శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం
శ్రీ రామతీర్థంకు సమీపంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరం భక్తజనులను విశేషంగా ఆకర్షించే మరో దివ్యమందిరం. శ్రీ చతుః సంప్రదాయ అఖాడా వారి నిర్వహణలో ఉన్న ఈ మందిరంలో శ్రీ వేంకటేశ్వరుడు దివ్యాభరణ భూషితుడై, మందస్మితవదనారవిందుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని శ్రీ హథీరాంజీ శిష్యుడు ఒకరు ప్రతిష్టించినట్టుగా స్థానిక ఐతిహ్యం వల్ల తెలుస్తోంది. శ్రీ హథీరాంజీ తిరుమల దివ్యక్షేత్రంలో అఖండ తపస్సును ఆచరించి, కలియుగప్రత్యక్షదైవాన్ని ప్రత్యక్షీకరించుకున్న మహాభక్తుడు. స్వామివారితో పాచికలను ఆడిన మహానుభావుడు. ఈనాటికీ తిరుమల శ్రీవారి ఆలయంలోని వెండివాకిలి వద్ద శ్రీనివాసునితో పాచికలను ఆడుతున్న హథీరాంజీ వారి కుడ్యశిల్పాన్ని చూడవచ్చు. అంతటి భక్తుడైన హథీరాంజీ బాబా శిష్యుడు స్థాపించిన ఈ శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిరంలో రజత కిరీటధారి అయిన శ్రీనివాసుడు నయనమనోహరంగా దర్శనమిస్తాడు. కర్ణకుండాలలతో, శంఖ, చక్ర, కటి, వరద హస్తాలతో “నవ్వు రాజిల్లెడి మోము వాడై” కనిపించే స్వామిని దర్శించిన భక్తులు ప్రశాంత హృదయులై తరిస్తారు.
శ్రీ వేంకటేశ్వర బాలాజీ మందిర్ లో శ్రీ భక్తాంజనేయస్వామి కొలువైవున్నాడు. శ్రీనివాస పరబ్రహ్మ నెలవైవున్న గర్భాలయం ప్రక్కనే గల ఉపాలయంలో శ్రీ ఆంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. సీతాశోకనివారకుడైన కపీశ్వరుని దర్శనంతో భక్తులు భక్తితత్వం గొప్పదనాన్ని అవగతం చేసుకొంటారు. బాలాజీ మందిరంలోని మరొక ఉపాలయంలో రాధా సమేతుడైన గోవిందుడు సుందరవదనారవిందుడై దర్శనమిస్తాడు. తన వేణుగానంతో గోప బాలకులను, గోపికలనే కాక బ్రహ్మాది దేవతల్ని సైతం మైమరపింపజేసిన ఆ రాధామోహనుడు మురళీధరుడై కానవచ్చే శ్రీ బాలాజీ మందిరం నాసిక్‍ను దర్శించే భక్తులు అవశ్యంగా వీక్షించవలసిన దివ్యధామం.
@@@@@
మోదకేశ్వర గణపతి మందిరం
నాసిక్ క్షేత్రంలోని దర్శనీయ స్థలాల్లో ప్రముఖమైనది శ్రీ మోదకేశ్వర గణపతి మందిరం. నాసిక్ లోని “అసార్చివేస్” ప్రాంతంలో వెలసిన స్వయంవ్యక్త గణపతి మందిరమే శ్రీ మోదకేశ్వర మందిరం. అత్యంత ప్రాచీనమైన ఈ గణేశ మందిరంలో గణాధినాథుడు మోదక రూపంలోని విశేష దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. మోదక రూపంలో వెలయడం వల్ల ఈ స్వామిని “మోదకేశ్వర గణపతి”గా పూజిస్తారు భక్తులు.
కేశవరావ్ క్షేమకళ్యాణి అనే భక్తుని కలలో వినాయకుడు కనిపించి ప్రస్తుతం దేవాలయం వెలసిన స్థలంలో తాను ఉన్నట్టుగా సూచించాడట! స్వామివారి సూచన మేరకు ఈ స్థలానికి వచ్చిన కేశవరావ్‍కు విఘ్నేశుడు మోదక రూపుడై, శిలాప్రతిమగా దర్శనమిచ్చాడు. ఈనాడు భక్తులు దర్శించే ఈ మోదకేశ్వర మందిరాన్ని కేశవరావ్ క్షేమకళ్యాణి నిర్మించాడు. స్వయంభుగా వెలసిన మోదకేశ్వరుణ్ణి నాసిక పట్టణాధీశ్వరునిగా కొలుస్తారు నాసిక్ పురవాసులు.
