అగ్నికుండం
ఈ అగ్ని కుండ కథనం జ్ఞాన విజ్ఞానదాయకం, ఆనందకారకం.
పంచవటి క్షేత్రంలో లక్ష్మణుని చేత శూర్పణఖ గర్వభంగం జరిగిన తర్వాత క్రోధితులైన ఆమె సోదరులు ఖరదూషణాదులు పద్నాల్గు వేలమంది సైన్యంతో పంచవటిని ముట్టడిస్తారు. ఏకాంగవీరుడైన శ్రీరామచంద్రుడు ససైన్య సహితంగా ఖరదూషణుల్ని సంహరిస్తాడు. తాపసుల ఆశ్రమాల నిలయమైన దండకారణ్యం, కామరూపులు, మాయాజాల ప్రవీణులైన దుష్ట రాక్షసుల విహారభూమి అని గ్రహించిన రాముడు అనేక ముందు జాగ్రత్తలను తీసుకున్నట్టు వాల్మీకి రామాయణం, ఆనంద రామాయణాల వల్ల తెలుస్తోంది.
పంచవటిలో సీతాపహరణ ఘట్టం సంభవించడానికి పూర్వమే దుష్ట రాక్షసుల మాయోపాయాలను చక్కగా గ్రహించిన శ్రీరాముడు తన అర్ధాంగి, ముక్తికాంతా అయిన సీతాదేవిని మూడు రూపాలు ధరించమని ఉపదేశించాడు. స్వామి ఉపదేశానుసారం సీతాదేవి సాత్విక, రాజస, తామస గుణప్రధానాలైన మూడు రూపాలను స్వీకరించింది. సాత్వికగుణ ప్రధానమైన సీతమ్మ రూపం శ్రీరాముని నీడలా మారి స్వామివారి వామభాగంలో లీనమయింది. తామస గుణప్రధానమైన రూపం, పంచవటి పర్ణశాలలో పాంచభౌతిక రూపాన్ని ధరించి నిలిచింది. రాజస గుణప్రధానమైన సీతాదేవి మూడవ రూపం అగ్నిదేవుని గృహంలో కొలువై, స్వాహాదేవి, స్వధా దేవి చే నిత్యపూజలను అందుకోసాగిందని శతకోటి రామాయణ అంతర్భాగమైన ఆనంద రామాయణం వివరిస్తోంది.
శ్రీరాముని ఆదేశానుసారం మూడు రూపాలను ధరించిన సీతాదేవి, రాజసమూర్తియై, ఈ అగ్నికుండంలో ప్రవేశించి, హుతాశనుడైన అగ్నిభట్టారకుని గృహాన్ని చేరిందని చెబుతారు. సీతాదేవి స్వీకరించిన మూడు రూపాలను వర్ణిస్తూ “అథా తామ్ జానకీమ్ ప్రాహ/ రామో రహసి సాదరమ్/ సీతే త్వమ్ త్రివిధా భూత్వా/ రజోరూపా వసానలే/ వామాంగే మే సత్త్వ రూపా/ వస ఛాయా తమోమయీ/ పంచవట్యాం దశాస్థస్య/ మోహనార్థమ్ వసత్ర వై/” అని ఆనంద రామాయణం వివరిస్తోంది.
ఖరదూషణాదుల్ని నిముషమాత్రంలో సంహరించిన శ్రీరాముడు సీతాదేవిని సమీపించి “ఓ సీతా! నీవు మూడు రూపాలను ధరించు. రజోరూపివై అగ్నిదేవుని ఇంటిలో నివసించు. సాత్వికరూపివై నా వామభాగాన్ని చేరి నీడలా నన్ను అనుసరించు. తామసరూపివై ఈ పంచవటిలో సర్వులకూ దర్శనమిస్తూ దశకంఠునికి మోహాన్ని కలిగించే నిమిత్తం వసించు” అని చెప్పాడు. శ్రీరామవచోపాలనే పత్నీధర్మంగా కలిగివున్న సీతమ్మ, రజోరూపధారిణియై ఈ ’అగ్ని కుండం’ను ప్రవేశించింది.
