సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? రెండవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గ్రంథకర్త: శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు

ప్రమాణముల విమర్శ

పరలోకాలు, వాటికి కారణమయ్యే పుణ్యపాపాలు, వీటిల్ని అనుభవించే దేహాతిరిక్త ఆత్మ (జీవి), మోక్షం; సమస్త ప్రపంచానికీ నియామకుడైన దేవుడు – ఇవన్నీ కంటికి కనిపించనివి కాబట్టి వీటిల్ని నమ్మాల్సిన అవసరం లేదని కొందరు చెబుతారు. కానీ ఇది సరికాదు. ఏ వస్తువే గానీ “ఉంది” అథవా “లేదు” అని చెప్పడానికి ఆధారాలు అవసరం.

ఉదాహరణకు, ఏ ఇంద్రియానికి ఏ వస్తువు విషయం అవుతుందో , ఆ ఇంద్రియం ఆ వస్తువు “ఉన్నది”, “లేదు” అనడానికి ఆధారమౌతుంది. కుండ మొదలైన వస్తువులు కంటికి “విషయ”మైనందువల్ల, ఈ చోట “కుండ ఉంది” అనడానికి గానీ “కుండ లేదు” అని అనడానికి కన్నే ఆధారం. వస్తువు ఎలా ఉన్నదో అలాగే గ్రహించడాన్ని “ప్రమాణం” అంటారు. కన్ను లాగే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం మొదలైనవాటిని తెలిపే ప్రమాణాలే శ్రోతృ, త్వక్, చక్షుసు, రసన, ఘ్రాణేంద్రియాలు. వీటినే “పంచేంద్రియాలు” అంటారు. ఇది లోకప్రసిద్ధం.


 

ఈ పంచేంద్రియాలను శాస్త్రంలో ప్రత్యక్షప్రమాణాల ప్రభేదాలని పిలిచారు. ఇంద్రియాలకు గోచరంకాని విషయాలను తెలియజెప్పేదే “మనసు”. ఇది శరీరం లోపల ఉండడంవల్ల “అంతఃకరణం” అన్న పేరును పొందింది. (కన్ను మొదలైన వాటికి బాహ్యకరణాలని పేర్లు).

ఇంద్రియాలకు “విషయ”మైన పదార్థాలను నమ్మనివాళ్ళు లోకంలో బ్రతకడమే కష్టమౌతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. “ఈ వస్తువు ఇక్కడ, ఈ ఆకారంలో, ఇలా ఉంది” అని అందరూ అన్నప్పుడు అలా లేదు అని అన్నవారు బుద్ధిహీనులని ప్రపంచం పిలుస్తుంది కదా! కాబట్టి మన జీవనం సుఖకరంగా సాగాలంటే ఇంద్రియాలకు గోచరమయ్యే పదార్థాలన్నిటినీ నమ్మి తీరాలి. కేవలం కంటికి కనిపించేవాటినే నమ్మేవారు ఇతర ఇంద్రియాల ద్వారా అనుభవమయ్యేవాటిని నమ్మకపోతే ఆయా ఇంద్రియాల ద్వారా లభించే సుఖాన్ని కాదనుకొన్నవారే అవుతారు. కన్ను చూపించే వస్తువుల్ని అసలు నమ్మనివారు మహా దుఃఖానికి గురి కావల్సి వస్తుంది.

“నేను ఉన్నాను; నేను సుఖాన్ని లేక దుఃఖానీ పొందుతున్నాను; నా మనస్సు సరిగాలేదు; అది ఎక్కడెక్కడికో పోతోంది” వగైరా విషయాలు మనందరికీ అనుభవమైనవే. ఈ అనుభవాలు కన్ను మొదలైన ఇంద్రియాలను పోగొట్టుకున్నవారు సహితం అనుభవిస్తారు. కానీ పై అనుభవాలు కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా కలిగేవి కావు. ఇలా కన్ను, చెవి మొదలైన బాహ్యకరణాల ద్వారా దొరకని అనుభవాన్ని గ్రహించే ఇంద్రియానికి “సాక్షి” అని పేరు. ఇది కూడా ప్రత్యక్ష ప్రమాణాల్లోని ఒక ప్రభేదమే.

