మానవ చరిత్రలోని అత్యంత విస్మయకరమైన మరణాలు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

“పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో శాశ్వతమెవరురా?” అని ఏయెన్నారు గారు ఘంటసాల మేష్టారు గొంతును అరువు తెచ్చుకొని మరీ అరిచి గోలచేసినట్టు తెలుగు సినీ చరిత్ర చెబుతోంది. కానీ ఇంతకంటే గోలగోలగా ఉండే ప్రపంచ చరిత్రలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలున్నట్టు చాలామంది గగ్గోలు పెట్టి చెప్పారు. అలాంటి ఘన గోల గగ్గోల చరిత్రల్లోని కొన్ని విస్మయకరాలైన చావుల్ని మీ చేత చదివించాలని కమిట్టైపోయాను.

స్టీవ్ ఇర్విన్ (1962-2006)

ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ “ద క్రొకడైల్ మ్యాన్” అన్న టెలివిజన్ సీరీస్ తో ప్రసిద్ధిలోకొచ్చాడు. ఎలాంటి భయాలూ లేకుండా మొసళ్ళు, పాములు మొదలైన భయంకర జంతువులతో అతను చేసే సాహసాల్ని చూసి జనాలు ముక్కున వేలేసుకొనేవాళ్ళు. అలాంటి సాహసమే 2006 లో అతని ప్రాణాల్ని తీసింది.

సెప్టెంబర్ 4, 2006 న ఆస్ట్రేలియా సముద్ర తీరమైన గ్రేట్ బారియర్ రీఫ్ లో తన స్వంత డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా సముద్రంలోని కొన్ని జంతువుల్ని షూట్ చేసే నిమిత్తం నీళ్ళలోకి కెమరామ్యాన్ తో సహా దూకాడు ఇర్విన్. చిత్రీకరణ జరుపుతుండగా స్టింగ్‍రే అని పిలవబడే ఒక సముద్ర జంతువుకు దగ్గరగా స్టీవ్ వచ్చాడు. ఆ జంతువు పైన వున్న స్టీవ్ ను, కొద్దిగా ముందుగా కెమరాతో ఉన్న వ్యక్తిని చూసి తన ప్రాణాలకు ముప్పొచ్చి పడినట్టుగా భావించింది. ఒక్కసారిగా అది తన తోక ప్రాంతంలో ఉండే పదునైన “స్టింగ్”ను విదిల్చింది. అది స్టీవ్ గుండెల్లోకి దూసుకుపోయి చిల్లు పొడిచింది. అంతే….భయమే ఎరుగని మొసళ్ల మనిషి ప్రాణం గాల్లో కలిసిపోయింది.

ఈ విషయంపై మాట్లాడుతూ బెన్ కార్ప్ అనే సముద్ర నిపుణుడు “పది లక్షల స్టింగ్‍రే దాడుల్లో ప్రాణం పోయిన ఒకే ఒక్క ఘటన ఇది.” అని చెప్పాడు.

“ఓషన్స్ డెడ్లియెస్ట్” అన్న పేరుతో తీస్తున్న తన డాక్యుమెంటరీలో తన డెడ్లియెస్ట్ చావును చిత్రీకరించుకొన్న స్టీవ్ ఇర్విన్‍ది ఎంత విస్మయమైన మరణమో కదా!

 

ఫ్రాన్సిస్ బేకన్ (1561-1626)

ఇంగ్లాండుకు చెందిన ఫ్రాన్సిస్ బేకన్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనో వేదాంతి, దౌత్యవేత్త, శాస్త్రవేత్త, న్యాయవాది, న్యాయనిర్ణేత మరియు రచయిత. ఇంగ్లాండు దేశానికి అటార్నీ జనరల్‍గాను, లార్డ్ ఛాన్సలర్‍గానూ పనిచేసాడు. అతని కెరీర్ చాలా అవమానకరంగా ముగిసింది. తాత్వికతతో కూడిన న్యాయవాదిగా, పరిణామశీలమైన వైజ్ఞానికతతో కూడిన అతని రచనలు చాలా పేరును తెచ్చిపెట్టాయి. “బేకానియన్ మెథడ్” అని పిలువబడే ఒక వైజ్ఞానిక ఒరవడిని తయారుచేసాడు. బేరన్ వెరూలమ్, విస్కౌంట్ సెయింట్ అల్బాన్ అనే రెండు పీరేజ్‍లను (బ్రిటన్ రాచరిక వ్యవస్థలోని ఒక స్థాయి) సృష్టించాడు. కానీ వారసులెవరూ లేని కారణంగా బేకన్ తర్వాత ఇవి నశించిపోయాయి.

1626 ఏప్రెల్ నెలలో అప్పటి రాజుగారి వైద్యుడితో కలిసి లండన్ లోని హైగేట్ ప్రాంతానికి వచ్చాడు బేకన్. మంచుతో నిండిపోయిన ఆ ప్రాంతానికి రాగానే బేకన్ మెదడులో ఒక వింతైన ఆలోచన వచ్చింది. మంచును వాడి మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవొచ్చా? అన్నది బేకన్ ఆలోచన. వెంటనే తాను ప్రయాణిస్తున్న వాహనంను దిగి, అక్కడే ఓ కోడిని కొని, దగ్గరలోనున్న ఓ పేదరాలి గుడిసెకు వెళ్ళి ఆ కోడిని కోసివ్వమన్నాడు. ఈ తంతులో భాగంగా అతనికి తీవ్రమైన న్యుమోనియా తగులుకొంది. ఇప్పుడు బేకన్ బుర్రలో ఇంకో వింత ఊహ వచ్చింది. ఏ కోడి మాంసానైతే మంచులో కూరి పరీక్షిస్తున్నాడో దాన్నే తినడం ద్వారా తన రోగం తగ్గవచ్చని అనుకొన్నాడు. కానీ తిన్న రెండు, మూడురోజుల్లోనే అత్యంత దీనస్థితిలో చచ్చిపోయాడు.

విచిత్రమైన తమ ప్రయోగాలకు తామే బలైపోయిన వాళ్ళల్లో ఈ బేకన్ ముందు వరుసలో ఉంటాడని ఆకాలంలోని వాళ్ళందరూ విచారం వెలిబుచ్చారట!

గ్రెగొరి రస్పుతిన్ (1869-1916)

రష్యన్ జార్ చక్రవర్తుల మెప్పు పొందిన గ్రెగొరి రస్పుతిన్ గొప్ప సైనికుడో, రాజనీతిజ్ఞుడో కాడు. రచయితనో లేక నాటకాల రాయుడో కాడు. నిజానికి అతనో సామాన్య పౌరుడిగా పుట్టి, పెరిగి పెద్దయ్యాక ఫకీరుగా మారిన ఒక దేశద్రిమ్మరి. ఆ కాలంలో రష్యాలో ప్రభుత్వ నిషేధానికి గురైన క్లిస్టీ అనే ఒక క్రిస్టియన్ గుంపులో గ్రెగొరి కూడా సభ్యుడనే వదంతి ఉండేది. క్లిస్టీ సభ్యులు శృంగారం ద్వారా ఆధ్యాత్మికతను సాధీంచాలనుకొనేవాళ్ళట! అందుకనే నిషేధానికి గురైయ్యారు. ఇలాంటి అనైతిక బృందానికి చెందినవాడుగా చెప్పబడ్డ రస్పుతిన్ పై జార్ చక్రవర్తి విచారణకు అదేశించాడు. కానీ ఆ విచారణలో ఎలాంటి విషయమూ నిర్ధారణ కాలేదు. దాంతో సున్నితమైన ఈ విషయాన్ని సరిగ్గా నిర్వహించనందుకు గాను సమాచార శాఖా మంత్రి పదవి కోల్పోవలసి వచ్చింది. రస్పుతిన్ యొక్క పలుకుబడి ఆ స్థాయిలో ఉండేది. ఇది చాలామందికి కన్నుకుట్టే అంశంమైంది.

ఈమధ్యలో 1889లో ప్రస్కోవియా ఫ్యొడొరోవ్నా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రైయ రస్పుతిన్ గ్రీస్, జెరూసలేమ్ యాత్రలకు మరలాడు. మూడేళ్ళ ప్రవాసం తర్వాత 1903లో రష్యా తిరిగివచ్చి సెయింట్ పీటర్స్‍బర్గ్‍లో స్థిరపడ్డాడు. మళ్ళీ జార్ కుటుంబానికి దగ్గరివాడవడమే కాకుండా పెద్దస్థాయిలో ప్రభావాన్ని చూపసాగాడు. అంతేకాదు ఒక ప్రవక్తగా ఎలాంటివాటిల్నైనా నివారణ చేసే మహిమాన్విత వ్యక్తిగా అవతారమెత్తాడు.

1916లో భార్యాబిడ్డల్ని చూడ్డానికి వచ్చిన రస్పుతిన్ ను చంపాలన్న నిర్ణయానికి వచ్చేసారు ఆనాటి ప్రిన్స్ ఫెలిక్స్ యుసుపోవ్, గ్రాండ్ డ్యూక్ డిమిత్రి పావ్లోవిచ్. ప్రిన్స్ యుసుపోవ్ భవనానికి రస్పుతిన్ ను విందుకు ఆహ్వానించారు. ఆనాటి విందులో రస్పుతిన్ కు వడ్డించిన కేకుల్లో ఐదుమందిని చంపగలిగేంత సైనెడ్ కలిపి పెట్టారట. కానీ రస్పుతిన్ కు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. చక్కగా తిని వచ్చేసాడు. కానీ ఆ తర్వాత హైపర్ అసిడిటీతో అల్లాడుతూ మరణించాడు.

 

Your views are valuable to us!