సిద్ధి బుద్ధి ప్రదాయకుడైన గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువబడే ఈ మోదకం బొజ్జ గణపయ్యకు ప్రియమైన ఆహరం కావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం దేవతలు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైన మోదక రూపంలో కూర్చి పార్వతీపరమేశ్వరులకు సమర్పించారట. జగజ్జనని అయిన పార్వతీదేవి ఆ మోదకాన్ని తన పుత్రులైన గణపతి, కుమారస్వాములకు చెరి సగం పంచి ఇవ్వబోయింది. ఈ విభాగాన్ని నిరాకరించిన పుత్రులిద్దరూ ఆ మోదకం తమకే కావాలని పట్టుబట్టారు. అప్పుడు గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఎవరు తమ భక్తిని నిరూపిస్తారో వారికే మోదకం దక్కుతుందని చెప్పింది పార్వతీదేవి. తల్లి మాటను ఆలకించిన షణ్ముఖుడు తన మయూర వాహనం ఎక్కి వెనువెంటనే సమస్త తీర్థ క్షేత్రాలను దర్శించడానికి బయలుదేరాడు. వినాయకుడు మాత్రం “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అంటూ తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణలు చేసాడు. విఘ్ననాయకుని వినయాన్ని, విజ్ఞతను వీక్షించిన హిమాలయ తనయ ఆ దివ్య మోదకాన్ని మూషికవాహనుడికి అనుగ్రహించింది. ఆవిధంగా మోదకం వినాయకునికి అత్యంత ప్రియమైన భక్ష్యంగా మారింది. ఆనాటి నుండి పార్వతీతనయుడు మోదకప్రియునిగా త్రిలోకఖ్యాతిని పొందాడు.
సంస్కృతంలో మోద అంటే అత్యంత ఉన్నతమైన సంతోషమని అర్థం. ఆవిధంగా మోదక అంటే సంతోషాన్ని కలిగించేదని అర్థం. జీవులకు నిజమైన సంతోషాన్ని కలిగించేది జ్ఞానం మాత్రమే అని సకల శాస్త్రాలు చాటుతున్నాయి. మోదకం పైనుండే పొరలు పంచభూతాలను సూచిస్తాయి. ఆ లోపల ఉండే మెత్తటి, తియ్యటి పూర్ణం భాగం ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనం. ఈవిధంగా మోదకం ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే మోక్షదాయకమైన వేదాంత జ్ఞానాన్ని సాధించే సూక్ష్మాన్ని బోధిస్తుంది. ముక్తిహేతువైన జ్ఞానదాయకునిగా కీర్తిని పొందిన శ్రీ మోదకేశ్వర గణపతి దర్శనం వల్ల భక్తుల తాపత్రయాలు తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది.
శ్రీ మోదకేశ్వర గణపతి మందిరంలో విఘ్నేశ్వరునితో బాటు ఐశ్వర్యప్రదాయిని, మూలప్రకృతి స్వరూపిణీ అయిన గజలక్ష్మి భక్తులకు దర్శనమిస్తుంది. ఆదర్శదాంపత్యానికి నిదర్శనమైన సీతారామచంద్రులు, చంద్రభాగా నదీ తీరవాస్తుడైన పండరివిఠలుణ్ణి కూడా దర్శించి తరిస్తారు భక్తులు.
శ్రీ మోదకేశ్వరుని ఆలయానికి అత్యంత సమీపంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం నెలకొనివుంది. ఈ ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరుని దివ్యలింగం భక్తులకు అభీష్టప్రదానం చేస్తూ దృగ్గోచరమవుతుంది. శ్రీ మోదకేశ్వరుణ్ణి దర్శించిన భక్తులు భక్తవత్సలుడైన శ్రీ కాశీ విశ్వేశ్వరుణ్ణి కూడా దర్శించి భగవదనుగ్రహాన్ని పొందుతారు.
@@@@@
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం
నాసిక్ క్షేత్రంలోని పవిత్ర తపోవన్ ప్రాంతంలో వెలసిన దివ్యధామం శ్రీ లక్ష్మీనారాయణ మందిరం. వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఈ తపోవన ప్రాంతమంతా విహరించాడు. ఎర్రని తామరల్ని పోలిన తన మృదుపదాలతో ఈ తపోవన సీమను పరమపావనం చేసాడు సాకేత రాముడు. “నక్షత్రాణి చ గణ్యంతే/ పాంసవశ్చ క్షణాదయః/ న వీర్యాణి గణ్యంతే…” అని పురాణాలు చాటినట్టు ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైని మట్టి కణాలను లెక్కించవచ్చును కానీ శ్రీరాముని గుణగణాలను గణించగలగడం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అటువంటి అతులితగుణగణధాముడైన శ్రీరాముని రజోస్పర్శతో పునీతమయింది ఈ పావన తపోభూమి క్షేత్రం.