కన్ను మొదలైన గోళకాలను (అవయవాలను) చూడగలం గానీ “చక్షుసు” మొదలైన ఇంద్రియాలు కానరావు. మనకు చూచే శక్తి ఉంది అంటే అది “చక్షుసు” వల్లనే. కానీ ఆ శక్తి వ్యక్తమయ్యేది కంటి ద్వారా. అలాగే మనం వినగలుగుతున్నామూ అంటే దానికి “శ్రోతృ” అన్న ఇంద్రియం వల్ల సాధ్యం. అంటే “శ్రోతృ” అనే ఇంద్రియపు శక్తి చెవి అనే బాహ్యేంద్రియం ద్వారా తెలిసివస్తుంది. గమనించవల్సిన విషయమేమిటంటే కన్ను, చెవి మొదలైనవి పనిచేస్తున్నాయని “చక్షుసు”, ‘శ్రోతృ”వుల ద్వారా ఊహించి తెలుసుకుంటాము.

దూరంలో పొగను చూసి “అక్కడ నిప్పు ఉంది” అని ఊహిస్తాము. నిజానికి నిప్పు కంటికి కనబడకపోయినా కూడా చూడగలిగినవాడు ఊహించి తెలుసుకుంటాడు. ఈ ఊహ అబద్ధం కాదు. ఉన్న పదార్థాలను తెలియజెప్పే ఈ ఊహకే “అనుమానం” అని శాస్త్రనామం. “ప్రత్యక్షం” మొదటి ప్రమాణమైతే, ఈ “అనుమానం” రెండవది.

దేశాంతర, కాలాంతర పదార్థాలను మరొకరు చెప్పడంవల్లనో, వారి అభిప్రాయాలను వినడం వల్లనో, వారి వ్రాతల వల్లనో తెలుసుకుంటాము. దీనికి “ఆగమం” అని పేరు. ఇది మూడో ప్రమాణం.


లోకంలో “ధర్మం”, “అధర్మం”, “దేవుడు” మొదలైన పదాలున్నాయి. ఈ పేర్లతో పిలువబడే వస్తువులు మనకు తెలియనప్పటికీ అవి ఉండి తీరాలి. ఎలాగంటే మనకు తెలియని ఒక పదార్థముంటే దానికొక పేరున్నట్టే! భాషలోని ఏ పదమూ వ్యర్థం కాదు. దీన్నే కాళిదాసు –

వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే|
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ||

అని చెప్పాడు. ప్రపంచంలో ఏదైనా ఎక్కడైనా ఉన్నా అది “వస్తువు ” అన్న పేరును పొందుతుంది. క్రియలు గానీ, గుణాలు గానీ వస్తువులోనే అంతర్భావాన్ని పొందుతాయని తెలుసుకోవాలి.

ఒక పదం మనకు దొరికినప్పుడు ఆ పేరుతో పిలవబడే పదార్థం మనకు తెలియకపోయినా ఆ పదం ద్వారా సూచితమయ్యే వస్తువు త్రికాలాల్లో ఎప్పుడైనా ఉండి ఉంటుందనే భావించాలి.

ధర్మం, అధర్మం మొదలైన అతీంద్రియ పదార్థాలను తెలియజెప్పేదే “ఆగమం”. ఎవరి మాటలతోనూ ధర్మాదులను నిశ్చయించడానికి సాధ్యం కానందువల్ల, వాటిల్ని తెలియజెప్పేందుకు వేదాలు వచ్చాయి. ఈ వేదాలు ఏ ఒక్క వ్యక్తో లేక వ్యక్తుల సమూహాలతోనో రచించబడినవి కావు. కాబట్టి వ్యక్తిగత దోషాలు లేనివి. ఒకరి నుండి మరొకరికి ఉపదేశ రూపంలో పరంపరానుగతంగా రావడంతో “శ్రుతి” అన్న పేరుతో ప్రసిద్ధి పొందాయి.

సశేషం

 

Your views are valuable to us!