“పడతీ! నీవిట మూడు రూపముల నొందుము/ అనలమందు రజోరూపమున వసించి/ సత్వమున నాదు దాపల సతము నుండి/ తామసిక మూర్తి రావణార్థంబు గొనుము” అంటూ సీతా త్రిమూర్తి తత్వాన్ని సరళమైన తెలుగు భాషలో అనువదించారు శ్రీ గుండు లక్ష్మణ శాస్త్రిగారు.
త్రిమూర్తి కుండం
సీతా రక్షణార్థం తాను చేసిన ఈ త్రిరూప విభాగానికి, రజోరూపి అయిన సీతాదేవి అగ్నిదేవుని వద్దకు చేరిందనడానికి సాక్షిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ వసించాలని శ్రీరాముడు కోరాడు. విశ్వసాక్షీభూతులైన ఆ త్రిమూర్తులు శ్రీరాముని ప్రార్థన మేరకు మూడు కుండాల రూపంలో ఈ అగ్నికుండం దగ్గర వెలిసారు. ప్రజాపతి బ్రహ్మదేవుని సాన్నిధ్యాన్ని కలిగిన ఈ కుండం ’బ్రహ్మ కుండం’గా ఖ్యాతి గడించింది. సర్వసాక్షి, సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని విభూతి రూపమైన ఈ కుండం ’విష్ణు కుండ’మని పేరుపొందింది. దేవతా సార్వభౌముడు, పరమవిరక్తశిఖామణి అయిన పరమశివుని ప్రతినిధి అయిన ఈ కుండం ’శివ కుండం’గా విఖ్యాతిని పొందింది. సర్వకాలాలలోనూ, స్వచ్ఛమైన నీటితో నిండివుండే ఈ త్రిమూర్తి కుండాలను దర్శించిన భక్తులు సృష్టి, స్థితి, లయాదులలో నిబిడీకృతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమేశ్వరానుగ్రహ పూర్వకంగా పొందుతారు.
ఈ త్రిమూర్తి కుండ దర్శనం వల్ల ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవకాలనే తాపత్రయాలు పరిహారమవుతాయి. త్రిగుణాత్మకమైన సీతారూపాలను అగ్ని కుండంలో దర్శించి, ధ్యానించడం వల్ల రాజస, తామస గుణ జనితాలైన కష్టాలు సమసిపోతాయి. శుద్ధ సాత్విక సీతారూపం శ్రీరాముని ఛాయలా మారిన విధంగా ఈ పవిత్ర కుండాల దర్శనంతో భక్తుల హృదయాలు శ్రీరామపదారవింద లగ్నమానసాలై వికసిస్తాయి. మోక్షకారకమైన సత్వగుణప్రధానమై అలరారుతాయి.
పాపవిమోచన కుండం
పరమ పావనాలైన అగ్నికుండం, త్రిమూర్తి కుండాల సమీపంలో “పాపవిమోచన కుండం” దర్శనమిస్తుంది. ఈ తీర్థ జలాలతో స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కేవలం పాపాన్ని పోగొట్టుకోవడమే మానవుల లక్ష్యం కారాదని శ్రీరామచంద్రుడు చూపించిన ధర్మమార్గంలో నడవాలనే సందేశాన్ని అందిస్తుంది ఈ పాపవిమోచన కుండం.
శ్రీరామ పర్ణకుటి, సీతా గుహ, పంచవటవృక్షాలు, లక్ష్మణ రేఖా మందిరం, సీతాపహరణ మందిరం, త్రిమూర్తి కుండాల దర్శనాలతో పవిత్ర నాసిక్ పంచవటీ వీక్షణం సుసంపన్నమవుతుంది.
అనేక ఆలయాల నిలయమైన నాసిక్ క్షేత్రంలో దర్శనీయ మందిరాలు మరిన్ని ఉన్నాయి. వీటిలో శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం, శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం, శ్రీ నవశ్యా గణపతి మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, శ్రీ మోదకేశ్వర గణపతి మందిరం ప్రధానమైనవి.
