ఆమె లేదు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆదివారం, 12 వ తేదీ, 2013 వ సంవత్సరం. ఈ రోజుకు గల ప్రాధాన్యత.  ఆ(! అదేనండీ! మాతృ దినోత్సవము (Mother’s Day.)

విజయ నామ సంవత్సరములో ఇంగ్లీషు వారు ఏర్పరచిన ఈ మంచి పండుగ విశ్వవిఖ్యాతమైనది. అందుకే ఒక ప్రముఖ రచయిత అనుభవాన్ని చెప్పుకుందాము.

**************

మార్క్ ట్వైన్ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ (నవంబర్ 30, 1835 -21 ఏప్రిల్ 1910) అసలు పేరు శామ్యూల్ లా మ్ గోర్న్ క్లెమెన్స్. మార్క్ ట్వైన్ కి తన అమ్మ అంటే ఎంతో ప్రేమ.

“నా అమ్మ నా వలన అనేక ఇబ్బందులు పడింది, ఐతే వాటిని ఆమె సహనంతో ఎదుర్కొంది. నా జీవితాన్ని ఆనందమయం చేసింది.” అన్నాడు. తన జీవితములోని ఒడిదుడుకులనూ, మిట్టపల్లాలనూ – స్వానుభవములనూ గుర్తుచేసుకుంటూ.

**************

మార్క్ ట్వైన్ హాస్యచతురత జనులను ఆకర్షించేది. మార్క్ ట్వైన్ రచయితగా పేరుప్రఖ్యాతులు గడించాడు. ఆతని ప్రతిభకు గుర్తింపు లభించినందు చేత, అనేక సన్మానాలు అతనికి జరుగుతూండేవి. మార్క్ ట్వైన్ కి 70 ఏళ్ళు వచ్చినవి. అతని డెబ్భైవ జన్మదిన సందర్భముగా కొన్ని ఆంగ్ల సాహితీ సంస్థలు “మీకు సన్మానము చేస్తాము.”అని ఆహ్వానించినవి.  ఘనమైన అభినందన మందారమాలలను అందుకున్నాడు. ఆనవాయితీ ప్రకారం గెస్టు, నిర్వాహక, పుర ప్రముఖులు ముక్తసరిగా మాట్లాడారు. అందరికీ మార్క్ ట్వైన్ ఉపన్యాసాన్ని వినాలని అభిలాష. కనుక “మిస్టర్ మార్క్ ట్వైన్ మీరు మీ అమూల్య వాక్కులను వినిపించండి.” అని అడిగారు.

మార్క్ ట్వైన్ ఆనాడు తన అనుభవాలను కొన్నిటిని శ్రోతలతో పంచుకున్నాడు. ప్రేక్షకులు చెవులు రిక్కించి వినసాగారు.

“నా మొదటి పుట్టిన రోజుకూ, ఈ నాటి ఈ జన్మదినోత్సవ వేడుకకూ అసలు ఏ మాత్రమూ పోలిక లేదు. ఆరోజు ఒక చిన్న ఇరుకు గదిలో…అక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు – నేను, నాతల్లి. అప్పటి బర్త్ డే కి ఏ పూలూ, బొకేలూ లేవు. ఏ పళ్ళూ, ఫలహారములూ లేవు. నిశ్శబ్దమే సంగీతం. నా కన్నతల్లి మమతానురాగములే పుష్ప హారములు. నేటి ఈ సంబంరంలో ఆవిష్కృతమౌతున్న అనేక సంతోష చిత్రవర్ణాలను నేను వీక్షిస్తున్నాను. కానీ ఇప్పుడు, ఇక్కడ ఈ హర్షాతిరేక ఉత్సవ చిన్నెలను చూస్తూ మురిసిపోయేటందుకు అమ్మ లేదు.”

అది ఉపన్యాసమా? కాదు, ఆర్తికి ప్రతిబింబం! అవి నుడువులా? కావు, మార్క్ ట్వైన్ మనో కుహరములో నుండి ఎగసిన ఆవేదనల వెల్లువ!

సభలోని ఆడియన్సు చెమ్మగిలిన నయనములే మార్క్ ట్వైన్ కి ఓదార్పు పద్యాలకు ఆనవాళ్ళు ఐనవి.

Your views are valuable to us!