వనవాస కాలంలో దుర్మార్గులైన ఖరదూషణాదుల్ని సంహరించిన ప్రాంతంలో శ్రీ లక్ష్మీనారాయణ మందిరం కొలువైవుంది. ఇతిహాస ప్రసిద్ధమైన ఈ మందిరం ప్రశాంత వాతావరణంలో, సుందరమై, సురుచిరమై, నయనమనోహరమై దర్శనమిస్తుంది. ఆలయ ప్రవేశద్వారం వద్ద ధనస్సు, అమ్ముల పొది ప్రతీకలు ప్రత్యేక వేదికపై కొలువుదీరి కనిపిస్తాయి. ప్రవేశ ద్వారం దాటి ప్రాంగణంలోకి ప్రవేశించగానే మూడు మూర్తులను ప్రతిబింబించే మూడు గోపురాలతో, అనేక స్తంభాలతో వెలుగొందే శ్రీ లక్ష్మీనారాయణ మందిరం దర్శనమిస్తుంది. ప్రధాన మందిరానికి ఎదురుగా ఉన్న రెండు ఉపాలయాలలో శ్రీ ఆంజనేయుడు భక్తులకు రెండు రూపాలలో దర్శనమిస్తాడు. మొదటి ఉపాలయంలో లక్ష్మణప్రాణదాత, సంజీవనగిరిధారి అయిన వీరాంజనేయుడు దర్శనమిస్తాడు. రెండవ ఉపాలయంలో వినమిత గాత్రుడై చేతులు జోడించి నిలచిన దాసాంజనేయుడు దృగ్గోచరమవుతాడు. అనన్య వీరత్వానికి, అగణ్య దాసభావానికి నిలువెత్తు నిదర్శనమైన మారుతీ దర్శనంతో భక్తిభరితులవుతారు భక్తులు.
శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలోకి ప్రవేశించగా, ప్రధాన మందిరంలో గదా పద్మ శంఖ చక్రధరుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీసహితుడై భక్తులకు దర్శనమిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి పద్మపుష్పాన్ని ధరించి, అభయముద్రాంకితయై, ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది. “శంఖాంభోజ/ గదా సుదర్శన ధరైః/ సంకీర్తమాన సురైః” అన్నట్టుగా సకల దేవతలు, సర్వజీవులు సదాకాలం భజించే శ్రీమహావిష్ణువును ఈ లక్ష్మీనారాయణ మందిరంలో కనులారా తిలకించి ధన్యులవుతారు భక్తులు. పట్టుపీతాంబరాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనారాయణుల దివ్యదర్శనాన్ని పొందిన భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక భావనతో పునీతులవుతారు.
శ్రీ రామరతన్ మహంతు అనే భక్తునికి భగవత్సాక్షాత్కారం కలిగిన తరువాత 1904 వ సంవత్సరంలో ఈ లక్ష్మీనారాయణ మందిర్‍ను నిర్మించారు. ఈ మందిరంలో శ్రీ లక్ష్మీనారాయణులతో బాటు సీతా లక్ష్మణ సహిత శ్రీరామచంద్రుడు, గోపీజనమోహకుడైన శ్రీ ద్వారకాధీశుడు కొలువైవున్నారు.
శ్రీ లక్ష్మీనారాయణ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్ళకు ఒకసారి సంభవించే గోదావరీ మహాకుంభమేళా సందర్భంగా నాసిక్ లో జరిగే షాహీస్నాన్ సంరంభం ఈ మందిరం నుండే ఆరంభమవుతుంది. నాసిక్ కుంభమేళాలో పాల్గొనే మహంతులు, మహామండలేశ్వరులు, సాధువులందరూ షాహీస్నాన్ రోజు ఉదయమే ఈ లక్ష్మీనారాయణ మందిరాన్ని చేరుకొంటారు. ఇక్కడి నుండి మేళతాళాలతో, బాజాభజంత్రీలతో భవ్యమైన ఊరేగింపును నిర్వహిస్తూ రామతీర్థాన్ని చేరుకొంటారు.