సోమేశ్వర మహాదేవ మందిరం
నాసిక్ పట్టణంలోని గంగాపూర్ ప్రాంతంలో గోదావరీ తీరాన వెలసిన మహాద్భుత శివమందిరం శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం. సువిశాలమైన ప్రాంగణంతో, చుట్టూ పచ్చపచ్చని వృక్షసిరితో కూడిన శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం భక్తుల మనస్సులను మొదటి వీక్షణంలోనే ఆకర్షిస్తుంది.
సోమేశ్వర మహాదేవ మందిరాన్ని ప్రవేశించడానికి కొన్ని మెట్లను దిగాలి. భక్తులు ఈ మెట్లను దిగి సోమేశ్వర మందిరంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రవేశ ప్రాంతంలోనే పరమశివుని ప్రియభక్తులు, వాహనము అయిన నందీశ్వరుడు తదేకధ్యానమగ్నుడై దర్శనమిస్తాడు. నంది అనగా ఆనందం కలిగించేవాడని అర్థం. మహా వైరాగ్యమూర్తి అయిన చంద్రశేఖరుణ్ణి దర్శించడానికి ముందుగా నందీశ్వరుణ్ణి దర్శిస్తే మనసులోని చింతలు, బాధలు తొలగిపోయి ఆనందం చేకూరుతుంది. సంతోషంతో కూడిన ప్రశాంత హృదయంతో గౌరీమనోహరుణ్ణి దర్శించి, పూజిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. జ్ఞానము, భక్తి వృద్ధి చెందుతాయి.
సోమేశ్వరాలయంలో స్థితుడైవున్న నందీశ్వరుణ్ణి దర్శించిన పిదప భక్తులు ఆలయ గర్భగృహంలోని శ్రీ సోమేశ్వర మహాదేవుణ్ణి దర్శించుకుంటారు. ఈ స్వామిని భక్తులే స్వయంగా అర్చించవచ్చు. “చేతులారంగ శివుని పూజించడేని” అని భక్తకవి పోతనామాత్యుడు నుడివినట్టుగా ఈ మందిరంలో భక్తులు మనస్పూర్తిగా సోమేశ్వర స్వామిని అర్చించి తరిస్తుంటారు.
సోమేశ్వర అంటే చంద్రునికి అధిపతి అని అర్థం. విశాల వినీలాకాశంలో వెన్నెల వెలుగుల్ని విరజిమ్మే చంద్రుడు దక్షప్రజాపతికి అల్లుడు. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేసాడు. ఈ ఇరవైయేడు కన్యామణులే అశ్విని, భరణి, కృత్తికా మొదలైన 27 నక్షత్రాలు. తారానాథుడైన చంద్రుడు ఆ ఇరవైయేడు మందిలో ఒక్క రోహిణీదేవిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తూ ఇతర భార్యల్ని నిర్లక్ష్యం చేసాడు. ఇందుకు కోపించిన దక్షుడు చంద్రుణ్ణి క్షయవ్యాధిగ్రస్థుడవు కమ్మని శపించాడు. అమిత సౌంధర్యంతో, తేజస్సుతో వెలిగిపోయే చంద్రుడు శాపగ్రస్తుడై మహావిష్ణువును శరణు కోరుతాడు. ఆ దేవదేవుని సలహా మేరకు కైలాసవాసుడైన మహారుద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. భయభీతుడైన శశాంకునికి అభయమిచ్చిన పరమశివుణ్ణి ఎదిరించడానికై దక్షుడు కైలాసానికి వచ్చాడు. సమస్యను పరిష్కరించడానికై వైకుంఠవాసుడు తరలి వచ్చి దక్షునికి, శివునికి మధ్య సంధానం చేసాడు. విష్ణుమూర్తి ప్రతిపాదన మేరకు చంద్రుడు బాలచంద్రుని రూపంలో పిండివెన్నెలను ఒలికిస్తూ సదాశివుని శిరస్సుపై ఎల్లకాలము వెలుగుతూ నిలిచాడు. చంద్రుని మరో రూపం దక్షప్రజాపతి శాపాన్ని స్వీకరించి పదిహేను రోజులు పెరుగుతూ, మరో పదిహేను రోజులు తరుగుతూ మిగిలాడు. సోమ అని పిలువబడే చంద్రుణ్ణి ధరించినందువల్ల ఆనాటి నుండి సోమేశ్వరునిగా, చంద్రచూడునిగా, చంద్రకళాధారిగా త్రిలోకఖ్యాతిని పొందాడు మహాదేవుడు.
