తెలుగు సినిమాకు అందని భీముడు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

చాల మంది పెద్దలు అనగా విన్నాను, తెలుగు వారి పురాణ జ్ఞానం 90% తెలుగు సినిమా సంప్రాప్తమే. ఇందులో ప్రక్షిప్తాలు అనేకం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్టీఆర్ కు అనుకూలంగా పురాణ పాత్రాలూ మారిపొతూ కనబడ్తాయి. పాండవ వనవాసంలో భీముడే గొప్పవాడు. నర్తనశాలలో ఆ పాత్రకు అంత గొప్పదనం ఉండక అర్జునుడు గొప్పవాడైపోయాడు. శ్రీకృష్ణపాండవీయంలో కృష్ణుడు, దుర్యోధనులే స్క్రీను మొత్తం పరచుకొనివుంటారు. ఇలా సినిమా నుండి సినిమాకు, ఎన్టీయార్ వేసే పురాణ పాత్రకు అనుగుణంగా ఇతర పాత్రల యొక్క ప్రాముఖ్యతలో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనబడతాయి. కనుక వ్యాస భగవానుని దృష్టిలో భీముడు, అర్జునుడు యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటి? అన్న ప్రశ్న జిజ్ఞాసువుల్లో తప్పక కలుగుతుంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఉండ్రాజవరంలో జరిగిన మహాభారత ప్రవచనాల్లో కొందరు ప్రవచనకర్తలు భారత ఇతిహాసంలో భీమసేనుని గురించి  చెప్పిన మాటలు నాలాంటి వారికి ఉత్సుకతను కలిగించాయి. దాని ఫలితమే ఈ వ్యాసమ్. పెద్దలు తప్పులున్నచో సరిదిద్దగలరు.

* * * * *

చాగంటి వారి ప్రవచనాలలో హనుమ భవిష్యద్బ్రహ్మ అని చాలాసార్లు చెప్పారు. దాని అర్ధం ఏమిటని తెలిసినవారినొకరిని అడిగాను. అప్పుడే “ఋజు గణ వ్యవస్థ” అన్న చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకొన్నాను.

ఇంతకీ ఏమిటీ ఋజుగణ వ్యవస్థ?

సంక్షిప్తంగా చెప్పాలంటే ఋజు అంటే అవక్రమైనది అంటే వంకలు, డొంకలు లేకుండా నేరుగా ఉండేదని అర్థం. ఉదాహరణకు “కాంతి ఋజు మార్గములో ప్రసరించును” అని చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదువుకొన్నామే అలాంటి “ఋజు” మార్గములో భగవంతుడిని సేవించే వారి యొక్క గుంపునే “ఋజు గణము” అని వ్యవహరిస్తారు.

ఈ ఋజుగణస్థులు మనలాంటి జీవులే. కానీ వారి సాధన చాలా అత్యుత్తమమైనది. అందువల్ల వారిని “జీవోత్తములు” అని పిలుస్తారు. శ్రీ మహాలక్ష్మి తరువాత నారాయణుని పట్ల సక్రమమైన జ్ఞానం కలిగిన వీరు సాధనాజీవులలో అగ్రగాములుగా నిలుస్తారు.

ఎవరీ ఋజుగణస్థులు? వారి పేర్లేమి?

ఋజుగణములో మొత్తం 100 మంది ఉంటారు. వీరు ప్రతి సృష్టిలోనూ వంద సంఖ్యలోనే ఉంటారు. నూరవస్థానంలో ఉండే ఋజువే చతుర్ముఖ బ్రహ్మగా ప్రసిద్ధుడు. అంటే ఇక్కడ వంద సంఖ్య మొదటగాను, ఒకటవ సంఖ్య చివరిదిగానూ వ్యవహరింపబడుతుంది.

ప్రస్తుతం ఉన్న బ్రహ్మ ఋజుగణాలకు ప్రధాన నాయకుడు. ఇతను మహారాజుగా భావిస్తే అతని తర్వాత  వాయు పదవిలో ఉన్న ఋజువు యువరాజులాంటి వాడు. ఇలా మరో  98 మంది ఋజువులు క్రమసంఖ్యలో ఉన్నారు. ప్రతి ఋజువుకు ఒక్కొక్క అండము ఉంటుంది. ప్రతి అండములోనూ జీవరాశులు ఉంటారు. ఈ అండాలలో 100వ ఋజువైన చతుర్ముఖ బ్రహ్మ యొక్క అండము మాత్రమే సృష్టి స్థితిలో వ్యక్తమౌతుంది. దీన్నే బ్రహ్మాండం అని పిలుస్తారు. మిగిలిన 99 మంది ఋజువుల యొక్క అండములు అవ్యక్తస్థితిలో ఉంటాయి.

