ఉగాది గీతం “చిరు లత పల్లవ సోయగ చందముతో”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పల్లవి
 
చిరు లత పల్లవ సోయగ చందముతో,
తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది.                                               ||చిరు||
 
అనుపల్లవి
 
మరు మాస నవ వధువై, మధుర గంధముతో,
మరల వచ్చెను మనకై విజయ ఉగాది.                                             ||చిరు|| 
 
1.    చైత్ర శుద్ధ శుభ పాడ్యమి ఘడియలో,
అతి దివ్య ఆనంద జ్యోతులు వెలిగించ,
ప్రతి ఎదన సంతోష, సౌఖ్యములు పండించ,
కదలి వచ్చెను తెలుగు విజయ ఉగాది.                                             ||చిరు||
 
2.    యిమ్ముగ వనములలో తరు, శాఖ, లతలపై,
కమ్మని రంగులతో కొమ్మ కొమ్మన విరిసి,
సొమ్ముగ సిగ్గుల పల్లవ పైటతో,
కోమలి లక్ష్మిలా వచ్చె ఉగాది.                                                              ||చిరు||
 
3.    హిమ శైలము పైన ముక్కంటి సతి జడలో,
ఘుమ ఘుమ చల్లను, మరుమల్లె కుసుమమై,
కమల కంఠము లోన కుసుమ మాలికయై,
అమల రూపము నొచ్చె విజయ ఉగాది.         .                              ||చిరు||
 
4.    విజయ ధుంధుభులతో విశ్వ జను లెల్లరు,
నిజ వైభవానంద డోలికల ఊగగ,
అజులు అమర వీధి నాశీర్వదింపగ,,
విజయ పతాకముతో వచ్చె ఉగాది.                                                   ||చిరు||
 
5.    పుల్ల మామిడి చెరకు, బెల్లము తోటి,
తెల్ల వేప పూత, చింత, నిమ్మ వేసి,
కలిపి లవణముతో, కమ్మగ అందించ,
కలికి క్రొత్త వధువై వచ్చె ఉగాది.                                                            ||చిరు||
 
6.    కవి, గాయక, నృత్య, శిల్పి, వైతాళికులు,
భావములు పొంగగ, భాష రంగరించి,
నవ కవిత గానముకు, నటనలు కలుప,
హావ భావములతో వచ్చి ఉగాది..                                                       ||చిరు||
 
7.    సాటి లేని మేటి  దైవ శిఖామణి ,
ఏడు కొండల  స్వామి వేంకటేశ్వరుడు,
పాటవము చూపి ప్రార్ధనలు వినుచూ,
దీటుగ దీవించ వచ్చె ఉగాది.                                                                  ||చిరు||
 
 
                             
అజులు = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

Your views are valuable to us!