గర్భాలయంలో తెల్లటి రజత కవచంతో భాసిల్లే సోమేశ్వరుడు దివ్యకాంతివిరాజితుడై భక్తులకు దర్శనమిస్తాడు. పంచఫణామండితమైన రజత సర్పరాజ మొకటి మహాదేవునికి ఛత్రమై అలరారుతూవుంటుంది. బిల్వపత్రాలతో, పుష్పమాలలతో అలంకృతుడైన మహా సోమేశ్వరుడు భక్తులు భక్తితో అర్పించే పూజలను స్వీకరిస్తూ చిరునవ్వుల వెన్నెలల్ని కురిపిస్తాడు. ఆ చల్లని స్వామిని చూసిన భక్తులు ఆనంద పారవశ్యులై ఆ స్వామిని స్పృశించి, నమస్కరించి, ధూపదీపాలతో అర్చించి తరిస్తారు.
సోమేశ్వరుణ్ణి దర్శించి, పూజించి, స్మరించిన వారి మనోక్లేశాలు సమసిపోతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. చంద్రుణ్ణి శివుడు తన శిరసుపై ధరించడంలో విశిష్ఠమైన ఆధ్యాత్మిక ఆంతర్యం ఉందని విజ్ఞులు చెబుతారు. విరాట్ పురుషుని మనసు నుండి ఆవిర్భవించినవాడిగా కీర్తించబడే చంద్రుణ్ణి ధరించడం ద్వారా శివుడు మానవుల, దేవతల మనసులను నియంత్రించే అధినాయకుడయ్యాడు. ఈ అనుసంధానంతో సోమేశ్వరుణ్ణి తలచినా, కొలిచినా ఆ చల్లని చూపుల స్వామి భక్తుల మానసిక రుగ్మతలను తొలగిస్తాడు. నిశ్చలమైన మనసును ప్రసాదిస్తాడు. నాసిక్ క్షేత్రంలోని గంగాపూర్ ప్రాంతంలో పవిత్ర గోదావరీ తీరాన వెలసిన ప్రాచీన శ్రీ సోమేశ్వర మహాదేవుణ్ణి అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
సోమేశ్వర మహాదేవ్ మందిర ప్రాంగణంలో సీతాలక్ష్మణ హనుమంత సమేతుడైన జానకీరాముని మందిరం ఉంది. అందమైన పాలరాయి వేదికపై కొలువైవున్న శ్రీరామ పంచాయతనం భక్తజన మన మోహకమై, శ్రీరామభక్తి ప్రచోదనమై దర్శనమిస్తుంది. “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే” అంటూ శ్రీరామ తారక మంత్రాన్ని పార్వతీదేవికి ఉపదేశించిన పరమశివుని సాన్నిధ్యంలో రఘుకులతిలకుని దర్శనాన్ని పొందిన భక్తులు అమితానంద హృదయారవిందులవుతారు.
ఈ ప్రాంగణంలో సత్యసంకల్పుడైన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా శోభాయమానంగా దర్శనమిస్తుంది. “సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం” అని ప్రార్థించిన వారిని వెనువెంటనే అనుగ్రహించే సత్యనారాయణ స్వామి సోమేశ్వర మహాదేవ ఆలయ ప్రాంగణంలో నెలకొని, భక్తులను బ్రోచే పరదైవమై వెలిసివున్నాడు.
శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం ఆధ్యాత్మిక సాధకులతో బాటు ప్రకృతి ప్రేమికులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయ సమీపంలో విశాలమైన ప్రవాహంతో ప్రవహించే గోదావరీ నది నేత్రానందాన్ని అందిస్తుంది. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ప్రవహించే గోదావరీ నదిలో యాత్రీకులు బోటు విహారాన్ని చేస్తారు.
శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం
సోమేశ్వర మహాదేవ మందిరం నెలకొనివున్న గంగాపూర్ లోనే శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం ఉంది. గోదావరీ నదీ తీరంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం అద్భుతమైన నిర్మాణ శైలితో అలరారుతూ దర్శనమిస్తుంది. ప్రాచీనమైన నాగర నిర్మాణ శైలిని అనుకరిస్తూ సాగిన ఈ నవీన మందిరం చూపరుల మదిని ఇట్టే ఆకట్టుకుంటుంది. 2004 వ సంవత్సరంలో శ్రీ శంకరాచార్య న్యాస్ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన ఈ బాలాజీ మందిర్ నాటి నుండి నేటి వరకూ వేలాదిమంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పగోడా శైలిని పోలిన ప్రధాన మందిరం, అర్ధ మండపం, మహామండపాలతో కూడిన బాలాజీ మందిర్ కొత్త పాతల మేలుకలయికకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో సమున్నతమైన ధ్వజస్తంభం పరమాత్ముని కీర్తిధ్వజంలా ఉజ్జ్వలంగా దర్శనమిస్తుంది. ధర్మము, న్యాయము, యోగ్యత అనే మూడు గుణాలకు ప్రతీకగా భావించే ధ్వజస్తంభానికి నమస్కరించి, ఆలయంలోకి ప్రవేశించడం ప్రాచీన సంప్రదాయంగా వస్తోంది. శ్రీ బాలాజీ మందిర్ లోని ధ్వజస్తంభం మూల భాగంలో శ్రీమహావిష్ణువు అంతేవాసి, సేవకుడూ అయిన గరుత్మంతుడు దర్శనమిస్తాడు.
శుభ్రమైన, స్వచ్ఛమైన వాతావరణంలో, పచ్చని చెట్లు, పూలమొక్కల మధ్య వెలసిన విశాలమైన మందిరంలో శ్రీ వేంకటేశ్వర బాలాజీ కొలువైవున్నాడు. నల్లటి రాతి పలకలను పరచిన ఆలయ మహామండపం అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని కలిగిస్తుంది. ఈ మహామండపంలో భక్తులు నమస్కార భంగిమలో వెలసిన గరుత్మంతుణ్ణి దర్శించుకుంటారు. మహామండపాన్ని దాటి వెళితే ఎత్తైన వేదిక మీద వెలసిన గర్భాలయం దర్శనమిస్తుంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు నెలకొనివుంటారు.
గర్భాలయ అంతర్భాగంలో లీలామానుషవిగ్రహుడైన తిరుమల శ్రీనివాసుణ్ణి పోలిన భవ్య విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సుమారు ఏడున్నర అడుగుల ఎత్తున్న ఈ మనోహర మూర్తిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శంకరాచార్య న్యాస్ ట్రస్ట్ వారికి బహూకరించారు. వాసుదేవుడు, శేషాద్రినిలయుడు, భక్తవత్సలుడు, భవరోగవైద్యుడు అయిన శ్రీ వేంకటనాథుడు చిరునవ్వుల వెన్నెలల్ని కురిపిస్తూ దర్శనమిస్తాడు. ఇరువైపులా దివ్యజ్యోతులు వెలుగులీనుతుండగా జగజ్జీవనజ్యోతి అయిన శ్రీనివాస పరబ్రహ్మ భక్తులకు దర్శనమిస్తాడు. శంఖ చక్రధారియై, కటి-వరద హస్తాలతో, తిరునామాలను ధరించిన శ్రీనివాసుణ్ణి కనులారా కాంచి, తరిస్తారు భక్తులు. తిరువేంకటనాథుని అలౌకిక మూర్తికి అగ్రభాగంలో శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు సాలంకృతాలై నయనమనోహరంగా దర్శనమిస్తాయి.