ఈ ఋజువులలో కూడ త్రిగుణాలు ఉంటాయి. కానీ సత్వ గుణమే 99.9999999999999999 (to the infinite) ఉంటుంది. అత్యంత సూక్ష్మశాతంలో రజో, తమో గుణాలు ఉంటాయి. కనుక వీరిని శుద్ధ సాత్వికులుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఋజువులు తమ అవతార స్వీకరణలో సైతం ఈ శుద్ధ సాత్విక స్థితిలోనే ఉంటారు.

అనంతమైనది జీవరాశి కనుక ఋజువు అనే పదవి లేదా స్థితి కూడా అనంతంగా కొనసాగుతూ / మారుతూ ఉంటుంది. ప్రతి ఋజువు 99 కల్పాల సాధన చేసిన అనంతరం చతుర్ముఖ బ్రహ్మ స్థానాన్ని పొంది అటుపై ముక్తికి వెళ్తాడు. ఋజువుల్లో కనిష్టుడు కల్కి (విష్ణువు యొక్క అవతారం కాదు). అవరోహణ క్రమంలో:

బ్రహ్మ

వాయు

లాతవ్య

గవ్య

వక్తవ్య

జ్ఞాతవ్య ఇత్యాది 100 మంది ఋజువుల పేర్లు ప్రకాశ సంహిత వంటి వాటిల్లో ఇచ్చివున్నారు.

వీరి సాధన అంటే ఏమిటి?

ఋజుగణ సాధన అంటే విష్ణు తత్వాన్ని తెలుసుకోవటమే. నిజానికి అందరు దేవతలూ విష్ణు భక్తులే. వారిలో సర్వోత్తమ వైష్ణవుడు పరమశివుడు, మహాదేవుడు (దేవతలకు దేవుడు) దేవతల సాధనా క్రమంలో. అందువలనే క్షీర సాగర మథన సమయంలో హాలాహలం భక్షించి దేవతలను రక్షించే స్థితిని పొందాడు. అందుకే ఈయన సదా శివుడు, అందుకే దేవతోత్తముడైన శివుని స్థితిలో మార్పు ఉండదు.

* * * * *

ఇక అసలు విషయం వద్దాం.

అతినిద్రా లోలుడు చదువులేని మూర్ఖుడు, తిండిపోతు, స్థూలకాయుడు, కోపిష్టి వంటి విశేషణాలతో సినీకవులు భీముణ్ణి చిత్రీకరించారు. “నిదురవోతుంటివో లేక బెదరి పల్కుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడవే కావో…” అనే కృష్ణావతారంలోని పద్యాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.

కానీ భీముడు మన సినీ కవులకు అందని ఒక మహత్తర శక్తి. పంచ ప్రాణాలు అనే మాట తరచూ వింటాం మనం ఆ పంచ ప్రాణాలలో ముఖ్యమైనది ప్రాణ వాయువు దీని అధిష్టానం ముఖ్య ప్రాణుడు. ఈయనే 99 వ ఋజువు వాయువు. ఈ ముఖ్య ప్రాణుడి అవతారమే భీముడు. త్రేతాయుగంలో హనుమగా, ద్వాపర యుగంలో భీముడుగా, కలియుగంలో మధ్వాచార్యగా అవతరించే ముఖ్య ప్రాణుడు జీవులలో శ్వాసరూపంలో ఉంటూ విష్ణు జీవులకు తత్వాన్ని ఉపదేశిస్తూనే ఉన్నాడు.

అలాగే సమస్త దేవతలలో ముఖ్య ప్రాణుడు ఉంటాడు, శివుని తో సహా. పంచ పాండవులలో భీముడు జ్ఞానానికి ప్రతీక. కృష్ణుని తరువాత మహాభారతం లో భీముడే ముఖ్యుడు. త్రిగుణాతీతుడు కనుకనే బాల్యం లో కుంతి ఒడి నుంచి జారి శతశృంగ పర్వతం పై పడి పోగా అది వ్రక్కలౌతుంది. భీముడు ఎప్పుడూ కృష్ణుని మాట జవదాటలేదు (జీవోత్తముడు సర్వోత్తముని మాట జవదాటడు). ఉద్యోగపర్వంలో తనని గూర్చి చెప్పమనగా భీముడు తన బలాన్ని వివరించిన పిదప శ్రీ కృష్ణుడు వెంటనే “భీముని బలం అతను చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ” అని చెబుతాడు. భారత యుద్ధం ప్రారంభం లో చేసిన బీముడి సింహనాదానికి గుర్రాలు, ఏనుగులు దిక్కులు పట్టి పరుగులు తీసాయి. భారత యుద్ధం లో తొలుత, చివర యుద్ధం చేసింది భీముడే. లక్క ఇంటికి నిప్పు పెట్టడం 6 నెలలు అయినా కుదరలేదు ఎందుకంటే భీముడు 6 నెలలో రేయింబవళ్ళు కాపలా కాసాడు కనుక. ఇది అతని శక్తి కి ఒక మచ్చు తునక.

భారత యుద్ధం లో 11 అక్షౌహిణుల సైన్యం లో 6 అక్షౌహిణులు భీముడే చంపేసాడు. యుద్ధానంతరం ధర్మజుని వైరాగ్యాన్ని కాదని రాజ్య పాలనవైపు మరల్చింది భీముడే. మనకు మరి ద్రౌపది స్వయం వరానికి ఎందుకు భీముడు వెళ్ళలేదు అనే సందేహం వస్తుంది. దానికి పురాణాలను సమన్వయము చేసి మధ్వులు వారి మహాభారత తాత్పర్య నిర్ణయం లో ఇలా వివరించారు: భీముడు సంహరించిన విష్ణు భక్తుడు బాహ్లికుడే. అదీ బాహ్లికుడి అభ్యర్ధన మేరకే. భీముడు సంహరించిన ప్రతి యోధుడూ దుర్యోధనుని రూపం లో ఉన్న కలి అనుచరులనే. అలాగే కృష్ణుని (విష్ణు వైరులైన) శత్రువులైన జరాసంధుని, కీచకుణ్ణి, కిమీరుణ్ణి, హిడింబాసురుని, బకుని, మణిమంతుని, దుశ్శాసనుణ్ణి భీముడే సంహరించాడు. పాండవులలో రెండవ వాడైనా మొదట వివాహం జరిగింది భీమునికే హిడింబితో. రెండవ వానిగా పుట్టడానికి కారణం కృష్ణుడు కూడా బలరాముని తమ్ముని గా పుట్టాడుగా. సర్వోత్తముని అనుసరించే వాడే జీవోత్తముడు! భీముడే కౌరవ సోదరులన్దరినీ మట్టుపెట్టాడు.

దుశ్శాసనుని రొమ్ము చీల్చి నెత్తురు తన దోసిలి లో ఉంచుకొని మన్యు సూక్తం చదివి నారసింహుని కి నివేదన చెస్తాడు. పరమశివుడు అంబ కు ఒక మహిమాన్విత మాలను ఇచ్చి ఇది ధరించిన వీరుడు భీష్ముని చంపగలదు అని వరమిస్తాడు. భూమికి నలు చెరగులా ఉన్న రాజులను అర్ధిస్తుంది ఈ మాల స్వీకరించి భీష్ముని వధించమని అందుకు ఎవరూ సాహసం చేయకపోగా చివరికి ద్రుపద రాజ మందిర ద్వారానికి దానిని తగిలించి తన జీవితాన్ని చాలిస్తుంది. ఇతః పూర్వం శిఖండి ఒకసారి ధరించి విడచినది ఈ మాల. ద్రుపదుడు ఈ మాలను భద్రపరచి తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం సమయంలో ఇచ్చి మత్స్య యంత్ర చ్చేదన చేసిన వీరుని మెడలో వేసి వరించమని చెబుతాడు. విష్ణు భక్తుడైన భీష్ముని జీవోత్తముడైన భీముడు భాగవత ధర్మం ప్రకారం వధించ లేడు, కనుక ఘటనాఘటన సమర్ధుడైన శ్రీ కృష్ణుడు అర్జునుని చే ఈ పని చేయించాడు తద్వారా పరమశివుని వరాన్నీ గౌరవించాడు – యద్యదాచరతి శ్రేష్ఠ: మహాభారతం లో ద్రౌపది చెబుతుంది భీమసేనుడు అర్జునిని కంటే చెప్పలేనంత బలవంతుడు అని, పైగా గాండీవానికి నారి సంధించ గలవారు కేవలం ముగ్గురే అని వారు కృష్ణుడు, భీముడు, అర్జునుడు అని. ఇది భీముని ఎనలేని జీవోత్తమం.

స్వస్తి

 

One thought on “తెలుగు సినిమాకు అందని భీముడు

Your views are valuable to us!

%d bloggers like this: