సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? మూడో భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

నాస్తికవాద నిరసన

 

జీవుల స్వరూపం, అనాదిత్వం మరియు నిత్యత్వం యొక్క సమర్థన:

ఇప్పుడు “నేను” ఉన్నాను, సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అన్న అనుభవం అందరికీ తెలిసిందే. ఈ అనుభవం లోకప్రసిద్ధమైనది. ఐతే ఈ అనుభవం ఎప్పుడు కలుగుతుందని విచారిద్దాం.

ఈ అనుభవ జ్ఞానం శరీరానికి కలిగేదని అనుకుంటే శవానికి కూడా ఈ అనుభవం కలగాలి. అలాకాక,  కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల ఈ జ్ఞానం కలుగుతుందని చెప్పే పక్షంలో, ఆయా ఇంద్రియాలు పని చెయ్యని వారికి (అంధులు, బధిరులు మొ.) “నేను” అన్న జ్ఞానం పుట్టకూడదు. కానీ ప్రపంచంలో అలా జరగడంలేదు కదా! కళ్ళు మొదలైన అవయవాలు జ్ఞానాన్ని కలిగించడం ద్వారా జ్ఞానేంద్రియాలని (జ్ఞాన కరణాలు) పిలువబడుతున్నాయి. కానీ అవి జ్ఞాన స్వరూపాలు కావు.

ఇంకో విధంగా వాదం చేస్తూ “ప్రాణవాయువు లేక జఠరాగ్ని మొదలైనవి “నేను” అన్న జ్ఞానాన్ని కలిగిస్తాయి అని అంటే, ఆ ప్రాణవాయువు/జఠరాగ్ని గాఢనిద్రలో ఉన్నప్పుడు “నేను” అన్న జ్ఞానాన్ని కలిగించవు. అంటే వాటి అస్తిత్వం గాఢనిద్ర పోతున్న జీవిలో ఉన్నా కూడా తాత్కాలిక అచేతనత్వాన్ని పొందివుంటాయి. అందువల్లే మెలకువకు, నిద్రకు తేడా ఏర్పడుతుంది.

ఇందువల్ల తేలేది ఏమిటంటే ఏ ఇంద్రియాలకూ లోబడకుండా, ఏ అతిసూక్ష్మ వస్తువు యొక్క సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఈ శరీరంలో “నేను” అనే జ్ఞానం పుట్టదో; ఏ వస్తువు ఉన్నప్పుడు శరీరానికి పెరగడం, తరగడం అన్నవి కనబడతాయో; ఏ వస్తువు లేనప్పుడు వృద్ధి, హ్రాసాలు కనబడవో, ఆ వస్తువునే “జీవి” అని పిలుస్తారు. ఈవిధంగా కంటి కనబడని వస్తువులు అనేకం ఉన్నాయని ఎవరైనా సరే ఒప్పుకోవాలి.

ఈ జీవి అనాది నుండి ఉత్పత్తి రహితమై ఉన్నదని వివేకులు చెబుతారు. పుట్టిన వెంటనే శిశువుకు స్తన్య పానంలో ప్రవృత్తి కలుగుతుంది. ఈ ప్రవృత్తి జ్ఞానంతో కూడింది కావున, జ్ఞానరహితమైన శరీరమే మొదలైన జడపదార్థాల ద్వారా జ్ఞానం సిద్ధించదు. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆ జన్మలోనే పాలు త్రాగే అనుభవం ఉండదు. అందువల్ల పూర్వజన్మ సంస్కారం ద్వారానే పాలను త్రాగుతోందని తెలియాలి. వార్తా పత్రికల్లో మనం ఈ పూర్వజన్మ గుర్తున్న మనుషుల గురించి తరచూ చదువుతుంటాం. ఒక అమ్మాయి తన పూర్వజన్మలోని భర్తను, పిల్లల్ని గుర్తించిందని, ఒక దేశానికి చెందిన వ్యక్తి ఆ భాష కాక ఇంకో దేశపు భాషను నిద్రలో మాట్లాడుతాడని, కొద్దిమంది అతి చిన్న వయసులోనే గొప్ప గాయకులుగా, కళాకారులుగా ప్రసిద్ధిని పొందుతున్నప్పుడు మనం గమనించవలసినది ఏమిటంటే అవన్నీ క్రితం జన్మల సంస్కారాలన్న విషయం. ఇందువల్ల “జీవి” అనాదిగా ఉన్నటువంటిదని తెలుస్తుంది. ఆనాదిత్వంతో పాటు దాని నిత్యత్వం కూడా సిద్ధిస్తుంది. విద్యుత్ స్థంబంలో (Electrical pole) విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది మన కంటికి కనబడదు. కానీ మనకు షాక్ తగిలినప్పుడు విద్యుత్ అస్తిత్వాన్ని ఒప్పాల్సిందే కదా!

 

(తరువాయి భాగంలో – దేవుడి అస్తిత్వం – ప్రభుత్వ సమర్థనం)

 

Your views are valuable to us!