బాలాజీ స్వామివారికి దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో, వైఖాసన ఆగమానుసారంగా పూజలను నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం శనివారాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహారాష్ట్ర నలుమూలల నుండి విశేష సంఖ్యలో భక్తులు ఈ మందిరాన్ని దర్శించడానికై తరలివస్తారు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా వివిధ ఉత్సవాలు, భజనలు, సంగీత మేళాలు, హోమాలు జరుగుతుంటాయి. స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను శంకరాచార్య న్యాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తారు.
బాలాజీ మందిర్ ప్రాంగణంలో శంకరాచార్య స్వామీ విద్యాశంకర భారతి వారి సమాధి మందిరం ఉంది. వీరు డాక్టర్ కుర్తకోటిగా సమాజంలో ప్రఖ్యాతిని పొందారు. స్వామీ విద్యాశంకర భారతి గారు శృంగేరీ శారదా పీఠం శాఖా మఠమైన కరవీర పీఠంలో వచ్చిన ప్రసిద్ధ పీఠాధిపతులు. వీరు హిందూమహాసభకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. 1967లో శివైక్యాన్ని పొందిన శంకరాచార్య డా. కుర్తకోటి సమాధిని భక్తులు దర్శించుకుంటారు.
నాసిక్ తీర్థయాత్రలో గంగాపూర్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిర్ దర్శనం అలౌకిక ఆధ్యాత్మికానుభూతిని కలిగిస్తుంది.
పేష్వే కాలీన్ నవశ్యా గణపతీ మందిర్
నాసిక్ పట్టణంలోని గంగాపూర్ ప్రాంతంలో సోమేశ్వర మహాదేవ్ మందిరానికి వెళ్ళే దారిలో ఆనందవల్లీ గ్రామంలో సుప్రసిద్ధ గణపతి దేవాలయం నెలకొనివుంది. “పేష్వే కాలీన్ నవశ్యా గణపతీ మందిర్” పిలువబడే ఈ గణపతి మందిరం మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణేశ ఆలయాలలో ఒకటి. మూడు వందల యాభై సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రతినిత్యం వందలాది మంది భక్తుల రాకతో కళకళలాడుతూ ఉంటుంది. పరమ పావన గోదావరీ నదీ తీరాన వెలసిన ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన పేష్వా రఘునాథ రావ్ భార్య ఆనందీ బాయ్ నిర్మించింది. ఆమె పేరుతో వెలసిన ఆనందవల్లీ గ్రామంలో నవశ్యా గణపతి ఆలయం వెలసింది.
శీఘ్రంగా వరాలను కటాక్షించే క్షిప్రప్రదునిగా పేరుపొందిన గణపతిని పుత్రసంతానాన్ని అర్థిస్తూ ప్రార్థించిన ఆనందీ బాయ్ తన కోరిక ఫలించడంతో ఈ గణపతి మందిరాన్ని నిర్మించిందని స్థల ఐతిహ్యం వివరిస్తోంది. కోరిక కోర్కెలను తీర్చే దైవంగా ఈ నవశ్యా గణపతి ఖ్యాతిని పొందాడు. మరాఠాలో నవశా అంటే ప్రార్థన అని అర్థం. భక్తులు చేసే ప్రార్థనలను విని, శీఘ్రంగా అనుగ్రహించే దైవం గనుక మరాఠా భక్తులు ఈ స్వామిని “నవశ్యా గణపతి”గా పిలుస్తారు.
