శివతత్వం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

ఫాలనేత్రం…

కపాలమాల…

గరళకంఠం…

సర్పహారం…

నంది వాహనం…

త్రిశూలం, ఢమరుకం…

గజచర్మాంబరం…

ఇలా విశిష్టమైన రూపంలో భక్తులను అనుగ్రహించి, కరుణించే భక్తసులభుడు పరమ శివుడు.

హిమగిరివాసునికి పరమప్రియమైన ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహారుద్రుని తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా పరమశివుని కారుణ్యానికి మనం మరింత పాత్రులం కావొచ్చు.

మహాశివరాత్రి సుసందర్భంలో మంగళకరుడు, గంగాధరుడు, సర్వశుభంకరుడూ అయిన గౌరీధవుని మంగళ తత్వాన్ని ప్రస్తుతి చేసి  శివానుగ్రహపాత్రులై తరిద్దాం.

****

హరాయ భజకానిష్టహరాయ పురవైరిణే

భవాయ భవతే భూయచ్ఛివాయ శిరసాన్నమః

 

“హరా! నిన్ను కొలిచేవారి అనిష్టాలను హరించేవాడా! త్రిపురాంతకా! భవా! శివా! నీకు తలవంచి నమస్కరిస్తున్నాను” అని ఎందరో భక్తులు ప్రార్థించారు. భోలాశంకరునిగా కీర్తింపబడే పార్వతీపతి వారందరినీ కరుణించాడు.

శివుని మూడో కన్ను జ్ఞాననేత్రానికి ప్రతీక, స్వామి మెడలో పాములు కోరికలకు ప్రతీక, పట్టిన త్రిశూలం కుండలినీ శక్తికి గుర్తు,  మ్రోగించే ఢమరుకం వేదనాదానికి ప్రతినిధి. ఇలా పరమశివుని దేహము, ఆయుధాలు అన్నీ కూడా సాధకులకు తత్వోపదేశాన్ని చేసేవే.

మహామహిమాన్వితమయిన శివతత్వాన్ని ప్రతిపాదించే దివ్య సందర్భమే మహాశివరాత్రి. మాఘ బహుళ త్రయోదశి నాడు మహాశివరాత్రిగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆస్తికులు ఆచరిస్తారు.

మాఘమాసం, కృష్ణపక్షం, బహుళ త్రయోదశి మహాశివరాత్రిగా పిలువబడుతుంది. ఈ పర్వదినం నాడే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం పేర్కొంటోంది.

పరమ పవిత్రమైన శివరాత్రి నాడు ఉపవాస దీక్షను వహించి, రాత్రంతా జాగరణ చేస్తూ పరమశివుని స్తుతులతో గడపడం అత్యంత ప్రాచీనమైన ఆచారం. శివనామస్మరణతో తన్మయులైన భక్తులు తమ తమ శక్త్యానుసారం దీపాలను వెలిగిస్తారు. వివిధ రూపాలలో ఆ దీపాలను శివయ్య సన్నిధిలో అమర్చి తమ శ్రద్ధాభక్తుల్ని వ్యక్తపరుస్తారు. శివరాత్రి నాడు ఆద్యంతాలు లేని ఆదిమమౌనివరుణ్ణి భజనలతో స్తుతిస్తారు్. తాండవప్రియుణ్ణి తాళలయగతులతో మెప్పిస్తారు. “సర్వమ్ శివమయమ్” అంటూ కీర్తిస్తారు.

 

****

భారతీయ సంప్రదాయంలో గల దేవీదేవతలు స్త్రీ ఆకారాల్లోనూ, పురుష ఆకారాల్లోనూ దర్శనమిస్తారు. అయితే, ఒక్క శివుడు మాత్రమే నిరాకారుడై, నిర్వికార లింగ స్వరూపంలో సాక్షాత్కరిస్తాడు…పూజలందుకొంటాడు.

భృగుమహర్షి శివునికి “లింగరూపి”వి కమ్మని శపించిడం వల్ల భూలోకంలో శివుడు “లింగరూపం”లో అర్చింపబడుతున్నాడని భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. పద్మపురాణం కూడా ఇదే విషయాన్ని విస్తారంగా చెబుతుంది.

****

“లింగం” అంటే ఏమిటి? శివుణ్ణి లింగరూపంలో అర్చిస్తే కలిగే ఫలం ఏమిటి? అన్న ప్రశ్నలు సహజంగా ఉద్భవిస్తుంటాయి. మేధావులయిన మన ప్రాచీనులు ఈ ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలను ఏనాడో అందించారు.

