స్వస్తి ప్రజాభ్యామ్ – ఒక వివరణ

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 5]

ప్రపంచ సాహిత్యంలో ప్రాచీన రచనగా ఖ్యాతి పొందిన ఋగ్వేదంలో “ధృవం తే రాజా వరుణో…” అన్న ఋక్కులోని “రాజ” శబ్దం పాలకుడు అన్న అర్థంలో వ్యాఖ్యానించడబడుతుంది. ఆవిధంగా పాలకులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ప్రస్తావన భారతీయ గ్రంథాలలో ఉపయోగించబడింది. ఈ ఋక్కును ఆశీర్వచన మంత్రంగా వాడడం పరిపాటి. సనాతన సంస్కృతికి చెందిన వారు ఏదైనా పదవిని స్వీకరించినపుడు ఈ ఋగ్వేద మంత్ర పురస్సరంగా ఆశీర్వచనాన్ని తీసుకోవడం ఓ సంప్రదాయంగా వస్తోంది.

అయితే, ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, వైదిక సంప్రదాయపు తీరుతెన్నులూ మారిపోతున్న తరుణంలో ఒక్కసారి మన ప్రాచీనులు పాలకుల గురించి ఏం చెప్పారు? ఆ చెప్పిన సంగతుల్లో ఈనాటి పరిస్థితులకు ఒదిగేవి ఏవి? ఒకవేళ ఆధునిక స్థితిగతులకు సరిపోలే విషయాలు ఉంటే వాటిని స్వీకరించాలా, వద్దా? అన్న ప్రశ్నలకు సారసంగ్రహంగా, సంక్షిప్తంగా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

 

రాజధర్మం

 

భారతీయ ఇతిహాసాల్లో అగ్రస్థానాన్ని పొందిన రామాయణంలోని ఈ శ్లోకాలు మనకు ’రాజధర్మా’న్ని పరిచయం చేయిస్తాయి.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

ప్రహృష్టనరనారీకః సమాజోత్సవశోభితః

సుకృష్టసీమా పశుమాన్ హింసాభిః పరివర్జితః

(రామాయణము – అయోధ్యా కాండమ్)

శ్రీరాముడు భరతునితో రాజధర్మాలపై మాట్లాడుతూ “భరతా! ఎక్కడైతే సుపరిపాలన ఉంటుందో ఆ రాజ్యం స్త్రీపురుషులందరూ సుఖసంతోషాలతో హాయిగా ఉంటారు. ధర్మనిర్ణయ సభలతో, సమాజానికి సంబంధించిన ఉత్సవాలతో రాజ్యం విలసిల్లుతుంది. సస్యశ్యామలాలైన పంటభూములతో, పశుసంపదతో అది వర్ధిల్లుతుంది. అక్కడ ఎలాంటి హింసలకు చోటు ఉండదు.” అని ఉపదేశిస్తాడు. తన తండ్రియైన దశరథుని పాలనలో కోసల రాజ్య ప్రజల సుఖసౌభాగ్యాల గురించి అత్యంత భక్తిభావంతో పై మాటల్ని చెబుతాడు.

పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలో ఎన్నెన్నో శ్లోకాలు రాజధర్మపు వివిధ కోణాలను ఆవిష్కరిస్తాయి. అయితే ఈ క్రింది శ్లోకం మాత్రం శిరోరత్నమై అలరారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

కాలో వా కారణమ్ రాజ్ఞో రాజో వా కాలకారణమ్

ఇతి తే సంశయో మాభూద్రాజా కాలశ్చ కారణమ్

(మహాభారతమ్ – శాంతిపర్వమ్)

భారతీయులకు తాత్విక సందేశాలనే కాకుండా రాజకీయ పాఠాలను కూడా నేర్పిన ఉద్గ్రంథం మహాభారతం.

మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని వ్రాసిన వేదవ్యాస మహర్షి రాజు యొక్క గుణశీలాలను వివరిస్తూ ’రాజు యుగకర్త’  అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఎవరికీ లొంగని తీవ్రశక్తి అయిన ’కాలం’ కేవలం ఒక్క పరిపాలకుని మాత్రమే వశమవుతుంది. ధార్మికుడు, పరదుఃఖదుఃఖిత్వం తెలిసిన వాడు, జితాత్ముడు అయిన పరిపాలకుడు కలియుగంలో సత్యయుగాన్ని నిర్మించగలడు. ఇందుకు విరుద్ధంగా దుష్టుడు, మూఢుడు, అవైజ్ఞానికుడయిన పాలకుడు సత్యయుగాన్ని కూడా కలియుగంగా మారుస్తాడు.

కనుక ఎప్పుడో త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో వెలువడిన వాల్మీకి, వ్యాసుల అభిప్రాయాలు నేటికీ, అంటే ఈ కలియుగానికి కూడా అన్వయింపబడడం యాదృచ్ఛికం కాదు. కాకతాళీయం అసలే కాదు. యుగాలు వేరైనా యుగకర్తలు కొందరే ఉంటారు. వారి లక్షణాలు విశిష్టంగా ఉంటాయి. వారి చర్యలు లోకోత్తరంగా ఉంటాయి గనుక వాల్మీకి, వ్యాసుల మాటలు వ్యర్థమైనవి కావు. అవి నిత్యసత్యాలు.

 

తిక్కన సోమయాజి తన మహాభారత ఆంధ్రానువాదంలో భీష్ముని చేత ఇలా చెప్పిస్తాడు:

వరుసదనముమెయి నరిగొన జొరదగ
దది పొదుగు గోయు చొప్పగు విను పా
ల్గురియించుకొన దలంచిన
నరయవలదె గోవు బ్రజయు నట్టిదె యధిపా!

“ఓ ధర్మరాజా! ప్రజలపై కాఠిన్యం వహించి కప్పంను సంగ్రహించేందుకు ప్రయత్నించకూడదు. కాఠిన్యంతో ప్రవర్తించి కప్పాన్ని గ్రహించడమంటే పాలిస్తున్న ఆవు పొదుగును కోయడంతో సమానం. పాలు కావాలనుకొన్నప్పుడు ఆవును జాగ్రత్తగా రక్షించుకోనాలి కదా! అట్లాగే ప్రజలను కూడా పరిరక్షించుకొవాలి.”

దయ బ్రజ రక్షించుటకు, నె
నయె తపములు నధ్వరములు నరవర దానన్
జయమును లక్ష్మియునుం గీ
ర్తియు సుగతియు గలుగు వసుమతీనాథునకున్

“ఓ ధర్మరాజా! ప్రజలను సంరక్షించుటయే రాజు ప్రధానధర్మం. కాని, ఆ రాజు చేసే తపస్సులు, యాగాలు, ప్రజలను దయతో సంరక్షించే దానితో సమానం కావు. రాజు రాజధర్మాన్ని అనుసరించి ప్రజలను సంరక్షిస్తే ఆ రాజునకు విజయంతో బాటు సంపద, కీర్తి, ఉత్తమగతులు లభిస్తాయి.”

అంతేగాదు, ఒక పులి నోట ఈ క్రింది ధర్మసూక్ష్మాల్ని చెప్పిస్తాడు తిక్కన:

ధర్మ మధర్మము భంగి న
ధర్మము ధర్మంబు మాడ్కి తనయా! తోచున్
నిర్మలమతి నరయవలయు
ధార్మికతను కోరువాడు ధర కేర్పడగన్.

కొన్ని కొన్నిసార్లు ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మం గాను కనబడుతూ ఉంటాయి. ఏది ఏమిటన్నదాన్ని గ్రహించాలంటే మనిషి నిర్మలమైన బుద్ధిని కలిగివుండాలని పై పద్యభావం.

ఈ దృష్టితోనే మన ప్రాచీనులు ఓ చక్కటి మంగళాశాననా రూపమైన శ్లోకగుచ్ఛాన్ని రచించి, ప్రతిరోజూ ధార్మిక కార్యక్రమాల చివరలో చదవాల్సిందిగా సూచించారు.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శ్శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు
కాలే ఫలతి పర్జన్యా పృథ్వీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణ స్సంతు నిర్భయాః
అపుత్రా పుత్రిణస్సంతుః పుత్రిణః స్సంతు పౌత్రిణః
అధనా సధనాస్సంతు జీవంతు శరదాం శతం

తాత్పర్యం: ప్రజలకు, పాలించే ప్రభువుకు శుభమగుగాక! రాజ్యాన్ని పాలించే ప్రభువు న్యాయమార్గంలో నడచుగాక! గోమాతలకు, బ్రహ్మజ్ఞానులకు సుఖం కలుగుగాక! కాలానికి తగ్గట్టుగా వర్షాలు కురవాలి. భూమి సస్యశ్యామలం కావాలి. దేశం ఈతిబాధలు లేకుండా ఉండుగాక. బ్రహ్మజ్ఞానులు నిర్భయులై ఉండుగాక. సంతానం లేని వారికి సంతానం, సంతానవంతులకు మనవళ్ళు జన్మించుగాక. పేదవారు ధనము సంపాదించువారగుగాక! ప్రజలందరూ నూరేళ్ళు చల్లగా వర్ధిల్లెదరు గాక!

పై మంత్రాలలో కేవలం గోవుల్ని, బ్రాహ్మణుల్ని మాత్రమే చెప్పారు గనుక ఇది పక్షపాతపూరితమైనదిగా కొందరు వాదించే అవకాశం ఉంది. అయితే, ఆ ఆక్షేపానికి ఉత్తరం కూడా ఉంది. ఓ ఉదాహరణ రూపంలో ఆ సమాధానాన్ని తెలుసుకుందాం.

స్వస్తి ప్రజాభ్యామ్ – వివరణ:

 

ఏదైనా ఓ ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సహా ఎందరో పాల్గొంటారు. ఆ కార్యక్రమం తాలూకు వివరాలు వార్తాపత్రికలో వేసేటప్పుడు “ఫలానా కార్యక్రమంలో ఫలానా పేరుగల జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు” అని వ్రాస్తారు. అనగా, ఇద్దరు ఉన్నతాధికారుల పేర్లను మాత్రం ప్రస్తావించి, మిగతావారి పేర్లను విడిచిపెట్టడం తప్పుకాదు.

అదేవిధంగా సనాతన సంస్కృతిలో పూజనీయ స్థానాన్ని పొందిన జంతువుగా ఆవును, వ్యక్తిగా బ్రాహ్మణుడిని చెప్పడం జరిగింది. వీరు ఇరువురు ఆయా జీవరాశి వర్గానికి ప్రతినిధులు మాత్రమే!పాలితులలో పరస్పర విశ్వసనీయతను పెంపొందించేవాడే నిజమైన ఉత్తమ నాయకుడు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ఆదర్శాలను, ఆశయాలను తుంగలోకి తొక్కే నాయకులు త్వరలోనే తెరమరుగైపోతారు.

మంథర దుర్బోధలకు కైకేయి ఒక్కతే మోసపోలేదు. మొత్తం కోసల ప్రజలు రామరాజ్యం నుండి పద్నాలుగేళ్ళు దూరమయ్యారు. శకుని మాయోపాయాలకు బలయింది కేవలం పాండవులే కాదు అనాటి అమాయక ప్రజలు కూడా ప్రజారంజకమైన పాలన నుండి పదమూడు సంవత్సరాలు వంచితులైనారు. కనుక వ్యాసం మొదట్లో పేర్కొన్న “కాలో వా కారణమ్ రాజ్ఞో” అనే మహా భారత శ్లోకాన్ని మరొక్కమారు స్మరించుకుంటే “రాజే యుగకర్త” అన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ ధర్మసూక్ష్మాన్ని గుర్తించి నాయకులు మెలగాల్సివుంది.

పాలకుని స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎన్నెన్ని గొప్ప పనులు చేయవచ్చో, ఎంతెంత ప్రజాక్షేమాన్ని కోరవచ్చో  రామాయణ, భారతల్లోనూ, పద్దెనిమిది పురాణాల్లోనూ సోదాహరణంగా నిరూపించబడింది. ఇప్పటి నాయకులు ఇకనైనా కళ్ళు తెరచి “క్రొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా” అన్న చందంగా ప్రాచీన రాజధర్మాలను తెలుసుకుంటూనే కొత్త యుగానికి నాందీ పలకాలి. ఇది మన జీవితాలను ప్రభావితం చేసే అంశం. ఇది మన భావి తరాల తలరాతని తీర్చిదిద్దే రాజతంత్రం. ఇది నిర్ణయాత్మకమైన సమయం.

కాబట్టి గోబ్రాహ్మణ సాక్షిగా మన పాలకుల్లో ధర్మప్రజ్ఞ జాగృతం కావాలని కోరుకుందాం. “ధృవం తే రాజా” అంటూ మంగళశాసనాలు చేద్దాం.

||శాంతిః శాంతిః శాంతిః||

[2016 లో తానా పత్రికలో ప్రచురితమైన నా వ్యాసం]

Your views are valuable to us!