పవిత్ర గోదావరీ తీరంలో వెలసిన నవశ్యా గణపతి మందిరాన్ని చేరుకోవడానికి రహదారి నుండి సుమారు ఇరవై మెట్ల దాకా క్రిందకు దిగాల్సివుంటుంది. దిగువ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై నెలకొల్పిన త్రిశూల మొకటి దర్శనమిస్తుంది. ఈ త్రిశూలానికి భక్తులు సమర్పించిన గంటలు అసంఖ్యాకంగా కనబడతాయి. కోరిక కోర్కెలు సఫలమయిన భక్తులు కృతజ్ఞతాపూర్వకంగా ఆలయంలోని ఈ త్రిశూలానికి గంటలను కడతారు. ఈ త్రిశూలాన్ని దాటి వెళితే ఆలయ అంతర్భాగానికి దారితీసే వసారా కనిపిస్తుంది. ఇక్కడ ఇరువైపులా వివిధ రకాల గణపతి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. “అష్ట వినాయకులు”గా ప్రసిద్ధి కెక్కిన మహారాష్ట్రా గణేశ దేవాలయాలలో వెలసిన వినాయక ప్రతిమల నమూనాలను ఇక్కడ ప్రతిష్టించారు. మోరేగాంవ్ మయూరేశ్వర్, సిద్ధటేక్ సిద్ధివినాయక్, పాలీ బల్లాలేశ్వర్ మొదలైన ఎనిమిది ప్రసిద్ధ వినాయకుల ప్రతీకలను నవశ్యా గణపతి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భక్తులు దర్శిస్తారు.
అష్టవినాయకులను దర్శించిన భక్తులు చిన్నదైన ప్రవేశ ద్వారం గుండా మందిర అంతర్భాగంలోకి ప్రవేశిస్తారు. ఈ అంతర్భాగంలో మరాఠా ఆలయ సంప్రదాయ చిహ్నమైన కూర్మవిగ్రహం దర్శనమిస్తుంది. ఏకాగ్రతకు, తదేక దీక్షకు, ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక అయిన కూర్మవిగ్రహం నవశ్యా గణపతి మహరాజ్‍ను వీక్షిస్తున్నట్టుగా మలచారు. గౌరీతనయుని ప్రియవాహనమైన మూషికం మోదకాన్ని చేత ధరించి వినయభావంతో విఘ్నేశుని ప్రక్కగా నిలచివుంటుంది.
గర్భాలయంలో ఎత్తైన వేదికపైన ఆశీనుడైవుండే నవశ్యా గణపతి మహరాజ్ ప్రసన్నవదనంతో, వాత్సల్యపూరిత నయనాలతో భక్తులకు దర్శనమిస్తాడు. జీవకళ ఉట్టిపడే గణేశుని నేత్రాలను కాంచిన భక్తజనం ఆనందపారవశ్యంతో స్వామివారిని కీర్తిస్తారు. ఆరతి గీతాలతో విఘ్నవినాయకుణ్ణి కొలుస్తారు.
విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా వెలిగే దైవం శ్రీ విఘ్నేశ్వరుడు. ఆదిపూజితుడిగా ప్రసిద్ధి కెక్కిన ఈ గౌరీతనయుడు మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడు. లంబోదరుడైన విఘ్నరాజు తన వాహనంగా మూషికాన్ని ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముందని విజ్ఞులు వివరిస్తారు. వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుకను ఇంద్రియ లౌల్యానికి నిదర్శనంగా భావిస్తారు. ఆవిధంగా ఎలుకను అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీకగా భావిస్తారు. సర్వవిద్యాసమన్వితుడైన విఘ్నేశుడు జ్ఞానశూన్యతకు ప్రతినిధి అయిన ఎలుకపై కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు. అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి శ్రీ విఘ్నేశ్వరుడు.
ఏకదంతునిగా కీర్తింపబడే గణాధినాథుడు మహాభారత ఇతిహాసాన్ని లిఖించిన మహాలేఖకుడు. సిద్ధి, బుద్ధి అనే దేవకాంతలకు పతి అయిన ఏకదంతుని స్మరణ వల్ల ఆధ్యాతిక జ్ఞానం లభిస్తుంది. శ్రీ నవశ్యా గణపతిని సేవించే భక్తులకు ఐహిక ఫలాలతో బాటు ఆముష్మిక సాధన కూడా సఫలమవుతుంది. నాసిక్ క్షేత్ర పర్యటనలో శ్రీ నవశ్యా గణపతి మందిర్ దర్శనీయమైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం.