్ మందిరంలో సీతాదేవి మాత్రమే నెలకొనివుంది. భారతదేశంలో రాముడు లేని ఆలయంగా ఈ సీతాపహరణ మందిరం ప్రసిద్ధి కెక్కింది.

ఈ మందిరంలో సీతాదేవి విగ్రహాన్ని భిక్షను వేస్తున్నట్టుగా మలచారు. రామాయణ కథనం ప్రకారం బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుడు రామబాణ ఘాతానికి నేలకూలుతూ మాయోపాయంతో “హా సీతా! హా లక్ష్మణా!” అని అరచి ప్రాణం విడుస్తాడు. శ్రీరాముని కంఠ ఘోషను విన్న సీతమ్మ రామ రక్షణకై తరలివెళ్ళమని లక్ష్మణున్ని ఆదేశిస్తుంది. వదిన ఆజ్ఞను శిరసావహించి, ఆశ్రమం చుట్టూ రక్షరేఖను గీసి వెళతాడు లక్ష్మణుడు. రామలక్ష్మణులు లేని ఆ సమయంలో మాయా సన్యాసి రూపాన్ని ధరించి వస్తాడు రావణుడు. ఆ వచ్చినది నిజమైన సన్యాసి అన్న భావనతో భిక్షను వేయడానికై పర్ణకుటీరం వెలుపలకు వస్తుంది సీతమ్మ. ఈ ఘటనకు గుర్తుగా మందిరం ముందు భాగంలోని బయలు ప్రదేశంలో సన్యాసి వేషంలో ఉండే రావణాసురుని విగ్రహం ఉంది. మందిరంలోని సీతమ్మ విగ్రహం, దోసిళ్ళతో భిక్షను పట్టుకున్నట్టుగా దర్శనమిస్తుంది.

శూర్పణఖ విరూపి కావడం, అత్యంత ఆప్తులైన త్రిశిరుడు, ఖర దూషణాదులు సైన్యసహితంగా సమూల నాశనాన్ని పొందారన్న వార్తలను విన్న రావణాసురుడు క్రోధితుడై తన మేనమామ అయిన మారీచుణ్ణి బెదరించి వానిచే మాయామృగ రూపధారణం చేయించాడు. రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చావడమే మేలని తలచిన మారీచుడు బంగారు జింకగా మారి రాముణ్ణి సీతనుండి వేరు చేసాడు.

ఈ ఘటన సంభవించడానికి మునుపే శ్రీరాముని ఆదేశానుసారం సాత్విక సీత, రాజస సీత, తామస సీతా అనే మూడు రూపాలను సీతాదేవి ధరించిందన్న సూక్ష్మ విషయాన్ని ఆనంద రామాయణం తెలుపుతోంది. “తమోమయీ/ పంచవట్యామ్/ దశాస్థాస్య మోహనార్థం” అన్న ఆనంద రామాయణ వచనం మేరకు పంచవటిలో రావణునికి భిక్ష వేయడానికి నిలచిన సీతారూపం తామసరూపమని, ఆ రూపం రావణాసురునికి మోహాన్ని కలిగించే నిమిత్తమే నిలచివుందని స్పష్టమవుతోంది. మహత్తరమైన ఈ ఆధ్యాత్మిక ధర్మసూక్ష్మాన్ని ఈ “సీతాపహరణ్ మందిర్”లో తలచుకుని భావోద్వేగభరితులవుతారు భక్తులు.

సీతాపహరణ్ మందిరంలో సీతాదేవికి ఇరువైపులా గోపాలబాలుడైన మురళీధరుడు, ఆదిపరాశక్తియైన పార్వతీదేవి వెలసి దర్శనమిస్తారు.

ఈ సీతాపహరణ్ మందిరానికి మరో విశేషముంది. శ్రీరామ రక్షణార్థం పర్ణకుటీరం నుండి తరలివెళ్ళే ముందు సీతమ్మ రక్షణకై లక్ష్మణుడు గీసాడని చెప్పే లక్ష్మణరేఖ ఆపై ఓ నదిగా మారిందని చెబుతారు. సీతాపహరణ్ మందిరం వెనుక భాగంలోని ఈ ప్రాంతంలో పూర్వం లక్ష్మణ రేఖా నది పారేదని ఈ ప్రాంతాన్ని చూపిస్తారు స్థానికులు.