“లిగి గతౌ” అన్న ధాతువు నుండి “లింగ” శబ్దం ఉత్పత్తి అయింది. “గతి” అంటే కదలిక లేక చలించడం. శివలింగం ఊర్ధ్వ దిశను సూచిస్తున్నట్టుగా నిలువుగా ఉంటుంది. మానవులు స్వర్గాది ఊర్ధ్వలోకాలపై దృష్టి పెట్టి ఉత్తమమైన ఆ లోకాలను పొందడానికి సాధన చేయాలని శివలింగం సందేశాన్ని ఇస్తోంది.

మేదినీ కోశం అనే సంస్కృత నిఘంటువు ప్రకారం “లింగం” అంటే చిహ్నం అని అర్థం. చిహ్నం అంటే ఒక గుర్తు. శివలింగం ఒక పవిత్రమైన చిహ్నం. శివుని ద్వారా స్వర్గాది లోకాలను సాధించవచ్చునని సూచించే ఆధ్యాత్మిక చిహ్నమే శివలింగం.

*****

శివుడి రూపం ఎంత సరళమైనదో ఆ స్వామి కూడా అంతే భక్తిసులభుడు. “శి..వ” అన్న రెండు లఘు పదాలతో కూడిన స్వామి నామం చిన్నారులు సైతం సులభంగా ఉచ్ఛరించగలరు.

అదేవిధంగా లింగము, పానవట్టమనే రెండు అంగాలను కలిగిన శివలింగ రూపాన్ని ఎవరైనా సరే చాలా సులభంగా చిత్రీకరించవచ్చు. నదీతీరాల్లో అప్పటికప్పుడు ఇసుకతో శివస్వరూపాన్ని నిర్మించి, పూజించవచ్చు. అంతటి భక్తసులభుడు శ్రీమన్మహాదేవుడు. కనుకనే శివుడు ఎందరికో ఆరాధ్యదైవమయ్యాడు.

*****

అక్షర జ్ఞానం లేని ఆటవికుడయిన కన్నప్పకు కైవల్యాన్ని ప్రసాదించిన శివయ్యను మెప్పించాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మనసులో నిర్మలమైన భక్తి ఉంటే చాలు. నోటిపై శివనామస్మరణ జరిగితే చాలు. కైవల్యం కరతలామలకం.

స్వామి రూపాన్ని బంగారు, వెండితో చేస్తేనే పుణ్యం వస్తుందన్న నియమం లేదు. ఇసుకతో చేసినా…దీపాలను కూర్చి చేసినా…స్వామి అనుగ్రహిస్తాడు.

దేహమనే దీపంలో, మనసు అనే వత్తిని వేసి, భక్తి అనే నెయ్యితో వెలిగించితే అక్కడ జ్ఞానజ్యోతి సర్వప్రకాశమై వెలుగుతుంది.

ఆ దీపశిఖ శివలింగాకారంలో…నిశ్చలంగా…నిర్మలంగా…అఖండ తేజోమయమై వెలుగుతూ శివదర్శనాన్ని కలుగజేస్తుంది. శివతత్వ ప్రకాశాన్ని భక్తుల మనసులో నింపుతుంది.

*****

శివుడు ముక్కోపి అనే ఒక భావం ఉంది.

అయితే పురాణాలను పరికిస్తే శంకరుడు కోపకారియే కాదు పరోపకారి కూడా అని తెలిసివస్తుంది.

గంగానదిని దివి నుండి భువికి తీసుకురావడంలోను, క్షీరసాగర మథనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని భక్షించడం వల్ల, త్రిపురాసురులు, గజాసురుడు మొదలైన రాక్షసుల సంహారంతో దేవతలకు, మునులకు, మానవులకు ఎనలేని ఉపకారం చేసాడు ఉమా వల్లభుడు.

అంతేకాదు, భక్తి పూర్వకంగా తనను అభిషేకించిన వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మనసారా కొలిచిన వారికి అకాల మృత్యువును పరిహరించడం వంటి ఎన్నో ఉపకారాలను జగత్తుకు, మానవ జాతికి కలిగించిన మహామహితాత్ముడు పరమశివుడు.

వరాలను ప్రసాదించడంలో భోలా శంకరుడైన పార్వతీపతిని ఈ మహాశివరాత్రినాడు స్మరించి, అర్చించి, తరించిన వారికి అనంతపుణ్యసంపదులు చేకూరినట్టే. శివునికి అత్యంతప్రీతిపాత్రమైన మహాశివరాత్రి నాడు ఆ సర్వశుభంకరుని స్మరణతో మనమందరం తరిద్దాం.

||నమః పార్వతీపతియే హరహర మహాదేవ||

Your views are valuable to us!