వంశీ (జె.వి.కె. నారాయణ రాజు) దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, శోభన, శుభ నటించిన “లేడీస్ టైలర్” సినిమా అందరికీ తెలిసినదే! ఈ చలన చిత్రము 1985లో రిలీజ్ ఐనది.
టైలర్ అనగానే చెవిలో పెన్సిలు, చేతిలో కత్తెర, కొలతలను తీసుకోవడానికి టేపు, సైజుల వారీగా కొన్ని కుట్టిన బట్టలు పక్కన కుప్పలుగా ఉన్న దృశ్యము మన మనోయవనికపై ప్రత్యక్షమౌతుంది. కొంచెం పోష్ గా, సిటీలలో షాపులలో గాజుతలుపుల మధ్య అలమార్లలోహ్యాంగర్లకు తగిలించిన గుడ్డలు గుర్తుకొస్తాయి.
అలనాటి స్వర్గసీమ ఇత్యాది సినిమాలలో స్త్రీలు ఇంట్లో కుట్టు మిషనుపై టకటకా గౌనులూ వగైరాలను కుట్టేస్తూ, తమ పిల్లలను పెంచి, పెద్ద చేసిన ఉదంతాల ఇతివృత్తాలు ప్రేక్షకులను ఆకట్టుకుని రజతోత్సవ, స్వర్ణోత్సవాలు జరుపుకున్నవి.ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే- Tailor అనే మాటకు ఇంకో పదాన్ని ఊహించగలరా? ట్రై చేస్తారా మరి?!
దర్జీ అనే పదమును మీరు వినేఉంటారు. దశాబ్దంక్రితం ఈ మాట వాడుకలో ఉండేది. దర్జీ అంటే టైలర్ (tailor) అని అర్ధము. పర్షియన్ మాట “దర్జాన్” నుండి దర్జాగా వచ్చినది “దర్జీ”. దర్జ్ అనగా కుట్టుట.{darzan – seam }. సంస్కృతములో సూదిని సూచీ అని అంటారు. (సూచించుట; దిక్సూచి, సూచ్యగ్రము- మున్నగునవి,సూచన, సలహా అనే భావముతో ఉన్నవి. सुचिकार అన్నచో సూదిపనివాళ్ళు అని బోధపడ్తున్నది.