@@@@@
శ్రీ రామచంద్ర పంచముఖీ హనుమాన్ మందిరం
నాసిక్ పుణ్యధామంలో వెలసిన విశిష్ఠ ఆలయం శ్రీ రామచంద్ర పంచముఖీ హనుమాన్ మందిరం. నాసిక్ లోని పురాతన ఆలయాల్లో ఒకటిగా భావించబడే ఈ శ్రీరామచంద్ర పంచముఖీ హనుమాన్ మందిరంలో సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రునితో బాటు ఐదు ముఖాలను కలిగిన పంచముఖ ఆంజనేయస్వామి కొలువైవున్నాడు.
పంచముఖ ఆంజనేయుని ఆలయాలు భారతదేశంలో అరుదుగా ఉన్నాయి. నాసిక్ లో వెలసిన ఈ ఆలయం కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయా శ్రీక్షేత్రానికి సమీపంలో పంచముఖీ అన్న పేరుతో పంచముఖ ఆంజనేయుని క్షేత్రం వెలసివుంది.
నాసిక్ లోని పంచముఖీ హనుమాన్ మందిరంలో కొలువైవున్న పంచముఖ ఆంజనేయుడు అలౌకిక తేజస్సుతో అలరారుతూ భక్తులకు దర్శనమిస్తాడు.
పంచముఖ ఆంజనేయుని పంచముఖాలలో వానర ముఖంతో బాటు నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలు దర్శనమిస్తాయి. తూర్పుదిక్కున ఉండే ఆంజనేయ ముఖం మానవులకు శుద్ధమైన మనసును, సఫలతను కటాక్షిస్తుందని, దక్షిణ దిశన దర్శనమిచ్చే ఉగ్రనరసింహుని ముఖం జయసిద్ధిని, నిర్భయత్వాన్ని కలిగిస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. పశ్చిమ దిక్కును వీక్షించే గరుత్మంతుని ముఖం భక్తులకు దుష్టశక్తుల నుండి రక్షణను కటాక్షిస్తుందని, ఉత్తరదిశగా ఉండే వరాహస్వామి ముఖం సకలాభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెబుతారు. ఆకాశదిశగా ఉన్న హయగ్రీవ ముఖ దర్శనంతో సకల విద్యాప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. ఈవిధంగా పంచముఖ ఆంజనేయుని విరాట్ రూప దర్శనం వల్ల ఐహిక, ఆముష్మిక సిద్ధులను సాధిస్తారు భక్తులు.
“ఆంజనేయో/ మహావీరో/ హనూమాన్/ మారుతాత్మజః/తత్వజ్ఞానప్రదః/ సీతాదేవీ ముద్రా ప్రదాయకః” అని స్తుతించినవారికి సద్గతులను ప్రసాదిస్తాడు ఈ పంచముఖీ ఆంజనేయుడు.
“అశోక వనికాచ్ఛేత్తా/ సర్వమాయా విభంజనా/ సర్వ బంధా విమోక్తా చ/ రక్షోవిధ్వంసకారకః” అని కొనియాడినవారికి కలిగే సర్వ భయాలను, ఉపద్రవాలను నివారిస్తాడు శ్రీ ఆంజనేయుడు.
“చతుర్ బాహుర్/ దీనబంధుర్/ మహాత్మా భక్తవత్సలః/ సంజీవన నగా హర్తా/ శుచిర్ వాగ్మీ/ ధృడవ్రతః” అని తలచినవారికి శ్రీ రామ భక్తితో బాటు ముక్తికారకమైన వేదాంత జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఈ పంచముఖీ ఆంజనేయుడు.
అహిరావణుడనే రాక్షసుడు రామలక్ష్మణుల్ని అపరించి, పాతాళంలో దాచినప్పుడు వారిని విడిపించడానికై వెళ్ళిన ఆంజనేయుడు అహిరావణుని పంచ ప్రాణాలను కలిగిన ఐదు దీపాలను ఒకేసారి ఆర్పివేయడానికై పంచముఖాలు ధరించాడనే పురాణ కథను ఆలయ అర్చకులు చెబుతారు.
సర్వ భీతి నివారకుడైన, సర్వాభీష్టప్రదాయకుడైన శ్రీ ఆంజనేయుణ్ణి శ్రీ రామచంద్ర పంచముఖీ హనుమాన్ మందిరంలో దర్శించిన భక్తులు శ్రీరామ నామ ధ్యాని నిరతులై ధన్యులవుతారు. కపిశ్రేష్ఠుడు, వానరసేనా నాయకుడు, భవిష్యద్ బ్రహ్మ అయిన శ్రీ పంచముఖీ ఆంజనేయుని దర్శనంతో నాసిక్ క్షేత్ర దర్శనం సంపూర్ణమవుతుంది.
@@@@@