కాట్యా మారుతీ మందిరం

సీతాపరణ్ మందిర్ ఎదురుగా ఇతిహాస ప్రసిద్ధమైన “శ్రీ కాట్యా మారుతీ మందిరం” భక్తజనమందారమై భాసిస్తూ దర్శనమిస్తుంది. మందిర అంతర్భాగంలో భవ్యమైన కాట్యా హనుమాన్ భారీ విగ్రహం దర్శనమిస్తుంది. స్వామివారు స్వయంభు మూర్తి అని స్థలపురాణం వివరిస్తోంది. సుమారు పదకొండున్నర అడుగుల ఎత్తున్న శ్రీ కాట్యా మారుతి, విశాలమైన నేత్రాలతో, శివుని మూడో కంటిని తలపించే నామంతో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తాడు.

శ్రీ కాట్యా మారుతి త్రేతాయుగం నుండి ఇక్కడ నెలకొనివున్నట్టు స్థలపురాణం వివరిస్తోంది. సుమారు పదకొండున్నర అడుగుల ఎత్తున్న శ్రీ కాట్యా మారుతి భారీకాయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం త్రేతాయుగంలో సీతాన్వేషణలో భాగంగా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి, అశోకవనంలో బంధితయై దుఃఖిస్తున్న సీతమ్మకు శ్రీరామ ముద్రికను ఇచ్చి, ఆ మహాసాధ్విని సంతోష పరచి, సీతమ్మ ఇచ్చిన చూడామణిని ఆ తల్లి క్షేమసమాచారానికి గుర్తుగా స్వీకరించి, లంకను నుండి కిష్కింధకు బయలుదేరిన హనుమంతుని భారీ కాయమే ఈ విగ్రహమని చెబుతారు.

ద్వాపరయుగ కాలంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని స్థానిక ఐతిహ్యం చెబుతోంది. అరణ్యవాసంలో భాగంగా దండకారణ్య ప్రాంతానికి వచ్చిన పాండవులు, నాసిక్ పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న పాండవ్ గుహా అన్న ప్రాంతంలో నివసించేవారని ప్రతీతి. ఆహార అన్వేషణకై పాండవ గుహ నుండి బయలుదేరిన పాండవులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వజ్రశరీరుడు, మహాగంభీరుడూ అయిన కాట్యా వీర హనుమాన్ నల్లతుమ్మ చెట్టు క్రింద దర్శనమిచ్చాడట! మహోన్నత మూర్తియై దర్శనమిచ్చిన కేసరీనందనుణ్ణి వివిధ స్తోత్రాలతో కీర్తించారు పాండవులు. అజాతశత్రువులు, జితేంద్రియులు, ధర్మదీక్షాదక్షులైన పాండవుల భక్తికి మెచ్చిన వాయునందనుడు వారికి ఓ వరాన్ని ప్రసాదించాడు. పాండవ వనవసానంతరం సంభవించే కురు-పాండవ సంగ్రామంలో అర్జునుని రథాగ్రంపై కపిధ్వజరూపంలో వెలసి, విజయుని వీరవిహారంలో సహాయం చేస్తానన్న వరాన్ని కాట్యా మారుతి ప్రసాదించాడని చెబుతారు.

సిందూర గంధానులేపనంతో వెలుగులీనే శ్రీ కాట్యా మారుతీ విగ్రహ పైభాగంలో ఆ మహాభక్తుని ఆరాధ్యమూర్తులైన శ్రీ సీతారాములు కొలువైవుండి భక్తులను అనుగ్రహిస్తారు. వేదజ్ఞానానికి నిదర్శనమైన సీతమ్మను, వేదప్రతిపాద్యుడైన శ్రీరాముణ్ణి జతచేర్చిన భాగ్యశాలి, బాహుబలి ఈ హనుమంతుడు. వజ్రకాయుడు, వజ్రసంకల్పుడూ అయిన హనుమంతుని నామోచ్ఛారణ వల్లనే సకల భయాలు తొలగిపోతాయి. లక్ష్మణ ప్రాణదాత అయిన అంజనాసూనుని స్మరణమాత్రం చేతనే సకల అరిష్టాలు నశిస్తాయి. శతయోజన విస్తీర్ణ సింధువును లీలాజాలంగా లంఘించిన పవనసుతుణ్ణి ప్రార్థించేవారికి మహా సంసార సాగర సముత్తరణం అత్యంత సులభసాధ్యం. మహాబలశాలి, మహాపౌరుషవంతుడు అయిన హనుమంతుణ్ణి శ్రీ కాట్యా మారుతిగా దర్శించిన భక్తులు నిర్భయులై, మనోకామనా సాధకులై తరిస్తారు.

తపోవనం

నాసికా పట్టణంలో రసరమ్య రామాయణ కథాకల్పవల్లికి పూచిన మరో ఐతిహాసిక కథాపుష్పం “తపోవనం.” నాసిక్ పట్టణ శివార్లలో వెలసిన ఈ “తపోవనం”ను రామాయణ కథాగమనాన్ని మలుపు తిప్పే శూర్పణఖ గర్వభంగ స్థలిగా చెబుతారు. సుమిత్రా నందనుడైన లక్ష్మణుడు దుష్టరాక్షసి అయిన శూర్పణఖ కర్ణనాసాలను తన కరవాలంతో ఖండించాడని వివరించే రామాయణ ఘట్టం ఈ స్థలంలోనే సంభవించిందని చెబుతారు. లక్ష్మణ వీరత్వ నిదర్శనమైన ఈ తపోవనంలో “శ్రీ శేషనాగ మందిరం” కొలువైవుంది. భారతదేశంలో లక్ష్మణునికై వెలసిన ప్రత్యేక ఆలయంగా ఈ శేషనాగ మందిరం ఖ్యాతి గడించింది.

విశాలమైన ప్రాంగణంలో వెలసిన ఈ మందిరంలోకి ప్రవేశించగానే రావణ గర్వాపహారి, సంజీవనీపర్వతోద్ధారి అయిన ఆంజనేయుడు సిందూర చర్చితుడై దర్శనమిస్తాడు. హనుమంతుణ్ణి దర్శించిన పిదప మందిరం అంతర్భాగంలో తపోభంగిమలో, పద్మాసనస్థుడై, ముకుళిత హస్తాలతో ఆశీనుడైవుండే శ్రీ శేషనాగ లక్ష్మణున్ని దర్శించుకుంటారు భక్తులు.

లక్ష్మణుడు ఆదిశేషుని అవతారమని పురాణ, ఇతిహాస ప్రసిద్ధమైన విషయం. శ్రీమన్నారాయణునికి పాన్పుగా, ఛత్రంగా, ఆసనంగా అనునిత్యం సేవలందించే ఏకాంత భక్తుడు ఆదిశేషుడు. సజ్జన పీడకులై, యజ్ఞ విధ్వంసకులై, పరస్త్రీ పీడనా పరాయణులై చెలరేగుతున్న రావణాసురాది దైత్యుల సంహారానికి దేవదేవుడు శ్రీరాముడై అవతరించాడు. వైకుంఠవాసుని అంతేవాసులైన శంఖ చక్రాలు, ఆదిశేషుడు ఆయనను అనుసరించి భరత, శతృఘ్న, లక్ష్మణులుగా అవతరించారు. శ్రీరామ వనవాస దీక్షలో సుమిత్రా తనయుడైన సౌమిత్రి అన్నకు అండగా, జత వీడని నీడగా అనుసరించి, సేవించాడు. భాతృప్రేమకు, నిస్వార్థ సేవకు, కఠోర నియమ పాలనకు, జితేంద్రియత్వానికి ప్రతీకగా నిలచే లక్ష్మణుడు శ్రీ శేషనాగ మందిరంలో భక్తులకు దర్శనమిస్తాడు.

అయితే ఈ స్థలానికి “తపోవనం” అన్న పేరు స్థిరపడడానికి వేరే కారణం ఉంది. కపిలా-గోదావరీ సంగమ స్థలమైన ఈ ప్రాంతంలో లక్ష్మణుడు రాక్షస సంహార సామర్థ్య ప్రాప్తికై పరమశివుడిని ఉద్దేశించి ఉగ్ర తపస్సును ఆచరించాడు. అందువల్ల ఈ ప్రాంతాన్ని “తపోవనం”గా పేర్కొంటారు. విశాలమైన శేషనాగమందిర ప్రాంగణంలో నిలచివున్న ఈ వటవృక్షం క్రింద లక్ష్మణుడు తీవ్ర తపస్సు చేసాడని చెబుతారు. రామ-రావణ సంగ్రామంలో రావణపుత్రుడైన ఇంద్రజిత్తును వధించి, జయించడానికై లక్ష్మణుడు ఈ వటవృక్షం ఛాయలో తపశ్చర్యను ఆచరించాడని కూడా చెబుతారు. ఈ కథనానికి గుర్తుగా మహోన్నతమైన వటవృక్షం క్రింద తపోదీక్షలో లీనమైవున్న లక్ష్మణ విగ్రహాన్ని స్థాపించారు. లక్ష్మణ దేవర తపోవేదికగా నిలచిన ఈ వటవృక్షం త్రేతాయుగం నాటిదని, ఇది చిరంజీవి అని ఏనాడు వాడపోలేదని చెబుతారు మందిర నిర్వాహకులు.

ప్రసిద్ధమైన పంచవటీ పర్ణకుటీరంతో బాటు ఈ తపోవనాన్ని శూర్పణఖ గర్వభంగ స్థానంగా పేర్కొంటారు. నిజానికి శూర్పణఖ ముక్కు, చెవులను ఖండించిన స్థలం కపిలా-గోదావరీ సంగమక్షేత్రమని చెబుతారు. వర్షాకాలంలో ఆ ప్రాంతం గోదావరీ నదిజలాల్లో పూర్తిగా మునిగిపోతుంది. ఈ కారణం వల్ల నదికి దూరంగా, ఈ తపోవన ప్రాంతంలో శూర్పణఖ గర్వాపహార దృశ్యాన్ని సుందరమైన విగ్రహాల రూపంలో నిర్మించారు నిర్వాహకులు.

కపిలా-గోదావరీ సంగమ స్థానం

భవ్య గోదావరీ రమ్య జలప్రవాహం ప్రవహిస్తున్న ఈ ప్రాంతం అపూర్వమైన కపిలా-గోదావరీ సంగమ స్థానం. నదీ సంగమ క్షేత్రాలు అత్యంత పుణ్యదాయకాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. సంగమ ప్రదేశాలలో ఆచరించే పుణ్యస్నానాలు అనంత పుణ్యాన్ని అందిస్తాయి. ఆవిధంగా కపిలా-గోదావరీ సంగమ ప్రదేశమైన తపోవనం ఓ దివ్యస్థలిగా వాసికెక్కింది. ఈ సంగమ తీరంలోనే కామ వ్యామోహపీడితయైన శూర్పణఖ, శ్రీరాముణ్ణి సమీపించి, తనను వివాహమాడవలసిందిగా కోరిందట! ఆ కోర్కెను తిరస్కరించినందువల్ల క్రోధవశయై సీతాదేవిని గాయపరచబోగా, వదినమ్మను రక్షించే నిమిత్తం లక్ష్మణుడు నిశిత కరవాలంతో దుష్ట శూర్పణఖ ముక్కు, చెవులను ఖండించాడు. ఈ కథనానికి గుర్తుగా కపిలా-గోదావరీ సంగమ తీరంలో ఈ ప్రాచీన శిల్పాన్ని చూడవచ్చు. భీకరమైన ఆకారంతో కూడిన శూర్పణఖపై కరవాలంతో లంఘిస్తున్న లక్ష్మణ స్వామిని ఈ శిల్పంలో భక్తులు దర్శిస్తారు. కమలనేత్రుడైన లక్ష్మణుడు “శరంబు వింట దానెక్కిడి దానిపై విడువ/ నేగి తదీయ కుచోష్ఠ కర్ణముల్, ముక్కును గోసి/ యా శరము పోయెను/ రాముని చెంత” అని కీర్తిశేషులు శ్రీ గుండు లక్ష్మణశాస్త్రి గారు తమ ఆంధ్ర ఆనందరామాయణంలో శూర్పణఖ గర్వభంగాన్ని వర్ణించారు.

కపిలా-గోదావరీ సంగమస్థల తీరంలో శ్రీమన్నారాయణుని అంశావతారి అయిన కపిల మహర్షిని భక్తులు దర్శిస్తారు. మహాఋషి అయిన కపిల భగవానుని ముందుభాగంలో వెలసిన ఈ చిన్న కుండాన్ని “కపిలతీర్థం”గా పిలుస్తారు. సాంఖ్యయోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన కపిల మహాఋషి ఈ గోదావరీ తీరంలో తపస్సును ఆచరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం చేత ఈ కుండానికి కపిల తీర్థమని పేరు వచ్చిందని చెబుతారు. “పంచమః కపిలో నామ/ సిద్ధేశః కాలవిప్లుతమ్ / ప్రోవాచాసురయే సాంఖ్యం / తత్త్వగ్రామ వినిర్ణయమ్/” అని కపిలావతార వైశిష్ట్యాన్ని భాగవత మహాపురాణం వర్ణిస్తోంది. బ్రహ్మమానస పుత్రుడైన కర్దమ ప్రజాపతికి, దేవహూతీ దేవికి జన్మించిన కపిలుడు శ్రీమన్నారాయణుని ఇరవై నాలుగు అవతారాల్లో ఐదవదని భాగవతం వివరిస్తోంది. గంగానది దివి నుండి భువికి దిగిరావడానికి ఈ కపిల ఋషియే ప్రధాన కారణమని రామయణ, భారతాల ద్వారా తెలుస్తోంది.

కపిల ఋషిని అవమానించి భస్మమైపోయిన తన తాతలను ఉద్ధరించి, విముక్తుల్ని కావించి, ఊర్ధ్వలోకాలకు పంపడానికై ఇక్ష్వాకు కుల తిలకుడైన భగీరథుడు తీవ్రతపస్సును చేసి గంగానదిని ప్రసన్నీకరించుకున్నాడు. ఆవిధంగా, ఈ కపిల ఋషి కారణంగా, దేవలోకవిహారిణి అయిన గంగానది భూలోకసంచారిణిగా దిగివచ్చింది. సమస్త పాపాలను పరిహరించే పావన గంగానది మానవులమైన మనకు దక్కడానికి కారణభూతుడైన కపిల ఋషిని గౌతమీ గంగా తీరంలో, కపిలా-గోదావరీ సంగమ స్థలంలో దర్శించి, అర్చించగలగడం అనేక జన్మల పుణ్యఫలమే!

గంగాజనకుడైన శ్రీమన్నారాయణుడే గంగావతరణ కారకుడైన కపిల ఋషిగా విరాజిల్లే అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఈ కపిలా-గోదావరీ సంగమ స్థలంలో స్మరించిన వారికి కపిల నామక భగవంతుని సంపూర్ణానుగ్రహం లభిస్తుంది.

మహామహిమాన్వితుడైన కపిల ఋషి విగ్రహాం పక్కనే వత్స సహితమైన కపిలధేనువును దర్శించి, తరిస్తారు భక్తులు.

పవిత్ర కపిలా-గోదావరీ సంగమ ప్రాంతమైన ఈ తపోవనంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఐతిహాసిక తీర్థాలు నెలకొనివున్నాయి. వీటిలో అగ్ని కుండం, త్రిమూర్తి కుండాలు అత్యంత ప్రసిద్ధిని పొందినవి.

Your views are valuable to us!